Previous Page Next Page 
మాయ జలతారు పేజి 35


    భుజం మీద ఎవరిదో చేయి పడితే ఉలిక్కిపడి చూచాడు రాజారావు. సూరి! వళ్ళు జల్లుమంది లేచి నుంచున్నాడు. ఇద్దరూ ఒకరి నొకరు చూస్తూ నుంచున్నారు క్షణం. ఇంతలో డెయిజీ వచ్చింది. చిరునవ్వు నవ్వింది జవాబు రాలేదు రాజారావు నుంచి ప్రతిమలా నుంచుండిపోయింది.
    "హలో రాజారావ్! లేడిలా ఎగురుతూ , పూవులా నవ్వేవాడివి పాషాణంలా మారిపోయావేమి? గ్రహాలను, ఉపగ్రహాలను సైతం బంతుల్లా కాళ్ళతో తన్నేవాడివి ఇలా ఉన్నవేమి? ప్రళయం రానున్నదా? సముద్రం ఇంకనున్నదా? నౌబత్ పహాడ్ కూలనున్నదా?" అన్నాడు సూరి.
    హాస్యం అసహ్యం అనిపించింది రాజారావుకు రెండు మహా సర్పాలు ఎదుట నిలిచినట్లనిపించింది. తన విషయం వీరికీ చెప్పడమా? అని ఆలోచించాడు ఎందరికీ చెప్పలేదు? ఏ పుట్టలో ఏ పాముందో అనుకోని "బ్రదర్ సూరీ! ప్రళయం నెత్తిన కూలింది" అని కధంతా ఓపిగ్గా వినిపించాడు.
    ముగ్గురూ మంటపంలో కూర్చున్నారు. కోకాకోలా చప్పరిస్తున్నారు. ముగ్గురూ దీర్ఘాలోచనలో ఉన్నారు. రాజారావు కధ విని డెయిజీ వాస్తవంగా క్షోభపడింది.
    "ఏ దశలో ఉంది కేసు?" అడిగాడు సూర్యారావు.
    "అనాలిసిస్ కోసం లాబ్ కు తీసుకెళ్ళారు."
    మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు సూరి అమాంతంగా ఏదో ఉపాయం స్పురించినట్లు "రాజ్! దొరికింది ఉపాయం డెయిజీ సహాయం చేస్తానంటే పని జరిగిపోయినట్లే " అన్నాడు.
    రాజారావు ప్రాణం లేచి వచ్చింది. డెయిజీ వైపు చూచాడు. ఆ చూపులు దీనంగా ఉన్నాయి. ఏదో యాచన ఉంది వాటిలో.
    డెయిజీ కనులు చెమ్మగిల్లాయి. "నేను దేనికైనా సిద్దమే" అన్నది జీరపోయిన గొంతుతో.
    రాజారావు కరిగిపోయాడు "డెయిజీ! ప్లీజ్ హెల్ప్ మీ" అని చేతులు పట్టుకున్నాడు.
    డెయిజీ తలవంచుకుంది కన్నీరు చెక్కిళ్ళ దాకా వచ్చింది. "ఆయామ్ హియర్ ఫర్ యూ, డోంట్ వర్రీ" అన్నది ఆమె గొంతు బొంగురు పోయింది.
    "నేను సర్వదా రుణపడి ఉంటాను మిస్ డెయిజీ!" అన్నాడు రాజారావు.
    "ఏమి ఈ మాత్రానికి రుణాలూ, గుణాలూ అంటున్నావు పని అయిపోయింధనుకో పద మందు కొడ్దాం, విచారం విరిగిపోతుంది ఈల కొట్టుకుంటూ ఇంటికి వెల్దువు గాని"
    ముగ్గురూ నయాగరాకు వెళ్ళారు. ముగ్గురూ త్రాగారు . కాని ఇద్దరు ఒక దోవన, రాజారావు మరొక దోవన వెళ్ళిపోయాడు.
    రాజారావు మళ్ళీ తాగాడు. అతని మెదడు మొద్దుబారింది. ఏదో మరో అనందం కోసం అర్రులు చాచింది. రజని అతనికి గుర్తుకు రాలేదు. మహబూబ్ కీ మేహెందీ కీ చేరాడు.
    నగరంలో గానాబజానా ఇంకా నిలిచి వున్నది. మేహెందీలోనే కారు దిగగానే పాటలూ, వాద్యాలూ స్వాగతం పలికాయి. రాజారావుకు ఒక ఇంటి వైపు నడిచాడు. గుమ్మం ముందు పూలమాలలు అమ్ముతున్న కుర్రాళ్ళు కనిపించారు. పూలదండలు కొనుక్కుని లోన అడుగు పెట్టాడు.
    ఒక ఇంట్లోకి ప్రవేశించాడు రాజారావు. గుమ్మం దగ్గర పూలమాలలు పట్టుకొని ఒక కుర్రాడు నుంచున్నాడు. "మాలలు కావాలా?" అని అడిగాడు. ఎందుకో ఏమిటో అర్ధం కాలేదు రాజారావుకి. అయినా, రెండు మాలలు కొనేశాడు రెండు రూపాయలిచ్చి.
    గదిలోని తివాచీ మీద తెల్లని చలవ చేసిన గుడ్డ పరచి ఉంది. గోడకు బాలీసులు అమర్చి ఉన్నాయి. రసికులు బాలీసులకు అనుకుని కూర్చున్నారు. హాలు నిండుగా ఉంది వారి ఎదుట ఒక యువతి కూర్చొని వుంది. ఆవిడ అందంగానే ఉందనాలి తలలో పూలున్నాయి మెడలో హరలున్నాయి ఉచ్చేస్వరంతో పాట పాడుతుంది. "సాయినారా' వెనక తబలా, హార్మోనియం వాయించే వారున్నారు వాయిద్యాల ధ్వని ఆవిడ పాటను మించి పోతుంది.
