Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 33


    ఎలెక్షన్లో అన్న గెలిచాడు. విజయోత్సవాలు జరిగాయి. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ ఏదో పనిమీద రాజధానికి వెళుతున్నారు.

    వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ప్రజల ఖర్చుతో ఒక గన్ మాన్! ఒక స్టెన్ గన్!!

    వింటున్న అఖిల్ కీ, సుధకీ, నవాబుగారికీ, బేగంగారికి కూడా ఒళ్లు భగ్గుమన్నట్లయ్యింది.

    అఖిల్ కి అనిపించింది.

    డెమోక్రసీ కాదు ఇది.

    డెమనోక్రసీ.

    రాక్షస రాజ్యం.

    ఇలాంటి వాళ్ళవల్లే ప్రజాస్వామ్యం పరువుపోతోంది.

    అప్రయత్నంగా అశువుగా అఖిల్ మదిలో మెదిలింది ఒక కవిత.

    "నేను కేపిటలిస్టు,

    నా కొడుకు కమ్యూనిస్టు,

    మా కోడలు కమ్యూనిస్టు,

    నా సోదరుడు సోషలిస్టు,

    మా అమ్మడు అనార్కిస్టు.

    మా బామ్మర్ది బద్ధకిస్టు,

    మా షడ్డకుడు సెంటరిస్టు,

    ఏ పార్టీ పపరు కెక్కినా,

    మేం మాత్రం సుష్టుగా తింటాం,

    అంచేత ఇదే బెస్టు!"

    ఈలోగా,

    విస్కీ బాటిల్ ఖాళీ అయ్యింది.

    సుందోపసుందుల్లాంటి ఆ అన్నదమ్ములిద్దరికీ, వాళ్ళ బాడీగార్డుకీ కూడా కై పెక్కింది.

    అప్పుడు పడింది తమ్ముడి దృష్టి సుధ మీద! సాభిప్రాయంగా అన్న వేపు చూశాడు.

    అన్న చిన్నగా నవ్వాడు. నవ్వి ,ఎక్స్ రే కళ్ళతో సుధవేపు చూశాడు. అతను బట్టలు ఉండగానే లోపలి అందాలు బేరీజు వెయ్యడంలో ఎక్స్ పర్ట్.

    ఇందాక అఖిల్ కొద్ది క్షణాలపాటు సుధని చూసినప్పుడు ఆమె మొహాన్నీ, చిరునవ్వునే చూశాడు.

    ఇప్పుడీ ప్రజానాయకుడు అలా చూడలేదు.

    అతని చూపులు సూటిగా సుధ వక్షం మీద పడ్డాయి.

    భారంగా ఉంది సుధ వక్షం. ఉచ్చ్వాస్వ నిశ్వాసాలకు లయబద్ధంగా పైకి క్రిందికీ కదులుతోంది. ఆ క్రిందుగా నాజూకయినా నడుము చీరెలో నుంచే బలంగా, పొడుగ్గా కనబడుతున్న తొడలు.

    బాడీగార్డు వేపు సాభిప్రాయంగా చూశాడు అన్న.

    బాడీగార్డు స్టెన్ గన్ పట్టుకుని రెడీగా నిలబడ్డాడు.

    అన్న లేచి సుధవేపు అడుగులు వేశాడు.

    సుందోపసుందులలాంటి ఆ అన్నదమ్ముల్లో అన్న సుదవేపు ఇంకో అడుగువేశాడు.

    ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గ్రహించి తక్షణం లేచి నిలబడింది సుధ అప్రయత్నంగానే. ఆత్మరక్షణ కోసం తన హ్యాండ్ బ్యాగ్ ని రెడీగా పట్టుకుంది.

    ప్రత్యర్ధుల పశుబలం ముందూ, వాళ్ళ స్టెన్ గన్ ముందూ తన హ్యాండ్ బ్యాగ్ ఒక ఆయుధంగా నిలుస్తుందని కాదు.

    కానీ__

    నీట మునిగే వారికి గడ్డిపరక కూడా ఆధారమే అని తోచినట్లు హ్యాండ్ బ్యాగ్ ని గట్టిగా పట్టుకుంది సుధ. ఆమె శ్వాస రొప్పులాగా వస్తోంది.

