Previous Page Next Page 
అహల్య పేజి 33


    'ఏం శిష్యవర్యా!'


    గౌతముల చమత్కారానికి సిగ్గుపడ్డాడు శిష్యుడు.


    'తల వంచుకునే పనేదయినా చేస్తేనే తల వంచుకోవాలి. లేనప్పుడు ఎందుకా సిగ్గు?'


    'పెద్దల ముందు పెద్దరికం ప్రదర్శించడం సిగ్గు తెప్పించింది గురువర్యా!'


    'సరే! ఏమిటి నీ సందేహం?'


    'దేన్నయినా సాధించవచ్చా అని అడిగాను. ఇష్టకామ్యాలూ సిద్ధిస్తాయా?'


    'అంటే?'


    'ఆధిపత్యం- ఐశ్వర్యంతో పాటు సిద్ధిస్తుందా?'


    'ఆహా!'


    'రాజ్యాంగ సభలో స్థానం లభిస్తుందా?'


    'ఆహా! అయితే ఆ సభలో స్థానం లభించాలంటే విద్యార్హత ఉండాలి కదా!'


    'అదే నా ప్రశ్న గురుదేవా!'


    'అంటే విష్ణుసహస్రనామ పారాయణం వల్ల విద్యలు లభిస్తాయా అని కదా నీ సందేహం?'


    'ఓరి బుద్ధిమంతుడా! నిష్టతో పారాయణం చేయగలిగిన బుద్ధిమంతుడికి చదువెందుకు రాదురా! ఆత్రమతీ! మందబుద్ధిమంతుడికి విద్య అబ్బదు. కానీ శ్రమించే వాడికెందుకు విద్యలు ప్రాప్తించవు?'


    'మందబుద్ధి మంతులకు ఆ మందతనం పోతుందా?'


    గౌతముడు క్షణంపాటు ఆలోచించాడు 'కొడుకు కోసం తండ్రి దీక్షగా పఠిస్తే వాడికి ఆ మందబుద్ధితనం పోతుంది. అందులో సందేహం లేదు!'


    శిష్యుడు తలూపేడు. క్షణం ఆగి అన్నాడు 'గాన విద్య సిద్ధిస్తుందా గురుదేవా?'


    'లభిస్తుంది! సాధనతో అన్నీ సమకూరుతాయి. కమ్మని కంఠం రాకపోవచ్చు. కానీ పాండిత్యం వస్తుంది. శాస్త్రవేత్త అవుతాడు. అందుకు సందేహం లేదు. అయినా లలిత కళలు, గానం, శిల్పం, నృత్యం, కవిత్వం మొదలయినవి పాండిత్య మాత్రంతో శోభించవు. వాటిలో నేర్పరితనం రావాలి. మేలిమి కావాలి. అప్పుడే వన్నెకెక్కేది.'


    శిష్యుడు తలూపేడు.


    'కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, అవన్నీ స్వర్గలోక వాసులకు సొమ్ము. కోరినవన్నీ వారికి వాటి ద్వారా సిద్ధిస్తాయి. భూలోక వాసులకు అవన్నీ- కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, కలగలిసిన సుస్వరూపం ఈ విష్ణుసహస్రనామం. చాలా, ఇంకేమైనా వివరణ కావాలా?'


    తెలిసిందన్నట్లు అంతా తలూపేరు.


    గౌతములు ఆ పూటకు పాఠం చాలించేరు. 'సహనా వవతు. సహనౌభునక్తు. సహవీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు' గురుదేవులతో పాటు శిష్యులందరూ కమ్మగా పఠించారు.


    ఆ రాత్రి గౌతములు, అహల్యా ఆశ్రమంలో ఏకాంతంలో ఉన్నారు. అహల్యాదేవి మనసారా భర్తను సేవించింది. గౌతములు ఋతు ధర్మాన్ని అనుసరించి, మనసెరిగి ఆమెతో సరస సల్లాపాలు సాగించి శయ్యాసుఖాన్ని పరిపూర్ణంగా పొందాడు. స్వాతివానలో ముత్యపు చిప్ప చినుకును స్వీకరించింది.


