Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 33

    "నాకు కాదురా అయింది-నీకేదయినా అయిందని నా భయం. నీ కేదన్నా అయితే మీ అమ్మ నా తాట వలిచేస్తుంది. నన్ను, నా వంశాన్ని అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు కలిపి తూర్పార పడుతుంది. నాకడగటం రాదు__నీకు చెప్పడం రాదు_ఎందుకోచ్చిన గోల కాని ఒకసారి డాక్టర్ దగ్గరకెళదాం పద విషయం తేలిపోతుంది" అన్నాడు గుర్నాథం.
   
    "ఏ విషయం?" పాండు అడిగాడు.
   
    "అదేరా నీ విషయం" అన్నాడు గుర్నాథం.
   
    "అదే నా విషయం ఏమిటి?" పాండు తిరగి ప్రశ్నించాడు.
   
    ఇలా తండ్రీ కొడుకులమధ్య పావుగంటసేపు మాటలు జరిగాయి కాని తండ్రి అనే మాటలు కొడుక్కి అర్ధంకాలేదు. కొడుకు చెప్పే తీరు ఆ తండ్రికి నచ్చలేదు.
   
    చివరిసారిగా ప్రయత్నిస్తూ "నీవు కాలు జారావేమోనని న ఆనుమానం?" అన్నాడు గుర్నాథం.
   
    "మొన్న కాలుజారి బాత్రూమ్ లో పడ్డది నువ్వు" గుర్తు చేశాడు పాండు.
   
    "కాలు జారడమంటే కడుపుతో ఉండటం" గుర్నాథం వివరించాడు.
   
    "కాలు జారదానికి కడుపుకి సంబంధమేమిటి?"
   
    "బోలెడుందిరా నాయనా!" అతను అన్నాడు.
   
    "అయితే వెళ్ళి డాక్టరుకి చూపించుకో" ఉచిత సలహా ఇచ్చాడు పాండు.
   
    "అదికాదురా పాండు! నీ కడుపు కాయ పడ్డదేమోనని నా అనుమానం" అతను కాస్త దిగులుగా అన్నాడు.
   
    "కడుపులో కాయలు పడ్డమేమిటి? నా కడుపేమన్నా ఫ్రిజ్జా! కాయలు పెట్టడానికి?" పాండు అన్నాడు.
   
    గుర్నాథం తల ప్రాణం తోకకొచ్చినట్టయింది. తోకంటు ఒకటి లేకపోయినా "నేనెలా చెప్పినా నీ కర్ధం కావడంలేదు. ఏ ఆడపిల్ల వల్లనయినా నీవు కడుపుతో ఉన్నావేమోనని నా అనుమానం, పెళ్ళి కాకుండా అదే జరిగితే జన్మలో ఏ ఆడపిల్లా నిన్ను పెళ్ళిచేసుకోదు మీ అమ్మ నిన్ను, నన్ను ఇంట్లోనూ ఉంచదు" గుర్నాథం వాపోతూ చెప్పాడు.
   
    లోకం పోకడ బొత్తిగ తెలీని పాండు "కడుపుతో ఉండడమంటే ఏంటి నాన్నా!" అని చల్లగా అడిగాడు.
   
    "లోకజ్ఞానం తెలీని ఎంత అమాయకుడివిరా నా తండ్రీ! జరగరానిది జరిగితే మన పని ఏమయ్యేను! నువ్వు చూడబోతే ఉత్త అమాయకుడివి నాకా ఈ అనుమానంతో అరికాళ్ళల్లో వణుకు బయల్దేరి నడినెత్తిదాకా పాకుతున్నది. ఇలాకాదు..."
   
    అతను కాస్త ఆలోచించి కొడుకుని తీసుకుని అప్పటికప్పుడే రహస్యంగా డాక్టర్ కి చూపించడానికి ఆస్పత్రికి వెళ్ళాడు.
   
    ఆస్పత్రిలో పాండుని డాక్టర్ పరీక్షచేసి "మీ అబ్బాయికి కడుపు రాలే" దంటూ చల్లటి వార్త అతనికి వినిపించాడు.
   
    ఉత్త పరీక్షకే ఆ డాక్టర్ గారికి వందరూపాయలు ఫీజు చెప్పించి కొడుకుతో ఇంటిదారి పట్టాడు గుర్నాథం.
   
    "ఇదంతా ఏమిటి నాన్నా?" ఇంటికొచ్చింతర్వాత పాండు అడిగాడు-
   
    "నీకేం తెలీదు. నీదిప్పుడు ఎదుగుతున్న వయస్సు. ఇలా మనం మధ్య మధ్య డాక్టర్ దగ్గరకెళ్ళి పరీక్ష చేయించుకుని వస్తూ ఉండాలి. ఈ విషయం మీ అమ్మకు చెప్పకు" చెప్పాడు గుర్నాథం.
   
    "అమ్మకు చెబితే ఏంటంట?" ఎదురు ప్రశ్నించాడు పాండు.
   
    "నిన్ను, నన్ను కోప్పడుతుంది సరేనా."
   
