"నావైఫ్ కి స్వాములవార్లన్నా, స్వాములమ్మలన్నా నమ్మకం లేదు." ముకుందరావు ముకుళించుకుపోయిన మొహంతో అన్నాడు.
"మూడ్ చూసి వప్పించే ప్రయత్నం చెయ్యి భార్యలందరూ కాస్త టెక్కు ప్రదర్శిస్తూనే ఉంటారు. మనమే భరించి చిరునవ్వుతో సహించి ఒప్పించాలి. నాలుగు చివాట్లు పెడితే భరించు భార్య చివాట్లు పెడితే భర్త భరించడంలో తప్పేం లేదు ఇలా ఇంటా బయటా గొడ్డుమోతు వాడివనిపించుకోవడం నీకు మటుకు బాధగా లేదా!" అంటూ సానునయంగా చెప్పాడు అతను.
ముకుందరావు బుర్రకి ఆ మాటలు బాగా ఎక్కాయ్. అప్పట్నించి ఇంటి కొచ్చేవరకు ఈ విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ముకుందరావు.
రాత్రి అయింది.
భార్య ఆహ్లాదకరంగ ఉన్నా మంచి సమయం చూసి స్వాములమ్మ సంగతి బైట పెట్టాడు.
"ఛత్! ఇలాంటి పగటి వేషగత్తెల సంగతి నాదగ్గిర ఎత్తకండి. మంత్రాలకి మామిడికాయలురాలవ్" విసుక్కొంటూ అంది మలయవంతి.
"ఏమో! ఏ పుట్టలో ఏ ముందో? ఒక్కసారి వెళ్ళి చూస్తేపోయిందేముంది! ఈ వక్కసారికి నా....మా ...ట ..." ముకుందరావు నాన్చుతు అన్నాడు.
"వాళ్ళ మీద నాకు నమ్మకంలేదు." మలయవంతి ముఖంచిట్లిస్తూ చిరాగ్గ అంది.
కార్యం సాధించాలంటే ఓర్పు అవసరం ఓర్పుగ నేర్పుగ వకటికి పదిసార్లు భార్యని అడిగాడు ముకుందరావు.
చివరికి ఏ మూడ్ లో వుందో మలయవంతి "ఈ వక్కసారికి....ఊ..." అంది పనిలో పని హెచ్చరించింది. చివర మాటగ "నా స్నేహితురాళ్ళ భర్తలందరూ పిల్లవాళ్ళ తండ్రులయారు, నా తర్వాత పెళ్ళి చేసుకున్న నా ఇద్దరు చెల్లెళ్ళ భర్తలు పిల్లలని కన్నారు. నా తమ్ముడు మొన్న మొన్ననే పండంటి పిల్లవాడిని కన్నాడు. ఆఖరికి నాకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలు "నాకు తమ్ముడు ఎప్పుడు పుడతాడేఅమ్మా" అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక చచ్చిపోతున్నాను. ఈ వక్క సంవత్సరము ఆగుతాను. మీ కడుపునా ఓ పిల్లకాయ కాయకపోతే విడాకులు తప్పదు" అంటూ అటు తిరిగి పడుకుంది.
విడాకుల మాట తర్వాత ముందు తన మాట మన్నించింది. అంతే చాలు. వక్కసారి అంబలంబ స్వాములమ్మగారిని కల్సుకుంటే నా అదృష్టం ఫలిస్తే....తీయగ ఆలోచిస్తూ నిద్రపోయాడు ముకుందరావు.
ఆ మర్నాడు ఆఫీసుకి శెలవు పెట్టాడు ముకుందరావు.
అంబలంబ స్వాములమ్మగారి ఆశ్రమానికి తోడుగరమ్మంటే "నాకు ఇలాంటి నమ్మకాలు లేవు" అంటూ మలయవంతి తన ఆఫీసుకి వెళ్ళిపోయింది.
ముకుందరావు ప్రాణం వుసూరుమంది. అయినా తను యీ విషయంలో అసమర్ధుడు. అవసరం తనది అనుకున్నాడు.
పాపం వంటరిగానే ముకుందరావు పూలు పళ్ళు కుంకం పసుపు తీసుకుని అగరవత్తులు కర్పూరం టెంకాయ జబారులో కొనుక్కుని" అంబులంబ స్వాములమ్మ ఆశ్రమానికి వెళ్ళాడు.
అక్కడ.
ఆశ్రమంలో-
పురుష పుంగవులు తమ కొడుకులతోను పక్కింటి వాళ్ళతోనూ ఏవేవో బాధలతో సమస్యలతో అక్కడికి వచ్చిన వాళ్ళతో ఆచోటఅంత కిటకిటలాడుతున్నది.
