Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 34


    "రామ! రామ! అదేంలేదే. పాపం దీన్ని వంటరిగా ఇక్కడ వదిలేసి వెళ్ళటానికి మనస్కరించక సుందరికి తోడుగా ఉందామని...అంతే అంది రాణి.


    "అంత అవసరంలేదు. సుందరిని పైకి తీసుకెళ్ళే బాధ్యత నాది.


    "ఏ పైకే వందనా! ఆ...పైకి కాదుకదా! మా బామ్మ నాకోసం మంచం పడుతుందే! నేనంటే మా బామ్మకి పంచన్నర ప్రాణాలే! అని ఇంకా ఏదో చెప్పబోయింది సుందర సుకుమారి.


    "అది నాకు తెలుసు. నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ బామ్మకి అప్పగిస్తాను సరేనా."


    "అదికాదే వందనా!"


    "ఇంకేమీ మాట్లాడకు. శ్రావణ బెళగొళలోని గోమఠేశ్వరుడిని చూడటానికి రెండు కళ్ళు చాలవుట. ఆ విగ్రహం ఆకాశమంత ఎత్తు ఉంటుందట. ఏకరాతితో నిర్మించారని అంటారు. అంత గొప్ప విగ్రహం చూడకుండా వెళ్ళిపోవడమా? నో...నో..." అంది వందనాదేవి.


    "అప్పుడీ యాత్రికులంతా నిన్ను చూసి ఇక్కడ్నుంచే దిగిపోతారు. గోమఠేశ్వరుడిని అన్యాయం చేసినదానివౌతావు. నీతోపాటు మేము కాసేపు ఈ మెట్లమీద కూర్చుంటాము. నీ అలుపు పూర్తిగా తీరిన తర్వాతనే మరికొన్ని మెట్లు ఎక్కుదాం."


    "గుడ్. వందన చెప్పిన ఈ ఐడియా బాగుంది" అంది ప్రమద.


    "సుందరి! నీతోపాటు ఫుడ్ అంటే పిండివంటల లగేజి వస్తూనే ఉంటుంది కదా! కాస్త ఏదన్నా దాణా కడుపులోకి చేర్చు. శక్తి...ఉత్సాహం వస్తాయ్" రాణి చెప్పింది.


    "నా నోటికి...చేతికి తగినంతపని లేకపోతే నా బుర్రకూడ పనిచేయదు. "పళ్ళున్నప్పుడే జంతికలు తినాలి. కడుపు ఖాళీ లేకుండా తినాలి తిండి" అని మా బామ్మ చెప్పిన మాట వేదవాక్యంలా పాలిస్తుంటాను. ఏదే ఆ పిండివంటల సంచీ...వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి" అలుపు తీరిన సుందర సుకుమారి సంచీని చూస్తూ అంది.


    రాణి ఇచ్చిన సంచీ అందుకొని స్వీటు, హాటు కరకర...కచకచ తినేస్తూ కబుర్లు మొదలుపెట్టింది సుందర సుకుమారి.


    "అసల్నాకు తెలీక అడుగుతాను...ఈ దేముళ్ళు కొండలమీద గొబ్బెమ్మల మీద ఎక్కి కూర్చుంటారేమే! నాబోటి దానికి ఎంతకష్టం" ఓ పక్క ఫలహారాన్ని ఇష్టంగా తింటూ కష్టంగా అంది సుందర సుకుమారి.


    "నీ కష్టమే ఆలోచిస్తున్నావుగాని దేశ, కాల, మాన పరిస్థితులు ఆలోచించవేంటి? రోజురోజుకి జనాభా ఎక్కువై పోతున్నది. మన ప్రభుత్వం ఎర్ర త్రికోణం చూపించి ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా.... ఈ ప్రజలకి బుద్ధిలేక ప్రసూతి ఆస్పత్రులని పెంచి పారేస్తున్నారు. మరికొద్ది సంవత్సరాలు పోతే ఈ వేదభూమి అంతులేని జనాభాతో కిక్కిరిసి పోతుంది. ఇది ఆనాడే గ్రహించిన దైవాంశ సంభూతులు కొండలమీద వాళ్ళ నివాసం ఏర్పరచుకొన్నారు. వాళ్ళకి ఎంత ముందు జాగ్రత్త చూడు" వందన అంది.


