Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 33


    "మీరలా అదే పనిగా పొగడకండే. నాకు సిగ్గేస్తుంది. మన నలుగురికి ఆడ పంచపాండవులు అని పేరు ఉందికదా! నలుగురంటే నలుగురమే ఉండి పంచపాండవులమని పేరుబడసిన మనలో నేను ఆడ భీముడిని సరేనా!"


    సుందర సుకుమారి అన్నదానికి ముగ్గురు నవ్వారు.


    "మన సుందర సుకుమారి లావుగా ఉన్నందుకు అరంగుళం వాసి కూడ బాధపడదే. సుందరి తరఫున నేను గర్విస్తున్నాను" ప్రమద అంది.


    "నేను రొంబ సంతోషంతో తల్...మున్ కల్...అవుతున్నాను" రాణి అంది.


    "నా సంతోషం మాటలతో చెప్పలేనిది. పోనీ కవిత ద్వారా వినిపిద్దామా అంటే కవిత అల్లటం రాదు. పోనీ పాట రూపంలో పాడదామా అంటే పక్క వాయిద్యాలు లేవు" సరదాగా అంది వందన.


    "కవిత మాట ఎందుకు గుర్తు చేశావే తల్లీ! నాకప్పుడే బుల్లి బుల్లి కవితలు రెండు వచ్చేశాయ్. మీరు విన్నా...వినకపోయినా కక్కుతాను. ఎందుకంటే నా నాలుక దురదగా ఉంది కాబట్టి" సుందర సుకుమారి చెప్పింది.


    "కవిత వచ్చినా...కక్కు వచ్చినా...కళ్యాణం వచ్చినా ఆగవు. ఒకవేళ మాకు అభ్యంతరం వున్నా ప్రస్తుత పరిస్థితిలో మనసులో దాచుకుంటాంగాని పైకి వెళ్ళగక్కం. తొందరగా చదివేసేయ్" అంది వందన.


    "అమ్మయ్య! ఎంతకాలానికి నా కవితలు వినడానికి ఆనందంగా ఒప్పుకున్నారే! సరే వినండి. ఇది ఒక ఆడపిల్లల తండ్రి యొక్క దీన కవిత. కవితపేరు "ఆడపిల్ల తండ్రి" అంటూ కవిత మొదలుపెట్టింది సుందర సుకుమారి.


    "ఆయన ఓ సగటు మానవుడు
    ఆరుగురు ఆడపిల్లల తండ్రి
    అమ్మాయిల పెళ్ళిచూపుల నిమిత్తం
    తిరిగి తిరిగి అరిగిపోయాయి చెప్పులు
    అలసి అలసి ఆగిపోయింది గుండె"


    "అద్భుతం...చాలా బాగుంది" అంటూ ముగ్గురు మరీమరీ మెచ్చుకున్నారు. నిజంగా ఈ కవిత చాలా అర్థవంతమైంది. అందుకే అభినందనలు లభించాయ్.


    "థాంక్యూ...థాంక్యూ. మరో బుల్లి కవితనికూడా వినిపిస్తాను వినండి" అంటూ సుందర సుకుమారి రెండో కవితని ఎత్తుకొంది.


    "కాలం కరిగిపోతున్నది
    ఎండను చూసిన మంచులా
    కానీ...
    జీవితం మాత్రం అలా వుండిపోయింది    
    ఎండను చూసిన బండ రాయిలా."


    "భేష్! భేష్! ఈ కవిత కూడా చాలా బాగుందే సుందరి! ఈ శుభ సందర్భంలో నా తరపున...వీళ్ళ తరఫున మాట ఇస్తున్నాను. "నీ కవిత్వాన్ని ఇంకెప్పుడూ వెక్కిరించమని" వందన మాట ఇచ్చింది.


    "మరే...మరే" అంటూ చెలులిద్దరూ వంతపాడారు.


    "థాంక్స్" చెప్పింది సుందర సుకుమారి.


    "అందరం ఇంక లేచి కాలకృత్యాలు...స్నాన పానీయాలు కానిచ్చి ఇక్కడ్నించి బైట పడదాం. ఈ పూట బేలూరు...హళిబీడ్...శ్రావణ బెళ గొళ...ఏదో ఒకటి చూసి వద్దాం. కబ్బన్ పార్క్ కి మరో రోజు వెళదాం" అంది వందన.


    "నీ ఇష్టం. నువ్వెక్కడికి వెళదాం అంటే అక్కడికే వెళదాం" ముగ్గురూ వందనమీదే వేశారు భారం.


    "తొందరగా తయారుకండి" అంటూ వందన ముందుగా లేచేసరికి మిగతా ముగ్గురూ లేచారు.


                                        14


    "ఓమ్మో!" అంది సుందరి.


    "నోరు మూసుకొని పద" అంది వందన.


    మరో పదిమెట్లు ఎక్కంగానే "అమ్మ...అ...బామ్మ...నేనింక పైకి ఎక్కలేనే" అంటూ మెట్లమీద అడ్డంగా కూర్చుండిపోయింది సుందర సుకుమారి. ఒళ్ళంతా చెమటలు దిగజారుతుంటే ఆయాసంతో వగరుస్తూ ఉండిపోయింది.


    "నోరు మూసుకుంటే ఆయాసం ఉండదు. నెమ్మదిగా మెట్లు ఎక్కు. సగందూరం వచ్చి ఆగిపోతానంటే ఎలా చెప్పు?" సానునయంగా అంది వందన.


    "నాలుగు కిలోల నేరేడుపళ్ళు తిని విజేతవి అయిందేకాక...దొంగని పట్టుకున్న వీరనారివి. మెట్లు ఎక్కలేనంటే ఎలాగే?" రాణి అంది.


    "దొంగని పట్టుకోవడము...ఇన్ని వందల మెట్లు ఎక్కడము ఒక్కటేనా! గజగమన వేగంగా గజంలాగా ఎంత దూరమైనా శరీరాన్ని ఈడుస్తూ నడవగలను గాని...ఈ మెట్లు ఎక్కడం మాత్రం నా తరం... నా వశం... రెండూ కావడంలేదు. ఒకటా...! రెండా...! వందలు...వందలు" ఆయాసపడుతూ చెప్పింది సుందర సుకుమారి.


    "ఇదిలా మధ్యాంతరంలోనే ఆగిపోయింది. ఏం చేద్దామే వందనా?" ప్రమద అడిగింది.


    "పోనీ నేనుకూడ దీనికి తోడుగా ఇక్కడే ఆగిపోతాను. మీరు వెళ్ళండి" అంది రాణి.


    "చూడ్డానికి చువ్వలా ఉంటావ్. నీ శరీరం తీగలాగ ఎటు పడితే అటు తిరుగుతుంది. నీకేం రోగమే మహారాణీ! ఒసేయ్ ప్రమద! దీనిమీద ఓ కన్ను వేసి ఉంచవే. ఇదేదో వేషాలు వేస్తున్నది" వందన అంది. 

 Previous Page Next Page