"ఎళ్ళుండి తింటానో లేదో ఎవరికి తెలుసు? మనసైనప్పుడే తినాలి" అంది సునీత.
"ఎప్పుడు ఏదడిగితే నేను పెట్టలేదు! యెలాగూ ఎల్లుండి పుట్టినరోజు ఆరోజు చేయొచ్చులే అని అన్నాను. పైగా ఒంట్లో నలతగా వుంది. కడుపులో ఏదో ఆరాటం అది మంటో ఏమిటో తెలియటంలేదు" అంటూ పార్వతి ఏమిటేమిటో విసుక్కుంటూ మాట్లాడింది.
ఆ కారణంగా సునీతకి కోపం వచ్చింది. "సాగర్ అడిగితే చాలు ఏదైనా చేస్తావు. నేనడిగితే మాత్రం..." అంటూ గొణిగింది.
ఆ తర్వాత గులాబ్ జామ్ చేస్తానంటూ పార్వతి లేచింది. "వద్దులేమ్మా! అడిగాను. కాస్త కోపం వచ్చింది అంతేకదా! ఇప్పుడు కోపం పోయింది. నా పుట్టినరోజునాడే చేద్దువుగాని సరేనా?" అంటూ తల్లిని చేయకుండా తనే ఆపుజేసింది.
ఇంక సాగర్ విషయం. ఆరోజు నా దగ్గరకువచ్చి "డాడీ! అర్జంటుగా అయిదువందలు కావాలి. నా ఫ్రెండ్ కి అవసరం వచ్చిందని" అడిగాడు...
"నీకు డబ్బు విలువ తెలియదు సాగర్ అడిగిన వాళ్ళకి అడిగినట్లు యిస్తుంటావు. నీ వీక్ నెస్ తెలుసుకుని వాళ్ళేదో కట్టుకథ చెప్పి అప్పుగా డబ్బు గుంజుతుంటారు. తిరిగి యిచ్చేదిమాత్రం లేదు. వీడు యిచ్చేరకమేనా?" అన్నాను.
"వాడికి ఎవ్వరూలేరు! తల్లికి జబ్బు చేసిందట అవసరం అని అడిగాడు. తప్పకుండా తిరిగి యిస్తాడు. కాని యిప్పుడు కాదు. వాడి చేతిలో డబ్బున్ననాడు వాడి సంసారం యిబ్బందుల్లో ఉంది. వాడి అక్క ఏదో కుట్టుమిషను తొక్కి సంపాదిస్తున్నది. చెల్లెలు గుడ్డల షాపులో సేల్స్ గరల్. నెలజీతం రెండొందలు. తమ్ముడికి కాళ్ళు లేవు."
"ఇంక చెప్పకు చాలా పెద్ద కథే. నీ మాట కాదనలేక ఈ ఒక్కసారికి యిస్తున్నాను. మళ్ళీ అడగవద్దు. ఈ దేశంలో అనాధలకి కొదవలేదు" అంటూ విసుక్కుంటూ యిచ్చాను.
"ఎవరికైనా అవసరం అయితే యివ్వాలనిపిస్తే నా పాకెట్ మనీలో యిస్తాను. ప్రతిసారి అడిగి మిమ్మల్ని బాధపెట్టనులే డాడీ!" అన్నాడు సాగర్.
నేను పార్వతి ఎవరని ఎప్పుడూ కష్టపెట్టం. అలా అని డబ్బుని మంచినీళ్ళుగాను వాడం. అవసరానికి ఎంతో మందికి సాయం చేశాము. పాత్ర నెరిగి దానం మంచిది కాదు. ఆ సత్యం తెలిసిన నేను పార్వతి మంచి తనంతోనే జాగ్రత్తగా వుండేవాళ్ళం. అంతేగాని ఎవరిని వంచించేవాళ్ళం కాదు.
తెల్లారితే నా పిల్లలిద్దరి పుట్టినరోజు. రేపటిరోజు ఏమేమి చేయాలి ఎలా సరదాగా గడపాలి అని...ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర చర్చ మొదలుపెట్టాము. ఆ ఉదయం టిఫెన్ గా ఇడ్లీ చేసింది పార్వతి.
ఇడ్లీ అంటే పిల్లలిద్దరికి చాలా యిష్టం. సునీతకయితే మరీ మరీ యిష్టం. కబుర్లు చెప్పుకుంటూ తింటున్నామేమో తెలియకుండా చాలానే తినేశాము. మళ్ళీ మళ్ళీ తినే అవసరం లేనని ఇవాళే తినేశానమ్మా! మళ్ళీ యిప్పుడప్పుడే చేయవద్దు" అంది సునీత.
"ఇడ్లీ తింటే చచ్చిపోవులేవే!" నవ్వుతూ అన్నాడు సాగర్.
ఇలా అన్నీ అపశకునం మాటలే. వారంక్రితం నుంచి పెద్ద కారణం లేకుండానే మాటల మధ్యలో సాగేవి. వాటిని మేము పట్టించుకోలేదు.
ఆ సాయంత్రం సునీత సాగర్ రేపు పుట్టినరోజు నాటికి వారికి కావలసినవి కొనుక్కు రావడానికి బజారు వెళ్ళారు. కారు తీసుకెళ్ళమని చెప్పారు. "అక్కర్లేదు డాడీ! సరదాగా ఈ పూట నేను, సునీత బస్సులో తిరుగుతాము. రేపటిరోజు మా యింటికి రావాలని చిన్న టీపార్టీ యిస్తున్నానని ముందే ఫ్రెండ్స్ కి చెప్పేయటం జరిగింది. యింక ఎక్కడికీ వెళ్ళేపని లేదు. ఓన్ లీ షాపింగ్ అంతే" అంటూ వెళ్ళారు.
