ఈరోజు కొడుకు తనంతట తానుగా పైకి తేలగానే ఆవిడకి ఏం అనాలో తోచలేదు.
"అమ్మా-ఏం చేద్దామమ్మా...." ఆరాటంగా అడిగాడు.
ఆవిడ నిట్టూర్చింది. "చేయడానికి ఏముంది బాబూ...అంతా నిశ్చయం అయ్యాక యిప్పుడే కారణంతో మనం వెనక్కి తిరగగలం. అయినా మాట యిచ్చి తప్పడం మనకేం మర్యాద...యిన్నాళ్ళూ కాబోయే భార్య అని ఆమెతో షికార్లు తిరిగావు. యిప్పుడు మనం కాదంటే ఆ పిల్ల భవిష్యత్తు ఏమిటి. సంవత్సరం తరువాత కుదుర్చుకొన్న సంబంధం తప్పిపోతే యింక ఆ అమ్మాయికి పెళ్ళిఅవుతుందా - నాన్నగారు కుదిర్చి నలుగురెదుటా నిశ్చయించిన సంబంధం. వద్దని మానుకుంటే ఆ పిల్ల జీవితం అటుంచి మన పరువు ప్రతిష్ట ఏమవుతాయో ఆలోచించు" కృష్ణమోహన్ ఒక్కక్షణం మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా "అమ్మా! నా జీవితం కంటే పరువు ప్రతిష్టల విలువెక్కువకాదా అమ్మా-!"
సరస్వతమ్మ ఆ ప్రశ్నకి జవాబివ్వలేక పోయింది. కొడుకు సుఖంకంటే తల్లి కోరుకునేదేం వుంటుంది. కాని- యీ పరిస్థితిలో ఏ కారణం చూసి ఆడిన మాట తప్పగలరు.
"చూడు కృష్ణా-గీత గారాబంగా పెరిగిన పిల్ల-యీ కాలం పిల్ల-అత్తగారు, అత్తింట కాపురం, పాత పద్దతులు అంటే నచ్చనిది. ఆ అమ్మాయికి నచ్చనిది నేను కాని నీవు కాదు. అంతగా ఆ అమ్మాయి నాతో సర్దుకోలేకపోతే నేనెక్కడికన్నా వేరే వెళ్ళి ఉంటాను సరోజని తోడు తీసుకుని అప్పుడింక ఆ అమ్మాయికి ఏ విషయంలో అభ్యంతరం ఉండదు కదా-"
"అమ్మా" కోపంగా అరచాడు మోహన్ "అమ్మా గీత కోసం నిన్ను దూరం చేసికుంటా ననుకుంటున్నానా ఆవిడ కోసం నీ యిల్లు వదిలి నీవు వెళ్ళాల్సిన గతి కలిగిస్తాననుకున్నావా. ఆవిడగారి కోసం ఒక్కగానొక్క కొడుకుని దూరంచేసి దిక్కులేని దానిలా నిన్నెక్కడికో పంపగలననే అనుకున్నావా. ఏం మాటలు మాట్లాడుతున్నావమ్మా-"
"అది కాదు నాయనా - యింట్లో నేను, సరోజ వుండడం వల్ల గదా గీతకు చిరాకు, కోపం - సరోజ ఎలాగూ వెళ్ళి పోతుంది-నేను లేకపోతే-"
"అమ్మా! మరో మాటు ఆ మాట అనద్దు- ఈ సలహా చెప్పటానికి కాదు నిన్ను పిలిచింది. అమ్మా, నీవు ఒక మాట చెప్పు గీతతో నేను సుఖపడగలనని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవా" తీవ్రంగా అడిగాడు-
సరస్వతమ్మ నిట్టూర్చింది- "ఏమిటో నాయనా మంచికో చెడుకో ఆ పెళ్ళి వెంటనే అయిపోతే ఈనాడు మనం యిలా ఆలోచించాల్సిన అవసరం లేకపోయేది- వెనక్కి తిరిగి చూసుకుని పశ్చాత్తాప పడాల్సిన అవకాశం వుండేది కాదు- నేనేం చెప్పను నాయనా నీ అదృష్టం ఎలా ఉంటుందో-"
"హుఁ! నా అదృష్టం మీద నాకు నమ్మకం పోయిందమ్మా -ఆ అదృష్టాన్ని మార్చుకోగలనేమోనన్న ఆశతో నిన్ను సలహా అడుగుతున్నాను" ఆశగా చూశాడు తల్లివంక.
