ఇంజక్షన్ చేయడం అయిపోగానే తిరిగి మామూలుగా పడుకున్నాడతను. అతను కళ్ళను ఆర్పడం లేదు.
నర్సు చిన్నగా నవ్వి, వెళ్ళడానికి వెనక్కి తిరిగింది.
ఆమె వీపు మీద 'ఐ లవ్ యు' స్టిక్కర్.
రజనీ తన మనసులోని మాటను స్టిక్కర్ తో చెప్పిందని అర్థమైపోగానే సంతోషం పట్టలేక అతను 'హుర్రే' అని గట్టిగా అరిచాడు.
విషయం ఏమిటో అర్థంకాక, అతను ఎందుకలా అరిచాడో బోధపడక అక్కడున్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. అతనివేపు భయంగా చూశారు.
* * * * *
శ్రీనివాసరావు, బ్రహ్మానందం, విజయ రెండోసారి ఔట్ హౌస్ లో సమావేశమయ్యారు.
శ్రీనివాసరావు నిస్సహాయంగా చూస్తున్నా అతని బుర్ర చురుకుగా పనిచేస్తూంది. రజని నరేష్ ను ప్రేమిస్తుందనీ తెలిశాక ఆయనకు కాళ్ళూ, చేతులూ ఆడకపోయినా రజనీని ఎలా దక్కించుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
బ్రహ్మానందం ముఖం తెల్లగా పాలిపోయింది. విజయ ఒక్కతే ఆ ముగ్గురిలో మామూలుగా ఉంది.
"ఇప్పుడేం చేస్తాం సార్? మనం ఉపేక్షించడంవల్లే అమ్మాయిగారు వాడి వలలో చిక్కింది" చాలాసేపు మౌనం తర్వాత అన్నాడు బ్రహ్మానందం.
"ఉపేక్షించకుండా ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. వాడి ప్రేమలో నువ్వు పడకమ్మా అని ఎలా చెప్పడం? అలా చెప్పామంటే పంతం కొద్దీ అయినా అతన్ని దగ్గరకు తీసే రకం రజని. ముల్లును ముల్లుతోనే తీయాలి. అదీ నా పధ్ధతి అప్పుడు రజనీకి నామీద దురభిప్రాయం కలగదు వాళ్ళిద్దరూ ప్రేమించుకోకుండా ఆపలేం. ఇప్పుడు మనం చేయగలిగింది వాళ్ళిద్దర్నీ విడదీయడమే. అందుకేం చేయాలో ఆలోచించండి" చెప్పాడు శ్రీనివాసరావు ఆయన లోపల చాలా మదన పడిపోతున్నట్టు వణుకుతున్న అతని కంఠమే చెబుతోంది.
"ఆ రోజు గూండాలచేత నరేష్ ను కొట్టించాలనుకున్నాం కదా. అదెందుకు ఫెయిలయింది?" అడిగింది విజయ.
ఆరోజు జరిగిన విషయం ఆమెకి తెలియదు.
బ్రహ్మానందం చెప్పాడు "నరేష్ జగ్గారావుతో మాట్లాడాక నేను వెళ్ళి అతడిని సంప్రదించాను నిజంగానే నరేష్ ను చావబాదమని, అందుకు అయిదువేలు ఇస్తామని చెప్పాడు. అయితే అతను అందుకు ఒప్పుకోలేదు. మొదట నరేష్ తో కాంటాక్ట్ కుదుర్చుకున్నాక దానిని జవదాటనని అన్నాడు. ఎంత నచ్చచెప్పినా ఒప్పుకోలేదు. గూండాగా వున్న వాడూ నీతి నియమాలకు కట్టుబడ్డాడు."
"నరేష్ నాటకమాడాడని తెలిసిన అమ్మాయిగారు అతని వలలో ఎలా పడింది?" అడిగింది విజయ అమాయకంగా.