    విషపు నవ్వు నవ్వుతూ దగ్గరికి వచ్చాడు అన్న.

    వెంటనే హ్యాండ్ బ్యాగ్ తో అతని మొహానికి తగిలేటట్టు కొట్టబోయింది సుధ.

    ఆమె చేతిని గట్టిగా పట్టేసుకున్నాడు అన్న. హ్యాండ్ బ్యాగ్ ని బలంగా గుంజి కిటికీలోంచి బయటకు గిరాటేశాడు.

    అనుకోకుండా తను కూడా కిటికీ వేపు తిరిగింది సుధ.

    ఆ అరక్షణంలోనే సుధ అందాలను వెనుకనుంచి చూసేశాడు అన్న.

    వెకిలిగా అన్నాడు-

    "ఆడోళ్ళ హిప్స్ రెండురకాల షేపుల్లో ఉంటాయి. యాపిల్ పండు నిలువునా సగానికి కొస్తే ఎట్లా వుంటుందీ. అట్లాంటి షేపు ఒకటి. రెండో రకమేమో జీడిమామిడిపండు షేపన్న మాట. పైన సన్నగా వుండి కింద విశాలంగా వుండే షేపు.... ఈ పోరిది యాపిల పండు షేపురా!" అని.

    అతని మాట పూర్తికాకుండానే అతని చెంప చెళ్ళుమనిపించడానికి గాను విసురుగా చెయ్యెత్తింది సుధ.

    గాల్లోనే ఆమె చేతిని గట్టిగా పట్టేసుకున్నాడు అతను. విడిపించుకోడానికి శాయశక్తులా పెనుగులాడుతోంది సుధ.

    అన్న ఆమె రెండు చేతులూ పట్టేసుకుని నవాబుసాబ్ తో అన్నాడు-

    "నవాబ్ సాబ్! ఇక్కడ కాస్త గడ్ బిడ్ జరగబోతోంది. మీరు పక్క కంపార్టుమెంటులో కెళ్ళి కూర్చోండి"

    వాళ్ళెవరయినదీ హఠాత్తుగా గుర్తొచ్చింది నవాబు సాబ్ కి.

    "అరే! నువ్వు సురేందర్ వి కదూ? మచ్చీందర్ కా బచ్చా! వాడు నీ తమ్ముడు దేవేందర్! అవునా?"

    "మీరు వెయ్యి కుక్కల నవాబ్!" అన్నాడు సురేందర్, తను కూడా ఆయన్ని గుర్తుపట్టి.

    సురేందర్ కుటుంబం నవాబ్ సాబ్ కి పరిచయమే. సురేందర్ తండ్రి రాజా మచ్చిందర్ చిన్న జాగీర్దారు. నిజం ప్రభువుకి గులాంగా ఉండేవాడు. పరపీడన పరాయణత్వంలో ఆ ప్రాంతాలలో ఆ కుటుంబాన్ని మించినవాళ్ళు లేరని ప్రఖ్యాతి. నిజం సర్కార్ ఉన్నన్నాళ్ళూ రాజా మచ్చిందర్ "జోహుకుమ్!" అన్నట్లు నైజాం అడుగులకి మడుగులు వత్తుతూ, నజరానాలు, నీరాజనాలూ సమర్పించుకుంటూ, సర్కార్ అనుగ్రహం సంపాదించి, ఆ ధైర్యంతో ప్రజలను పీడిస్తూ వుండేవాడు. వేష భాషల్లో పూర్తిగా నైజాంనే అనుకరించేవాడు అతను. అదే మీసకట్టు, అలాంటిదే షేర్వాణీ, పైజమా, కాళ్ళకి సుల్తాన్ షాహి జోళ్ళు, తల మీద కాశ్మీరు గొర్రె బొచ్చుతో చేసిన ఫెజ్ క్యాప్ పెట్టేవాడు.

    ఇంతలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నైజాం తను ఇండియాలో కలవనని, స్వతంత్ర దేశంగా వుంటాననీ మొండికేశాడు నైజాం ప్రభుత్వం మీద పోలీస్ యాక్షన్ జరిపింది భారత ప్రభుత్వం.

