Previous Page Next Page 
మగబుద్ధి పేజి 33


    హతాసురాలయింది రజని. వాడివేపు వింతగా చూసింది.

 

    శ్యామల చిరుకోపంతో తన కొడుకుని దగ్గిరికి లాక్కుంది. ఆ కొత్త అమ్మాయికి తన కొడుకుకి వున్న దురలవాటు తెలియడం ఆమెకి ఇష్టం లేకపోయింది.

 

    రాళ్ళపల్లి టాపిక్ మార్చాడు.

 

    "ఆ జగ్గారావు కథ తేల్చేస్తాను. ఆత్మరక్షణ కోసమయినా కత్తితో పొడుస్తాడా రాస్కెల్."

 

    "వద్దులెండి సార్! తప్పంతా నాది" నరేష్ అన్నాడు.

 

    "అసలింతకీ ఈ నాటకం ఎందుకాడావు? ఈ అమ్మాయి ఎవరు?"

 

    విషయం చెప్పడానికి  సిగ్గుపడ్డాడు నరేష్. అయినా చెప్పక తప్పలేదు. వాళ్ళంతా తనకు ఆత్మీయులు.

 

    "ఈమె పేరు రజని సార్! ఆమె చేత 'ఐ లవ్ యు' అనిపించడానికి చిన్న నాటకమాడుదామని అనుకున్నాను. అయితే రజని ఎప్పుడయితే భయంతో కేకలు వేసిందో మొత్తం మరిచిపోయాను. ఆమెను రక్షించాలన్న ఆతృత తప్ప మరేం గుర్తు రాలేదు సార్!"

 

    "అయితే ఈ అమ్మాయి 'ఐ లవ్ యూ' అన్నదా?" అడిగాడు ప్రసాద్.

 

    "ఇంకా లేదు సార్!" ఓరకంటితో రజనీని చూశాడతను.

 

    "సిగ్గుపడుతోందా?" ప్రసాద్ మళ్ళీ ప్రశ్నించాడు.  

 

    అంతలో శ్రీలక్ష్మి కల్పించుకుంది "అదే మా చిరంజీవి అయితే ఇలాంటి నాటకాలంతా ఆడడు. మొదటి చూపులోనే హీరోయిన్ చేత ఆ మాట కాస్త అనేటట్టు చేస్తాడు.

 

    "నీ చిరంజీవి హీరోయిన్ చేతే ఏమిటి ఆమె అమ్మ దగ్గరయినా ఐ లవ్ యు అనిపిస్తాడు" కసిగా అన్నాడు ప్రసాద్. అతనికి చిరంజీవి అంటే రాత్రి నుంచి చెడ్డ ఎలర్జీగా వుంది.

 

    "చిరంజీవి అంటే నాకూ ఇష్టం అక్కా! ఎంచక్కా ఎప్పుడూ అద్భుతమైన మ్యాచింగ్ డ్రస్సులు వేసుకుంటాడు" స్వప్న చెప్పింది.

 

    శ్యామలకు ఒళ్ళు మండింది. "నువ్వు నోరు మూసుకుని వుండటమే ప్రస్తుతానికి మ్యాచింగ్" అంది కూతుర్ని కొరకొరా చూస్తూ.

 

    "చూడే అమ్మా! నన్నిలా తిట్టావంటే ఈ ఆసుపత్రి కాంపౌండర్ వెధవతో లేచిపోతా" స్వప్న అంతకంటే వాడిగా చూస్తూ చెప్పింది.

 

    వాళ్ళంతా మాటల్లో పడ్డారు.

 

    రజనికి ఇంటికి వెళ్ళాలనిపిస్తోంది. రాత్రి నుంచి ఇంటికి వెళ్ళలేదు. ఆసుపత్రిలోనే వుండిపోయింది. ఇంటికి ఫోన్ చేసి విషయమంతా చెప్పకుండా ఒక స్నేహితుడ్ని హాస్పిటల్ లో చేర్చారని, ఉదయమే వస్తానని చెప్పింది. ఫోన్ లో కూతురి మాటలు వింటున్న శ్రీనివాసరావు బీపీ హెచ్చింది. తన కూతురు నరేష్ ప్రేమలో పడ్డట్టు ఆయన వూహించాడు. అయితే ఆయన డైరెక్ట్ గా కూతుర్ని ఈ విషయంలో మందలించదలుచు కోలేదు. కూతురు ఇష్టానికి తల వూపుతూనే ఆ ప్రమాదం నుంచి ఆమెను రక్షించాలని ఆయన తాపత్రయం.  

