Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 34


    "బేఖుసూర్ హూఁ సర్కార్5, నాదేం లేదిండ్ల. చంపింది" అని అటూ ఇటూ చూచి "రఘు" అని చెవులో చెప్పి "తాసిల్దార్ సాబ్ తప్పీల్గ6 చెప్పుతనన్నడు. చలో సర్కార్" అని బ్రతిమాలాడాడు.
____________________________
5.నిరపరాధిని ప్రభూ 6.వివరంగా.

 

    రఘు పేరు విని తల తిరిగిపోయింది. మొహతమీమ్ కు. ఫస్టు ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఇచ్చింది అతను. పంచుల్లో అతడొకడు. కాక రఘు విషయంలో ఒక సదభిప్రాయం ఏర్పడ్డదతనికి. అతడా ఖూనీ చేసింది? స్థానికాధికారుల సహాయం లేకుండా కేసును నడపించడం కష్టం అనుకున్నాడు. కచ్చడంలో తాసిల్దారు ఇంటికి చేరారు.

 

    గజ్జల చప్పుడు విన్నాడు తాసిల్దారు. బల్లపీటమీంచి లేచాడు. మొహతమీమ్ కు ఎదురేగాడు. చేయినేలకానించి మూడుసార్లు సలామ్ చేశాడు. చేయి అందించి బండి మీదనుంచి దింపాడు. కాలుకు మట్టి అంటకుండా పరచబడిన గుడ్డ మీద మొహతామీమ్ కు దారి చూపుస్తూ తీసికెళ్ళాడు. విశాలమైన హాల్లో పరుపుమీద కూర్చో బెట్టాడు. ఇంతలో పైజామా కమీజు తొడిగి సెల్వార్ వేసుకున్న అమ్మాయి గ్లాసులో నీళ్ళు అందించింది. మరొక అమ్మాయి హుక్కా తెచ్చి అందించింది. ఇంకొక అమ్మాయి మధుపాత్ర తెచ్చి పెట్టేసింది తాసిల్దారు చేసిన సంజ్ఞ మేరకు చషకంలో అమృతం నింపి అందించింది. సలామ్ చేసి స్వీకరించవలసిందని వేడుకున్నాడు తాసిల్దారు. అధికారి తాసిల్దారు వైభవం చూసి ఆశ్చర్యపడ్డాడు. అతని వినయానికి తబ్బిబ్బైనాడు. అమ్మాయిల అందంలో మునిగిపోయాడు. తనను మరచాడు. అధికారాన్ని మరచాడు. కర్తవ్యాన్ని మరచాడు. ఆనందంలో మున్కలు వేశాడు.

 

    సాయంకాలం అయిందీ, చీకటి పడిందీ తెలియలేదు వారికి. దీపాలు వెలిగాయి. లైట్లు వచ్చాయి. రకరకాల భోజనాలు, రకరకాల సారాయి, రంగులు మార్చుకుంటున్న రమణులు. అదేదో స్వర్గంలా వుంది. వారికి నందనంలా వుంది. నాగలోకంలా వుంది.

 

    డోలక్ మోగింది. కాళ్ళు గజ్జెలు ఘల్లుమన్నాయి. అందానికి అవయవాలు వచ్చి ఆడసాగాయి. ఖవాలీలు, గజళ్ళు, ఆటలు, పాటలు అంతా మత్తుగా వుంది. అంతా మస్తుగా వుంది. వాతావరణం నిషాతో నిండిపోయింది. అధికారి తన్మయత్వంలో ఉన్నాడు. అమీను వచ్చాడు. అధికారి కాళ్ళమీద పడ్డాడు. తనతోపాటు ఒక అందగత్తెను అతనిమీద పడేశాడు. అభయం ఇవ్వందే కాళ్ళమీద నుంచి లేవనన్నాడు. అధికారి ఆలోచించే దశలోలేడు. అమ్మాయి మెత్తని దేహం అతనికి తగులుతూ వుంది. అభయం ఇచ్చాడు.    

 

    తానే మున్సిఫ్ ను ఖూనీ చేశానని చెప్పాడు. మున్సిఫ్ మీద అనేక చాడీలు చెప్పాడు. అతణ్ణి కాఫిర్ అన్నాడు. ఎప్పుడూ హిందువులకే సాయం చేసేవాడన్నాడు. తమను వట్టి ముండలకింద జమ కట్టాడన్నాడు. అతని వల్ల ప్రజలు రెచ్చిపోయారనీ వేరే గత్యంతరం లేకపోయిందనీ చెప్పి నోట్లకట్ట అతని జేబులో పెట్టాడు. హాలులోంచి అంతా నిర్గమించారు - వయ్యారిని అక్కడ వదిలి.

 

    తెల్లవారి ఊరిని హడలకొట్టేశాడు అమీను. కనిపించిన వాణ్ణలా పట్టాడు. కొట్టాడు. ఇండ్లలో దుండుగులను దూర్పించాడు. దోపిడీలు చేయించాడు. కొందరిని కట్టుకొయ్యలకు కట్టి కొట్టాడు. కొందరిమీద బండలెత్తాడు. డబ్బు, డబ్బు బోలెడు డబ్బు వసూలు చేశాడు. ఆ రాత్రి విందులో అధికారికి మరికొంత అందించాడు. అప్పుడు తాసిల్దారు ప్రారంభించాడు.