అలా వెళ్ళినవాళ్ళు ఎంతకీ తిరిగిరాలేదు. "మొదటి ఆట సినిమాకి వెళ్ళారా? ఏ ఫ్రెండింట్లోనైనా కూర్చొని కబుర్లాడుతున్నారా?" అనుకొన్నాము.
రాత్రి పది గంటలవరకు నేను, పార్వతి అలా అనుకొంటూ మామూలుగానే వున్నాం. పదిగంటలు దాటింది. మాలో ఆందోళన మొదలయ్యింది. పార్వతి పోరు భరించలేక వాడి ఫ్రెండ్స్ యిళ్ళకి ఫోన్ చేశాను. అలాగే సునీత ఫ్రెండ్స్ యింటికి కూడా. "సునీత, సాగర్ రాలేద"ని అందరి దగ్గరనుంచి ఒకటే సమాధానం వచ్చింది. వీళ్ళ ఫ్రెండ్స్ లో కొందరికి ఫోన్లేలేవు. ఎక్కడికని వెళ్ళను? ఎవర్నని అడగను? "వాళ్ళని యెవరైనా కిడ్నాప్ చేశార"ని అనుకొందామంటే వాళ్ళిద్దరూ చిన్న పిల్లలు కాదు. మాకెవరూ శతృవులు లేరు. పోలీసులకి ఫోన్ చేద్దామనుకొన్నాను. సిల్లీగా అనిపించింది. కాని మా యిరువురికి మాత్రం ఆందోళనగానే ఉంది.
రాత్రి ఒంటిగంటవేళ నేను కారు వేసుకొని "నాలుగు వీధులు తిరిగొద్దాము. వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురినీ కలుసుకొని వద్దాము" అనుకొన్న వేళ ఫోన్ మోగింది. సాగర్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు.
"అంకుల్! నేను రెండో ఆట సినిమా నుండి వస్తూండగా ఓ విషయం తెలిసింది. ఈ సాయంత్రం ఒక సిటీ బస్సు గేటు దాటుతూండగ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొందట. బస్సు నాలుగు పల్టీలు కొట్టి రాళ్ళగుట్ట మీంచి దొర్లుతూ పల్లంలోకి పడిపోయింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న కొందరికి మాత్రం గాయాలు తగిలాయట. చాలామంది మరణించటం జరిగిందట. నేను వచ్చే దోవ అదే కాబట్టి ఆ యాక్సిడెంట్ స్థలానికి వెళ్ళాను. మీరొకసారి యిక్కడికి రండి" అంతవరకే చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్ ఫ్రెండ్.
నా మనసు కీడును శంకించింది.
"సాగర్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఓసారి వెళ్ళొస్తాను" అని మాత్రమే చెప్పి గుండెను చిక్కబట్టుకుని యాక్సిడెంట్ జరిగిన చోటుకి కారుతో వెళ్ళాను. నే వెళ్ళేసరికి సునీత, సాగర్ అక్కడే వున్నారు. కానీ...సజీవంగా కాదు... "శంకర్రావు ఆపైన చెప్పలేక చాలాసేపు మౌనంగా వుండిపోయాడు. ఆనాటి వాళ్ళ రూపం కళ్ళకి కానవస్తూ మరింత బాధకు గురిచేసి వుంటుంది.
పద్మిని ప్రియదర్శినికి అసలు కథ అప్పుడర్దమయింది. ఏం మాట్లాడాలో తెలీక తనూ మౌనంగ వుండిపోయింది.
ఆ తరువాత చెప్పడానికి ఏమీ లేదు. తెల్లవారింది సునీతది, సాగర్ ది పుట్టిన రోజు. పదిహేడు నిండిపోయాయ్. కాని వాళ్ళకి నిండిపోయింది పదిహేడేళ్ళు కాదు...చిన్న వయసులోనే నిండు నూరేళ్ళు. ఈ భూమ్మీదకి వకేసారి వచ్చారు. కలిసి నిర్ణయం తీసుకున్నట్టు వకేసారి వెళ్ళిపోయారు.
ఆ ఉదయం పార్వతి సునీతది, సాగర్ ది ఆనవాలు లేని రూపాలని చూసింది. చూస్తూనే విరుచుకుపడిపోయింది. కాని పడుచు ప్రాణాలకన్నా ముసలి ప్రాణాలు గట్టివి. తమాషా ఏమిటంటే ఇంత ఘోరం జరిగినా మేమిద్దరం బ్రతికే వున్నాం. ఆ తరువాత జరగవలసినవన్నీ జరిగిపోయాయ్. పిల్లలు తిరిగిన ఆ యిల్లు, ఆ జ్ఞాపకాలు భరించలేక నాకున్న ఆ పెద్ద మేడను అమ్మేశాను. కార్లు, షేర్లు అన్నీ అమ్మేశాను. బిజినెస్ చేయటం పూర్తిగా మానేశాను. అక్కడ్నించి దూరంగ ఇక్కడికి వచ్చి ఈ చిన్న యిల్లు కొనుక్కుని కాలక్షేపం చేస్తున్నాను. ఇది జరిగి మూడేళ్ళయింది.


