Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 34

    అన్నీ ముగించుకుని యింటికి చేరేసరికి సాయంత్రం అయింది.

    "ఈ దేశంలో ఎన్నిరకాల జీవితాలు! ఎన్ని రకాల బాదాపూరిత జీవితాలు తను చూసిన ఈ చిన్ని ప్రపంచంలోనే ఇన్ని రకాల మనుషులు ఉండగా మొత్తం ప్రపంచం చుడితే యెన్నిరకాల బాధాతప్తహృదయాల కన్నీటిగాధలు కానవస్తాయా?" అనుకుందామె.

    వెళ్ళేటప్పుడున్న ఉషారు తిరిగి వచ్చినప్పుడు పద్మిని ప్రియదర్శినికి లేకపోయింది. శంకర్రావు పార్వతమ్మ ఏమీ తినలేదు. ఆఖరికి కాఫీకూడా తాగలేదు. తిరిగి తిరిగి రావటం వల్ల వాళ్ళు మరింత అలసిపోయారు.

    ఇంటికి రాగానే_

    పార్వతమ్మ చూపమీద పడుకుండిపోయింది.

    శంకర్రావు పడక్కుర్చీలో కూర్చుని విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు.

    వారిద్దరినీ ఆ విధంగా చూస్తుంటే పద్మినికి ఏదో తట్టినట్టయింది. వెంటనే కిచెన్ లోకి దారితీసింది.

    కాఫీ తయారుచేయటం పద్మినికి వచ్చు. అప్పటికప్పుడే ఫ్రిజ్ లోంచి పాలప్యాకెట్ తీసి పాలుకాచి మూడు కప్పుల నిండుగా నెస్ కేఫ్ కలిపి వేడి వేడి కాఫీ కప్పులని ట్రేలో పెట్టుకొని ముందు గదిలోకి తీసుకువచ్చింది.

    "అంకుల్! కాఫీ తాగండి లేచి" అంది శంకర్రావుతో.

    "వద్దమ్మా!" దగ్గుత్తికతో సమాధానం యిచ్చాడు శంకర్రావు.

    "ఆంటీ! కాఫీ నేను తయారుచేసి తెచ్చాను లేచి తాగండి"

    "వద్దు"

    "వద్దమ్మా! వద్దు! బాగుంది. చూడండి ఆంటీ! అంకుల్! మీ యిరువురు ఉదయంనుంచి యేం తీసుకోలేదని తెలుసు. నేను కాఫీ టిఫిన్ తీసుకుంటే నేను భోంచేస్తే మీ యిరువురు సంతోషించారు. మీరు ఖాళీ కడుపుతో వుంటే నేను విచారించాలా సంతోషించాలా! ప్రస్తుతం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ఓపిక మీకు లేదు. నా చేత్తో ఇచ్చిన కాఫీ నేను స్వయంగా తయారుచేసి తీసుకువచ్చిన కాఫీ తాగారా సరేసరి లేకపోతే మీతోగాని ఈ యింటితో గాని నాకు సంబంధంలేదు. మీనుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నా ఆత్మ సంతోషించదు..." ఎందుకందో ఆ మాట అంది పద్మిని. కొన్ని మాటలు అనుకోకుండా నోటిలోంచి వస్తాయి. అలా ఎందుకు వస్తాయో ఎవరికీ తెలియదు.

    అలా వచ్చాయి పద్మిని నోట్లోంచి మాటలు.

    చటుక్కున అటు శంకర్రావు ఇటు పార్వతమ్మ లేచి కూర్చున్నారు. పార్వతమ్మ కళ్ళకి పద్మిని రూపం కనిపించలేదు. సునీత రూపం లీలగ కదలాడింది.

    "అమ్మా! నన్ను విడిచి వెళ్ళవద్దు" అంటూ పద్మినిని చేతులతో చుట్టేసి దగ్గరగా తీసుకొని ఒక్కసారిగా భోరుమంది పార్వతమ్మ. శంకర్రావు కళ్ళకి అడ్డంగా టవల్ పెట్టుకున్నాడు కన్నీరు పైకి రాకుండా.

    పద్మిని తెల్లబోయింది.

    ఆమె పెరిగిన వాతావరణం వేరు. ఇలాంటివి కనీవినీ ఎరుగదు. తను చదివిన నవలల్లోను తను చూసిన సినిమాల్లోనూ తప్ప ఎవరి నిజజీవితాల్లోకి వెళ్ళి చూడలేదు. వాళ్ళలా ఏడుస్తుంటే యేం మాట్లాడాలో అర్ధం కాకుండా పోయింది.

