Previous Page Next Page 
మధుపం పేజి 32


    "ఇప్పుడు ఇండియాలోనూ హైవేలు అరులైన్లు , నాల్గు లైన్లు వేస్తున్నారు. ప్లై ఓవర్లు కడ్తున్నారు. కాని ఈ నాణ్యత ఎక్కడుంది .... అక్కడ విపరీతంగా కార్లు పెరిగాయి. ట్రాఫిక్ జామ్ లు వచ్చాయి. ఇలా పకడ్భందీగా ట్రాఫిక్  ఎక్కడుంది ." క్రుష్ణశార్మగారన్నారు.
    "నాన్నగారు - మనవాళ్ళు రోడ్లు వేస్తారు గాని మెయిన్ టేనేన్స్ ఏది - వేసిన నాల్గు రోజులకే ఓ వర్షం కురవగానే కంకర తేలుతుంది. ఇక్కడ ప్రతీ ఏడాదీ వింటర్ పూర్తీ కాగానే రోడ్లు మరమ్మత్తులు క్రమం తప్పక చేస్తారు ."
    'చెప్పకురా మన దేశం గురించి - రోడ్లమీద పెట్టె డబ్బులో పాతిక వంతు రోడ్డుకి చేరుతుంది. మిగతాది కాంట్రాక్టర్లు ఆఫీసర్లు, రాజకీయనాయకుల జేబుల్లోకి . ఎక్కడ చూసినా అవినీతి - డబ్బు తినడం తప్ప ఎవరికీ ఏం పట్టదు . అందుకే ప్రతి డిపార్ట్ మెంటు అలా ఏడుస్తుంది " - విరక్తిగా అన్నాడు కృష్ణశర్మ.
    కబుర్లు చెప్పుకుంటుండగానే ప్రయాణం చేసినట్టే అనిపించకుండా మూడు గంటల్లో బోస్టన్ చేరింది కారు. '        పిల్లలు, సునీత కారు దగ్గిర కొచ్చారు.
    "నమస్కారం అత్తయ్యగారు మామయ్యగారు " కన్నడ అమ్మాయి సునీత తెలుగు పట్టి పట్టి మాట్లాడుతుంటే తమాషాగా అనిపిస్తుంది. పిల్లలిద్దరూ కాస్త దూరంగా నిలబడి చూస్తుంటే వర్ధనమ్మ ముందుకు వెళ్ళి పిల్లలిద్దర్ని చెరో చేత్తో దగ్గరికి లాక్కుంది. "శరత్, శ్రావణీ మామ్మని గుర్తున్నానా" అంటూ పలకరించి , "సునీతా బాగున్నావా , ఈరోజు ఆఫీసు కెళ్ళవా" పలకరించింది.
    "ఇప్పుడే వచ్చానత్తయ్య . రండి లోపలికి."
    అందరూ తలో సామాను మోసుకు లోపలి కెళ్ళారు.
    నాల్గు పడకగదుల ఇల్లు ఆ ఫర్నిచర్, పరదాలు, తివాచీలు అలంకరణ సామాగ్రి అన్నీ అబ్బురంగా చూస్తూ గదులన్నీ ఓసారి తిరిగి వచ్చింది. "ఇల్లు బాగుందిరా కిందటి మాటు ప్లాట్ కంటే ...." అంది.
    "బాగుంది అది అద్దె అపార్ట్ మెంటు - ఇది స్వంత ఇల్లు...." - భార్య అమాయకత్వానికి నవ్వి అన్నారు కృష్మశర్మ.
    "పదండి నాన్నా, మీ గది చూపిస్తా ... ఫ్రెష్ అయి వస్తే భోం చేద్దాం ....' అన్నాడు వేణు.
    కోడలు ఫ్రిజ్ తెరచి ఏవేవో జిప్ బ్యాగులు తీసి టేబుల్ మీద పెడ్తోంది.
    "ఏమిటమ్మా ఇప్పుడు వండాలా - పొద్దుట కొన్ని చేసి పెట్టుకోకపోయావా -" అంది వర్ధనమ్మ.
    "అబ్బే అక్కరలేదత్తయ్యా.... అన్నీ ఉన్నాయి. సంబారు గడ్డ బయట పెట్టా, దొండకాయ కూర తింటారా, వంకాయ కొత్తిమీర కారం కూర తింటారా!" - ఐసు కట్టిన జిప్ లాన్ బ్యాగులు చూపిస్తూ అడిగింది. "రాత్రి వంకాయ వద్దులే, దొండకాయ చెయ్ ....' అంది, రెండు బ్యాగులు ఫ్రిజ్ లోంచి తీసి, రైస్ కుక్కర్ అన్ చేసి, "మీరెళ్ళి స్నానం చేసిరండి. ఈలోగా అన్నీ వేడి చేస్తా" అంది కోడలు.
    కొడుకు వెంట వెడ్తున్న కృష్ణశర్మ 'సాంబారు గడ్డ ' అన్నమాట విని వెనక్కి తిరిగి టేబిల్ మీద గడ్డ కట్టిన బ్యాగులు చూసి భార్య వంక ఆశ్చర్యంగా చూశారు .... కొడుకు తండ్రి గది చూపి , చన్నీళ్ళు ట్యాపులు తువ్వాళ్ళు అవి చూపించి క్రిందికి వెళ్ళాడు.
