"నేను పట్నంలో లేకుంటినిగా? ఎలా తెలుస్తుంది? ఇలాంటి ఖచ్చితమైన వాళ్ళుంటే మాకూ మంచిదే"
"చంద్రయ్య ఏదో మోసం చేశాడని నాకు అనుమానంగా ఉంది అందరికీ జగన్మోహనరావును గురించి తెలిసినపుడతనికి తెలియకుండా ఉంటుందా? చేయాలనే చేశాడని నాకు అనుమానం పోలీసువాణ్ణికదూ?"
రాజారావు ఆలోచించాడు శ్రీనివాసరావు చెప్పిందాని మీద అతనికి నమ్మకం కుదరసాగింది కాని, చంద్రయ్య ఇలాంటి ద్రోహం తలపెడ్తాడని కలలో సైతం అనుకోలేదతను. చంద్రయ్యను పీక నులిమి చంపెయ్యాలనిపించింది. కాని చంద్రయ్యకు తన రహస్యాలన్నీ తెలుసు అతన్నేమన్నా అన్నాడంటే మునుగుతాడు .
"చంద్రయ్య కూడా స్వతంత్రంగా కాంట్రాక్టులు తీసుకుంటున్నాడు , తెలుసా?" అడిగాడు శ్రీనివాసరావు.
ఆశ్చర్యం వ్యక్తపరిచాడు రాజారావు ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి శేల్యూట్ కొట్టి చీఫ్ ఇంజనీర్ పిలుస్తున్నాడని చెప్పాడు. శ్రీనివాసరావు రాగానే రూఫ్ తవ్వించడానికి వెళ్ళాడు జగన్మోహనరావు ఆ పని పూర్తీ కాగానే అతణ్ణి పిలిపించాడు. '
"వస్తున్నా పద" అని కానిస్టేబుల్ ను పంపించేసి "ఏం, ఏం చేద్దామంటావు?" అడిగాడు రాజారావును.
అంతసేపనుంచీ అనవసరం అయిన ఆలోచనల్లో మునిగిపోయామనే విషయం గుర్తుకు వచ్చింది రాజారావుకు. "సరే , ఒక పని చెయ్యి కొద్దిగా ఆలస్యం మాత్రం చెయ్యి, నేనిప్పుడే వస్తా" నని కార్లో వెళ్ళిపోయాడు.
రాజారావు నేరుగా మంత్రి దగ్గరికి వెళ్ళాడు స్నేహంగా పలకరించాడు రాజారావు. తానిచ్చిన విరాళాలూ, చేసిన ఉపకారాలూ ఏకరవు పెట్టి, తనకు సహాయం చేయాల్సిందని కోరాడు. మంత్రిగారు తన నిస్సహాయత వ్యక్తపరిచాడు.
జగన్మోహనరావు ఉన్నప్పుడు తానెం చేయలేనన్నాడు. మంత్రిగారి ఎన్నికలకు చందా మాత్రమే కాక తన మనుషులు కాపు సారాయి అందజేసిన విషయం వల్లించి చెడా మడా మాటలు వినిపించి వచ్చేశాడు రాజారావు ---- ఇక ఏమైనా ఎదుర్కోవాలనే స్థిర నిశ్చయంతో ఒక్క నీతిపరుడు ఎంత ,మందిని గడగడ లాడిస్తున్నాడు!
స్థలానికి వచ్చేవరకూ అతనిలో ఉన్న భయం, నీరసం అన్నీ జారిపోయాయి. అతని వదనంలో దృడ నిశ్చయం కనిపించింది రావడం రావడమే "జగన్మోహనరావుగారూ, కానివ్వండి అన్నింటికీ సిద్దంగా ఉన్నాను న్యాయానికి ధర్మానికీ ఎంత బలం ఉందో నేనూ పరీక్షిస్తాను" అన్నాడు.
జవాబుగా ఉపన్యాసం ఇవదలచుకోలేదు జగన్మోహనరావు చిరునవ్వు మాత్రం నవ్వాడు. తన పనిలో తాను నిమగ్నడైనాడు. అయిదు నిమిషాల్లో పంచనామా వగైరా జరిగింది "లాబ్" లో అప్పగించడానికి పోలీసు వ్యానులో వెళ్ళిపోయాడు జగన్మోహనరావు.
