తను వీళ్ళని ఎదిరిస్తూ చావనన్నా చస్తుంది గానీ ఎవరికీ లొంగదు. బతిమాలి భంగపడదు. ష్యూర్!
మోటుగా సుధ భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు సురేందర్.
ఈలోగా....
ప్రక్కనే ఉన్న ప్రయాణికుడొకడు కళ్ళముందే జరిగిపోతున్న ఈ ఘోరాన్ని చూస్తూ వుండలేక చటుక్కున లేచాడు.
తక్షణం....
పెద్ద సైజు సుత్తిలా బలంగా ఉన్న తన పిడికిలితో అతని దవడ మీద కొట్టాడు అఖిల్.
ఆ ప్రయాణికుడు గింగిరాలు తిరిగి, బెర్తుమీద పడ్డాడు. అతని నోరు రక్తంతో ఎర్రగా అయిపోయింది.
బాడీగార్డు స్టెన్ గన్ పట్టుకుని రెడీగా నిలబడ్డాడు.
ఆ తర్వాత ఇంక ఎవ్వరూ సుధని రక్షించే సాహసం చేయలేదు.
సుందోపసుందుల్లో అన్న అయిన సురేందర్ సుధ పమిట పట్టుకు లాగాడు.
గింజుకుంది సుధ. అతన్ని దూరంగా తోసేసే ప్రయత్నం చేసింది. అతని చేతిని కొరకబోయింది.
నిర్వికారంగా నిలబడి అదంతా చూస్తున్నాడు అఖిల్.
అయిదు నిమిషాల ప్రతిఘటన తర్వాత సుధ వంట్లో శక్తి తగ్గిపోయి నట్లయ్యింది. ఊపిరందడంలేదు తనకి.
అప్పుడు సురేందర్ ఒడుపుగా ఆమె నాభి దగ్గర కుచ్చెళ్లు పట్టుకుని లాగేశాడు.
మరుక్షణంలో సుధ చీరె జారిపోయింది.
పరికిణి, జాకెట్ తో నిలబడిపోయింది సుధ సిగ్గుతో, అవమానంతో వళ్ళు చచ్చిపోతున్నట్లు వుంది తనకి.
అప్రయత్నంగానే అఖిల్ వేపు చూసింది.
అదోరకమైన తృప్తి కనబడుతోంది అతని మొహంలో.
"నీ పని కానివ్వు అన్నా!" అని సురేందర్ తో చెప్పి, తలుపు దగ్గరకెళ్ళి తలుపు తెరచి బయటికి చూస్తూ నిలబడ్డాడు అతను.
ప్రయాణీకులందరినీ తన గన్ తో కవర్ చేస్తూ బెదిరించడానికి వీలుగా, బాడీగార్డు కూడా దాదాపు అఖిల్ దగ్గరే నిలబడ్డాడు.
విపరీతంగా పెనుగులాడుతున్న సుధని మరింతగా దగ్గరికి హత్తుకున్నాడు సురేందర్.
అప్పుడు జరిగింది అది....
ఊహాతీతమైన వేగంతో మెరుపులాగా కదిలాడు అఖిల్. మరుక్షణములో అతను బాడీగార్డు చేతిలోని స్టెన్ గన్ ని గుంజుకున్నాడు. ఆ తరువాత క్షణంలో స్టెన్ గన్ గాల్లో పయనిస్తూ తలుపులో నుంచి వేగంగా బయటికి వెళ్ళిపోయింది.
అప్పటిదాకా అఖిల్ ప్రవర్తనని గమనిస్తూ, అతనివల్ల తమకి ప్రమాదమేమీ లేదని నమ్మకం కుదిరి, కొంచెం అలక్ష్యంగా వున్న గన్ మాన్, అఖిల్ మెరుపువేగంతో తన చేతిలోని స్టెన్ గన్ ని గుంజుకొని రైల్లో నుంచి బయట పారెయ్యడంతో నిర్ఘాంతపోయాడు.
మరుక్షణంలోనే తేరుకుని, అతని మీదకు లఘించబోయాడు గన్ మాన్.
శరీరాన్ని ఉక్కుముక్కలా చేశాడు అఖిల్. గన్ మాన్ దూకుడుని ఎదుర్కోవటమే కాకుండా, అతన్ని అవలీలగా ఎత్తేసి వాష్ బేసిన్ మీద కుదేశాడు.