    "అందుకే వాళ్ళు దేవుళ్ళయ్యారు...మనం మానవమాత్రులయ్యాం" అంది రాణి.


    "సుందరీ! తిండి పూర్తయిందికదా! ఇంక లేస్తావా? మోకులుకట్టి పైకి లాక్కెళ్ళమంటావా?" వందన అడిగింది.


    "అంత అవసరం లేదులేవే...లేస్తున్నాను" అంటూ సుందర సుకుమారి పైకి లేచింది.


    సరీగ్గా అప్పుడే....


    "ఒసేయ్...అటు చూడండే అర్జంటుగా" అంది ప్రమద.


    "ఎటు చూడమంటావ్? ఏముందక్కడ?"


    "కిందనించి పైకి నెమ్మదిగా నడిచి వస్తున్నాడే...అదేనే మనపాలిట విలన్...చెదలు తినేసినట్లున్న మొహం...మేకుల్లా నిక్కబొడుచుకున్న అరంగుళం సైజు తెల్ల జుట్టు...హిట్లర్ మీసాలు... మనల్ని నీడలా వెంటాడుతూ ఇక్కడికి వచ్చాడే. చూడు చూడు...వాడ్ని సరిగ్గా చూడు" అంది ప్రమద.


    "అవును...వాడే" అంది రాణి.


    "ఊ...ఇప్పుడర్థమైంది. వాడు మన నీడలాగానే వస్తున్నాడు. మనం పూర్తిగా కొండ ఎక్కామనుకొని కాస్త ఆగి నెమ్మదిగా వాడు బయలుదేరాడు. కాని మనం సగం మెట్లు దగ్గర ఆగిపోయాంకదా! దాంతో నీడగాడ్ని చూడగలిగాం" వందన అంది.


    "వాడు మనలాగానే జర్నీ చేస్తున్నాడు అనుకున్నాం. కాని మనతోపాటు వస్తున్నాడే! ఈ కేసేదో అనుమానించదగిందేనే వందనా" రాణి అంది.


    "డోంట్ వర్రీ! ఆడ దొంగని సుందరి పట్టుకోవడంవల్ల మనకి ఇన్ స్పెక్టర్ విశ్వనాథరెడ్డిగారితో పరిచయమయ్యింది...ఇన్ స్పెక్టర్ గారు కూడా చాలా మంచివారు.


    "ఆయన మంచితనం నీకెప్పుడు తెలిసిందే వందనా?" ప్రమద చిలిపిగా అడిగింది.


    "మరోసారి నా మాటలకి అడ్డు తగిలావంటే ఈ మెట్లమీదనించి కిందికి తోసేస్తాను. కనక అడ్డు రాకుండా విను. మళ్ళీ మళ్ళీ ఈ విలన్ గాడు మనకి తారసపడినా...మరోసారి వీడిపై మనకి అనుమానం వచ్చినా ఇన్ స్పెక్టర్ విశ్వనాథ రెడ్డిగారికి చెబుతాం...ఇంక వారే చూసుకుంటారు. విలన్ గాడ్ని వదిలెయ్యండి. లేవండి వెళదాం. ఆయాసం తగ్గిందిగా సుందరీ" అని అడిగింది వందన.


    "ఫరవాలేదే ఏదో కాస్త తప్ప మొత్తం ఆయాసం తగ్గింది. ఇంకయితే ఒకటే ఎగరొప్పనుకో. ఊ...ఇంక పైకివెళదాం పదండి" అంది సుందర సుకుమారి. 

 Previous Page Next Page