Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 32

    దీక్ష చేయి పైకెత్తి దించుతూ "హాష్ ష్ ష్" అంది.

    టక్కున ఇద్దరమ్మాయిలు ఆగిపోయారు. వెనక్కి వెనక్కి నడుస్తూ వెళ్ళి యధాస్థానంలో నుంచున్నారు. మరో ఇద్దరు అమ్మాయిలు ముందుకు వచ్చారు.

    "ఇప్పుడు మీరు "కరాటే" పోరాటం తిలకించారు. అలాగే "జూడో" "కుంగ్ పూ" కూడా ఆ విచిత్ర పోరాటం కూడా మరికొద్ది సేపటిలో చూడబోతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి "కుంగ్ పూ" చూడబోతున్నారు. "కుంగ్ పూ" పోరాటం కూడా కరాటే కి సంబంధించినది. అయితే కుంగ్ పూలో విశేషం, ప్రత్యేకత ఏమిటంటే కేవలం వేళ్ళతోనే పోరాటం. సాధనతో గట్టిపడిన వేళ్ళు కుంగ్ పూ పోరాటంలో ఇనుపచువ్వల్లా మారిపోతాయి. వేళ్ళని మాత్రమే వుపయోగించి ఎముకలని చితక గొట్టవచ్చు. శత్రువు శరీరంలోకి చురకత్తిలా దూసుకుపోయి గాయపరుస్తుంది. వేలి దెబ్బకి అయిన గాయంలోంచి, కత్తిదెబ్బ తగిలినట్లు ధారగా నెత్తురు కారటం నిజంగా అద్భుతమే. వేళ్ళు వజ్రాయుధాల్లాగా మారటం కనీ వినీ ఎరుగని వింత ఎంత మాత్రం కాదు. మన చేతలే మన చేతులని వజ్రాయుధాల్లాగా మారుస్తాయి. అదే మీరు చూడబోతున్నారు." అంది దీక్ష.

    ఇప్పుడు ఆ అమ్మాయి లిద్దరూ కేవలం వేళ్ళు మాత్రమే వుపయోగిస్తూ కుంగ్ పూ పోరాటం సాగించారు.

    అది చూస్తూ "అద్భుతంగా వుంది" అనుకున్నారు ఎవరికి వారే.

    కుంగ్ పూ పోరాటం కూడా రెండు నిమిషాలు జరిగింది.

    ఆ తర్వాత.

    ఇలాంటివి చాలా జరిగాయి. వంటరి మనిషి ఏకకాలంలో అరడజను మంది శత్రువులతో పోరాడి గెలవటం, గాలిలోకి లేచి ఎగిరి తన్నటం, రెండు చేతులు కట్టుకుని చేతులు ఏ మాత్రం ఉపయోగించకుండా వంగిలేస్తూ పక్కలకి తప్పుకుంటూ కేవలం కాళ్ళు మాత్రమే వుపయోగించి ప్రత్యర్ధులని పడేయటం, వ్రేళ్ళనే చాకుల్లా చేసి పోరాడటం ఇలాకొన్ని....

    జూడో పోరాటంలో పద్ధతులు హెడ్ నట్టింగ్ ఆర్ట్. అనగా కేవలం గొర్రె పొటేలులాగా తలతో కుమ్మటం. బలమైన దారాలతో బరువైన రాళ్ళనికట్టి ఆ రాళ్ళని వేళ్ళతో దారాలు మాత్రమే వేలికి చుట్టుకుని పైకి ఎత్తటం. కత్తిలా చేయి చాచి ఐసు ముక్కని రెండుగా పగల గొట్టటం. అలాగే ఇటుక ముక్కలని పగల గొట్టటం, బలమైన చెక్కని ఒక్క దెబ్బతో ముక్కలు ముక్కలుగా చేయటం.. ఇలా చాలా రకాలు చేసి చూపించారు.

    దేనికదే అద్భుతంగా వుంది.

    ప్రదర్శనముందు తర్వాత "ఇది హినరిట్. దీనిని సుకటె అంటారు. ఇది కితికోము, ఎదుటి వారి మోకాలి మీద ముందు నుంచిగాని తన్ని ఎముకలు విరిగేలా చేయటం. అలాగే దిరిగాసి అన్నది దెబ్బకు దెబ్బతీసే ప్రక్రియ. దీని పేరు మోకగిరి. ఆత్మరక్షణకి. మడమతో దెబ్బ తీయవచ్చు. దీనిని అసికబె అంటారు. ఇదిగోయిదే టోచీగసి తప్పించుకునే అద్భుత పధ్ధతి..." అంటూ దీక్ష ఆయా పోరాట వివరణలు తేలికపాటి భాష ఉపయోగిస్తూ అందరికి అర్ధమయేలా చెప్పింది.

    వినటానికి చూడటానికి బాగున్నా ఆ ప్రదర్శన మొత్తం పదిమంది అమ్మాయిలు మాత్రమే పాల్గొని చేసి చూపించారు.

    ఇందాక రౌడీవేషాలు అత్త మామ భర్తల వేషాలు వేసింది కూడా వీళ్ళే. ఓ సెట్టు స్టేజీ దిగేసరికి రెండో సెట్టు పైపై మేకప్ వేసుకుని రెడీగా వుంచేవాళ్ళు. వాళ్ళు దిగటం వీళ్ళు ఎక్కటం దిగేసరికి మళ్ళీ వాళ్ళు రెడీ అయి స్టేజీ ఎక్కటం చాలా క్విక్ గా చేశారు. వాళ్ళ పోరాటాలు కూడా అలాగే వున్నాయి.

    అంతా బాగానే వుంది.

    దీక్ష నాటకం లాంటి ఆ ప్రదర్శనలోను పాల్గొన లేదు. ఈ వింత వింత పోరాటాల్లోను పాల్గొనలేదు. ఇంతవరకూ నిలబడి కేవలం వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అంతే!

    మరి షోకేస్ లో బొమ్మలాగా నిలబడటానికా కరాటే దుస్తులు ధరించింది?

    అసలు యిదంతా ఏమిటి?

    ఈ అనుమానం వాళ్ళందరిలో ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్న సరి అయిన టైములో దీక్ష ముందుకు వచ్చింది.

    అందరి చూపులు దీక్షపై నిలిచాయి.

 Previous Page Next Page