    "అమ్మ ఊర్కినే కోప్పడదుకదా! ఇప్పుడు మనమేమీ తప్పుచేయలేదుకదా!"
   
    "నేరకపోయి నీమీద అనుమానం పడ్డానురా నాయనా! సుపుత్రా కొంప పీకకురా!" అనుకొన్న గుర్నాథం కొడుకుని కాసేపు బ్రతిమిలాడుకొని వాడి చేతిలో వందరూపాయలు లంచం పడేసి "బాబు! ఈ ఒక్కసారికి నోరుమూసుకోరా" అన్నాడు.
   
    వందనోటు చూడంగానేపాండు కళ్ళు మెరిశాయి. "నా స్నేహితురాళ్ళు ఎప్పటినుంచో నన్ను సినిమా చూపించమని అడుగుతున్నారు. వాళ్ళకు సినిమా చూపించి హోటల్లో కాఫీ, టిఫిన్ ఇప్పించి నేనెప్పుడో వాళ్ళకిచ్చినమాట ఇప్పుడు చెల్లించుకుంటాను. మా మంచి నాన్న. ఇక నుంచి నన్ను వారానికోసారి డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళినా అడ్డు ప్రశ్నలేయకుండా చక్కగా వస్తాను" అని చెప్పి పాండు అప్పటికప్పుడే బయటికి వెళ్ళిపోయాడు.
   
    గుర్నాధం రెండు చేతులూ నెత్తిమీద పెట్టుకుని కూర్చుండి పోయాడు.
   
                                                    *    *    *    *
   
    ఒకానొక కాలంలో-
   
    పెళ్ళయిన ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోతే 'గొడ్రాలు' అని 'గొడ్డుమోతుద'ని అనేవారు. కారణం ఏదయినా కాని మాతృత్వం పొందలేని స్త్రీ సమాజం చేత చిన్నచూపు చూపబడేది తనకుతానే అంతులేని వేదనని అనుభవించేది.
   
    ఇప్పుడు కాలంతోపాటు సృష్టి ప్రక్రియకూడా మారిపోయింది. స్త్రీనొకన్యాయం పురుషునికొక న్యాయం లేకుండా ఇరువురికి ఒకేన్యాయం ఒకే ధర్మం అక్షరాలా నాలుగుపాదాల నడుస్తున్నది.
   
    ముకుందరావుకి పెళ్ళయి పదేళ్ళు దాటుతోంది. కడుపున ఒక్క కాయకాదుకదా చిన్న పువ్వుకూడా పుట్టలేదు.
   
    ఇంట్లో భార్య దృష్టిలో, అత్తగారి దృష్టిలో, అటు లోకులదృష్టిలో ముకుందరావు గొడ్డుమోతు వాడిలాగ మిగిలిపోయాడు. ఈ పదేళ్ళ కాపురంలో ముకుందరావు భార్య మలయవంతి ఇద్దరమ్మాయిలను కంది.
   
    ఆమెకదో గర్వం కాస్త భర్తమీద కోపం వచ్చినప్పుడల్లా "మీకు విడాకులిస్తా" నంటూ ఎగిరెగిరి పడుతుంది. ఆ ఇంట్లోనే తిష్టవేసిన అత్తగారి సూటీపోటీ మాటలకి అంతేలేదు.
   
    ఇంటి పరిస్థితి ఇలా వుంటే 'ఆఫీసులో' పరిస్థితి అంతకన్నా అద్దాన్నంగ ఉంది. కొత్తగా పరిచయమైన వాళ్ళు "నీకెంతమంది పిల్లలోయ్?" అని అడుగుతూంటే అతని తల సిగ్గుతో వాలిపోయేది. ఏదో తప్పు చేసినట్టు చాలా ఫీలయ్యేవాడు.
   
    పోనీ అతని స్థితి తెలిసినవాళ్ళు ఊరుకోవచ్చుకదా. ఊరుకుంటే మనుషులెట్లా అవుతారు? "ఈనెలైనా నెల తప్పావా?" అని ఒకడు "పెద్ద డాక్టర్ ఎవరికైనా చూపించుకొకపోయావా? ఏదైనా లోపం ఉంటే చిన్న ఆపరేషన్ తో డాక్టర్ సరిచేస్తాడు. భయంలేదు!" అంటూ మరొకడు "ఊళ్ళోకి 'అంబలంబ' అని ఒక స్వాములమ్మ వచ్చిందట. ఆవిడ చిటికెడు కుంకమిస్తే చాలు ఎంత పెద్దరోగమైనా ఇట్టే నయమౌతుందట అంతేకాదు. గొడ్డుమోతు వాళ్ళకి బిడ్డలు పుట్టడానికి వేరే పూజలు చేసి ఏదో మందు ఇస్తుందట. నే విన్నది చెబుతున్నాను ఆ తర్వాత మీ ఇష్టం. "అంటూ మరో కొలీగ్ ఉచిత సలహా ఇచ్చాడు.

 Previous Page Next Page