    ఒకటి రెండు రోజులు ప్రతిఘటించి తర్వాత లొంగిపోయాడు నైజాం.

    నైజాం ప్రభుత్వం స్థానంలో భారత ప్రభుత్వం వచ్చింది.

    రాత్రికి రాత్రి తన వేషభాషలు మార్చేశాడు రాజా మచ్చిందర్. ఖద్దరు కుట్టించాడు. షేర్వాణీ, పైజమా స్థానంలోకి లాల్చీ, ధోవతీ వచ్చాయి! తల మీద ఫెజ్ క్యాప్ బదులు గాంధీ టోపీ పెట్టాడు.

    ప్రభుత్వం మారింది గానీ పాలకులు మారలేదు. ప్రజలూ మారలేదు.

    పార్టీ మార్చిన మచ్చిందరే మళ్ళీ ఆ ప్రాంతానికి కొత్త పాలకుడయ్యాడు. కాలక్రమాన తన పనులనుబట్టి, పార్టీలను పేకముక్కల్లాగా మార్చాడు.

    ఇప్పుడింక కొడుకుల హయాం వచ్చింది.

    నవాబ్ సాబ్ మందలిస్తున్నట్లు గట్టిగా అన్నాడు-

    "అరే సురేందర్! ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? డాక్టరు! దేవతలాంటిది .ఆమె మీద చెయ్యేస్తే సీదా నరకానికే పోతావు."

    నిర్లక్ష్యంగా నవ్వాడు సురేందర్.

    "బేగానీ షాదీమే అబ్దుల్లా దీవానా అన్నారు.... ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అంట! వెయ్యి కుక్కల నవాబ్ సాబ్! నిన్నేమన్నా పిచ్చికుక్క కరిచిందా ఏమి? ఎందుకట్ల ఒర్లుతావ్? మంచిగ వెళ్ళి పక్క కంపార్టుమెంటులో కూకో!"

    నవాబ్ సాబ్, బేగంగారూ ఇద్దరూ ఏదో అనబోయారు.

    సురేందర్, దేవేందర్ కలిసి వాళ్ళిద్దర్నీ మోటుగా ఈడ్చి, పక్క కంపార్టుమెంట్ లోకి తోసేశారు.

    "తమ్మీ! నువ్వు కూడా వెళ్ళు" అన్నాడు సురేందర్, అఖిల్ తో.

    అఖిల్ మాట్లాడకుండా లేచాడు.

    అతను కూడా వెళ్ళిపోతుంటే అప్పుడు అధైర్యం కలిగింది సుధకి.

    తనేం మాట్లాడుతున్నది తనకి తెలియకుండానే త్వర త్వరగా అనేసింది.

    "ప్లీజ్....ప్లీజ్ హెల్ప్ మి! ప్లీజ్...."

    నెమ్మదిగా వెనక్కి తిరిగి స్థిరంగా అన్నాడు అఖిల్.

    "వై? వై షుడ్ ఐ?" అన్నాడు. అతని మొహంలో కాఠిన్యం కనబడుతోంది.

    అతని నిష్ఠూరాన్ని ఎదుర్కొనే స్థితిలో లేదు సుధ.

    "ప్లీజ్.... హెల్ప్ మి" అంది మళ్ళీ యాంత్రికంగా.

    సంతోషం లేని నవ్వు నవ్వాడు అతను.

    "ఇప్పుడేం కొంపలంటుకుపోవు. కాసేపు కళ్ళు మూసుకో! అంతా అయిపోయాక ఫినాయిల్ తో స్నానం చెయ్యి. ఆల్ రైట్ అయిపోతుంది" అన్నాడు వ్యంగ్యంగా.

    సుధకి గుర్తొచ్చింది.

    తను ఇంతకుముందు "నోరు ఫినాయిల్ తో కడుక్కో...." అని రుడ్ గా తిట్టింది అతన్ని.

    అది మనసులో పెట్టుకుని ఇప్పుడిలా మాటకి మాట అంటిస్తున్నాడన్నమాట!

    ఇంక ఈ మృగాన్ని బతిమాలటం అనవసరం.

 Previous Page Next Page