Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 33


    నాగేశ్ పెదవి కదిలింది. "రుక్మిణి?" అంతే వలపు వాక పారింది.

 

    రుక్మిణి గుండె దడదడలాడింది. కనులెత్తి చూచింది. ఇంతలో సిగ్గు. కనురెప్పలు బరువైనాయి. వాలిపోయినాయి. వ్రేళ్ళతో నేలమీద బొమ్మలు గీసింది.

 

    "రుక్మిణి నువ్వెంత మంచిదానివి?" ఏదో అనాలని అనేశాడు.

 

    "ఎందుకు?" వరాలు రాలేయి. అతనికి కావలసింది అదే. ఆమె మాట్లాడాలి తాను మాట్లాడాలి. వారి మాటలు కలుసుకోవాలి. వాటిలోంచి అమృతం పుట్టాలి. దోసిళ్ళతో త్రాగాలి.

 

    "ఏమో! తెలియదు కాని నువ్వు మంచిదానివి. ఇట్లనే ఉండిపోరాదు."

 

    "ఎట్ల?" ఆమె కనులెత్తి చూచింది. అంత దగ్గరగా వారి చూపులు కలిశాయి.

 

    మల్లెలు రాలేయి.

 

    వసంతం విరిసింది.

 

    "దినాం గుడికిపోత"

 

    "సాయంకాలమా?"

 

    "అవు"

 

    "అయితే రోజూ కలుసుకుందామా?"

 

    సరేనన్నట్లు తల ఊపింది.

 

    ఇంతలో జానకి వచ్చింది. రుక్మిణిని పిలిచింది. ఉలిక్కిపడ్డదామె. ఊపిరి ఆడలేదు. తడబాటుతో లేచినుంచుంది. నాగేశ్ కూడా లేచాడు. ఆమె అతనిని చూచింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఏమనాలో అర్థంకాలేదు. అడుగు ముందుకు వేసింది. సాగిపోయింది. చూస్తూ ఉండిపోయాడు నాగేశ్.

 

    ఆ రాత్రి వీరయ్యగారింట్లో భోజనాలు. భోజనాల సందర్భంలో అనేక చర్చలు జరిగాయి. అనేక తీర్మానాలు జరిగాయి. భోజనాలైనా ఎవరూ పడుకోలేదు. వచ్చిన నాయకులతో చర్చ. జానకి ఉద్రేకంగా చర్చలో పాల్గొన్నది. వీరయ్యగారు అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారు. రఘు మామూలుగానే ఉన్నాడు. నాగేశ్ అంతగా పట్టించుకోలేదు.

 

    ఆ రాత్రి పాపం రుక్మిణి నిద్రపోలేదు.

 

    తాసిల్దారు మాత్రం నిద్రపోయాడా? తెల్లవార్లూ కూర్చున్నారు ముగ్గురూ - తాసిల్దారు, అమీను, గిర్దావరు, సాహుకారి వెంకయ్య తలనొప్పని ఎగ్గొట్టాడు. కాకుంటే నలుగురు కావలసింది. వారు ఆ రాత్రి తాగలేదు గానాబజానా లేదు. ఏదో రాబోయే తుపానును ఆపటానికి ప్రణాళికలు వేస్తున్నారు. వారి జన సమూహాలను చూచీ, ఉపన్యాసాలు వినీ గంగ వెర్రులెత్తాయి. నిన్నటి దాకా తమ ఆజ్ఞ లేకుండా చీమ చిటుక్కుమనలేదు. జాగీరు మొత్తాన్ని గడగడలాడించారు. ఇవ్వాళ వారి హృదయాల్లో గుబులు చేరింది. భయం ప్రవేశించింది. ఏం చెయ్యాలి? ఎవరిని చంపించాలి? ఎవరిని కొట్టించాలి? ఎలా హడలు కొట్టాలి? ప్రతివారి ప్రణాళికకూ ఏదో అడ్డువస్తూనే ఉంది. మున్సిఫ్ జాగీర్దార్, శాసనం ప్రభుత్వం ఇవన్నీ ఇన్నాళ్ళ నుంచి ఏమైనాయి? ఇవ్వాళ అమాంతంగా ఎలా ఊడిపడ్డాయి? ఎవరు దీనికి కారణం! రఘు, నాగేశ్!

 

    ఇద్దరూ వాళ్ళ పాలిట యములైనారు.

 

    వారిని వదిలించుకోవాలి.