చింతచెట్టు నీడన వాలుకుర్చీలో కూలబడ్డాడు రాజారావు జగన్మోహనరావు, పోలీసులు నిష్క్రమించారు. తండోపతండాలుగా కూడిన జన సమూహం చెదిరిపోయింది వారు వెళ్ళిపోయినా వారు చేసిన వ్యాఖ్యానాలు ఇంకా తలలో రింగుమంటూనే ఉన్నాయి. తుఫాను తరువాత ఏర్పడిన ప్రశాంతతలా ఉంది భయకరంగా ఉంది భరించరానట్టుంది.
రాజారావు మనసులో మనసులేదు. అతనికి ఎన్ని ఆలోచనలు వచ్చాయో చెప్పలెం భయకరమైనవి మనిషి చేయరానివి, చేయలేనివి కూడా వచ్చాయి. రజని అతని మనో ఫలకం మీద వెలిసింది. ఆవిడ చిరునవ్వులో అతడు మునిగిపోయేవాడు జరిగిపోయేవాడు లోకం మరచేవాడు. అది పూర్వ స్థితి, నేడు, ఆమె చిరునవ్వు అతనికి వెక్కిరింతగా కనిపించింది. కృతకమైనదిగా కనిపించింది. వికటంగానూ , వికృతంగానూ కనిపించింది. రజని - పూర్వపు లక్ష్మి ఇక్కడినే ఆమె పడింది. దానితో పాటు తననూ లాగింది. పాతాళంలోకి తోసింది. దీనంతటికీ రజనే కారణం అనుకున్నాడు. ఆవిడ లేకుంటే తాను పట్నం వదిలేవాడు కాదు. ఈ దుష్పరిమాణాలు కలిగేవి కావు. రజని రాక్షసిలా కనిపించింది . రజనిని గెంటేయ్యాలనుకున్నాడు గెంటేయ్యాలి కాని, ఎక్కడికి? ఎక్కడి నుంచి?
పాప కనిపించాడు వాని చిన్న చేతులు, కాళ్ళు, పసిడి నవ్వు క్షణం ఆనందాన్నిచ్చాయి . ఇంతలో అనుమానాలు వచ్చాయి. బుడతడు భూమి మీద పడుతూనే కష్టాలు కొని తెచ్చాడు. కొందరు పుట్టుకతోనే సంపదలు తెస్తారట! కొందరు ముళ్ళ పొదలతో పుడతారట! పచ్చని సంసారానికి చిచ్చు పెట్టాడు. వెధవ మళ్ళీ ఎందుకో తన పాప అలాంటివాడు కాడనుకున్నాడు. అయినా, జాతకం చూపిచాలనుకున్నాడు. అంతవరకూ లేని కొత్త నమ్మకాలు కలిగాయి. మనిషి అశక్తుడైనప్పుడు గ్రహాలు శక్తివంతాలౌతాయి.
అసలు చంద్రయ్యేనేమో వీటన్నీంటికీ కారణం? చంద్రయ్య నిక్కరుతో తట్ట మోసేందుకు తన దగ్గరికి వచ్చాడు తాపీ పని వాడైనాడు. తరువాత కోటు తొడిగి , టోపీ తగిలించి మేస్త్రీ అయినాడు. నమ్మకస్తుడని అన్నీ అతనికి అప్పగించాడు తాను. తన రహస్యాలలో అతనికి తెలియనివంటూ లేవు నారాయణరావు చేసిన అప్పులకు కూడా చంద్రయ్యే కారకుడయ్యాడు తనను నిలువునా ముంచాలని చూస్తున్నాడా? ఏం చెయ్యాలి చంద్రయ్యను? పిలిపించాడు చంద్రయ్యను.
ఉద్రేకంగా మాట్లాడాడు చెడామడా తిట్టాడు ఎన్ని మాటలన్నా నిన్నటివరకూ తల వంచుకొని విన్న చంద్రయ్య తిరుగుబాటు ధోరణిలో మాట్లాడాడు రోడ్డు వేయించకుండా కాజేసిన డబ్బును జగన్మోహనరావు కక్కించాడన్నాడు. డబ్బు తిన్న కౌన్సిలరు మన్ను తిన్న పామైనాడన్నాడు. ఒకరి కోసం ఎముకలు నుసి చేసుకోవడం వలన ప్రయోజనం లేదని తేల్చుకున్నాననీ, తానూ కంట్రాక్టులు చేస్తున్నానని చెప్పడమే కాక నారాయణరావుకు అప్పులు ఇప్పించింది తానేనని కూడా స్పష్టం చేశాడు.
