Previous Page Next Page 
మాయ జలతారు పేజి 32


    పుల్లయ్య వీరుడైనాడు ఇక అతణ్ణి అడ్దేవారూ ఎవరూ లేరు పరమయ్య అతనికీ తోడైనాడు.
    "పైనున్నోడితోని లడాయంటే దిల్లకా' ఆడు పైస గుమ్మరిస్తడు మనతాన యడున్నది పైకం? నిద్దర్లు లేవాయే కపాలాలు కాస్తుంటిమి అట్లయిన వచ్చిన్రా గుండాలు ఇగ పోలీసుల్ను తెస్తడు యాడికి పోతం, యాడికి పోయినా కిరాయియ్యాల కదనే గందుకే చెప్తాన్నా అని కాళ్ళు కడుపులు పట్టుకుందం మనకేం తప్పేదా? ఎట్లునన్న చేస్తం కష్టమైతే తప్పుతాది గద ఏమంటారు?" అన్నాడు అందరూ సరేనంటే సరే అన్నారు డబ్బు వసూలు చేసి ఇస్తే పుల్లయ్యా, నరసయ్యా వెళ్లి కట్టి రావాలని నిశ్చయించబడింది.

                      *    *    *

    తెల్లారి పదిగంటల సమయం గుడిసేముందు పందిట్లో మంచం మీదపడి "న్యూసాంగ్స్ " చదువుతున్నాడు దీర్ఘాలు తీస్తూ పిచ్చయ్య తనను పిల్చి నట్లనిపించి తలెత్తి చూస్తె పోలీసు కానిస్టేబుల్ వచ్చాడు పుస్తకం మడిచి లేచి కూర్చున్నాడు పిచ్చయ్య. పోలీసు సలాం చేశాడు . పిచ్చయ్య ప్రతి నమస్కారం చేసి పోలీసును మంచం మీద కూర్చోబెట్టాడు.
    "కనిపిస్తలే వేమన్న ఇయాల్రేవు?" అడిగాడు పోలీసు.
    "అగ్గా ఎన్నడు కండ్లబడకపోతి? దినం నాకతానికోస్తనే ఉంటివి"
    "నేనే బీమారయిన్లే రుక్సతు మీదుంటి సరేగాని, దొరపిల్చిండు తోల్కరమ్మన్నడు"
    "ఏం కత? ఖాన్ మాటున్నదా?"
    "నేనెట్ల చెప్తు? అరె,  పొయ్యి పిచ్చయ్యను పట్కారా అన్నాడు నేను వచ్చిన"
    "శీన్వసరావుకు పైన మీదా శేందన్న ఏమ్ కొడ్తాండనుకున్నవ్ రెండు బంగ్లలుండెనో ఉన్నయా, మొన్న మల్లోక బంగ్ల కట్టిండు కద అగ్గా ఎవరికేనో లేదా నీకు' జవాన్లతో సుత రాళ్ళు మోపించుండే ఎప్పటికీ పదిమంది జవాన్లుంటరింటి మీద లెస్స ఎట్టి సెయిస్తడనుకో చెప్పుకుంటే నమంగాని చీరేల్సుత ఉతికిస్తడే సరే గాని, జల్దేల్లు మల్ల గరమైతడు"
    చొక్కా వేసుకొని బైల్దేరాడు పిచ్చయ్యి.
    "నాస్తకు సుత పైసల్దోరకలేదే ఇయ్యాల' అన్న పోలీసు కిషన్ మాట విని గ్రహించాడు పిచ్చయ్య తిన్నగా హోటలుకు నడిచాడు తిన్నంత తిని తేన్చాడు పోలీసు. పిచ్చయ్య బిల్లు చెల్లించడానికి లేచినప్పుడు "పిచ్చయ్యన్న! పొరలు లడ్డుండాలని ఎడుస్తాన్రే, నేనేమో కాయిల వడ్డనా -- తేలేకపోయిన నాల్గు లాడ్లీప్పిస్తే కొనపోతింటికి" అన్నాడు పిచ్చయ్యకు ఒళ్ళు మండింది. పోలీసు అప్పటికే ప్యాకింగు కూడా చేయించుకొని వచ్చేశాడు విధిలేక బిల్లు చెల్లించి బైటికి రాగానే కిళ్ళీ కొట్టుకూ వెళ్ళి డబుల్ పాన్, రెండు "చార్ మినార్" పెట్టెలూ, అగ్గిపెట్టె పుచ్చుకొని సిగరెట్టు కాల్చి బైల్దేరాడు రక్షకభటుడు.