 

    యముణ్ణి ఎవడు చంపాడు?


                                                    *  *  *  *


    హత్య!

 

    ఖూన్!

 

    మర్డర్!

 

    భాషలు వేరైనా వార్త ఒక్కటే. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే వార్త ఊరంతా వ్యాపించింది. అగ్గిలా ఇంటింటికీ పాకింది. నిద్రలో ఉన్నవారు సహితం ఉలిక్కిపడి లేచారు.

 

    హత్య జరిగిపోయింది. ఎవరినోట విన్నా అదే వార్త. ఆడా, మగా, పిల్లలు అందరూ అందును గురించే ముచ్చటించుకున్నారు. గుంపులు గుంపులుగా చేరి అతని మంచితనాన్ని గురించి చెప్పుకుంటున్నారు. హత్య ఎవరు చేశారనే దాన్ని గురించి నానా రకాల వాఖ్యానిస్తున్నారు. హత్య యొక్క కర్తృ కార్య, కారణాల్ను గురించి తలా ఒకరీతిగా చెప్పుకుంటున్నారు.

 

    ఊరంతా తుకతుకా ఉడికిపోయింది. ఎవరి ముఖాన చూచినా విషాదచ్చాయలే. ఆ కాలంలో ఈ ప్రాంతంలో హత్యలు చాలా అరుదు. అధికారులు హతమారుస్తే హత్యకాదు. హత్యదాకా ఎందుకు-దొంగతనాలు కూడా అరుదే. ఎక్కడ దొంగతనం జరిగినా ఊరందర్నీ హడలకొట్టేవారు పోలీసులు. ఇక హత్య జరిగితే చెప్పాలా? ఈ పిడుగు ఎవరిమీద పడుతుందోనని హడలిపోతున్నారు జనం.

 

    హత్య జరిగినచోటికి జనయాత్ర సాగింది. స్థలం జనంతో కిట కిటలాడిపోయింది. కాని ఒక్క పోలీసువాడూ రాలేదు. ఘోరంగా హత్య చేశారు. కత్తితో అనేకచోట్ల పొడిచారు. వంటినిండా గాయాలే. మెడ సగం తెగిపోయింది. రక్తంలో పడివుంది శవం - మంచం ప్రక్కన. పాపం వంటరిగాడు. ఎంతో దూరం నుంచి వచ్చాడు. మంచివాడు. ఇక్కడ చచ్చాడు.

 

    ఖాజా అసదుల్లా బేగ్ అన్సారీ మున్సిఫ్ మేజిస్ట్రేట్ హత్య గావించబడినాడు. శత్రు పక్షంలో చేరిన తనవారిని ముందు తుడిచిపెట్టాలి. అందుకే అధ్యాయం ఇలా ప్రారంభం అయింది. ఇది రాబోయే పరిణామాలకు సంకేతం అనుకున్నారు ప్రజలు. పొంగిన ఉద్రేకంలో ఒక్కసారిగా కుండెడు నీళ్ళు పడ్డాయి. గుండెలు మళ్ళీ గుబులు, గుబులు మనసాగేయి.

 

    రఘు మాత్రం చలించలేదు. అతనికి బాధ కలిగింది. కాని భయం కల్గలేదు. నాగేశ్ లో ఉద్రేకం పొంగింది. ఇద్దరూ పరుగెత్తారు. జనాన్ని తోసుకుంటూ లోనికి వెళ్ళారు. భయంకరం అయిన శవాన్ని చూచి అక్కడే నిలిచిపోయారు. రఘు బాగా చూచాడు. అడుగుల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కత్తి అక్కడే పడివుంది. హంతకుడు చేతులు తుడుచుకున్న జేబురుమాలు కూడా నేలమీద ఉంది. ఒక్క పోలీసువాడు లేడు! వెంటనే కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాడు. జనాన్ని హత్యా స్థలంలో అడుగు పెట్టనీయకుండా చూడమని నాగేశ్ ను ఆదేశించాడు. స్టేషన్ కు పరిగెత్తాడు. జిల్లా పోలీసు మొహతమీమ్ (సూపరింటెండెంట్) టెలిగ్రాం ఇచ్చాడు.

 

    పోలీసు మొహతమీమ్ రైలు దిగాడు. తాసిల్దారుకు ఆ వార్త అందింది. ముచ్చెమటలు పోశాయి. అంత భారీ మనిషి హడలిపోయాడు. గుండెలు దడదడలాడేయి. మనిషి గడగడలాడేడు. నెత్తి నాలుగుసార్లు రాచుకున్నా కర్తవ్యం గోచరించలేదు. భయం అతణ్ణి కృంగదీయసాగింది.

