Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 33

    "తొందరగా భోంచేస్తే మనం బయటికి వెళదాం" శంకర్రావు అన్నాడు. 

    "దానకేం భాగ్యం" అనుకుంటూ పద్మిని వంటింట్లోకి వెళ్ళింది.

    డైనింగ్ టేబుల్ మీద ఒకటే కంచం పెట్టివుంది. కొన్ని పదార్ధాలు చిన్న చిన్న డిష్ లలోను మరికొన్ని పదార్ధాలు చిన్న చిన్న గిన్నెలలో వండినవి అలాగే వుంచి బల్లమీద పెట్టడం జరిగింది.

    "అదేంటి ఆంటీ! మీరు, అంకుల్......" డైనింగ్ టేబుల్ మీదవున్న ఆ కంచాన్ని గిన్నెల్ని చూసిన తరువాత ఆపై మాట పద్మిని నోటిలోంచి రాలేదు. ఒక్కరికి మాత్రమే వంట చేసినట్టు గుర్తించింది.

    తను పెట్టుకొని తింటంఏమిటి? వారిద్దరూ భోజనం మానేయడమేమిటి? పద్మిని అనుకుంటుండగా పార్వతమ్మ మారుమాట్లాడకుండా ముందు గదిలోకి వెళ్ళిపోయింది. వెంటనే శంకర్రావు కిచెన్ లోకి వచ్చాడు.

    "ఈ పూట మీ ఆంటీ బదులు సరదాగా నేను దగ్గరుండి వడ్డిస్తాను నువ్వు తినాలి. ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దు సుమా!" అంటూ పద్మినీని చేయిపట్టుకొని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు.

    "ఇవాళ స్పెషల్స్ ఏమిటి? ఆంటీ యేం చేసిందో చెప్పనేలేదు" ఆమె అంటూంటే శంకర్రావు ఒక్కొక్క గిన్నెమీద మూత తీసి చూస్తూ గుత్తివంకాయకూర, పొదీనాకు పచ్చడి, ములక్కాడల పులుసు, బోలెడు జీడిపప్పు లేసిన సేమ్యాపాయసం, పులిహోర, చుక్కకూర పప్పు, గోంగూర పచ్చడి, బంగాళాదుంప వేపుడు, కొబ్బరికాయ పెరుగు పచ్చడి, గులాబ్ జామ్ లు... నెయ్యి, పెరుగు మామూలే..." అని ఒక్కొక్క పదార్ధం పేరు చెబుతూ అన్నింటిని కాస్త కాస్త అన్నంతో పాటు వడ్డించాడు. 

    "బాప్ రే! ఇన్ని తినగాలనా అంకుల్!" పద్మిని కళ్ళు పెద్దవిచేసి ఆశ్చర్యంగా అడిగింది.

    "నీకిష్టమైనవి కడుపారా తిను. ఇష్టం కానివి నాలిక్కి రాచుకొని వదిలేయ్. పార్వతి చేసినందుకు దాని తృప్తి కోసం" అన్నాడు శంకర్రావు.

    ఆ తరువాత పద్మిని మాట్లాడలేదు. మీరిద్దరూ భోంచేయరా?" అని, కూడా అడగలేదు. రోజూ ఒకటికి రెండుసార్లు కాఫీ తాగేవాళ్ళు ఆ పూట తాగలేదని గమనించి కూడా గమనించనట్లు ఉండిపోయింది.

    పద్మిని అన్ని పదార్ధాలూ రుచులు చూస్తూ ఎంతో కొంత తిన్నది. "ప్రతి పదార్ధమూ బాగుందకుల్! కాని ఇన్ని పదార్ధాలు ఒకేసారి తింటానికి వీల్లేకుండా నా పొట్ట చిన్నదైపోయింది" నవ్వుతూ అని భోజనం ముగించింది.

    ఇరువురూ ముందు గదిలోకి వచ్చారు.

    పడక్కుర్చీలో నడుం వాల్చిన పార్వతమ్మ వీళ్ళని చూసి లేచి కూర్చుంది.

    "పార్వతీ! నువ్వు చేసినవన్నీ పద్మినీకి బాగున్నాయట. ఒక్క పదార్ధమైనా చెడిపోకుండా కుదరటమన్నది నీ చేతి మహత్యం. పెద్ద పెద్ద వంటవాళ్ళే పది రకాల పదార్ధాలు చేస్తే ఒకటి రెండు పదార్ధాలతో ఉప్పో, కారమో ఎక్కువై కుదరక చెడిపోతాయ్."

    శంకర్రావు మాట పూర్తిచేయకముందే "చాల్లేండి మీ మాటలు వంట వండేవారికి తినేవారికి ఇరువురికి దిష్టి తగిలేలా వున్నాయి" అంటూ పార్వతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అంతేగాని పద్మినిని చూడలేదు, ఆమెతో మాట్లాడనూ లేదు.

    "అరగంటలో ఆటో వస్తుంది మనం వెళ్ళాలి. భోజనం చేసిం తరువాత పది నిమిషాలైనా విశ్రాంతి తీసుకోకపోతే శరీరం బరువుగా భారంగా వుంటుంది. పడుకో_ నిద్రపోతే లేపుతాలే" అన్నాడు శంకర్రావు.

