15
"నమస్కారమండీ నాపేరు రాజారావు కాంట్రాక్టరును" తనను తానే పరిచయం చేసుకున్నాడు చీఫ్ ఇంజనీరు జగన్మోహనరావుకు.
రాజారావు హైదరాబాదు తిరిగి వచ్చేవరకు వ్యవహారాలన్నీ అస్తవ్యస్తం అయినాయి నారాయణరావుగారు విపరీతంగా అప్పులు చేశారు కాంట్రాక్టులు పెరిగాయి కాని లాభాలు లేవు పైగా లెక్కలు నష్టాలు చూపెడుతున్నాయి. ఏ విషయమూ అర్ధం కావడం లేదు. ఎవరి లోపమో తెలుసుకోలేక పోతున్నాడు చాలా చికాకులో ఉండగా , తికమక పడుతుండగా చీఫ్ ఇంజనీరు ఇన స్పెక్షనుకు వచ్చాడని వార్త అందడంతో పరుగెత్తుకుని వచ్చాడు.
"ఓహో, మీరాండి కాంట్రాక్టరు! చాలా చక్కగా పని చేయిస్తున్నారండి!" వెటకారంగా అన్నాడు జగన్మోహనరావు.
"ఈ మధ్య నేను నగరంలో లేనండీ సరేగాని చంద్రయ్యా! ఏమిటలా చూస్తూ నుంచున్నావ్? దొర నుంచొని ఉన్నారు , కనిపించడంలా? కుర్చీలు వేయించు నీడకు కాఫీలు తెప్పించు రండి జగన్మోహనరావు గారూ , కూర్చుందాం సిగరెట్టు కాలుస్తారా మరో సిగరెట్టు"
"థాంక్స్ క్షమించండి నేను సిగరెట్టు తాగను కాఫీ పుచ్చుకొను ఇది నా డ్యూటీ మీరు అతిధి సత్కారం చేయాల్సిన అవసరం లేదు నాకు కావలసింది పని -----కాఫీ కాదు ' అని సిమెంటు స్టోరుకు సీలు వేయవలసిందని ఆజ్ఞాపించాడు తన పనివారికి.
"తాము డ్యూటీ మీద వచ్చారు ఆ విషయం తెలుస్తూనే ఉంది. అయినా కర్టసీ అనేది ఒకటి ఉంది కదండీ మర్యాద చూపడం మా కర్తవ్యం నీడకు కూర్చొని కాఫీ పుచ్చుకోండి తరువాత మీరు చేయదలచుకున్నదే చేయండి."
రాజారావు చెప్పిన మాటలు వినిపించుకున్నట్లే లేదు జగన్మోహనరావు "రూఫ్ మెటీరియల్ పరీక్ష చేయించాలి తవ్వి తీయించండి నాకు చాలా పనులున్నాయి వెళ్ళాలి. అవును రాజారావుగారూ! మీరు చదువుకున్న వారని విన్నాను ఇంజనీరింగ్ పట్టా సైతం పుచ్చుకున్నారట! ఇంత అన్యాయం అవుతే ఎలా చెప్పండి? సిమెంటులో బలపపుపొడి కలుపుతే కట్టడం నిలుస్తుందా? ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చస్తే దేశం ఎలా బాగుపడుతుంది చెప్పండి? రెండవ ప్రపంచ యుద్దంలో సర్వనాశనం అయిపోయిన జపాను, జర్మనీ దేశాలను చూడండి బ్రహ్నాడ పునర్నిర్మాణ కార్యాలు జరిపి , ఇతర దేశాల తల దన్నేశారు అప్పుడే ఇరవై రెండు సంవత్సరాలైంది మనకు స్వాతంత్యం వచ్చి అధోగతి తప్ప పురోగతి లేదాయే మీలాంటి వారు ఇలాంటి పనులకు దిగుతే దేశం ఏం బాగుపడుతుంది, చెప్పండి?"
ఉపాన్యాసం విని ఉక్కిరి బిక్కిరి అయినాడు రాజారావు సన్యాసి కావాల్సినవాడికి చీఫ్ ఇంజనీర్ పదవి యిచ్చినందుకు ప్రభుత్వాన్ని తిట్టాడు.
"మిస్టర్ జగన్మోహనరావు మీకు నా విషయం తెలియనట్లుంది. కొత్తగా వచ్చారు, పాపం మంత్రులకు మాతో పనిపడని రోజంటూ లేదు నా నిజాయితిని గురించి వారికి తెలిస్తే చాలు ఈ మధ్యనే తుఫాను సహాయనిధికి యాభైవేలిచ్చాను ఉచితంగా ఒక స్కూలు కట్టించి యిచ్చాను. ఆస్పత్రిలో ఒక వార్డు నా పేరునే వుంది నా సహాయం లేకుద్నా ఎన్నికైన ఎమ్మెల్యే ఒక్కడు లేడు ఈ నగరంలో. అలాంటి నేను కల్తీ చేశానంటున్నారు సీలు వేస్తానంటున్నారు స్టోరుకు అది మాది కానే కాదంటాను ఏం చేస్తారు? మీరు లంచం అడిగారు, ఇవ్వకుంటే కేసు బనాయించానంటాను -- ఏం చేస్తారు? రూఫ్ మెటిరీయల్ పరీక్షిస్తామంటున్నారు తెల్లవారే వరకు ఈ రూఫ్ కూల్చి కొత్తది వేయిస్తాను లక్ష పారేస్తాను అది నాకు లెక్కలోనిది కాదు. మీరు నన్నేదో చేయగల్గుతాననుకుంటున్నారు అది వట్టి భ్రమ ఈ కల్తీలో పెద్దవారి దగ్గరనుంచి చిన్నవారి దాకా అందరి వాటాలు వున్నాయి ఇది ఒక కో - ఆపరేటివ్ ఎంటర్ ప్రైస్ మీరు నన్ను ఒక్కణ్ణి నిందించి ప్రయోజనం లేదు."