 

    స్టేషన్ లోనే పోలీసు అధికారిని కలుసుకున్నాడు రఘు. వివరాలన్నీ తెలియజేశాడు. ఒక్క పోలీసువాడు అటు రాకపోవడంవల్ల ఇందులో పోలీసు హస్తం వుందని అనుమానంగా వుందన్నాడు. పోలీసు అధికారిని హత్యా స్థలానికి తీసుకెళ్ళాడు. అధికారికి కూడా ఆ శవాన్ని చూచి వళ్ళు జల్లుమంది! తరవాత వళ్ళు మండింది. చంపబడినవాడు ముసల్మాను! అందులో మున్సిఫ్! హంతకుణ్ణి పట్టుకోవాలనే పట్టుదల కలిగింది. ఈ కేసులో అతనికి ప్రమోషన్ వచ్చినా రావచ్చు. ఒక ముస్లిం ఖూనీ చేయబడినాడు! బహుశః చంపిన వాడు హిందువై ఉండాలి. కాని రఘు, నాగేశ్ ల ఆతురత, ఒక్క పోలీసుగాని, ముసల్మానుగాని అక్కడ లేకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించాయి. పైగా ఒక్క జాగీరు అధికారి తనకు స్వాగతం చెప్పడానికి రాలేదు. ఏదో అవమానం జరిగినట్టు అయింది. దాంతో పట్టుదల మరీ హెచ్చింది.

 

    రఘు, నాగేశ్, వీరయ్యగారు, భీముడు, రావఁడు పంచులైనారు. పంచనామా జరిగింది, శవాన్ని పోస్టుమార్టమ్ కోసం బస్తీకి పంపించారు. రిపోర్టు వగైరా కొందరు పోలీసులతో జిల్లా కార్యాలయానికి పంపించి మరికొంత విచారణ జరపడానికిగాను అక్కడే ఉండిపోయాడు మొహతమీమ్. ఎవరిని అరెస్టు చేయాలో అతనికి అర్థంకాలేదు, అరెస్టులు చేయకుండా పోవటం అతని హోదాకు తక్కువ. ఏం చెయ్యాలో తోచక వాలు కుర్చీలో కూర్చొని సుదీర్ఘంగా ఆలోచిస్తున్న మొహతమీమ్ కు గిర్దావరు వంగి మూడుసార్లు సలాం చేశాడు.  

 

    "కౌన్ హై!" అడిగాడు మొహతమీమ్.

 

    "గిర్దావర్కు సర్కార్!"

 

    "గిర్దావర్కు ఈడేం పని? అమీన్ యాడ చచ్చిండు?"

 

    నసిగాడు గిర్దావరు, దౌర1 మీద పోయిండు సర్కార్. నేనున్న గద ఇంతజాములు2 చేసేటందుకు. తాసిల్దార్ సర్కార్ దావతిచ్చిండు3. నన్ను తోలిండు. తష్రీఫ్ లానా సర్కార్4" అన్నాడు.

 

    "ఇప్పుడెరికైనాది తాసిల్దారుకు! హమ్ నహీఁఆయేఁగీ. పోయి చెప్పు తాసిల్దారుతో. మేమేం జాగీరు నౌకర్లమా?" హూంకరించాడు మొహతమీమ్.

 

    గడగడ లాడాడు గిర్దావరు. "సర్కార్ కు కోపం వస్తే మేమెట్ల బతుకుతం? తాసిల్దార్ బొర్ర శాన పెద్దది. నడువలేడుండి. నన్ను పంపించు. కచ్చడంకూడ తెచ్చిన. నడిపిస్తాముండి సర్కార్ను! గులామ్ హుఁ సర్కార్. జరూర్ చల్నా!"

 

    "అచ్చా ఈ ఖూనీ ఎవరు చేసిన్రు? ముసల్మాన్ మున్సిఫ్ ఖూనే అయితే ఇండ్లల్ల కూకుంటర్? తేలుస్త తడఖా నీ చెయ్యి ఉన్నట్లున్నదిండ్ల."
___________________________________________________
1.పర్యటన. 2. ఏర్పాట్లు. 3.విందుకు పిలిచాడు. 4.దయచేయాలి ప్రభూ

 Previous Page Next Page