Previous Page Next Page 
జన్మభూమి పేజి 33

    "మరి యిదంతా ప్రభుత్వానికి తెలియదా! దళారులని ఎవరూ ఏమీ చెయ్యరా! మరి ఈ తీసుకున్న అప్పులు తీర్చకపోతే బ్యాంకులు ఎలా నడుస్తున్నాయి" ఆశ్చర్యపోయాడు కేశవరావు.
    "అదే సార్, బ్యాంకింగ్ వ్యవస్థ పాడవడానికి, నష్టాలలో నడవడానికి కారణాలు ఇవే. రైతులని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్నా అందాల్సిన వారికి అందడం లేదు."
    "బాగుంది - ఈ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వమే కాదు. కాంగ్రెస్, బి.జె.పి. ఏ ప్రభుత్వం వున్నా ఈ విపరీతాలు జరుగుతాయి. మరి ఏదో ఇదంతా ముఖ్యమంత్రి కావాలని చేసినట్టు ఇంత అల్లరి చేస్తున్నారేమిటి ప్రతిపక్షాలు" ఆఫీసర్ నవ్వాడు.
    "సరిగ్గా ఎలక్షన్ టైముకి ప్రతిపక్షాలకి మంచి సబ్జెక్టు దొరికింది సార్. ఏ ప్రభుత్వం అయినా ఇంతకంటే ఏం చేయగలదు. అపోజీషన్ పార్టీలు కాబట్టి అలా పాలనా ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తాయి. ఇదంతా ఎలక్షన్ ప్రచారానికి వాడుకుంటున్నారు.
    "అసలు నన్నడిగితే ఏ ఎక్స్ గ్రెషియాలు ఇవ్వడంవల్లే ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనిపిస్తుంది. అప్పులు తీరే మార్గంలేక తాము చచ్చిపోయినా కనీసం లక్షరూపాయలు, తాము జనమంతా సంపాదించినా కూడబెట్టలేని డబ్బు వస్తుందన్న ఆశ వారినలా ప్రోత్సహిస్తున్నట్టుంది."
    "ఆ మాట మాలాంటివారు అంటే, ప్రతిపక్షం విరుచుకు పడ్తుంది. గవర్నమెంటు ఎంత చేయగలదో అంతా చేస్తుంది సార్. రుణాలు మాఫీ చేయించారు. ఎకరానికి నష్టపరిహారం యిస్తున్నారు. ఒక్కరోజులో పరిస్థితి సర్దుకుపోదు గదా. టైము పడ్తుంది."
    "ఏమిటో ఏభైఏళ్ళయినా నా పల్లెటూరి ప్రజలు అజ్ఞానం మారలేదు. యిన్ని రకాల సబ్సిడీలు యిస్తున్నా పేదరికం పేదరికంలాగే వుంది" నిట్టూర్చారు కేశవరావు.
    రైసు మిల్లు కోసం శాంక్షన్ అయిన రుణం తీసుకోడానికి వాసుని తీసుకుని విజయవాడ వెళ్ళి వచ్చారు. ట్రాక్టరుకి, హార్ వెస్టర్ మిషన్ కి అడ్వాన్స్ గా డ్రాప్టులు పంపారు. రైతులు దుక్కి దున్నడం ఆరంభించేలోగా అడ్వాన్సుగా డ్రాప్టులు పంపారు. పంట చేతికి వచ్చేసరికి రైసుమిల్లు పని అవ్వాలని ఆయన సంకల్పం.
                                                         *    *    *
    పిల్లలు స్కూలులో పరీక్షలు హడావుడిలో రాజేశ్వరి కాస్త బిజీ అయింది. ఈ మూడు నెలల్లోనే పిల్లల చదువులో ఎంతో మార్పు వచ్చింది. ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకున్నారు. చిన్న మాటలు రాస్తున్నారు. చిన్న చిన్న ప్రశ్నలకి ఇంగ్లీషులో జవాబులు చెపుతున్నారు. పాఠాలతో పాటు రాజేశ్వరి నేర్పే ఇంగ్లీషు రైమ్స్ చాలా యిష్టంగా నేర్చుకున్నారు. రోజూ మానకుండా బడికి రావటంతోపాటు, స్నానం చేసి శుభ్రంగా రావడం అలవరుచుకున్నారు.