    "విశ్రాంతి కావల్సింది పెద్దవాళ్ళకి నాకేమిటి అంకుల్!" నవ్వుతూ అంది పద్మినిప్రియదర్శిని.

    "అంతే అంటావ్!"

    "అంతే."

    శంకర్రావు పద్మిని అలా మాట్లాడుకుంటున్నారు. కాని ఆమె కర్ణేంద్రియాలు అతి చిన్న శబ్దాన్ని కూడా ఆలకిస్తూ కిచెన్ లో గిన్నెలమూతలు తాలూకా చప్పుడుని వింటున్నాయి.

    తను చేసిన పదార్ధాలు పద్మిని సరీగ తిందో లేదో అని పార్వతమ్మ అతి మెల్లగా గిన్నెలు, డిష్ లు, తాలూకా మూతలు తీసిచూసి మళ్ళీ పెడుతున్నది.

    ఆ విషయం బాగానే పసిగట్టింది పద్మిని.

    పది నిమిషాలు అయిందో లేదో ఆటోవచ్చి వాకిట్లో ఆగింది.

    శంకర్రావు, పార్వతమ్మ, పద్మిని ఆటో యెక్కారు. ఇల్లు తాళంవేసి, ముందే మాట్లాడి ఉంచుకోవటంవల్ల వీళ్ళు ఎక్కంగానే ఆటో బయలుదేరింది.

    ఆటోలో కూర్చున్న ముగ్గురూ మాట్లాడుకోలేదు. ఎవరికివారే గంభీర్యంగా ఉండిపోయారు.

    ఆటో వెళ్ళి ముందుగా అనాధ బాల బాలికలు వుండే ఆశ్రమం దగ్గర ఆగింది. ముగ్గురూ ఆటో దిగారు.

    ఆశ్రమం నిర్వాహకులు యిద్దరు పనివాళ్ళు యెదురొచ్చారు. నమస్కారాలు ప్రతి నమస్కారాలు పూర్తి అయ్యాయి.

    వాళ్ళలో ఒకాయన రెండురోజుల క్రితం యింటికి వచ్చి డబ్బు తీసుకువెళ్ళిన ఆయన అని ఆమె గుర్తించింది.

    ఆ తర్వాత_

    పెరుగు అన్నం [దద్దోజనంలాగా తిరగమోత పెట్టి చేసింది] కప్పు కప్పు చొప్పున ఆకులోపెట్టి శంకర్రావు యిస్తుంటే పార్వతమ్మ ఆడ మగ పిల్లలకి తన చేతులతో పెరుగు అన్నం పెట్టిన పెద్ద డిష్ ఖాళీ కాకుండానే పిల్లలందరికి పెట్టటం అయింది. పెరుగు అన్నంతోపాటు తలా ఒక స్వీటు పెద్దసైజువి, ఒక అరటిపండు ఒక యాపిల్ యివ్వటం జరిగింది.

    పార్వతమ్మ శంకర్రావు పద్మిని ముందే ఆ పిల్లలంతా ఆవురావురుమంటూ ఆప్యాయంగా పెట్టినవి తినేసారు.

    పిల్లలని పలకరించి పెద్దల దగ్గర శలవు తీసుకుని మళ్ళీ ముగ్గురూ ఆటో ఎక్కారు.

    తల్లి తండ్రిలేని ఆ అనాధ పిల్లలని చూశాక వాళ్ళ చూపులు... వాళ్ళు ఆవురావురుమంటూ తింటున్న తీరు...పద్మిని హృదయాన్ని కలచివేశాయి. "ఇంత చిన్న వయసులో వాళ్ళేం పాపం చేసుకున్నారని తల్లి_తండ్రి కాదు కదా నా అనేవారుకూడా లేకుండా చేశావ్ భగవాన్!" అని మౌనంగా ప్రశ్నించింది.

    ఈ ప్రశ్నకి సమాధానం ఎవరిస్తారు?

    "ఇహపై నాకు చాతనయినంతలో నా శక్తికి తగ్గట్టు అనాధ పిల్లల ఆశ్రమాలకి చందాలిచ్చి ఆదుకుంటాను. యింకా వీలయితే మరోరకంగా మరోరకంగా సాయపడతాను" అని అప్పటికప్పుడే పద్మిని ప్రియదర్శిని గట్టి నిర్ణయం ఒకటి తీసుకుంది.

    ఈ తఫా ఆటో అనాధ ఆడపిల్లలు ఉన్న చోటుకి. అనాధలు అంటే పిల్లలు ఉండి_లేక రెండు విధాలా పిల్లలతో బాధపడివారు వెళ్ళకొడితే కొందరు. వారంతట వారుగా యింటినుంచి బయటికి వచ్చేసిన వృద్ధులు ఉన్న ఆశ్రమానికి... సరీగ మూడు చోట్ల ఆటో ఆగింది.

    వయసొచ్చిన పిల్లలకి భోజనాలు, వృద్ధులకి పాలు, పళ్ళు అలా వారి వారి యిదిని బట్టి పార్వతమ్మ శంకర్రావు పంచిపెట్టారు.

 Previous Page Next Page