Previous Page Next Page 
అహల్య పేజి 32


    'ఇన్ని సంవత్సరాలుగా మన లోకంపై దండెత్తి మిమ్మల్ని ఓడించి యీ సింహాసనాన్ని చేజిక్కించుకోని రావణుడు ఇప్పుడు దండెత్తుతాడని భయమెందుకు స్వామీ?'


    'రాక్షసుల బుద్ధులు ఏ క్షణానికి ఎలా మారతాయో ఎవరు చెప్పగలరు దేవీ! మేం వారి జ్ఞాతులం కదా! దాయాది మాత్సర్యం వారి రక్తనిష్ట గుణం!'


    'కానివ్వండి! కానున్నది కాక మానదు. ఏదో ఆపద రాగలదని ఇప్పటినుంచే చింతించడం ఎందుకు స్వామీ!'


    'చింత కాదు! ఆలోచన!'


    'ఆలోచన అధికమైతే అదే చింత. అదే దిగులు!'


    'ఇక ఆలోచనలకు స్వస్తి!'


    'ఏమిటి స్వామీ?'


    'తమరొచ్చారు కదా!'


    'వస్తే....'


    'అర్ధాంగి చెంతనే ఉంటే ఆలోచనలెలా వస్తాయి? అవి అంతర్ధానమైతేనే కదా ఆనందం!'


    శచీదేవి నవ్వింది. ఇంద్రుడు శచీదేవి చేయి అందుకుని అటు కల్పవృక్షం వైపు నడవసాగాడు.


                                      21


    ఆశ్రమంలో శిష్యులకు విష్ణుసహస్రనామం నేర్పుతున్నాడు గౌతమమహర్షి. రావణుడి బాధలను సహించలేక దేవాధి దేవతలంతా శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకుని ఆయన అభయం ఇచ్చాక అప్పుడు నారదుడు తన మధురమైన కంఠంతో గానం చేసిన విష్ణుసహస్రనామ స్త్రోత్రం అందరూ తొలిసారి వింటున్న అనుభూతి చెందారు.


    మంత్రాలు ఎప్పుడో సృష్టించబడి ఉంటాయి. వాటిని మహర్షులు దర్శిస్తారు. ఆ మంత్రాధి దేవతను దర్శిస్తారు. దానిని లోకానికి అప్పుడు వెల్లడిస్తారు. వారు మంత్ర ద్రష్టలే! కానీ మంత్ర సృష్టికర్తలు కారు.


    అలాగే విష్ణుసహస్రనామావళి కృతయుగం నుంచీ వస్తున్నది. మహర్షుల స్మృతి పథంలో నిక్షిప్తం చేయబడి శిష్యులకు పాఠంగా వినిపించబడుతూ ఉంది. ఈ త్రేతాయుగంలోనూ అదే ఆచారం కొనసాగుతూంది.


    కానీ- వైకుంఠంలో నారదుడు విష్ణుసహస్రనామం పఠించాక అది మళ్ళీ అందరికీ గుర్తు చేసినట్లయింది.


    ఆపదలను పోగొట్టేది, అనుకున్న పని అనుకూల పడేలా చేసేది- సానుకూలమై, సత్వర ఫలితాల నిచ్చేది, సమస్త కార్యసాధనకు సులువైనదీ, సూక్ష్మ మైనదీ అయిన విష్ణు సహస్రనామ పారాయణం మహిమంతా అందరికీ గుర్తుకు వచ్చింది.


    దేవర్షి నారదుడు లోక కళ్యాణార్ధం ఎన్నెన్నో చేస్తూంటాడు. అది ఆదిలో కొందరికి కంటిగింపుగా ఉన్నా చివరికి అది కంటికింపుగానే పరిణమిస్తుంది. మనస్సుకి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. ఏది ఏమైనా ఆయన కోరేది సర్వలోక సంక్షేమం. ఎంతయినా సృష్టికర్త కుమారులు కదా!


    ఆ విష్ణుసహస్రనామాన్ని విద్యార్థుల చేత కంఠస్థం చేయిస్తూ, ఒక్కో నామం విశిష్టతనూ- ఆ పేరులోని అంతరార్ధాన్ని చక్కగా వ్యాఖ్యానిస్తున్నారు గౌతమమహర్షి.


    'స్వరయుక్తంగా పాడాలా గురువర్యా!' అడిగాడు ఓ శిష్యుడు.


    'సామవేదంలో చెప్పిన సంగీత గమకాలు సరిగమపదని లతో స్వరబద్ధం చేసి చదవాలా?' మరో శిష్యుడు అడిగాడు.


    చిరునవ్వు నవ్వారాయన 'ఇది మంత్రం కాదు. సామం కాదు. గానం చేయడానికి ఇది స్తోత్రం. భగవంతుడి సహస్రనామావళి ఇది. దీన్ని స్తోత్రం చేస్తే చాలు! ఆర్తితో పఠించే వాడికి ఆత్మవేదనే ఒక రాగాన్ని కల్పిస్తుంది. దానికి ప్రత్యేక స్వర రచన లేదు.'


    'వీటిని పఠిస్తే ఏదైనా సాధించవచ్చా గురువర్యా?'


    మరో శిష్యుడడిగిన ప్రశ్నకి మందస్మితంతో అన్నారు 'ఏదైనా అంటే ఏమిటీ? దాని అంతరార్ధం! చిరంజీవిగా చిరంజీవి కావాలనా? లేక కైలాసానికో, వైకుంఠానీకో, సత్య లోకానికో సంకల్పమాత్రంగా సాగి పోవాలనా? ఖేచర గమనం కావాలనా? రాజ్యాధిపత్యం సిద్ధించాలనా?'


    సిగ్గుపడ్డాడు శిష్యుడు. అవేవీ కాదన్నట్టు తలూపాడు.


    'సాధ్యాసాధ్యాలుంటాయి. దుస్సాధ్యాలుంటాయి. అసాధ్యాలుంటాయి' మృదువుగా అన్నారు గౌతములు. శ్రమించి సాధించవచ్చు. కొన్ని కొన్ని సులువుగా సాధ్యపడతాయి. మరికొన్ని కష్ట సాధ్యాలు. కొన్ని సాధించలేం. అమరత్వం మన సొత్తు కాదు. అమరలోక గమనం అందరి సొత్తూ కాదు. మోక్షం సాధించవచ్చు. విద్యలు సాధించవచ్చు. అనారోగ్యం కలిగితే ఆరోగ్య భాగ్యాన్ని పొందవచ్చు.'


    శిష్యులు వింటున్నారు.


    'దీర్ఘకాలం వ్యాధులతో బాధపడే వారికి ఆ వ్యాధి నయమవుతుంది. ఆగర్భ దరిద్రుడైనా సరే యీ విష్ణుసహస్రనామాన్ని అనునిత్యం పారాయణం చేస్తూ, ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తూ, లక్ష్మీ అష్టోత్తరం సాయంవేళ పఠిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.'


    గౌతముడు చెపుతుండగా మొదట ప్రశ్నించిన శిష్యుడు ఆత్రంగా వింటున్నాడు. గౌతముడు ఆగాడు.


    'గురువర్యా!'

 Previous Page Next Page