కృష్ణమోహన్ బాధగా ప్రక్కమీద వాలిపోయాడు.
ఆ సాయంత్రం రంగారావు పురోహితుడ్ని వెంటబెట్టుకువచ్చి ముహూర్తం విషయం మాట్లాడుకుంటే - తల్లీ కొడుకులు యిద్దరూ మూగివారిలా గుటకలుమింగుతూ ఉండిపోయారు. ఇద్దరి కిద్దరూ ఏదో చెప్పాలని తాపత్రయ పడి ఎలా చెప్పాలో అర్ధంకాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆఖరికి కృష్ణ నోరు పెగుల్చుకుని "యింత తొందరగా - నాన్నగారి సంవత్సరీకాలు అయ్యీ అవకముందే ఎందుకు, కొన్నాళ్ళు పోనీయండి-" అని అనగలిగాడు.
"ఇంకా తొందరేమిటోయ్, ఎప్పుడో ఏడాది క్రితం అవ్వవలసిన పెళ్ళి - యిన్నాళ్ళు తప్పక ఆగాల్సివచ్చింది. ఆడపిల్లల వాళ్ళం మా తొందర నీకేం తెలుస్తుందిలే- యింక యీ ముహూర్తం తప్పదు. లేకపోతే మరో రెండు నెలల వరకు లేవు-" అన్నాడాయన అంతా స్థిరపరిచి యింకేం అనగలడు కృష్ణమోహన్?
మరీ నెలా పదిహేను రోజులకే పెళ్ళి. తప్పించుకునే అవకాశం ఏదీ లేదు. ఆ మాట తల్చుకోగానే కృష్ణ మోహన్ నీట మునిగిన వాడిలా దిగాలు పడిపోయాడు.
సాయంత్రం సరోజ రాగానే సరస్వతమ్మ ముహూర్తం నిశ్చయించిన వార్త చెప్పింది ఒక్క క్షణం సరోజ ఏదో పోగొట్టుకున్న దానిలా నీరస పడిపోయింది. అప్రయత్నంగా కృష్ణమోహన్ వంక చూసింది. ఆమె వంక చూస్తున్న అతనికి సరోజ చూపు గుండెలని కలుక్కుమని తాకింది.
* * *
"సరోజగారూ... యివాళ మీరు మా యింటికి రావాలి ఒకసారి...." ఆఫీస్ లో లంచ్ బ్రేక్ లో ప్రభాకర్ సరోజ దగ్గరికి వచ్చి అడిగాడు.
"ఏమిటి విశేషం...?" నవ్వుతూ అడిగింది సరోజ.
"విశేషం ఏం లేదనుకోండి....మా అక్క వచ్చింది. మిమ్మల్ని ఒకసారి చూస్తానంటుంది ... తీసుకురమ్మంది, సాయంత్రం టీకి రండి..." అన్నాడు ప్రభాకర్, కాస్త సిగ్గుపడ్తూ, నవ్వుతూ సరోజ ఆశ్చర్యంగా చూసింది.
"నన్ను చూస్తారా ...ఎందుకు?" అంది.
ప్రభాకర్ కాస్త తడబడ్తూ... "ఆ...ఆ...ఏం లేదూ...మీ గురించి మా అక్కకి చెప్పాను - మీరు నా బెస్ట్ ఫ్రెండు అని చెప్పాను - ఒకసారి యింటికి తీసుకురా అంది - యివాళ సాయంత్రం తీసుకువస్తానన్నాను - మీరు తప్పకుండా రావాలి - ప్లీజ్ ..." అన్నాడు ప్రభాకర్.
"సరే, అలాగే వెడదాం - దానికిన్తలా అడగాలా" అంది సరోజ మామూలుగా - ప్రభాకర్ యిటు అటు చూసి చుట్టుప్రక్కల ఎవరూ లేరని నిర్ధారణ చేసికుని గొంతు తగ్గించి.... "సరోజగారూ" అన్నాడు సందేహిస్తూ, "ఒక్కమాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరేం అనుకోరుగదా" అన్నాడు.
"ఏం, అంత అనుకునేది అడుగుతారా ఏమిటి?" చనువుగా నవ్వింది. సరోజ... "అడగండీ.....ఏమిటంత సందేహిస్తున్నారు..." కుతూహలంగా అంది.