    "పార్వతీ! మనకోసం స్వయంగా అమ్మాయి కాఫీ తయారుచేసి తీసుకొని వచ్చింది. ఒ కప్పు నాకిలా యిచ్చి నీవూ తాగు" ముందుగా తేరుకున్న శంకర్రావు గంభీర్యముగా గూడార్ధంగ అన్నాడు.

    పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంది. ట్రేలోంచి కాఫీ కప్పు అందుకొని భర్తకి యిచ్చింది. రెండో కప్పు పద్మినికి యిచ్చింది. మూడోకప్పు తన చేతిలోకి తీసుకొని "మమ్మల్ని విడిచి ఎక్కడికీ వెళ్ళనని మాట యివ్వు. అలా అయితేనే కాఫీ తాగుతాను" అంది.

    "అదెలా సాధ్యం?" పద్మిని క్షణకాలం ఆలోచించింది.

    "మిమ్మల్ని విడిచి యెక్కడకీ వెళ్ళను. కాని నేను ఎక్కడికి వెళితే అక్కడికి నాతోబాటు మీరూ రావాల్సి వుండాలి" తిరకాసుగా తిరిగి అడిగింది పద్మిని.

    "అలాగే" వెంటనే అన్నారు శంకర్రావు, పార్వతమ్మ. దూరం ఆలోచించకుండా మాట యిచ్చారు పద్మినికి.

    ఆ తర్వాత ముగ్గురూ కాఫీ తాగారు.


                                    20


    వెనక వీధిలో వాళ్ళు ఏదో నోము నోచుకుంటూ ముత్తయిదువుగా పార్వతమ్మని పిలిచారు.

    ఆమె వారింటికి వెళ్ళింది.

    ఇంట్లో శంకర్రావు పద్మిని మిగిలారు.

    "అంకుల్! మీరేమీ అనుకోనంటే నేనొకటి అడుగుతాను" ఆమె నెమ్మదిగా అడిగింది.

    "నీవేమి అడగాలనుకున్నావో నేను ఊహించగలను" ముక్తసరిగా అన్నాడు శంకర్రావు.

    "మొన్నటిరోజునుంచీ ఆడగాలా వద్దా అని నాలో నేను ఎంతో మధనపడుతున్నాను. నిజం తెలుసుకోవటం వల్ల నేనేమీ చేయలేకపోవచ్చుగాని..." ఆ తర్వాత యేం మాట్లాడాలో తెలియక ఆగిపోయిందామె.

    శంకర్రావు అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నాడు. "చెపుతాను అడ్డు ప్రశ్నలు వేయకుండా వినమ్మా!" అన్నాడు.

    "ఊ..." అంది పద్మిని.

    శంకర్రావు ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి చెప్పసాగాడు.

    "మా పెళ్ళయింతరువాత చాలాకాలం పిల్లలు కలగలేదు. సంతానంకోసం తిరగని చోటులేదు. చూడని పుణ్యక్షేత్రం లేదు. పదిహేనేళ్ళ తర్వాత పార్వతి కడుపుతో ఉంది. విచిత్రమేమిటంటే మా కోరిక తీరేలా కవలపిల్లలు పుట్టారు. అదికూడా ఒక మగ, ఒక ఆడ. మా అదృష్టానికి ఎంతో పొంగిపోయాము. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు కలగలేదు.

    అమ్మాయికి సునీత అని అబ్బాయికి సాగర్ అని పేరుపెట్టుకున్నాము. వాళ్ళిద్దరికి పద్దెనిమిది ఏళ్ళు యింక్కొక్క రోజు అంటే తెల్లారితేనన్న మాట...వస్తామనగా ఆ రోజు సాయంత్రం ఘోరాతి ఘోరం జరిగిపోయింది. వారిరువురూ మాకు శాశ్వతంగా దూరం అయిపోయారు.

    అంతవరకు చెప్పిన శంకర్రావు మనసునిబ్బరపర్చుకోటానికి కాబోలు క్షణం ఆగి కళ్ళు మూసుకుని తెరుస్తూ నిట్టూర్చాడు భారంగా బాధగా.

    "నేను బిజినెస్ చేస్తూ వుండేవాడిని. డబ్బు బాగా సంపాదించాను. పిల్లలు కూడా చీకు చింత లేకుండా హాయిగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పద్దెనిమిదో పుట్టిన రోజుకి రెండురోజుల క్రితం సునీత వాళ్ళమ్మని గులాబ్ జామ్స్ చేసి పెట్టమని అడిగింది. ఆరోజు పార్వతికి వంట్లో బాగుండలేదు. "ఎళ్ళుండి మీ పుట్టినరోజుకదా ఆరోజు తప్పక చేస్తానంది."   

 Previous Page Next Page