 

    "హుజూర్ రఘును గిరఫ్తార్1 చేసి తీస్క పోవాలె"

 

    అధికారికి ఏమీ అర్థంకానట్లు చూచాడు.

 

    "ఇంకింత ఇస్త. వాడు బద్మాష్ ఉన్నడు. వాణ్ణి జేల్ల నూకించాలె. ఎవ్వరికి ఎరికెకాకుండా పట్టుకుపోవాలె ఈ రాత్రి గాడి2కి. ఇదో" అని మరొక నోట్లకట్ట అందించాడు.

 

    "నహీఁ హోసక్తా. ఇంకెవర్నన్న పట్టించు పట్కపోత, వాడు మంచోడు."

 

    "అమ్మో! హుజూర్ వాడు మంచోడా? మంత్రాల మారోడు. చూసేటంద్కు అట్లనే ఉంటాడు. సైతాన్ సర్కార్! వాడు సైతాన్ హుజూర్ ఏది కావల్నంటే అదే ఇస్త. పరువు కాపాడాలే సర్కార్" అని కాళ్ళమీద పడ్డాడు. కాదనలేకపోయాడు అధికారి. అతడు తాసిల్దారుకు బానిస అయిపోయాడు. అంతకంటే ఏం చేయగలడు?

 

    అర్థరాత్రి చీకట్లో ఇద్దరు పోలీసులు వీరయ్యగారి ఇంటికి వెళ్ళారు. వారి భుజాలకు తుపాకులున్నాయి. ఇంటిని కాపలా కాస్తున్న భీముడు వారిని చూచాడు. అతని గుండె జల్లుమన్నది. కర్రపట్టుకు లేచి వారికి అడ్డం నుంచున్నాడు.

 

    "మొదలు నన్ను చంపండి. అటెన్క ఇంట్లో అడుగు పెట్టండి" అన్నాడు.

 

    "మేమ్ చంపెటంద్కు రాలేదు."

 

    "మా మొహతమీమ్ సాబ్ రఘుసాబ్ ను పిలుచుకు రమ్మన్నడు. వచ్చినం"

 

    "నన్ను తీస్కపోండి, కాల్మొక్త, నన్ను చంపుండి. చీరుండి! ఆ అయ్య దేవుడు, ఆయ్యన్నేమనద్దు."

 

    "కౌన్ హై బే తూ?" అని ఒక జవాను భీముణ్ణి నెట్టాడు. భీముడు కర్ర ఎత్తాడు. రఘు తలుపు తీసుకొని పరుగెత్తుకొని వచ్చి భీముని చేతిలోని కర్ర పట్టుకున్నాడు. "వారు డ్యూటీ చేయడానికి వచ్చినారు! వారి నేమి అనవద్దు" అని వచ్చినవారిని అడిగాడు. వారు చెప్పారు. అప్పటికి వీరయ్యగారు, జానకి వచ్చేశారు.

 

    "వస్త. భీమన్నా జాగ్రత్త" అని చెప్పి పోలీసులను అనుసరించాడు రఘు.

 

    ఇలాంటి అవాంతరం ఎన్నడో ఒకనాడు వస్తుందనీ, అందుకోసం సిద్ధంగా ఉండాలనీ అనేకసార్లు బోధించాడు రఘు మామకు, మరదలుకూ. వారు కూడా కొంతవరకు అందుకు సిద్ధం అయినమాట నిజమే. అయినా ఆ పిడుగుపాటును సహించలేకపోయింది జానకి. ఇద్దరు పోలీసుల నడుమ పోతున్న బావను చూచింది. కన్నీరు బలబలా రాలింది. అటు చూస్తే బావ దూరం అయినాడు. పక్కకు చూస్తే తండ్రి కనిపించాడు. తండ్రిమీద పడి "భోరు" మంది. వీరయ్యగారు ఆమెను ఓదార్చడానికి తల నిమిరాడు. కాని అతని కన్నీటి బొట్లు ఆమె తలమీద రాలాయి.

 

    భీమన్న తల బాదుకున్నాడు.

 

    కుప్పగా కూలిపోయాడు.