    మూడు నెలల్లో తను తేగలిగిన మార్పులు చేసి రాజేశ్వరి తృప్తి పడింది. మళ్ళీ సంవత్సరం ఆరో క్లాసుకి లెక్కలు, సైన్సు లాంటి సబ్జక్టులు వాసుని చెప్పమనవచ్చు అని ఆలోచించింది. సుగుణకీ మూడు నెలల్లో చిన్నక్లాసు పిల్లలకి పాఠాలు చెప్పగలనన్న నమ్మకం వచ్చింది.
    "ఇంకో నాలుగురోజులలో పిల్లలకి శలవులు ఆరంభిస్తున్నారు. స్కూలు రిపేరు ఇంకా మొదలుపెట్టాలి మీరు. ఈ శలవుల్లో పని అయిపోయేట్టు చూడండి."
    "చితం! దేవిగారి ఆజ్ఞ" కేశవరావు నవ్వుతూ అన్నారు. రంగాకి చెపుతాను ముందు సిమెంటు పని పూర్తికానీయమని. వరండాలకి గ్రిల్స్ పెట్టించాలి. అవి ఆర్డరు యిచ్చి రావాలి. ఏం కావాలన్నా విజయవాడ వెళ్ళాలి ఇలాంటి వాటికి. అదే చికాకుగా వుంది.
    "గ్రిల్స్ ఫ్యాక్టరీ పెట్టిస్తే సరి" హాస్యంగా అంది రాజేశ్వరి.
    "నీకంతా హాస్యమే. గ్రిల్స్ తయారుచెయ్యడానికి స్టీలు ఫ్యాక్టరీ కూడా పెట్టిద్దాం" ఇద్దరూ ముందు వరండాలో కూర్చుని ఉదయం కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ వుండగా యింటి ముందు టాక్సీ ఆగింది. అందులోంచి ఇద్దరు మగవాళ్ళు గాభరాగా పరిగెత్తినట్టే వచ్చారు.
    "డాక్టరుగారూ... మా అన్నయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చింది. మీరే రక్షించాలి. ఈ ప్రక్క వూరిలో వుంటాం. ప్రైమరీ సెంటర్ లో ఎవరూ దొరకలేదు. ఏ విజయవాడో తీసుకెళ్ళేవరకూ ఏం అవుతుందో... మీరు హార్టు స్పెషలిస్టు అని తెలిసొచ్చాం... మీరే చూడాలి..." ప్రాధేయపడ్డారు.
    "ఇక్కడికెందుకు. పదండి హాస్పిటల్ కి తీసుకుని పదండి. నేనూ వస్తున్నాను" హడావిడిగా బట్టలు మార్చుకుని వెంటనే వెళ్ళారు. అప్పటికే పేషంటుని టేబిల్ ఎక్కించి డాక్టర్ శ్యామల సెతస్కోపుతో పరీక్షిస్తుంది.
    ఆయన రాగానే శ్యామల పక్కకి తప్పుకుని నిలబడింది. ఆయనకి పేషెంటు స్థితి చూడగానే అర్ధమైంది. వళ్ళంతా చెమటలు, రోగి స్పృహలో లేడు. పల్స్ గుండె చూస్తూనే చేయాల్సిన ఇంజక్షన్ లు చెప్పారు.
    యింజక్షన్స్ నర్సు తీసుకొచ్చి ఈయగానే శ్యామల డైరెక్టుగా గుండెలోకే యింజక్షన్ యిచ్చి, యి.సి.జి. మిషను గుండెలకి అమర్చి టేపులు అతికించినది నర్సు సహాయంతో... కేశవరావు అరచేయి గుండెకి ఆనించి రెండు చేతులతో బలంగా గుండె మీద వత్తిడి చేస్తూ నొక్కసాగరు. అప్పటికి పేషెంటు స్థితిలో మార్పు కనపడలేదు. "ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చేట్టుంది. ఆయన హార్ట్ బీట్ ఇ.సి.జి. చూస్తూ గొణుక్కున్నారు. ఇ.సి.జి.లో మార్పు కనపడకపోయేసరికి క్షణంలో ఆయన నిర్ణయము తీసుకుని 'హార్టు ఓపెన్ చేద్దాం...' శ్యామల వంక చూస్తూ అన్నారు.
