'అవును, లోకం ఇన్నాళ్ళూ సవతి తల్లుల కధలే వింది. ఆ సవతి తల్లుల కంటే యీ సవతి తండ్రుల క్రూరత్వం ఏం తీసిపోదని మీ కధ ఋజువు చేస్తుంది. నన్ను నా మానాన నా ఖర్మకి పడి వుండనీయకుండా , నాలో లేని పోనీ ఆశలు కల్పించి పెద్ద కబుర్లు చెప్పి ఆదర్శమూర్తులని పించుకునెందుకు ఈ పెళ్ళి చేసుకున్నారు. చేసుకొన్న దగ్గర నించి ఒక్కలా కాల్చుకు తిన్నారు. పెళ్ళికి ముందు నాకు పిల్లాడున్నాడని, ఆ పిల్లాడు నాతో వుంటాడని తెలియకే చేసుకున్నారా? తెలిసి తెలిసి చేసుకుని నా బ్రతుకు నిలా నరకం ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఈ పెళ్ళి చేసుకుంటే ఏదో సుఖముంటుందని భ్రమిశాను. కాని యీ బ్రతుకు ఆ "వెధవ బ్రతుకు' కంటే అధ్వాన్నంగా వుంటుందని, అంతకు మించిన నరకం చూస్తానని ముందే తెలుస్తే చస్తే యీ పెళ్లి చేసుకునే దాన్నికాను..... నో రేరుగని పసివాడి మీద అంత కసి, ద్వేషం ఎందుకు మీకు, వాడెం చేశాడని వాడిని అలా ద్వేషిస్తున్నారు . వాడు కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, పడుకుంటే తప్పు, వాడెం చేసినా కోపం, వాడి నీడ చూస్తేనే ద్వేషం? వాడు.....ఆ పసివాడు ఇంట్లో బిక్కుబిక్కుమంటూ దీనంగా ఏం చేస్తే తప్పోనన్నట్టు భయం భయంగా తిరుగుతుంటే నా హృదయం ఎంత రంపపు కోత అనుభవిస్తుందో తెల్సా? తల్లి ముందే తన పసిబిడ్దని అంత ద్వేషించడం చూసి ఏ తల్లి అన్నా సహిస్తుందను కుంటున్నారా? మీరు వాడిని ఎంత హీనంగా చూస్తున్నా యిన్నాళ్ళూ సహించాను. కేవలం మిమ్మల్ని పెళ్ళాడిన నేరానికి.....ఆఖరికి పసివాడికి రోగం వస్తే మందిప్పించడానికి కూడా మీకు మనస్కరించడం లేదంటే మీరు....మీరు మనుష్యులు గారు.....పాషాణం.....' ఆవేశంతో , కోపంతో , దుఃఖంతో సుగుణ గొంతు వణికింది.
"నోర్మూయ్......' కోపంగా అరించాడు భాస్కరరావు.....' ఈ పెళ్ళి చేసుకుని నీవు కాదు నష్టపడింది నేను" ,.....బాధ పడ్తున్నది నేను.....తెలియక నేను.....తెలియక ఏదో అనుకున్నాను గాని తెలిస్తే నేనూ చస్తే చేసుకునే వాడిని కాదు, పెళ్ళి చేసుకున్నాను, నా సరదాలు ఏం తీర్చావు నీవు. సినిమాకి వేడధామంటే వాడో అంటావు, షికారుకి వెడదాం అంటే వాడుండాలి అంటావు. హనీమూన్ వెడదాం అంటే వాడ్నోదలి ఎలా రానంటావు. ఎప్పుడు సరదాగా కాలక్షేపం చేయడాని కన్నా పిలిస్తే నీకు ఎంతసేపూ వాడి భోజనం, వాడి నిద్ర, వాడి అలానా, పాలనా తప్ప, నా సంగతి నీ కేప్పుడన్నా పట్టిందా? ఎప్పుడు చూసినా ఆ వెధవని పట్టుకుని ఏడుస్తుంటే.....తను కానని పిల్లాడ్ని పట్టుకుని ఏడుస్తుంటే ఏ మగాడన్నా సహిస్తాడనుకున్నావా ? నా సరదా, నా ముచ్చటలు ఏం తీర్చావు నీవు? వాడిని .....వాడిని చూస్తుంటే.....నీవు.....నీవు నా దానివి కాక ముందు మరోడి పెళ్ళానివని.....వాడి ద్వారా ఆ పిల్లాడిని కన్నావని.....నా కంటే ముందు మరోడు నిన్ను అనుభవించాడని అనుక్షణం వాడి ఉనికి జ్ఞప్తికి తెస్తుంటే.....నా కేలా వుంటుందో నీకేం తెలుస్తుంది. నా మీద కంటే.....ఆ కుర్ర వెధవ మీద ఇంకోడి పిల్లాడి మీద నీకు శ్రద్ధసక్తులు ఎక్కువ వుంటే ఇవతలి వాడికి ఎలా వుంటుందో నీకెలా తెలుస్తుంది....' భాస్కరరావు ఎగిరి పడ్డాడు.
'అయితే ముందిది తెలియదా?"
"ముందు నీకు తెలియనట్టే.....నాకూ తెలియలేదు.....కనకనే గోతిలోకి దిగాను. లేకపోతే మగాడ్ని......ముప్పై ఏళ్ళున్న మగాడికి పెళ్ళాడడానికి పిల్లలు దొరకరని నిన్ను రెండో పెళ్ళి దాన్ని, పిల్లాడి తల్లిని కట్టుకుండేవాడిని కాను. తెలియకనే మోసపోయాను.....యీ వెధవ పిల్లాడి వల్ల నీకు నాకు మధ్య అడ్డుగోడలు లేస్తాయని , యీ కుర్ర వెధవ యిలా నా ఆనందాన్ని హరిస్తాడని ముందు తెలిస్తే.....' కసిగా అంటున్నాడు భాస్కరరావు.