                                                  *    *    *    *


    గౌతముడు కుటీరం తలుపులు తీసుకుని బయటికి వచ్చారు. అక్కడ- కోసల రాజ్యంలో రాజ్యాంగ వేత్తల నిర్ణాయక సభలో పండిత ప్రతినిధి- న్యాయ వైశేషిక విద్య అభ్యసించిన ఆయన శిష్యుడు- ఓ చెట్టు కింద కూర్చుని, గురువుల రాక కోసం నిరీక్షిస్తున్నాడు.


    గౌతములు బయటికి రాగానే ఆ శిష్యుడు తన ప్రవర- అంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్దేవ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య అశ్వలయన సూత్రః ఋక్ శాఖాధ్యాయీ శ్రీధరశర్మ అహంభో అభివాదయేత్- అంటూ ప్రవర చెప్పుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు.


    గౌతములు వేదాశీర్వచనం చేశారు.


    శిష్యుడు లేచి నుంచున్నాడు 'గురుదేవా! రావణుడి దుశ్చర్యలు క్షణ క్షణానికీ ఎక్కువవుతున్నాయి. రక్షణ లేని ఆశ్రమాలపై రాక్షసుల దండయాత్రలు ఎక్కువైపోయాయి. యజ్ఞయాగాదులు జరగనివ్వకుండా చేస్తున్నారు. ఆశ్రమ జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. విశ్వామిత్ర, భరద్వాజ మొదలయిన మహర్షుల ఆశ్రమాలు, తమ ఆశ్రమం, వశిష్టుల వారి ఆశ్రమం తప్ప సాధారణ మహర్షుల ఆశ్రమ జీవనం దినదిన గండంగా ఉంది. గడ్డాల వారు కనిపిస్తే చాలు వారిని రకరకాలుగా హింసిస్తున్నారు. రాజులు ఏమీ చేయలేకపోతున్నారు. రాక్షస మాయని నిగ్రహించలేక పోతున్నారు. సాంఘిక జీవనం కూడా భద్రత చెడింది. ఆలయాల్లో అర్చనలు కూడా సక్రమంగా సాగడం లేదు.


    శివాలయాల్లో ఆరు యామాలలోనూ మహా రుద్రాభిషేకాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. వైష్ణవ దేవాలయాలలో దీపారాధనకు కూడా కొరత ఏర్పడిపోయింది. ఈ గుళ్ళలో ధూప దీప నైవేద్యాలు తగ్గిపోయి, శివాలయాల్లో అభిషేకాలూ, ఆరాధనలూ పెద్ద ఎత్తున జరిగిపోతున్నాయి.


    చిన్న చిన్న రాజ్యాల ప్రజలు, ప్రభువులూ ఇప్పుడీ దానవ బాధ నుండి విముక్తి లభిస్తుందా అని మనసులో నారాయణ జపం చేస్తున్నారు.


    పురాణ వేత్తలు త్వరలో దశరధ మహారాజుల వారు త్వరలో పుత్ర కామేష్టి నిర్వహిస్తారనీ, ఆ యాగ ఫలంగా వారికి కుమారుడు జన్మిస్తాడనీ, శ్రీమన్నారాయణాంశలో జన్మించి, ఆ పురుషోత్తముడూ, కౌసల్యా తనయుడు, ఆ దాశరధీ, ఆ రాఘవుడు, అయోధ్యా ధీశుడు యీ బాధలన్నింటినీ రూపుమాపడానికి ఆ దశకంఠుడి రూపుమాపుతాడనీ చెపుతున్నారు. అందరూ ఒళ్లంతా కళ్ళు చేసుకుని నిరీక్షించే ఆ శుభ ఘడియ ఎప్పుడెప్పుడా అని జనమంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.'

 Previous Page Next Page