"సరోజగారూ! మీకు .... మీ కిష్టమైతే నేను మిమ్మల్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను - మా అక్క పెళ్ళి పెళ్ళి అని ప్రాణాలు తీస్తూంది రోజూ .... మీ అభిప్రాయం చెపితే అక్క మీతో మాట్లాడుతుంది." ప్రభాకర్ బిడియపడ్తూనే చెప్పదలచింది సూటిగా చెప్పాడు.
సరోజ మొహం పాలిపోయింది -కలవరపడ్తూ చూసింది..."మీరు....మీరు..." ఏదో అనబోయింది. ప్రభాకర్ ఆ మాట మరోలా అర్ధం చేసుకున్నాడు.
"సరోజగారూ, నన్ను గురించి మీకు పూర్తిగా తెలుసు - గీత విషయంలో నా తప్పు మీరు క్షమించగలిగి, మీ అంగీకారం తెల్పితే అదృష్టవంతుడి ననుకుంటాను - మీలాంటి సౌమ్యురాలు, సహృదయురాలు నా సహచారి అయితే యింకేం కావాలి? నాకు అన్పించింది మీతో పరిచయం అయిన ఈ కొద్ది రోజుల్లోనే..." సరోజ మనస్థితి గుర్తించకుండానే ప్రభాకర్ చెప్పేస్తున్నాడు.
"ప్రభాకర్ గారూ..." సరోజ మధ్యలో అడ్డుపడింది. "మీరు....మీరెందుకు యిలా అనుకున్నారు? ఆ ఉద్దేశం నాకెప్పుడూ లేదండి" మొహమాటంగా అంది సరోజ.
"ఇదివరకు లేకపోతేనేం లెండి. అలాంటి ఉద్దేశాలు మీరు మనసులో పెట్టుకుని మగవారితో స్నేహం కోరేవారు కాదని నాకు తెలుసు - అందుకే మీ పట్ల యింత ఆకర్షితుడి నయ్యాను - మా అక్కతో మీ గురించి చాలా చెప్పాను. అక్కకూడా సంతోషించింది. మిమ్మల్ని చూస్తానంది - మీకు అంగీకారం అయితే మీ మామయ్యగారి దగ్గిరకి వెళ్ళి మాట్లాడుతాను."
అంతా తనే మాట్లాడేస్తున్న ప్రభాకర్ కి ఏం చెప్పాలో తెలియక తడబడింది సరోజ - అతని కిలాంటి అభిప్రాయం ఎందుకొచ్చిందో ! కలలోనైనా తను యీ విషయం ఆలోచించలేదు. ఆఫీసులో కొలీగ్ గా ముందు పరిచయం -తరువాత గీత కనపడిన దగ్గిరనుంచి యిద్దరికీ పరిచయం స్నేహంగా మారింది. ఈ నెలా పదిహేను రోజులనించి - అతను చనువుగా మాట్లాడడం - అప్పుడప్పుడు కాఫీ తెప్పించి ఈయడం - యిద్దరూ కలిసి లంచ్ బ్రేక్ లో సరదాగా కలిసి టిఫిను తినడం - అంతవరకే తమ పరిచయం - తను చనువుగా మాట్లాడుతుంటే అతనేం అనుకున్నాడో తనకి తెలియదుగాని తను మాత్రం ఆఫీసులో కొలీగ్ గా మించి యింకేం అనుకోలేదు - గీత సంగతి విన్నాక నిజం అంత స్పష్టంగా చెప్పిన అతని నిజాయితీని మెచ్చుకుంది - తనని మోసంచేసిన గీత జోలికి మళ్ళీ వెళ్ళనంత సహృదయత చూపిన అతని ఔన్నత్యాన్ని మనసులోనే అభినందించింది - అంతే యిద్దరి మధ్యవున్నది - యీ పరిచయాన్ని పరస్పర సహచర్యంగా మార్చుకోవాలన్న కోరిక అతనిలో పుట్టిందేమో - అందులో తప్పేంలేదుగాని తనకా ఊహలేదు -బావ స్థానంలో యింత తొందరగా ఇంకొకరిని ఊహించనుకూడా లేదు. తన మనసు అందుకు అంగీకరించదు.