"లాభం లేదు కృష్ణా - ఆడినమాట తప్పలేను బాబూ - అంతకంటే కష్టమో సుఖమో భరిస్తాను ... ఇంట్లో కోడలు నట్టింట మహాలక్ష్మిలా తిరుగుతుందని ఆశించాను. కాని ఆ ఆశ అడియాస అని స్పష్టపడినా మాట ఎలా తప్పను బాబూ - చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బ్రతుకు ఎలా పాడు చెయ్యమంటావు నాయనా? అది నా వల్లకాదు..." ఆవేదనగా అంది.
"అంతేనా అమ్మా" నిరాశగా అన్నాడు మోహన్. కొడుకు మొహంలో గూడుకట్టుకున్న వేదన చూసి ఆవిడ చలించింది. నిస్సహాయంగా ఆమె మనసు గిలగిల లాడింది.
"నీకు తెలియదు కృష్ణా నేనెంత బాధపడ్తున్నానో...సరోజవచ్చిందగ్గరనించి యింట్లో కల కల లాడుతూ తిరుగుతూంటే అనుక్షణం గీత నా మనసులో మెదులుతూంది. సరోజలాంటి అమ్మాయి కోడలు కావాలని కలలుకన్నాను. కాని జరిగేది మరొకటి అని కళ్ళముందు కనిపిస్తుంటే - నా కోసం కంటే నీ కోసం నేను పడే బాధ ఏమని చెప్పను - నీవు పడే బాధ నా కర్ధం కాలేదనుకోకు బాబూ - అయినా ఏం చెయ్యాలో అంతుబట్టక నా అసంతృప్తి, ఆవేదన నాలోనే దిగమింగుకుంటున్నాను ఇన్నాళ్ళు"
సరోజ ప్రసక్తి తల్లి తనంతట తాను తీసుకురాగానే కృష్ణమోహన్ ఏదో చెప్పాలని ఆరాటపడ్డాడు - ఎలా చెప్పాలో తెలియక తడబడ్డాడు. ఈ ఉచ్చులోంచి తప్పించుకునే ఉపాయం కనపడక నిస్సహాయంగా గిలగిల లాడాడు. నాలుగు వైపులనించి బిగిసిన ఈ ఉచ్చు తన కంఠానికి ఉరిత్రాడుగా మారుతుందని తెల్సినా ఏం చెయ్యలేని నిస్సహాయత అతనికి కోపాన్ని, దుఃఖాన్ని కలిగిస్తూంది - ఆ కోపం తల్లిమీద చూపాడు.
"సరే కానీ అమ్మా - నా సుఖంకంటే నీకు మాట, పరువు ముఖ్యం అనుకుంటే యింక నేను చెప్పేదేం వుంది - కానీ" అన్నాడు కసిగా. సరస్వతమ్మ దిక్కుతోచనట్లు కలవరపడింది.
"కృష్ణా...నీవు చెప్పగలిగితే చెప్పు బాబూ - నా అంతట నేను చెప్పలేను -బాబూ, నీ వనుకున్నట్టు నీ కోరిక తీరితే నాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు -" అని - "అది తీరదని నాకు తెలుసు ఏం చేస్తావో సాయంత్రం మీ మామగారు వచ్చినపుడు నీవే మాట్లాడు బాబూ - యింతకంటే నేనేం చెప్పను ఏ భగవంతుడో దిగివచ్చి నీకు సాయపడితే అంతకన్నా నాకు కావల్సిందేం లేదు-" ఆవిడ నెమ్మదిగా గదిలోంచి వెళ్ళిపోయింది.