నడుము విరిగినట్లయ్యింది గన్ మాన్ కి.
ఈ గలభా విని, తిరిగి చూశాడు సుందోపసుందుల్లో తమ్ముడు ఐన దేవేందర్. వాళ్ళకి కొట్లాటలు కొత్తకాదు.
విలాసాల్లో సుఖాలు మరిగి మెత్తబడిపోయిన శరీరాలు వాళ్ళవి.... అయినా వాళ్ళ బలం అంతా తుపాకులే!
తుపాకీ చాలా చిత్రమైన ఆయుధం!
తుపాకులు బాగా వాడకంలోకి వచ్చాక హింసలో కూడా మార్పు వచ్చింది.
హింస సృష్టి ఆదినుంచి ఉంటూనే ఉంది.
రక్తపాతం, రౌడీయిజం- ఇవేవీ మనిషికి కొత్త కాదు.
అయితే....
పాతకాలపు రోజుల్లో పోట్లాటలు వేరే విధంగా ఉండేవి.
మామూలుగా ప్రత్యర్ధుల మధ్య బాహాబాహీ యుద్ధాలు జరిగేవి.
ఎవరికి ఎక్కువ భుజబలం, ఎవరికి ఎక్కువ బుద్ధిబలం ఉండేవో వాళ్ళు ఆ యుద్ధాల్లో గెలిచేవారు.
కానీ తుపాకులు వచ్చాక దేహబలం అనేది అర్ధంలేని దయిపోయింది.
అర్భకుడూ, పిరికిపందా అయినవాడు కూడా ఒక తుపాకీని దొరక బుచ్చుకుని, తనకంటే వందరెట్లు బలం, వెయ్యి రెట్ల తెలివీ ఉన్నవాడిని కూడా పిట్టని కాల్చినట్లు కాల్చి చంపెయ్యచ్చు.
తుపాకీ హింసా సంస్కృతిని మార్చివేసింది.
నిజం!
సుందోపసుందులయిన సురేందర్, దేవేందర్ లు ఇద్దరూ కూడా, తుపాకులమీద ఆధారపడి జులుం చలాయిస్తున్నవాళ్ళే.
ఎప్పుడయితే గన్ మాన్ తాలూకు స్టెన్ గన్ రైల్లో నుంచి బయటపడి పోయిందో, అప్పుడే వాళ్ళకింక అదురు పుట్టింది.
పైగా....
అఖిల్ బాడీ-కసరత్తు చేసి చేసి కండలు తిరిగిన అతని శరీరం_
అతను షర్టు వేసుకునే ఉన్నా, షర్టుకింద కండరాల కదలిక చూస్తున్న అన్నదమ్ములిద్దరికీ వణుకు పుట్టించింది.
నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు అఖిల్.
రెండు చేతుల్తో రెండు దెబ్బలు తగలనిచ్చాడు వాళ్ళకి.
అంతే! సురేందర్ చెవిలో నుంచి రక్తం కారడం మొదలెట్టింది.
దేవేందర్ పెదిమ మధ్యకు తెగింది.
ఈలోగానే....
ఆదరాబాదరగా చీరె వంటికి చుట్టేసుకుంది సుధ.
అప్పుడు నెమ్మదిగా అన్నాడు అఖిల్ -
"ఐ యామ్ సారీ! వాళ్ళదగ్గర పవరఫుల్ స్టెన్ గన్ ఉంది. అందుచేత వాళ్ళని ఏమార్చడానికిగానూ కాసేపు మీపట్ల విరోధం ఉన్నట్లు నటించవలసి వచ్చింది."
సుధ ఏదో అనబోయేలోగానే-
ప్రయాణికులందరూ ధైర్యం కూడదీసుకుని అక్కడికి వచ్చి గుమికూడారు. వాళ్ళలో తనచేత దెబ్బతిన్న ప్రయాణికుడితో అన్నాడు అఖిల్- "నన్ను క్షమించండి! నేను మిమ్మల్ని కొట్టి ఆపి ఉండకపోతే గన్ మాన్ మిమ్మల్ని కాల్చేసి వుండేవాడు."
'ఫర్వాలేదు!' అన్నట్లు తల పంకించాడు ఆ ప్రయాణికుడు.