'ఆపండి.....మాటిమాటికి వెధవ పిల్లాడంటూ ఇష్టం వచ్చినట్లు మాట్ల్దాకండి. నా ముందే ఇంతలేసి మాటలు నోరేరుగని పసివాడిని అంటుంటే ఏ తల్లి అయినా సహిస్తుందనుకుంటుంన్నారా? ఇన్నాళ్ళు సహించాను ఇక సహించను " పౌరుషంగా అంది సుగుణ.
'సాహిన్చాకపోతే మానేయి....నేనూ ఇదంతా సహించలేను.....ఇంకోడు కన్న పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని బాధపడాల్సిన అవసరం నాకేం లేదు" కఠినంగా అన్నాడు భాస్కరరావు.
'అంటే యేమిటి మీ ఉద్దేశం?" ఎగిసిపడుతున్న గుండెలతో ఆవేశంగా అంది సుగుణ.
"అంటేనా? విడమర్చి చెబుతున్నాను విను.....ఈ ఇంట్లో నీకు వుండాలని వుంటే నా దగ్గిర వాడుండటానికి వీలులేదు."
"యేమిటి? పిల్లాడు తల్లిదగ్గిర వుండకుండా ఎక్కడ వుంటాడని మీ ఉద్దేశం?"
'అదంతా నా కనవసరం! వాడిని ఎక్కడ వుంచుతావో, ఏం చేస్తావో నా కక్కరలేదు. కావలిస్తే మీ అన్నయ్య ఇంట్లో వుంచి, డబ్బు పారేయ్...."
సుగుణ కళ్ళు ఎర్రబడ్డాయి. "నేను కన్న పిల్లాడిని పెంచాల్సిన అవసరం మా అన్నయ్య కేం లేదు" వ్యంగ్యంగా అంది.
"నేను కనని పిల్లాడిని వుంచుకోవాల్సిన అవసరం నాకంత కంటే లేదు.' అంతకంటే హేళనగా అన్నాడు భాస్కరరావు.
"మీ ఉద్దేశం స్పష్టంగా చెప్పండి. నన్నింట్లోంచి వెళ్ళమనా అర్ధం?"
"నిన్ను వెళ్ళమనలేదు. నేన్నదల్లా నీకు నేను కావాలో వాడు కావాలో తెల్చుకోమన్నాను------ ఆలోచించుకో...."
సుగుణ ఓ క్షణం ఆవేశంతో ఊగిపోయింది. అంతలోనే నిలదొక్కుకుంది. పిచ్చిదానిలా పెద్ద నవ్వు నవ్వింది హేళనగా. వ్యంగ్యంగా . "ఛాయిస్ ఇచ్చారన్న మాట. మొగుడా? పిల్లాడా? అంటూ. భేష్.....ఆలోచించాలా.....ఈ విషయం గురించి ఆలోచించడానికి ఏ తల్లికి అరక్షణం కూడా పట్టదని మీలాంటి మగాళ్ళకి తెలియక పోవచ్చు! నోరేరుగని పసివాడిని అనాధ చేసి మొగుడుతో కులుకుతుంది ఆడది అని మీరనుకుని ఛాయిస్ ఇచ్చారా నాకు! నోరేరుగని పక్షులు సైతం రెక్కలు రాని తమ బిడ్డలని రక్షించుకోడానికి తమ ప్రాణాలు సైతం అర్పిస్తాయే అలాంటిది మనిషి హృదయం ఎలాంటిదో తెలియకే ఛాయిస్ ఇచ్చారా? నేను కాకపొతే మరో పెళ్ళాం మీకు క్షణంలో వస్తుంది కాని వీడికి తల్లి రాదు అని తెలియనంత తెలివి తక్కువతనం నాకుందనే ఛాయిస్ ఇచ్చారా మీరు!.....ఇదే మీ పిల్లాడయితే ....నేనే మీకు ఈ ఛాయిస్ ఇచ్చి వుంటే మీరు నన్నే ఎంచుకునుండేవారు . కన్నతండ్రి బిడ్డల్ని అలక్ష్యం చేసి పెళ్ళాంతో కులకబట్టే సవతి తల్లుల కధలు వచ్చాయి! కాని..... తల్లి....తల్లి వుండగా బిడ్డ మీద ఈగ వాలనీదు! బిడ్డని రక్షించుకోడానికి అవారమైతే రాక్షసి అవుతుంది. పెంచుకోడానికి ముష్టి అన్నా ఎత్తగలదు! బిడ్డ కోసం యే త్యాగమన్నా...... ఆఖరికి భర్త నన్నా సరే వదులుకోగలదు. తండ్రికి, తల్లికి తేడా యిప్పటికయినా తెలుసుకోండి! ఇప్పటికయినా యీ నరకం లోంచి నా బిడ్డకు విముక్తి కలిగి స్వేచ్చగా ఊపిరి పీల్చుకోడానికి అవకాశం యిచ్చినందుకు సంతోషం! ఎటొచ్చి ఈ పెళ్ళి చేసుకుని లోకంలో ఇదివరకు వుండే సానుభూతి కాస్త పోగొట్టుకుని హేళన పాలయాననేదే నా ఆవేదన! ఈ సంగతి ముందు తెలుసుకోలేక తప్పటడుగు వేసి అందరి చేత అన్పించుకునే స్థితికి వచ్చానన్నదే నా బాధ. వస్తా....శలవు.' అంటూ పిల్లాడిని తీసుకుని భుజం మీద వేసుకున్న సుగుణని వెర్రివాడిలా చూశాడు భాస్కరరావు.
"స్వాతి" ***