    ఆవిడ రాజారావును చూచింది పాట అవకుండానే కుడి చేయిని మొగ్గలా చేసి గద్దువ దాకా పోనిచ్చి సలాం చేసి స్వాగతం పలికింది కొందరు సర్దుకొని అతనికి చోటిచ్చారు. రాసికుల్లో ఒకడు పైజమా ధరించి, భుజం మీద అల్లకం పనిచేసిన లాల్చీ వేసుకొని కూర్చున్నాడు. కనులు ఎర్రగా ఉన్నాయి. తలమీద ఉండాల్సిన లక్నవీ టోపీ మడిచి జాగ్రత్తగా పక్కన పెట్టుకున్నాడు. ఎడమ కాలు మడిచి నేలకు ఆనించి ఉండగా కుడిపాదం నేలమీద నిలిచి మోకాలు వరకు మడిచి కూర్చున్నాడతను. కుడి ,మోకాలు మీద కుడి మోచేయి ఆనించి చేయి చాచి ఉంచాడు. అతని ముందు రూపాయల కట్ట ఉంది. ఎడం చేత్తో ఒక రూపాయి తీసి ముందు వేశాడు. గాయిక ఆ స్థలం నుంచి లేచివచ్చి అతని ముందు కూర్చొని ఒక చరణం చదివి లేవబోయింది. మళ్ళీ రూపాయి వేశాడు.
    రూపాయి వేసినప్పుడల్లా ఒక చరణం చదువుతుందామె. తుదకు లేవబోయింది . రెండు మోకాళ్ళు నేలకానించి కొద్దిగా లేచి ఆవిడ చేయి పట్టుకొని కూర్చోపెట్టడానికి ప్రయత్నించాడు ఆవిడ ఎర్రని కళ్ళతో చిరుబురుమని చూచింది. జేబులోంచి మరొక రూపాయి నోట్ల కట్ట తీసి బయటపడేశాడు. ఆవిడ అతని ఎదుట కూర్చుంది. అతడు బుగ్గ గిల్లబోయాడు చాకచక్యంగా చేయి దూరంగా జరిపింది. అతడు రూపాయి కాగితాలు చిటికెన వేలు పెట్టి మిఠాయి పోట్లంలా చుట్టి ఆవిడ సిగలో దూర్చసాగాడు. ఆవిడ సిగనిండా రూపాయి కాగితాలైనాయి. పూలదండల కుర్రాణ్ణి పిలిచాడు. ఆవిడ పాట సాగుతూనే ఉంది. కళ్ళు ఆడుతున్నాయి. ఏవో చెప్పుతున్నాయి. పది పూలదండలు ఆవిడ   మెళ్ళో వేశాడు "బిస్తర్ భిచాదియా హై తేరే ఘర్ కే సామ్నే" అనే పాట విని లేచి విడిపూలు దోసిటితో ఆమె నెత్తిన గుమ్మరించి వెళ్ళిపోయాడు.
    చాలాసేపు ఆ రసికుని వద్దనే ఉండిపోయింది. లేచి పూలు దులుపుకొని మిగతా వాళ్ళందరినీ ఒక చిరునవ్వు చూపుతో చూచి తన స్థానానికి వెళ్ళిపోయింది. కొప్పులో దూపాయలు, తన రూపాయలూ అక్కడ పడేసింది. కొన్ని పూలదండలు తీసేసి నిముషం ఊరుకొని సాగించింది పాట ----- రెండు చేతుల రెండేసి వేళ్ళతో తమాషాగా చప్పట్లు కొడుతూ నేలమీద జారుగుతూ .
    అక్కడున్నవాళ్ళంతా తమ ముందు రూపాయలు వేశారు ఎవరి ముందు కూర్చొని పాట పాడాలి అని ఆలోచిస్తుండగానే పది రూపాయలు వేశాడు. రాజారావు అతని ముందు వెళ్ళి కూర్చుంది పూలదండలు వేశాడు . చాలాసేపు పాట పాడింది. తర్వాత లేచింది అతడు ఆమె చేయి పట్టుకున్నాడు. ఆవిడ విదిలించుకుంది. వయ్యారంగా, చిరుకోపంగా ఒక నవ్వు నవ్వింది అక్కడి నుంచి లేచింది వేరే వాని ముందు కూర్చుంది పాట సాగించింది.
    రాజారావు లేచాడు వేరే చోటికి వెళ్ళాడు కాలికి గజ్జే కట్టి ఆడే ఆడవారిని చూచాడు శ్రావ్యమైన సంగీతంతో అలరించే అంగనలను చూచాడు వాద్యాలు పక్కనుంచుకొని గ్రాహాకుల కోసం ఎదిరి చూస్తున్న రమణులను చూచాడు కనుచూపులతో కరిగించే కన్నెపిల్లలను చూచాడు.
    మెడలో పూలదండలతో మెహందీ నుంచి బయలుదేరాడు కారు ఎక్కి స్టార్టు చేశాడు. ఇంటికి చేరుకొని సాయంకాల పత్రిక చూచాడు.
    "జగన్మోహనరావు సాధించిన మరొక విజయం - రాజారావు కల్తీ సిమెంటు పట్టుకోవడం!"
    పతాక శీర్షిక చూచాడు.
    గుండెలో హైడ్రోజను బాంబు ప్రేలింది.

                         * * * *

 Previous Page Next Page