Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 33

   
                                                - 16 -

    దీక్ష చిరునవ్వుతో అందరిని ఓ పర్యాయం కలయ చూసింది.

    అందరి చూపులు తనపైనే.

    'ఇంతవరకూ జరిగింది ఒక ఎత్తు చివరిది ఒక ఎత్తు. ఇదే తుది మొదలు అసలు కొసరు. దీంతో తన పని అటో యిటో తేలిపోతుంది.' అనుకున్న దీక్ష మైకు ముందు నిలిచి మాట్లాడటం మొదలుపెట్టింది.

    "సోదరీ మణులారా! మీరు ఇంతవరకు ఓపికగా కూర్చుని సహనంతో వింత వింత పోరాటాలని తిలకించారు. ఇది చూసి మీరందరూ ఆనందించటమే కాదు ఇదెలా సాధ్యమా అని రవంత అలోచించి కూడా వుంటారు.

    సాధ్యమా! అనుకునే ముందు ఒక్క విషయం. పట్టుదల ఉత్సాహం వుంటే ఏదైన సాధ్యమే. సాధనమున పనులు సమకూరు ధర లోన అన్నారు పెద్దలు. సంకల్ప బలం వుంటే అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించవచ్చు.

    పూర్వంకన్న యిప్పటి రోజుల్లో స్త్రీలు హాయిగా వున్నారు. అన్ని రంగాలలో వున్నారు. స్వేఛ్చ స్వాతంత్రాలతో వున్నారు. నిజమే కాని రక్షణ మాత్రం పూజ్యం. సున్నాకి సున్నా హళ్లికిహళ్ళి. ఇదీ ఈనాటి స్త్రీ బ్రతుకు.

    ఆడది బైటకాలు పెడితే ఆకతాయి మూకల ఆగడాలు. కాముకుల కోరికల కాట్లు. ఈ స్వాతంత్ర్యంలోని స్త్రీ బ్రతుకు యిది. పేపరు తెరవాలంటే భయం. అయిదారు రేప్ కేసులే. ఆరేళ్ళ పసిదాని దగ్గర నుంచీ తొంభై ఏళ్ళ ముసలమ్మ వరకు రేప్ విశేషాలే.

    బస్సు ఎక్కాలంటే భయం. బజారు కెళ్ళాలంటే భయం. వీధి వీధిన దుర్యోధన దుశ్శాసనులే!

    ఈ కాలం స్త్రీని కదిలిస్తే "భయం భయం బ్రతుకు భయం. నయం నయం ఆ రోజులే మా పాలిట నయం నయం." అంటున్నారు.

    ఈ దుస్థితి స్త్రీ కెందుకు కలిగింది?

    స్త్రీకి స్వాతంత్ర్యం లేదా?

    ఉంది...

    స్త్రీ చదువుకోలేదా!

    కుంది. (చదువుకుంది)

    స్త్రీకి శక్తి లేదా?

    వున్నట్లే వుంది.

    మరి?

    మనలో ఝాన్సీలక్ష్మీబాయి లాంటి వీరనారీమణులు లేరా? రుద్రమదేవి లాంటి వీరవనితలు లేరా! ఇందిరాజీలాంటి వీర మాతలు లేరా! వున్నారు. అవసరం వస్తే కదన రంగంలో విల్లుపట్టే అపర సత్యభామలు కూడా వున్నారు.

    కాని మగవాడు, కీచకుడు లాంటి మగవాడు మీదకి వస్తుంటే ఏమీ చేయలేని ఈ నిస్సహాయత ఏమిటి? తనకి అన్యాయం జరిగి పోతుంటే మరో మగవాడు వచ్చి రక్షిస్తేగాని బైటపడ లేని ఈ అసహాయత ఏమిటి? తనని రక్షించటానికి ఎవరూ రాకపోతే ఆ స్త్రీ గతి నిర్గాతేనా!

    కాదు... కాదు... కాదు...

    ఒంటరిగా పోరాడి తనని తాను రక్షించుకోగలదు స్త్రీ. అంతే కాదు మరో స్త్రీని కూడా అవసరం అయితే రక్షించగలదు. అన్నా! వచ్చి రక్షించు! అని గుండెలు బాదుకున్నా కృష్ణా కాపాడవా! అని ఎలుగెత్తి అరిచినా, హెల్ప్ హెల్ప్ అని పిలిచినా ఎవరూ ఆదుకోవటానికి పరుగెత్తుకు రారు.

    మీరు యింతకు ముందు కొన్ని ప్రదర్శనలు చూశారు. అవన్నీ ప్రస్తుత సమాజంలో నిత్యం జరుగుతున్న సంఘటనలే. మీ అందరికి తెలిసిందే. ఒంటరి స్త్రీ నలుగురితో పోరాడి విజయం సాధించింది. అదెలాగో మీరు చూశారు.

    ఇది నిజ జీవితంలో సాధ్యమా అన్న ప్రశ్న యిప్పటికే మీకు వచ్చి వుంటుంది. సాధ్యమేనని నొక్కి వక్కాణిస్తున్నాడు. సాధన అసాధన అన్నవి రెండూ మన చేతిలోనే వున్నాయి. శరీరం అన్నది మహా బద్ధకస్తురాలు. మనసు శక్తివంతమైనది. కాస్త మనసు పెట్టుకుని శక్తిని వుపయోగించి శరీరాన్ని అదుపులో పెట్టుకుంటే మన శరీరాన్ని అంటి పెట్టుకున్న బద్ధకాన్ని అవలీలగా పారదోలవచ్చు. ఎప్పుడైతే మన శరీరం మన మాట వింటుందో అప్పుడే వుట్టిచేతులతో కొండని కూడా పిండి చేయవచ్చు.

 Previous Page Next Page