 

    నాన్న తన కోసం కాచుక్కూర్చుని వుంటాడని ఆమెకు తెలుసు. తను ఎప్పుడోగానీ ఇలా రాత్రిళ్ళు ఇంటికెళ్ళకుండా ఆగిపోలేదు. తన మనసులోని మాట చెప్పకుండా పోవడానికి కాళ్ళు రావడం లేదు. తన ప్రేమనంతా నరేష్ కి చెప్పాలని ఆరాటపడుతోంది మనసు. అంతమందిలో అలా చెప్పడానికి సిగ్గుగా వుంది. అందులోనూ నరేష్ ముందే కళ్ళలోకి చూస్తూ అనడానికి ఎంబ్రాసింగ్ గా వుంది.

 

    ఆ ఆరాటంలో తలతిప్పి చూసిన రజని రాజా చేతిలో వున్న స్టిక్కర్ కనిపించింది. బ్లూ కాగితం మీద తెల్లటి అక్షరాలు... ఐ లవ్ యు... అని స్టిక్కర్ పై ఉన్నాయి తన అవస్థ గమనించి రాజా రూపంలో దేవుడే ఆ స్టిక్కర్ తీసుకొచ్చినట్టనిపించింది ఆమెకు.   

 

    ఎవరూ చూడకుండా ఆ స్టిక్కర్ ను తనకివ్వమని రజని సైగ చేసింది. దానిని వాడు గ్రహించి మెల్లగా చెప్పాడు "రూపాయి."

 

    ఆమె బ్యాగ్ తెరిచి అందులోంచి పదిరూపాయల కాగితం తీసి రహస్యంగా వాడి జేబులో కుక్కింది.

 

    వాడు స్టిక్కర్ ని రజనీకి అందించాడు.

 

 

    రజని స్టిక్కర్ తో ఏం చేయాలో ఆలోచించింది.

 

    వెంటనే పైకి లేచి నరేష్ తో మెల్లగా చెప్పింది "నే వెళ్ళొస్తానండీ! సాయంకాలం వస్తాను. మరో అయిదు నిమిషాల్లో నర్స్ వస్తుంది ఆమెను ముందునుంచి కాకుండా వెనుక నుంచి చూడండి."

 

    "అదేంటండీ ఆడపిల్లను వెనక చూడమంటారు. మగాడికి కావాల్సినవన్నీ ముందుంటే" నవ్వుతూ అన్నాడు.

 

    మరో సమయంలో అయితే ఆమె మరోలా రియాక్ట్ అయి వుండేది. ఇప్పుడు మాత్రం హాయిగా నవ్వేసింది.

 

    "మీకు కావాల్సింది వెనకే వుంటుంది" అతని చెవిలో అని మిగిలిన వాళ్ళతో వెళ్ళొస్తానని చెప్పి బయటపడింది.

 

    నరేష్ ఆ వచ్చే నర్స్ వెనుక ఏం వుంటుందో వూహించసాగాడు.

 

    రాళ్ళపల్లి నిల్చుని అతిబలవంతంమీద నిద్రను ఆపుకుంటున్నాడు. స్త్రీలు టేబుల్ మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.

 

    నరేష్ కి పూర్ణానందం గుర్తొచ్చాడు. "ఏం సార్! నాన్నగారు ఎలా ఉన్నారు?" అడిగాడు ప్రసాద్ ను.

 

    "ఏం చెప్పమంటావయ్యా! ఆయన మా నాన్న కాదు, శత్రువు. ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళను పేకాటకి కూర్చోపెట్టి, విస్కీ సిప్ చేస్తూ, వక్కపొడి నములుతూ, సిగరెట్ తాగుతుంటాడు. అటు చూస్తే పెళ్ళానికి చిరంజీవి పిచ్చి, ఇటు చూస్తే తండ్రికి దురలవాట్ల పిచ్చి. ఈ పిచ్చి జనాలతో వేగలేక నాకూ తొందరలో పిచ్చెక్కేట్టుంది" ప్రసాద్ తలపట్టుకున్నాడు.  

 

    పూర్ణానందాన్ని తలుచుకుంటే నవ్వాగలేదు నరేష్ కి.

 

    అంతలో డోర్ తెరుచుకుంటే నర్సు వచ్చింది.

 

    ఆమె వీపును చూడడానికి విఫలయత్నం చేస్తున్నాడతను.

 

    ఆమె వెనక్కి తిరగలేదు.

 

    టేబుల్ దగ్గిరికి వచ్చి అక్కడున్న మందును సిరంజిలో నింపింది.

 

    నరేష్ ను పక్కకి తిరగమని, బటక్ మీద ఇంజక్షన్ చేసింది.

 Previous Page Next Page