ఒక పాప ముందుకు వచ్చి "విలన్ వెధవా" అని తిట్టి సురేందర్ మొహంమీద ఉమ్మేసింది.
నవ్వులు వినబడ్డాయి.
అందరూ అఖిల్ ను మెచ్చుకోవడం మొదలెట్టారు.
ఆ సందట్లో_
హఠాత్తుగా రైలు ఆపే అలారం చెయిన్ లాగాడు అన్న అయిన సురేందర్.
జరుగుతున్నదేమిటో అఖిల్ గ్రహించేలోగానే రైలు ఆగింది. జనాన్ని తోసుకుంటూ తలుపు దగ్గరికెళ్ళిపోయి కిందికి దూకేశారు అన్నదమ్ములు. వాళ్ళవెనకే దూకేశాడు బాడీగార్డు. ముగ్గురూ పరుగెత్తడం మొదలెట్టారు.
ఆశ్చర్యంలోనుంచి తేరుకున్నాడు అఖిల్. వాళ్ళని తేలిగ్గా వదలదలచుకోలేదు అతను.
అందుకని తను కూడా రైల్లోనుంచి దూకి, వాళ్ళని తమరడం మొదలెట్టాడు.
ఇంజన్ వైపు పరుగెత్తడం మొదలెట్టారు వాళ్ళు ముగ్గురూ. అతివేగంగా వాళ్ళ వెనకే పరిగెడుతున్నాడు అఖిల్. వాళ్ళు ఇంకో రెండు అడుగులు వేస్తే దొరుకుతారనగా_
అప్పుడు అఖిల్ కి కనబడింది ఆ దృశ్యం!
అతని గుండె లయ తప్పినట్లయ్యింది.
రెండు సెకండ్లపాటు నిశ్చేష్టుడయిపోయిన అఖిల్ తేరుకుని, మళ్ళీ ట్రాక్ వైపు చూశాడు.
ఆగిన ఇంజన్ కి సరిగ్గా అడుగు దూరంలోనే ట్రాక్ మీద ఉంది పవర్ ఫుల్ బాంబు ఒకటి! తనేం చెయ్యాలో తక్షణం స్పురించింది అతనికి.
ఇంజన్ ని వెనక్కు పోనివ్వమని డ్రైవర్ కి పెద్దగా కేకేసి చెప్పాడు. అలా చెబుతూనే చిరతలా ఉరికి, ముందు వెళుతున్న అన్నదమ్ములిద్దరినీ చెరో చేత్తో పట్టేసుకున్నాడు.
తక్షణం వాళ్ళ కళ్ళలో ప్రాణభయం కనబడింది.
"ప్లీజ్! మమ్మల్ని వదిలెయ్యి" అన్నాడు అన్న, రైల్లో నుంచి గుంపులు గుంపులుగా దిగుతున్న ప్రయాణీకుల వైపు భీతావహుడై చూస్తూ. జనం అంతా కలిసి ఒక్కటయ్యారంటే, తనలాంటి వాళ్ళ గతి ఏమవుతుందో అతనికి బాగా తెలుసు.
"వదిలెయ్! ప్లీజ్!" అన్నాడు మళ్ళీ.
"వదుల్తాను! కానీ ఒక కండిషన్ మీద" అన్నాడు అఖిల్.
అన్నకి పోయిన ప్రాణాలు తిరిగివచ్చినట్లయింది.
"చెప్పు! ఏమిటా పని?" అన్నాడు ఆత్రంగా.
పట్టాలవైపు చూపించాడు అఖిల్.
"అదేమిటో చూశారా?"
అన్నదమ్ములిద్దరూ చూశారు. "ఫారిన్ బాంబు" అన్నాడు తమ్ముడు పీడకలలో కలవరిస్తున్నట్లు.
"మీరిద్దరూ కలిసి దాన్ని తీసేసెయ్యాలి. మీకు బాంబులతో బాగా పరిచయం వుండే వుంటుంది కదా" అన్నాడు అఖిల్.
అన్న అదిరిపడ్డాడు.
"అట్టాంటి ఇట్టాంటి బాంబు కాదిది. ఆటంబాంబుకి అమ్మ మొగుడి లాంటిది" అన్నాడు గజగజ వణుకుతూ.