Previous Page Next Page 
వివాహబంధాలు పేజి 32


    
    ఆ సరే అనడం ఎంత పొరపాటో మూడు నెలల తరువాత నరకయాతన తెలియచెప్పింది. ఆయన మారుతారని ఆశించడంలో నా తెలివితక్కువతనం తెల్సింది.
    కాపురానికి వెళ్ళాను. అక్కడ నాకోసం బంగారు పంజరం తయారుచేశారు. చక్కని ఇల్లు. అంతకంటే చక్కని పర్నిచర్. వంటకి, పనికి అన్నింటికి కలిపి ఒక మనిషి.
    ఆ మనిషి వంటే కాకుండా, ఇంటి యజమానురాలికి కాపలాదారనీ, ఆ ఇంటికి ఘూర్కా అనీ, యజమానినియమించిన గూఢచారనీ నాకు తెలియడానికి చాలా రోజులే పట్టింది. నేను మా ఇంటికి రాసిన ఉత్తరాలు పోస్టు చేయకుండా, నాకు వాళ్ళురాసే ఉత్తరాలు తిన్నగా పోస్టాఫీసుకే వెళ్ళి మాయం చేస్తున్నాడనీ అర్ధం అవడానికి నెల రోజులు పట్టింది.
    నేనిక్కడికి రాగానే మా ఇంటికి ఉత్తరం రాసినా వాళ్ళెందుకు జవాబు రాయలేదో, కొత్త కాపురం సరి దిద్దడానికి వస్తానన్న అమ్మ ఎందుకు రాలేదో, ఏ సంగతీ తెలియక ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబురాయని వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాను. పెళ్ళిచేసి పంపి మరచిపోయారని కోపం వచ్చింది.
    ఆయనకి రోజంతా ఆఫీసు పని. సాయంత్రం ఇంటి కొచ్చాక తాగి, వళ్ళు తెలియకుండా రాత్రంతా పడుకోడం దినచర్య. ఆయనేం చేసినా అదేమని అడిగే హక్కు నాకు లేదు.
    "ఏమిటిలా తాగడంలో మీ ఉద్దేశ్యం? మీకో భార్య, ఆ భార్యకో మనసు ఉంటుందని గుర్తుందా?" అంటే
    హేళనగా నిర్లక్ష్యంగా నవ్వేవారు. గట్టిగా అడిగితే "నోర్ముయ్!" అనేవారు.
    "నోరు మూసుకుని పడివుండడానికి నేనేం బొమ్మని కాను. ప్రాణం వున్న మనిషిని. ఏ సరదా, ఏ ముచ్చటా లేకుండా పడేసి తిండితింటూ పడివుండడానికి మిమ్మల్ని పెళ్ళాడలేదు" అన్నాణు కోపంగా ఒక రోజు.
    "సరదా నీకు లేదు .... కమాన్ తాగుదాం. డాన్స్ చేద్దాం... ఇంకా ఆ తరువాత ఎంజాయ్ చేద్దాం ... కమాన్ !" అన్నారు.
    "ఛీ! మీతో మాటలేమిటి" అసహ్యించుకున్నాను.
    "మీరేదో మారుతారన్న భ్రమతో మీ అమ్మ గారి మాట కాదనలేక వచ్చాను. నన్నీ ఇంట్లో ఉండమనా, వెళ్ళమనా మీ ఉద్దేశ్యం!" తీవ్రంగా అన్నాను.
    "అది నీ ఇష్టం" నిర్లక్ష్యంగా అన్నారు.
    "సరే. రేపే నాన్నగారికి టెలిగ్రాం ఇచ్చి రమ్మంటాను. ఆయనే నిర్ణయిస్తారు ఏం చెయ్యాల్సింది" ఆ మాట విని నిర్లక్ష్యంగా నవ్వారు.
    మర్నాడు పనివాడితో టెలిగ్రాం పంపాను. మూడు రోజులయినా నాన్నగారు రాలేదు. ఆశ్చర్యపడ్డాను. అర్జంటని టెలిగ్రాం యిచ్చినా అయన రాక పోవడంతో ఏమీ అర్ధంకాక తికమక పడ్డాను. అపురూపంగా పెంచి పెళ్ళి చేసి ఇంతలా ఒక్కసారిగా నా కర్మానికి నన్ను వదిలేసినట్టు ఎలా వూరుకున్నారన్న అనుమానం వచ్చింది. ఏడుపు వచ్చింది. నాన్న రాలేదు. సరే, నేనే వెళ్ళాలని నిశ్చయించుకుని ఆయనతో చెపితే ఎలాగో వప్పుకోరని ఆయన ఆఫీసుకి వెళ్ళాక గప్ చిప్ గా సూట్ కేసు చేత పట్టుకుని టాక్సీ తెమ్మన్నాను పనివాడిని.
    "ఎక్కడి కెడుతున్నారమ్మా?" అన్నారు వాడు.
    మామూలుగా అడుగుతున్నాడనుకుని "మా పుట్టింటికి వెడ్తున్నాను. నాలుగు రోజులలో వస్తాను. ఆయన వస్తే చెప్పు" అన్నాను.
    "అయ్యగారితో చెప్పకుండా ఎలా వెడతారు!" అన్నాడు అదోలా చూసి.
    నేనంత పట్టించుకోకుండా "ఫరవాలేదు. నీవు చెప్పులే."
    "కాదమ్మగోరు! అయ్యగారికి చెప్పకుండా మీరు వెళ్ళ వీలులేదు" అన్నాడు.
    తెల్లబోతూ చూశాను "ఏమిటీ" అన్నాను ఇంకా నమ్మలేక.
    "అయ్యగారితో చెప్పకుండా మీరు వెడితే అయ్యగారు నన్ను తిడ్తారు. అంచేత వెళ్ళడానికి వీలులేదు" ఖచ్చితంగా అన్నాడు.
    వాడి ధైర్యానికి విస్తుపోతూ కోపంగా "మధ్య నీవెవడివి చెప్పడానికి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ముందెళ్ళి టాక్సీ తీసుకురా" తీక్షణంగా అన్నాను.
    వాడు ఆ కోపానికి జడవలేదు. పైపెచ్చు ఇంకా ధాటీగా "నేను వెళ్ళను. మిమ్మల్ని వెళ్ళనివ్వను" అన్నాడు.
    వాడ్ని ఏం చెయ్యాలో తెలియనంత కోపం వచ్చింది వాడి వరస చూస్తే లాభం లేదనిపించింది "సరే నేనే వెళ్ళి ఎక్కుతాను" అన్నాను విసురుగా పైకి వెళ్ళబోయాను.
    వాడు గుమ్మానికి అడ్డంగా చెయ్యిపెట్టి "అమ్మ గారూ? అనవసరంగా గొడవపడకండి, లోపలికి వెళ్ళండి. మీరు వెళ్ళడానికి లేదు. అంతగా వెళ్ళాలంటే అయ్యగారు వచ్చాక వెళ్ళండి. అయ్యగారు వచ్చేవరకు గుమ్మం దాటనివ్వను" అంటూ అడ్డంగా నిలబడ్డాడు.

 Previous Page Next Page