"విదేశాలేందుకు నాన్న, మనదేశంలో ఉన్న వాళ్ళేందరు ఈ ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారా ఇప్పుడు , ఏదో మీలాంటి పాతతరం ఒకరిద్దరు తప్ప."
'నిజమేలే నీ వన్నది. చూడు బాబూ శరత్ - ఈ ఆచార వ్యవహారాలు నీకిప్పుడు చెప్పినా సరిగా అర్ధం కావు కానీ, ఇలా చేయడం వెనక పెద్దలు ఈ ఆచారం ఎందుకు పెట్టారో నీకర్ధంయ్యేట్టు చెప్పనా - ఇదివరకు రోజుల్లో మేం కింద కూర్చుని అరిటాకు వేసుకుని భోం చేసేవాళ్ళం. నేలమీద చీమలు, చిన్న కీటకాలు, సూక్ష్మజీవులు విస్తరకి పాకి రాకుండా విస్తరి చూట్టూ నీళ్ళు తిప్పితే ఆ నీళ్ళు దాటి చీమలు లాంటివి రాలేవు గదా - తరువాత ఉద్దరిణి తో నీళ్ళు పోసి వదలడం అంటే చేయి కడుక్కోవడం, నోట్లో నీరు పోసుకోవడం అంటే ఔపోసన -అంటే ఎండిన గొంతుని తడిపితే అన్నం ముద్ద సుళువుగా జారుతుందని ఇలా ఆచారం అంటూ పెట్టారేమో! మనవాళ్ళు అలా పెట్టిన ప్రతి ఆచారం వెనుక ఓ సైంటిఫిక్ రీజను వుండేది కాని అలా ఎందుకు చెయ్యాలో చెప్పేవారు కాదు సరిగా . దాంతో ఈ అచారాలన్నీ కొట్టిపారేసారు మనవారు. రోడ్లన్నీ తిరిగి వచ్చిన కాళ్ళతో ఇంట్లోకి రాకుండా గుమ్మం ముందు నీళ్ళు పెట్టి కడుక్కుని రమ్మనేవారు. మా చిన్నతనాన చెప్పులుండేవి కావు. అలాగే గుమ్మం ముందు పేడనీళ్ళు జల్లడం, ముగ్గు, గడపలకి పసుపు రాయడం అన్నింటి వెనక ఆరోగ్య రహస్యలుండేవి."
శరత్ తాతగారి మాటలు శ్రద్దగా విన్నాడు.
"డాడీ ఎప్పుడూ చెప్పలేదు నాకు -"
"నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి మాన్నాన్న నాకెప్పుడూ చెప్పలేదు మరి -"- వేణు నవ్వుతూ అన్నాడు.
"కృష్ణశర్మ నవ్వి, నీకంటే నీ కొడుకు నయం తెల్సుకోవాలన్న జిజ్ఞాస ఉంది వాడికి...."
"నాన్నగారు ..... మీరున్నన్ని రోజులు పిల్లలకి కాస్త తెలుగు పదాలు, శతకాలు, చెప్పి అర్ధం చెప్పండి. ఇలాంటి ఆచార వ్యవహారాలు, వాటి వెనుక ఉన్న విజ్ఞానం చెప్పండి వాళ్ళకి" అన్నాడు వేణు.
* * * *
"నాన్నగారూ ఇతను మైఖేల్ .... నా కొలీగ్. మిమ్మల్ని కలవాలని , మీతో కొన్ని విషయాలు చర్చిందాలని వచ్చాడు." - వేణు తండ్రితో అన్నాడు. మూడు రోజుల తర్వాత ఆఫీసు నించి స్నేహితుడిని వెంటబెట్టుకుని వచ్చి తండ్రికి పరిచయం చేశాడు.
కృష్ణశర్మ అతను చాపిన చేయి అందుకుని కరచాలనం చేసి "నాతోనా" అన్నారు ఆశ్చర్యంగా.
"ఆ, ఇతనికి మన హిందూ సాంప్రదాయాలు, భారతీయ సంస్కృతీ , మన వేదాలు పురాణాలు బాగా తెలుసు. ఆధ్యాత్మిక పుస్తకాలెన్నో చదివాడు. ఇండియా రెండు సార్లు వెళ్ళి, హరిద్వార్, బదరీనాద్ లలో పదిహేను రోజులుండి, యోగా, మెడిటేషన్ అవి నేర్చుకుని వచ్చాడు - మన రామాయణ భారతాలు చదివాడు. మీకు ఇంగ్లీషు, సంస్కృతం , తెలుగు అన్నీ బాగా వచ్చు. పురాణేతిహసాలు చదివారు. అతనడిగిన సందేహలని మీరు ఇంగ్లీషులో విడమర్చి చెప్పగలరు - మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నేను ఫ్రెష్ అయి వస్తాను -' అని వేణు లోపలికి వెళ్ళాడు.
ముఖేల్ నవ్వుతూ తనని తాను పరిచయం చేసుకుని తనకి భారతదేశం ఎందుకు నచ్చిందో, వేదాలలో సారం , హిందువుల ఆచార వ్యవహారాలు , తాను చూసిన ప్రదేశాలు, తాను చదివిన పుస్తకాలు , తాను చూసిన స్వాములు, మఠాలూ..... తనకి నచ్చిన యోగా , మెడిటేషన్ అన్నీ చెప్పాడు.
