"నీకెంత ధైర్యం? నౌకరు వెధవ్వి. ఇంటి యజమానురాలితో యిలా మాట్లాడతావా? ఆయన రానీ నీ పని చెప్తా" కోపంతో వణికిపోతూ అరిచాను!
వాడు నా మాట విననట్టు కదలలేదు.
కోపం పట్టలేక విసురుగా వాడి చెయ్యి తోసి "జాగ్రత్తగా మసులుకో, నీ కింత పొగరా?" అన్నాను బయటికి వెళ్ళబోతూ.
వాడు నా చెయ్యిపట్టి నన్నులోపలికి తోసి తలుపులు మూశాడు.
నిర్ఘాంతపోయాను.
"అమ్మగారూ! అనవసరంగా అల్లరి చెయ్యకండి. మీరిక్కడనించి వెళ్ళలేరు. మిమ్మల్ని కాపలా కాయడం నా పని. మీరు వెళ్ళారంటే నన్ను చంపుతారు అయ్యగారు. నా ఉద్యోగం పోతుంది. అయ్యగారు వచ్చేవరకు లోపలే ఉండండి" అంటూ పైన గడియవేసి తాళం పెట్టాడు.
చకితురాలినై పోయాను.
నాకు కాపలా పెట్టారా వీడిని! వీడు కాపలా కాస్తున్నాడా? ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక ఒక్కొక్క సంగతీ అర్ధమయినట్లయింది. నా ఉత్తరాలు అసలు మా వాళ్ళకి అందకుండా చేసి ఉంటాడు. వాళ్ళ ఉత్తరాలు నాకంద కుండా ముందే మాయం చేశాడన్న మాట. ఎంత ఘోరం! కట్టుకున్న భార్యని కాపలా కాయడానికి నౌకరుని పెట్టుతారా? వళ్ళు మరిచిపోయాను కోపంతో. ఆవేశంతో వణికి పోయాను. ఎన్నాళ్ళు నన్నిలా బందిఖానాలో పెడ్తారు? ఎలా ఇక్కడనుంచి వెళ్ళడం? కోపంతో బుసలుకొడ్తూ కూర్చున్నాను. వీడు ఫోను చేశాడో ఏమిటో ఆయన ఆఫీసు నుంచి వెంటనే వచ్చారు.
తలుపు తీయగానే కలపడ్డాను. "ఏమిటి మీ ఉద్దేశం? నన్నిలా బందిఖానా చేసి పైగా నౌకరు వాడిని కాపలా పెట్టడంలో మీ ఉద్దేశం? ఏమిటి" తీక్షణంగా అడిగాను.
ఆయన విలాసంగా ఓ నవ్వు నవ్వారు.
"అర్ధం వెరీసింపుల్ మైడియర్! కొత్తగా తెచ్చుకున్న పెంపుడు కుక్క కాస్త మచ్చిక అయ్యేవరకు కట్టి పడెయ్యకపోతే ఇటు అటు పారి పోతుంది. పోట్ల గేదెని స్వేచ్చగా వదిలితే మరి ఇల్లు చేరదు. ఎవరి వస్తువు వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలనుకోడంలో తప్పు వుందా? అంత కష్టపడి పెళ్ళాడి తెచ్చుకున్న పెళ్ళాం పోతానని బెదిరిస్తూంటే చూస్తూ పోనిచ్చే వెర్రివెధవ లుంటారా?" చాలా వినోదంగా అన్నారు.
ఇలాంటి మనిషిని ఎవరేం చెయ్యగలరు? ఎగిసిపడుతున్న గుండెలతో "ఎన్నాళ్ళిలా నన్ను కట్టడి చేయగలరనుకుంటున్నారు?" అడిగాను.