ఒక్కొక్కళ్ళని పిలిచే సారికి చాలా సమయం పట్టేట్టుంది. "ఆమె దగ్గర ఎంత మహాత్యం లేకపోతే ఇంతమంది మగవాళ్ళు గుమి గూడతారు. ఆమె దైవాంశ సంభూతురాలు దేవత__దైవం పంపిన దూతిణి మహిమగల తల్లి." అని తలో విధంగ చెప్పుకుంటున్నారు.
ఒక్కొక్కళ్ళ వంతు వచ్చేసారికి చాలా సమయం పడుతున్నది. యీ లోపల ఊరికే ఉండలేక తమకొచ్చిన కష్టం ఏమిటో ఒక్కోళ్ళకొకళ్ళు చెప్పుకొంటున్నారు.
సానుభూతి మాటలు, ఊరడింపుమాటలు, తమకష్టం ఇతరులతో చెప్పుకోవటం వల్ల హృదయం తేలిక పడటం...ఇవన్నీగాక ఆ ఆశ్రమంలోని ప్రశాంతత ఊదొత్తులు, కర్పూరం యొక్క పరిమళాలు...ఏదో దివ్యలోకంలోకి అడుగుపెట్టినట్టుంది. పురుష పుంగవులకి.
ముకుందరావు వంతు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు దాటింది.
ముకుందరావుకి లోపల్నించి పిలుపు రాంగానే వినయంగ లేచి నిలబడి వినమ్రతతో చేతులు ముడుచుకుని బితుకు బితుకుమంటు లోపలికెళ్ళాడు.
లోపల గదిలో__
అంబులంబ స్వాములమ్మగారు ఒంటి నిండా బోలెడు సొమ్ము దిగేసుకొని జుట్టు విరబోసుకుని మొహంనిండా అరంగుళం మందాన పసుపు రాచుకుని నుదుటన రూపాయి బిళ్ళంత కుంకం బొట్టు దానికింద అడ్డంగ గంధంబొట్టు దానిమీద అక్షింతలు అతికించి ఆ కింద కనుబొమ్మలు కలిసేచోట విభూతి మెత్తుకొని మిరప్పండు రంగు పట్టుబట్టని కింద గూడకట్టు లోగాను పైన కప్పుకుని అదోరకంగ పోతపోసిన విగ్రహంలా పద్మాసనం వేసుకుని కూర్చుని వుంది.
అంబులంబ స్వాములమ్మ భారతదేశం మహిళే. ఏ జన్మ సాంగత్యమో మరే కారణమో తెలియదుగాని అచ్చం నీగ్రోజాతి మనిషిలా ఉంది మనిషి విపరీతమైన లావు తల కాయని తీసుకొచ్చి భుజాల మీద ఆనించినట్టు మెడ మూసుకొని పోయి వుంది. మెడలో బోలెడు ఆభరణాలుండ బట్టి "ఓహో! అక్కడ మెడ ఉండే వుంటుంది." అనిపించేలా ఉంది. లావుపాటి దొండకాయల్లాగ పెదవులున్నాయ్. ఒక్కోచెవికి అరకాసు బంగారంతో చేయించిన దిట్టమైన దిద్దు ఉండటం వల్ల రెండు చెవులూ సాగిపోయున్నాయ్. ఇంకొక్క ఏడాది ఆగితే ఆ బరువుకి చెవులొచ్చి భుజం మీద వాలినా ఆశ్చర్యపోనక్కరాలేవు. మాయదారి దేవుడు! ముక్కుని సృష్టించడం మర్చిపోయాడో ఏమో! బుగ్గలతో సమానంగ ముక్కుండి ముక్కు తమ్మెలు మాత్రం కాస్త ఎత్తుగా కానవస్తున్నాయ్. అక్కడ ముక్క వుంది సుమా అనిపిస్తూ.
కళ్ళు చూడబోతే బుల్లి బుల్లివి. అయితే మాత్రమేమి? చూపులు సూదంటు రాయిలాగాను, సూదుల్లాగాలు చురుక్కున కానవస్తున్నాయ్. మొత్తానికి ఆమె వేషధారణ, ఆమె రూపం విచిత్రంగా వున్నాయ్.
వినాయకుడికి తొండం వుంది తుంబురుడికి ఇంత పొడుగు గుర్రం మొహం వుంది. అలాగే మరికొందరు దేవతలు దేముళ్ళు ఉన్నప్పుడు ఇంత మహత్తుగల అంబులమ్మ స్వాములమ్మ విచిత్ర రూపంలో వింతగా ఉండటంలో తప్పులేదు.
లోపలి కెళ్ళంగానే ముకుందరావు ఆమె కాళ్ళమీద చేతులుంచి భక్తితో ఆ చేతుల్ని కళ్ళకద్దుకున్నాడు.