    "ఏమిటే సాంబారు గడ్దేమిటి, కొంపదీసి ఆ సాంబారు పెద్తుందా కరిగించి -"
    "ఊరుకోండి , అబ్బాయి వింటాడు. సాంబారు ఫ్రీజరు లో ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టినట్లుంది. గడ్డ కట్టింది - ఆ అమ్మాయికి తెలుగు సరిగా రాడు కదా సాంబారు గడ్డ అంది .... వీళ్ళు వారం రోజులకి ఓసారి వండి పెట్టుకుంటారుగా ...." - వర్ధనమ్మ వివరించింది.
    "ఖర్మ రేపు ఇడ్లీ గడ్డలో, ఉప్మా గడ్డలో టిఫిను కి పెడ్తుంది కాబోలు. ఇదిగో ఆ ఐసు గడ్డల కూరలు నేను తినలేను గాని రేపటి నుంచి నీవు వంటచేయి మనం ఉన్నన్ని రోజులు ...." నసుగుతూ అన్నారు.
    "ఎక్కడ కొచ్చినా - సర్దుకోరు. మీ పెళ్ళాంలా ప్రతి పూటా వేడిగా వండి వార్చటానికి వీళ్ళకి తీరిక ఎక్కడ. మీ సణుగుడు కాస్త మాని సర్దుకోండి ....' - లోగొంతుకుతో అంది.
    'అందుకే నేనీ అమెరికా రాను మొర్రో అంటాను ...." గొణుక్కున్నారాయన.
    డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చోగానే అయన మొహం అప్రసన్నమైంది. మైక్రో ఓవెన్ నించి వేడి చేసి కోడలు ఒక్కొక్క డిష్ పైన పెడ్తుంటే భార్య వంక మిర్రి మిర్రి చూశారు. ఇటు అటు కెలికి ఆఖరికి పెరుగు వేసుకుని భోజనం అయిందనిపించి లేచారాయన. కోడలు వంటింట్లో గిన్నెలు కడుగుతుంటే వర్ధనమ్మ , "వేణూ , నేను వచ్చాగా, రేపటి నుంచి నేను వండుతాను. మీ నాన్న సంగతి తెలుసుగా - మడిగా ఏ పూట వండింది ఆ పూటే తింటారు. వంటపని నేను చూసుకుంటానని సునీతకి నీవే చెప్పు. తను ఏమి అనుకోకుండా -" లోగొంతులో కొడుకుతో అంది వర్ధనమ్మ.
    వేణు అర్ధమైనట్టు తల ఊపాడు - పడక గదిలోకి వెళ్ళాక , "నేనింక వంటకి ఓ నెల సెలవు. రేపటి నించి మా అమ్మ వండుతుంది. మా నాన్నకి మడి అది వుంది. ఆవిడకి రేపు వంటింట్లో అన్నీ చూపించి ఆవిడకి కూరలు తెచ్చి యియ్యి" అని భార్య నొచ్చుకోకుండా చెప్పాడు.
    మర్నాడు ఆదివారం. అందరూ లంచ్ కి కూర్చుంటే వర్ధనమ్మ వేడివేడిగా అందరికి వడ్డించింది. బీరకాయ పప్పుకూర, ఇంగువ నూనె వేసి , వంకాయ పులుసు పచ్చడి, కొత్తీమీర పచ్చడి, చారు పెడితే చాలా రోజుల తర్వాత తల్లి చేతి వంట ఫ్రెష్ గా వేడివేడిగా తింటుంటే అమృతంలా అనిపించింది వేణుకి. కోడలు కూడా మనస్పూర్తిగా మెచ్చుకుంటూ తింది. మనవలు కాస్త కారం అంటూ పప్పుకూరతో , చారుతో తిన్నారు.
    "మీలా నాకు అన్నిరకాల వంటలు రావత్తయ్యా"- నిజాయితీగా అంది సునీత.
    "అమ్మా , పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నావు . అది గొప్ప - వంటదెం ఉంది నాలాంటి వాళ్ళు చెయ్యాల్సిన పని యిది" - వర్ధనమ్మ కోడలుతో ఆప్యాయంగా అంది.
    తాతగారు అన్నం తినేముందు కంచం చూట్టూ నీళ్ళు తిప్పి ఔపోసన పట్టడం చూసి శరత్ తండ్రి చెవులో గుసగుసలాడాడు.
    "ఏమిట్రా మనవడా నామీద ఏం చెప్తున్నావు మీ నాన్నాకి ...." తాతగారు హస్యం ఆడారు.
    "మీరు అలా కంచం చూట్టూ నీళ్ళేందుకు తిప్పారని సందేహం వచ్చింది వాడికి."
    "ఆదా! అవును మరి మన ఆచార వ్యవహారాలు చెప్పందే పిల్లలకి ఎలా తెలుస్తాయి ? దూరంగా విదేశాల్లో ఉన్న పిల్లలకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఇవన్నీ ఎలా చూస్తారు?"

 Previous Page Next Page