"చెప్పాగా! కుక్క మచ్చిక అయి మాలిమి అయ్యేక పొమ్మన్నా పోదుకదా. తంతున్నా కాళ్ళదగ్గిరే పడివుంటుంది. పోట్లగేదెని నాలుగు రోజులు నడ్డి విరిగేలా తంతే పొగరు అణిగి పడివుంటుంది. అలాగే నీవూ ఇది నీ ఇల్లు. ఇంకెక్కడికీ పోలేను అని గుర్తించేవరకు - నన్ను కాదని పోలేవు అని గుర్తించాక అప్పుడు బందిఖానా వుండదు నీకు. ఎంతయినా మగాడ్ని. పెళ్ళాం వదిలి వెళ్ళిపోయిందనే అపవాదు భరించగలవా డియర్!" హేళనగా నవ్వారు.
తిట్టాను. ఏడిచాను. ఏం చేసినా ఆ రాయి కరగలేదు.
ఆయన అన్నట్టు - ఆయనను వదిలిపోకుండా నీవే గతి అని పడి వుండాల్సిన స్థితి, ఆయనను కాదనలేని స్థితి వచ్చి మీద పడింది. నా అవస్థలు చాలనట్టు, నామీద ఇంకా కక్ష తీరక భగవంతుడు శాపం యిచ్చినట్టు మొదటినెలకే నెలతప్పాను. ఆ సంగతి గుర్తించగానే వళ్ళు జలదరించింది. ఇదేం ప్రారబ్ధం అని కుమిలి పోయాను. ఇంక పుట్టబోయే పిల్లకోసమన్నా యీ భర్తని అంగీకరించడం మినహా దారి ఏముంది? తండ్రి ఎవరో తెలియని బిడ్డని సమాజం ఆదరించదు. ఆ బిడ్డకోసం. ఆబిడ్డ భవిష్యత్తుకోసం నా భవిష్యత్తు అంధకారం చేసుకుని ఈ నరకంలో మగ్గవలసిందేనా? "భగవంతుడా! నాకీ బిడ్డ వద్దు తీసుకుపో" అని ప్రార్దించాను. విలపించాను. ఆ దేవుడు నా మొర ఆలకించలేదు.
ఆయనకా విషయం చెప్పాలనిపించలేదు, అయినా ఎన్నాళ్ళు దాచగలను. వికారం వాంతులు ప్రారంభమయ్యాయి.
ఆయనకి విషయం అర్ధం అయ్యాక "గుడ్, నీవు దారికి వచ్చే రోజులు మొదలయ్యాయి అన్నమాట. ఇంకెక్కడికి పోతావు!" అన్నారు విలాసంగా.
ఆ మనిషితో మాట్లాడాలంటేనే అసహ్యం పుట్టింది. మాట్లాడినా ప్రయోజనం లేదని తెలిశాక నా కర్మానికి తిట్టుకుంటూ యింట్లో పడి వున్నాను. ఆయనతో పోట్లాడే ఓపికకూడా లేని నీరసం - వేవిళ్ళతో సతమత మవుతూంటే అమ్మ గుర్తువచ్చి కుమిలి కుమిలి ఏడిచేదాన్ని. పుట్టాక యిన్నాళ్ళు చూడకుండా వుండలేదు. మూడు నెలలే అయినా మూడుయుగాలు గడిచినట్లనిపించింది. ఏడుస్తున్నా తిండితినకుండా నీరసంతో వాలిపోయినా ఆయనేం పట్టించుకోలేదు. ఆయన అవసరాలు చూడడానికి వాడున్నాడు. నాతో రాత్రి తప్ప ఆయనకేం అవసరంలేదు. అలాంటి స్థితిలో నా కర్మానికి నేను పక్కమీద పడివుండేదాన్ని. ఈ గర్భం ఎలా తీసుకోనా అని ఎన్నివిధాలో ఆలోచించాను. ఏమందుమింగను? ఎలా తెచ్చుకోగలను, అని విచారించాను. గెంతాను - దుమికాను - వేడిచేసే పదార్ధాలు గుర్తున్నంత వరకు తిన్నాను. ఉహు - ఆ తండ్రిని మించిన మొండిదిలా వుంది ఆ పిండం. హతాశురాలినై - కర్తవ్యం తోచక నిర్లిప్తురాలినై వుండిపోయాను. చావాలన్నా అనుక్షణం కాపలా!