'సంతోషం బాబూ , మావాళ్ళ కంటే నీవు ఎక్కువ చదివావు. మా గురించి మా కంటే గొప్పగా అర్ధం చేసుకున్నాడు - నేనేం పెద్ద పండితుడిని కాను. నీకు చేప్పతగ్గ అర్హత నాకుందని నేననుకోవడం లేదు..... ఇన్ని తెలిసిన నీవు ఇంకా నాతొ చర్చించేదెం ఉంది"- ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణశర్మ.
'అలా అనకండి సార్ - మీరు పెద్దలు. నాది పుస్తకానుభవం. మీది స్వానుభవం . నాకు కొన్ని సందేహాలు నివృత్తి చెయ్యాలి. పాపపుణ్యానికి మీరిచ్చే నిర్వచనం , జనన మరణాలు, మీ హిందువుల విశ్వాసాలు, భారత, భాగవత, రామాయణాల్లో సందేహాలు కొన్ని తీర్చాలి ...."
"తప్పకుండా అడుగు, నాకు తెలిసినవి నిరభ్యంతరంగా చెపుతాను. చిన్నప్పుడు మా నాన్నగారు క్రమశిక్షణ టో దగ్గరుండి సంస్కృతం నేర్పించారు. పురాణాలు చదివించారు. వాటివల్ల కాస్త జ్ఞానం అబ్బింది. నాకు తెలిసింది ఇంకొకరితో పంచుకోవడం నాకు ఆనందమే!"
వేణు బట్టలు మార్చుకు రాంగానే మైఖేల్ ప్రశంశా పూర్వకంగా , "వేణూ మీ నాన్నాగారు ఎంత మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నారు -' అన్నాడు.
"అయన ఇంగ్లీషు రీడరుగా యూనివర్సీటీలో పనిచేసి రిటైరయ్యారు తెలుసా . అయన బ్రిటీష్ వారి టైములో చదివిన చదువు మరి-'
మైఖేల్ వినయంగా, "సార్ - నాలాగే నా స్నేహితులిద్దరికీ ఈ విషయాల మీద చాలా ఇంటరెస్ట్ - రేపు వారిని తీసుకువస్తే మీకేమన్నా అభ్యంతరమా" అనడిగాడు.
"తప్పకుండా , అభ్యంతరానికి ఏముంది" తండ్రి తరపున వేణు అన్నాడు.
"ఎన్ని గంటలకు రమ్మంటారు. మీ సమయం చెపితే ....'
"నాన్నగారు ఎనిమిది గంటలకి డిన్నరు తీసుకుంటారు. మీరు అరు గంటలకి వస్తే ఓ రెండు గంటలు మాట్లాడుకోవచ్చు ...." వేణు అన్నాడు.
మైఖేల్ శలవు తీసుకు వెళ్ళాక, "ఏమిటి నేను ఏం చెప్పాలి - ప్రవచనాలు చెప్పాలా షణ్ముఖ శర్మ లా" నవ్వుతూ అన్నారు.
'అలాగే అనుకోండి - ఏదో ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడండి . లెక్చర్లు ఇవ్వడం మీ కలవాటేగా - వాళ్ళడిగిన ప్రశ్నలకి జవాబివ్వండి - సాయంత్రాలు మీకు మంచి కాలక్షేపం వుంటుంది -" వేణు నవ్వుతూ అన్నాడు.
* * * *
ఏ ముహూర్తాన మొదలుపెట్టారో గాని కృష్ణశర్మ ముందు రోజే పెద్ద సక్సెస్ అయిపోయారు. అయన భాష , భావం, ఆశువుగా అలా ఒకదాన్లోంచి ఒదాన్లోకి అసలు కధల్లోంచి పిట్ట కధల్లోకి , పురాణాల గురించి, వేదాలు, ఆచారాలు, శతకాలు పూజ పునస్కారాలు, పండగలు, జనన మరణాలు - ఇలా అయన సృజించని వస్తువే లేదన్నట్టు పురాణ కలక్షేపంలా నెల రోజులు ఏకధాటిగా రామాయణ భారత, భాగవతాల ముఖ్య ఘట్టాలు, యోగ, మెడిటేషన్, మన ఆయుర్వేద విశిష్టత - అడిగినవి అడగినవి అలా అసువులా ప్రవాహంలా సాగిపోయింది నెల రోజులు.
మొదటిరోజే అయన వాగ్ధాటికి , చెప్పిన తీరుకు ముగ్దులయిన ముగ్గురు అమెరికన్ స్నేహితులు . "మాతో పాటు మరికొంతమంది వస్తాం అంటున్నారు తీసుకురావచ్చా" అన్నారు.
"మా డ్రాయింగ్ రూంలో పట్టినంత మంది రావచ్చు " - వేణు జవాబిచ్చాడు. వేణు కూడా తండ్రి అంత అద్భుతంగా అందరికి అర్ధమయ్యే రీతిలో అన్ని విషయాల గురించి మాట్లాడగలరని అనుకోలేదు. మర్యాదకి కాసేపు కూర్చుని లేచి పోదాం అనుకున్న వేణు మొదటిరోజు మొదలు నెల రోజులు ముఖ్య శ్రోత అయిపోయాడు. పిల్లలిద్దరూ తాతగారేం చెబుతారోనని కూర్చుని కధలు చెప్పినంత సేపు ఆకర్షితులై అర్ధం కాని విషయాలోస్తే అడుకుందుకు వెళ్ళిపోయేవారు.