 

    రఘును నేరుగా స్టేషనుకు తీసికెళ్ళారు. రైలు వచ్చేదాకా వెయిటింగ్ రూములో ఉంచి రైలెక్కించారు. రైల్లో చేతులకు బేడీలు వేశారు. అయినా పోలీసులు చాలా మంచిగా ప్రవర్తించారు. రఘు సైతం స్నేహంగా ప్రవర్తించాడు. పోలీసులతో కలిసి చాయ్ త్రాగాడు. సిగరెట్లు కాల్చుకున్నారు. రఘును ఎందుకు తీసుకెళ్తున్నదీ పోలీసులకు అర్థంకాలేదు. రఘు ఆ విషయం వారిని అడగనూలేదు. అతడు విషయం గ్రహించాడు అయినా. వ్యక్తపరచలేదు. చాలా మామూలుగా సాదాగా, సరదాగా ఉన్నాడు. అతణ్ణి చూచి పోలీసులకే ఆశ్చర్యం అయింది. బోనుకు పోయే పులి యిలాగే ఉంటుందేమో అనుకున్నారు.
______________________________
1.అరెస్టు. 2. రైలుకు    

 

    తెల్లవారుతుండగా బండి జిల్లా కేంద్రానికి చేరింది. రఘును మొహతమీమ్ ఇంటికి తీసుకు వెళ్ళారు. అతన్ని గదిలో పారేసి బయటి నుంచి తాళం వేసి వెళ్ళిపోయారు పోలీసులు. మొహతమీమ్ మత్తు ఇంకా దిగలేదు. అతడు పడకగదిలో పడిపోయాడు. రఘు నేల మీద పడి నిద్రపోయాడు.

 

    బాగా పొద్దెక్కిం తర్వాత లేచాడు మొహతమీమ్. లేవగానే అతనిక్కనిపించింది దినపత్రిక. మడత విప్పి చూచాడు. ప్రధాన శీర్షిక చూచి గుండె పగిలింది. అది మున్సిఫ్ హత్యను గురించిన వార్త. "జాగీరులో ముస్లిం మున్సిఫ్ హత్య సమాచారం అందించినవాడు హిందువు - రఘు" అనే శీర్షిక క్రింద హత్యకు సంబంధించిన వివరాలు విచారణకు సంబంధించిన వివరాలు విచారణకు సంబంధించిన వార్త వివరంగా వుంది. రఘును పత్రిక బాగా ప్రశంసించింది.

 

    ఆ వార్త చూచి గంగవెర్రులెత్తాయి అధికారికి. ఏంచెయ్యాలో అతనికి అర్థంకాలేదు. హత్య జరిగిన చోటు నుంచి ఎవరినీ అరెస్టుచేసి తేలేదు. తెచ్చిన వాణ్ణి గురించి పత్రికలు ఇలా వ్రాస్తున్నాయి, ఉర్దూ పత్రికలు కూడా అలా రాయడం అతనికి బాగనిపించలేదు. తరువాత తాసిల్దారు గుర్తుకువచ్చాడు. అతనిమీద కారాలు మిరియాలు నూరాడు. కాని అది గత జల సేతుబంధనం, ఇప్పుడు చేయాలి? రఘును విడుదల చేయడానికి వీల్లేదు. అయితే ఏం చేయాలి? ఎంతో ఆలోచించాడు. అమాంతంగా అతనికి తట్టిన ఆలోచన. రఘును కమ్యూనిస్టు కింద జమకట్టాలి. అతనితో నేరం ఒప్పించాలి. అంతకుమించి తనకు గత్యంతరంలేదు. తెచ్చిన నోట్లకట్టలన్నీ పెట్టెలో సర్దాడు. ముఖం కడుక్కొని నాస్తా చేశాడు. చాయ్ తాగి డ్రాయింగ్ రూములోకి వెళ్ళి రఘును పిలిపించాడు.

 

    రఘు వచ్చాడు. అతణ్ణి చూడగానే అధికారికి కోపం వచ్చే బదులు సానుభూతి కలిగింది. కాని దాన్ని అమాంతంగా దిగమింగి ఉగ్రుడైనాడు. కుర్చీలో కూర్చోబోతున్న రఘుమీద మండిపడ్డాడు.

 

    "బైఠాహై సాలా. ఖడేరహ్ ఖాతిల్ కహీఁక!"* అని కేక పెట్టాడు.

 

    రఘు నుంచున్నాడు. అతనికి లిప్తపాటు కళ్ళు చీకట్లు కమ్మాయి.

 

    కూర్చుంటావా దుర్మార్గుడా! నుంచో హంతకుడా!

 

    "కమీనిస్టువ్ లే భంచత్, ఖూనీ చేసినవ్ లే" గొంతు చించుకున్నాడు.

 

    రఘు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. "ఖూనీ చేసింది నేనుకాదు. అమీను. రుజువు పరచగలను." తొణక్కుండా బెణక్కుండా సమాధానం చెప్పాడు.

 

    "ఏమన్నవ్? అమీను ఖూనీ చేసినాడ్? ఖూనీ చేస్తవ్ అమీను మీద పెడ్తవ్? హరామ్జాదే" అని లేచి లాగి లెంపమీంచి పెట్టాడు.

 

    దెబ్బ బాగానే తగిలింది. అయినా చెలించలేదు రఘు. "నిజం కొంతమందికి చేదుగా కనిపిస్తుంది. అయినా నిజం నిజమే. అనేక సాక్ష్యాలున్నాయి. నిరూపించమంటే నిరూపించగలను" అన్నాడు.
_________________________________________
*కూర్చుంటావా గుర్మార్గుదా! నుంచో హంతకుండా!

 Previous Page Next Page