రాజారావు ఉపన్యాసం శాంతంగా విన్నాడు జగన్మోహనరావు. అదివిని అడిరిపోతాడనుకున్న రాజారావు ఆశలు, అడియాసలైనాయి. పైగా చిరునవ్వు నవ్వాడతను. "మిస్టర్ రాజారావ్! మీరు ఎంత గోప్పవారో ఇప్పుడు నాకు తెలిసింది అయినా నేను డ్యూటీ నిర్వర్తించాల్సిందే మీరు గొప్పవారని తెలిసే పోలీసులను కూడా రమ్మాన్నాను."
"పోలీసులు" అనే పదం విని గుండె జల్లుమంది రాజారావుకు.
ఆ విషయం గ్రహించే ముగించాడు "పోలీసులు వస్తూనే ఉండాలి వారు పంచనామా చేసి హస్తగతం చేసుకుంటారు. తాము బెదిరిస్తున్నారు కాబట్టి మేజిస్ట్రేటును కూడా రమ్మంటాను. నాకు ఈ విషయంలో ద్వేషం లేదు దేశానికి మేలు చేయాలనుకునే వాళ్ళల్లో నేను ఒక్కణ్ణి మీరు బలవంతులు, నా ఉద్యోగం ఊడగోడ్తారా" అందువల్ల నాకు నష్టం లేదు అదీ దేశానికే నష్టం"
డబ్బుకు లొంగనివాడంటూ ఉంటాడని రాజారావు కనీసం ఊహించలేదు . అతనికి డబ్బు విషయంలో చింతలేదు. కాని, అపఖ్యాతిని గూర్చి భయం పట్టుకుంది. డబ్బు ఆశ చూపి లొంగదీద్డామనుకున్నాడు జగన్మోహనరావును పక్కకు రావలసిందని పిలిచాడు అతను నిరాకరించాడు అయినా, బేరం పెట్టాడు 50 వేల నుంచి 3 లక్షల దాకా కాని ఫలించలేదు. లంచం తీసుకోవడమే కాక ఇవ్వడం కూడా ఒక నేరమేనని, లంచం ఇవ్వజూపిన నేరంలో కూడా రాజారావుకు ప్రాసిక్యూట్ చేయించవచ్చుననీ అన్నాడు జగన్మోహనరావు.
రాజారావుకు జగన్మోహనరావు విషయంలో ఉండిన ద్వేషం మాయం అయింది. అతని నిజాయితీ రాజారావును ఆశ్చర్యంలో ముంచింది. ఒకవైపు భయంతో వణికిపోతున్నాడు. మరొకవైపు సిగ్గుతో కుంచించుకుపోసాగాడు. అతని కోపం దుఃఖంగా మారింది గొంతుక డగ్గుత్తుక పడింది తాను చేస్తున్నది మోసం అని, ద్రోహం అని గ్రహించాడు కాని, ఈ పనికి తానోక్కాడు మాత్రమే కారణం కాదనీ ఈ విషయంలో తానొకభాగం మాత్రమేనని వివరించడానికి ప్రయత్నించాడు టెండరు వేసినప్పటినుండి గుమాస్తాలకు ఇవ్వాల్సిన లంచాల్నుంచి ఇన్ స్పెక్షన్ చేసి అది సరిగ్గా వుందని రాసేదాకా ఇంజనీరు వరకూ ఇవ్వాల్సిన లంచాలను గురించి వివరించాడు ఇందులో అట్టే మిగలదనీ తనను రక్షించవలసిందనీ ప్రాధేయపడ్డాడు.