"అమ్మాయిగారు దానిని తేలిగ్గా తీసుకున్నారు. అలా నాటకమాడడం తనను నరేష్ మోసం చేసినట్టు అమ్మాయిగారు అనుకోలేదు. తను అరుస్తూనే అన్నీ మరిచిపోయి వాళ్ళ మీద కలయబడ్డ అతను అంటే చాలా ప్రేమ కలిగింది. అంతకుముందే నుంచే అమ్మాయిగారు అతనిని ప్రేమించడం మొదలెట్టారు ఆ రోజు ప్రేమపరిపక్వం చెందింది. ఇక తట్టుకోలేక ఉదయం నర్శింగ్ హోమ్ లో నర్స్ వీపు వెనుక ఐ లవ్ యు స్టిక్కర్ అంటించి పంపింది" చెప్పాడు బ్రహ్మానందం.
"మొత్తానికి అమ్మాయిగారు కొత్తపద్ధతిలో తను ప్రేమిస్తున్నట్టు తెలియజేసింది" విజయ నవ్వుతూ అంది.
ఆమెను చూసి మండిపడ్డాడు శ్రీనివాసరావు "నేను కొంపమునిగిపోయి దారీ తెన్నూ కనపడక ఏడుస్తుంటే నీకు నవ్వులాటగా వుందా?"
"లేదండీ. నా పాతివ్రత్యం సాక్షిగా చెబుతున్నాను. నాకూ బాధగా వుంది. రజని నాకు కూతుర్లాంటిది కాదూ. దారితప్పిన అమ్మాయిగారిని సక్రమమైన మార్గంలో ఎలా పెట్టాలా అని అప్పట్నించి తెగ బాధపడిపోతున్నాను" ఏడుస్తూ చెప్పింది విజయ ముక్కును రెండు మూడుసార్లు తుడుచుకుంది.
"నీకు లేంది పాతివ్రత్యమే. దానిమీద సాక్ష్యం పెడతావెందుకు" ఎగిరిపడ్డాడు శ్రీనివాసరావు.
ఆమె ఆ మాటలకు మరింత బాధపడి కళ్ళను తుడుచుకుంది.
"ఇప్పుడేం చేద్దాం సార్?" టాపిక్ మార్చాడు బ్రహ్మానందం.
"అదే ఆలోచిస్తున్నానయ్యా" అని ఓ క్షణం ఆగి "ఇంతకీ నరేష్ ఎలాంటివాడు?" ప్రశ్నించాడు శ్రీనివాసరావు.
ఠక్కున సమాధానం చెప్పాడు బ్రహ్మానందం. "చాలామంచి వాడుసార్."
శ్రీనివాసరావుకు కోపం వచ్చింది. "అతనికి నువ్వేమీ కండక్టు సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. అతనికేమైనా దురలవాట్లున్నాయా?"
"లేవు సార్."
"మందు తాగుతాడా?"
"లేదు సార్. బీరంటే అదేదో టానిక్ అనుకునే రకం సార్."
"సిగరెట్లు తాగుతాడా?"
"అది దురలవాటుగా అమ్మాయిలు పరిగణించరు సార్. అది దురలవాటు అని మనం అనుకున్నా అతను సిగరెట్లు కాల్చాడు సార్."
"రేసులకు వెళతాడా?"
"అది డబ్బున్న వాళ్ళకు అంటుకునే జబ్బు సార్. గుర్రాలు బండి లాగడానికి తప్ప వాటితో రేసులు నడుపుతారని అతనికి తెలీదు సార్."
"చీట్ల పేక ఆడుతాడా?"
"నో సార్."
"అతనికి ఏ దురలవాటూ లేదా?" ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీనివాసరావు.
అక్కడ నిశ్శబ్దం కమ్ముకుంది. దానిని చెరిపేస్తూ అరనిముషం తరువాత చెప్పాడు బ్రహ్మానందం "అతనికి ఒక్క బలహీనత వుంది సార్!"
శ్రీనివాసరావు సోఫాలోంచి లేచి అడిగాడు "ఏమిటది?"
"ఆడపిల్ల" స్థిరంగా చెప్పాడు బ్రహ్మానందం.