    శ్యామల కాస్త ఆరాటంగా చూసింది. తానెప్పుడూ హార్టు సర్జరీ చేయలేదు. అసిస్ట్ చేయలేదు. ఇక్కడ వున్నది తామిద్దరే."
    "ఎక్విప్ మెంట్... అసిస్ట్ చేయడానికి... ఏదో అనబోతుంటే డాక్టర్ కేశవరావు చెయ్యెత్తి వారిస్తూ "నో టైమ్, టూ థింక్ ఆల్ దిస్, వుయ్ హావ్ టూ మానేజ్ ఇట్ అని నర్సు వంక తిరిగి ఏఏ పరికరాలు స్టెరిలైజ్ చెయ్యాలో, పేషెంటుని ఎలా ప్రిపేర్ చెయ్యాలో శ్యామలకి చెప్పి బయట నిలబడి బంధువుల దగ్గిరకి నడిచి "అర్జంటుగా హార్టు ఆపరేషన్ చెయ్యాలి. విజయవాడ తీసుకెళ్ళేందుకు టైము లేదు. ఇందులో రిస్క్ వుంది. ఆపరేషన్ చెయ్యకపోతే అసలు లాభం లేదు. చేస్తే బతికే ఛాన్సు ఫిఫ్టీ పర్సెంటు. మీరు అంగీకరిస్తే రిస్క్ తీసుకుని చేస్తాను."
    "ఇక్కడ చేయడానికి వీలుందా సార్" ఆరాటంగా అడిగాడు.
    "వీలున్నా లేకపోయినా రిస్క్ తీసుకోవాల్సిన ఎమర్జన్సీ యిది. అందుకే ధైర్యంచేసి వున్న సదుపాయాలని వినియోగించుకుని చేస్తున్నా. మీరు కాగితం మీద సంతకం చేసి యివ్వండి" గబగబా వెళ్తూ వెనక్కి తిరిగి ఆగి...
    "మీరు చెయ్యగలిగితే ప్రైమరీ హెల్త్ సెంటర్లో నర్సు కాని అక్కడ స్టాఫ్ కాని ఎవరు దొరికితే వారిని టాక్సీలో వెంటనే తీసుకురండి. మాకు హెల్ప్ కి కావాలి. అర్జంట్" అంటూ చెప్పి లోపలికి వెళ్ళారు. వచ్చిన ఇద్దరూ పరిగెత్తి టాక్సీ ఎక్కారు. అరగంటలో నర్సుని వెంటబెట్టుకొని వచ్చారు.
    నాలుగు గంటలపాటు జరిగిన ఆపరేషనుతో ఆగిపోయే గుండెను సమయానికి ఓపెన్ చేసి తిరిగి ప్రాణం పోయగలిగారు కేశవరావు. ఆయన అనుభవజ్ఞమైన చేతులు చకచక పనిచేశాయి. అమెరికాలో మాదిరి ఆధునిక మిషన్ లు, పరిజ్ఞానం వున్న డాక్టర్లు సహాయం లేదు. వున్న ఒక డాక్టరు, పరికరాలు అందించే నర్సు, యి.సి.జి. మిషను తప్ప ఏ సహకారం లేకపోయినా ఎంతో అనుభవజ్ఞుడు, వేలకొలది ఇలాంటి ఆపరేషన్లు చేసిన ఆయన సహాయం తక్కువ అయిన కారణంగా యింకో గంట ఎక్కువ తీసుకున్నా, గుండెను యధాప్రకారం కొట్టుకునేట్టు చేసి, మళ్ళీ యధా స్థితిలో కుట్లు వేయడం దగ్గిరనుంచి అన్నీ ఆయనే చూసుకోవాల్సి వచ్చింది. కష్టపడ్డా ఫలితం దక్కినందుకు తృప్తిగా వూపిరి పీల్చుకున్నారు. ఈ పల్లెటూరిలో తన మొదటి కేసు విజయవంతం అయిందంటే తనకి మంచిపేరు వస్తుంది.

 Previous Page Next Page