జగన్మోహనరావు కు అతని విషయంలో జాలి కలిగింది. సానుభూతి కూడా కలిగింది. రాజారావును వదిలేస్తే ఆ విష వలయం విచ్చిన్నం కాదు ఈ ప్రయత్నంలో తన వుద్యోగం ఊడినా ఊడవచ్చు తాను అమెరికాలో చదువుకున్నాడు విదేశాలు పర్యటించాడు రష్యాకు వెళ్ళాడు. అక్కడి ఆర్ధిక విధానం అతనికి నచ్చింది. డబ్బు సర్వాన్ని సాధించగలదనే భావన ఆ సమాజంలో లేదు అన్ని దేశాలు చూచి , అక్కడి పరిస్తితులను అధ్యయనం చేసి తన దేశం కూడా బాగుపడాలని , అందుకు తానూ కృషి చేయాలని నిశ్చయించుకున్నాడు గాని, తనకు ప్రమోషను రాలేదు. తనకంటే జూనియర్లకు, ఎంతో మందికి ప్రమోషన్లు వచ్చాయి. తనతోటివారు అనేకమంది కెనడాలోను, అమెరికాలో నూ, ఇంగ్లాండులోనూ స్థిరపడిపోయారు. లక్షలు సంపాదించారు. తానూ వెళ్తే లక్షలు సంపాదించగలిగేవాడే కాని, స్వదేశంలో వుండీ జన్మభూమికి సేవ చేయదలచుకొని వుండిపోయాడు.
తనను గుర్తించినవాడు లేడు సూపర్వైజర్లు లక్షలు సంపాదించారు , తాను వచ్చిన జీతంతో సంతృప్తి చెందుతూ తన విధులను నిజాయితీగా నిర్వహిస్తున్నా న్యాయంగా తనకు రావాల్సిన ప్రమోషను సైతం రాలేదు. కోర్టులో కేసు పెట్టి సాధించాడీ ప్రమోషనును మంత్రులకు మస్కాకొట్టే జూనియర్ ఇంజనీర్లు బాగుపడిపోతున్నారు. ఆ విషయం తనకు తెలుసు అయినా తానా పనిచేయలేడు. ఈ కేసులో మంత్రులు సహితం రాజారావు పక్షం వహించినా ఆశ్చర్యం లేదు తాను ఒంటరిగా పోరాడాలి తోడివారు తనను "మూర్ఖుడు" అంటారు అన్నా పరవాలేదు. తాను మంచిపని చేస్తున్నాననే సంతృప్తి తనకు వుంటుంది. ఈ కేసులో తన ఉద్యోగం ఊడితే ఇక ఈ దేశంలో ఉండి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నాడు ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసి రాజారావుతో చెప్పేశాడు "రాజారావుగారూ! మీ విషయంలో నాకు సానుభూతి ఉంది అది వ్యక్తిగా మీమీద నాకు కలిగిన సానుభూతి ఇంజనీరుగా నేను నిర్వహించవలసిన విధులున్నాయి వాటిని నేను వదులుకోలేను."
పోలీసు వ్యాను వచ్చేసింది. రాజారావు గుండె జల్లుమంది. వ్యాను లోంచి శ్రీనివాసరావు దిగాడు కొంత దైర్యం వచ్చింది ఎదురు వెళ్ళాడు . శ్రీనివాసరావు కృతజ్ఞకమైన చిరునవ్వు నవ్వి కరచాలనం చేశాడు. "ఏం కనిపించడం లేదే, బుల్బుల్ ఎలా వుంది? పార్టీలో కూడా కనిపించడం లేదు పరారైనావా ఏం?" అడిగాడు.
'అబ్బ నీ హాస్యానికి అంతు లేదోయ్!" అది హాస్యం కాదనీ, ఆ మాటల వెనక ఏదో నాటకం ఉందని తెలుసు రాజారావుకు అయినా "పార్వతి మగబిడ్డను కన్నది" అన్నాడు శ్రీనివాసరావు మీరిపోకుండా ఆకట్టడానికి.
"కాంగ్రాచ్యులేషన్స్ అయితే పార్టీ ఉందన్నమాట సరేగాని ఏమీ వ్యవహారం?"
శ్రీనివాసరావుని లాక్కుపోయాడు రాజారావు జరిగినదంతా వివరించాడు. ఏదో విధంగా పరువు కాపాడే పద్దతి చూడమన్నాడు . శ్రీనివాసరావు బాగా ఆలోచించాడు. శ్రీనివాసరావు రాజారావుకు క్లాస్ మేట్ ఇద్దరూ ఒరే అంటే ఒరే అని పిలుచుకునేవాళ్ళు ఇద్దరూ ఎవరి వృత్తిలో వారు ప్రవేశించాక పూర్వపు ఆ స్నేహం అట్టే లేదు. ఉభయులూ వ్యాపార పద్దతిలోనే ఆలోచిస్తున్నారు. రాజరవును ఈ గండం నుంచి తప్పించి పుణ్యం కట్టుకుందామనే ఆలోచన శ్రీనివాసరావుకు లేదు. ఆ మాటకొస్తే ఏ పోలీసువాడికి ఉండదు. రాజారావు ఘనంగా ముట్టజేపుతాడని తెలుసు అందుకే అతనంత దీర్ఘంగా ఆలోచించాడు గాని, అతని కేమీ ఉపాయం తోచకపోగా "జగన్మోహనరావు విషయం నీకు తెలియదు కర్కోటకుడు దేవుడు దిగివచ్చినా వినే బాపతు కాదు అతడు వచ్చినప్పడినుంచీ అనేక కేసులు పట్టేశాడు ఇలాంటివి. కాంట్రాక్టర్లంతా మేలుకున్నారు నీకెలా తెలియకుండా ఉందీ విషయం?"