రాజారావు కాళ్ళ క్రింది నేల జారిపోసాగింది. అణచి ఉంచాల్సిన స్ప్రింగు మీది నుంచి కాలు జారినట్టనిపించింది. కోపంతో మండిపడ్డాడు . తన చేతికింద బాగుపడినవాడే తన నెత్తికి ఎక్కుతున్నాడన్నాడు. తెల్లవారి వచ్చి లెక్కలు అప్పజెప్పమన్నాడు.
చంద్రయ్య గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. అగ్గిలో ఆజ్యం పోసినట్లయింది. రాజారావు స్థితి కుర్చీలోంచి ;లేచాడు, లాగి చంద్రయ్యను నాలుగు బాదాలని కాని, కుర్చీలో కూలబడ్డాడు చంద్రయ్య వెళ్ళిపోవడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.
రాజారావు కుర్చీలోంచి లేచాడు కారెక్కాడు స్టార్టు చేశాడు గమ్యం లేకుండా కారు సాగిపోతుంది. ఆ రోజు అతను వెళ్ళని మిత్రుడు, బంధువు అంటూ లేడు. అతనిని ఆదుకుంటా నన్నవాడూ ఒక్కడూ లేడు. రజని విషయంలో అతను అందరికీ దూరం అయినాడు . అయినా, ఒక్కడూ ఆ విషయం ప్రస్తావించలేదు.
అప్రియస్యతు పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభం!
రాజారావు పిచ్చి స్పీడుతో సాగిపోతున్నాడు. అతడు ఎక్కడికి పోతున్నది అతనికి తెలియదు. పోలీసు విజిల్ విని చూస్తే ట్రాఫిక్ సిగ్నల్ చూడకుండా వచ్చేశాడని గ్రహించి బ్రేక్ వేశాడు. పోలీసువాడు సలాం కొట్టాడు అది దీపావళి మాములు సలాం అని అతనికి తెలుసు చూస్తె బషీర్ బాగ్ చౌరస్తాకు వచ్చేశాడు. కారు వెనక్కు తీసుకొని లైనులో నుంచోబెట్టాడు. పచ్చలైట్లు వస్తే సాగించాడు వెంటనే అతనికి నౌబత్ పహాడ్ స్పురణకు వచ్చింది. అక్కడికే పోనిచ్చాడు కారు.
నౌబత్ పహాడ్ మీద ఉపన్యాసం నిర్మింపచేసినవాడు మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా (1580-1611) దండోరా వేసి అక్కడి నుంచి రాజాజ్ఞలు ప్రకటించబడేవట ఔరంగజేబు తన సైన్యాలను దింపిన చోటు దాని ప్రక్కనున్న ఫతెహ్ మైదాన్ తన విజయ చిహ్నంగా దానికా పేరు పెట్టాడు పాదుషా.
కారు దిగి చరచరా మెట్లక్కుతున్న రాజారావుని చూచింది డెయిజీ వెంటనే ఆమెలో ఒక విద్యుత్ ప్రవహించింది. ఏదో కోల్పోయిన వస్తువు కనిపించినట్లయింది. పక్కనే ఉన్న సూరికి చూపింది ఇద్దరూ చూస్తూ నుంచున్నారు.
రాజారావు మెట్లెక్కి మంటపంలో చేరాడు నగరంలో దీపాలు వెలిగాయి. చుక్కల్లా మిలమిలా మెరుస్తున్నాయి. నగరం ప్రశాంతంగా కనిపించింది. అందంగా కనిపించింది. సుందరంగా ఉంది. రోజూ చూచేదానిలో కూడా ఒక్కొక్కప్పుడు వింత సోయగం గోచరిస్తుంది దానిలో లీనం అయినవానికి మరో విషయం గుర్తుకు రాదు. అనందం లాంటిది కలుగుతుంది. అలాంటిదేదో ఒక క్షణం పాటున కలిగింది రాజారావుకు. అదే సౌందర్యంలో ఉన్న ప్రత్యేకత అదే అనడంలో ఉన్న మహత్తు .