    "నటైట్ల నడుస్తాందే" అడిగాడు పిచ్చయ్య.
    "నటకేం ధూమ్ గ నడుస్తోంది గని మనమే అందరేతాన్నం"
    "అగ్గా! గట్లకాకుంటే నీకోస్తాది? గదంత మార్వడోండ్లకే నే నడిగేడిది మామూళ్లోస్తున్నాయా అని"
    "ఇంకాడి మామూళ్ళిరే దొరలకే మింగేటంద్కు చాల్తలేవ్ మాకాడికోస్తాయ్? సరేగాని, గుడిసేల్లెమో గడిబిడైందట గదవే?"
    వివరాలన్నీ చెప్పాడు పిచ్చయ్య.
    "గుడిసెల్ల కూడుండకుండ చేస్తాన్రులే  గరీబోల్లు బతికేడిదే కష్టమై పోతాంది గుండాల హడ్ది సరమ్ చేయకపోయినారు?"
    "చేస్తే మీరొచ్చి మమ్మల్నే పట్కపోతరు గద!"
    "పోలీసోల్లను గరీబీల కోసం కాదు బై - అమీర్ల కోసమే పెట్టింది సర్కార్"
    ఈలోగా పోలీసు స్టేషన్ వచ్చేసింది శ్రీనివాసరావు ముందుకు వెళ్ళి "రక్' ,మని సలామ్ కొట్టాడు కానిస్టేబుల్.
    "అబే భంచత్ , ఇంతసేపాబే? ఎడిబే పిచ్చిగాడు?" అడిగాడు శ్రీనివాసరావు
    "పట్టుకొచ్చిందొరా!"
    "ఏడివాడు? పొగరెక్కిందా జవాన్లకు"
    "జీ సర్కార్!' అని వెళ్ళి పిచ్చయ్యను ప్రవేశపెట్టి నుంచున్నాడు కానిస్టేబుల్ చూస్తున్నవట, ఏం ?" అని ఉరిమాడు శ్రీనివాసరావు.
    ఏమీ అర్ధం కాలేదు పిచ్చయ్యకు గుడ్లప్పా చెప్పి చూశాడు.
    "మాట్లాడవెంబే మాదర్ చత్" అని కానిస్టేబులు నుద్దేశించి "ఇక్కడేం గానాబజానా అవుతుందనుకున్నావా? నికల్ బే సాలె" అన్నాడు శ్రీనివాసరావు.
    లా అండ్ ఆర్డర్ పోలీసు - నిష్క్రమించాడు.
    "ఏం మాట్లాడ్త దొరల ముంగల?"
    "బతికేది జేబులు కొట్టి లీడరీ చేస్తున్నావుట కదర లీడరీ!"
    "పెద్ద పెద్డోలు లీడరైతరు మేమైతాం దొర? బుట్టఫకీరోల్లం మీ మోహర్భామంటే బతుకుతం లేకుంటే చస్తం"
    "బాలిగాడేవడ్రా వాడు లీడరీ చేస్తున్నాట్ట నువ్వేమో మద్దతు  ఇస్తున్నావుట?"
    "బాలయ్య " అని చెప్పబోయాడు పిచ్చయ్య.
    "బాలయ్యా! బాలిగాడనుబే వాడేమైనా దొరైపోయాడనుకున్నావా? వాడి చమడాలు వలుస్తా"
    ఈ పరిణామం పిచ్చయ్య అనుకున్నది కాదు కాస్త తికమకపడ్డాడు.  
    "రిక్షా నడిపిస్తాడుండి.
    "గుడుంబ అమ్ముతాడట జేబులు కొడ్తాడట నాకు తెల్సుబే నలుగురు చూడ్డానికి రిక్షా తోక్కుతాడు"
    "కాదుండి బాలయ్య నిస్పవంటోడు గుడుంబ తాగనన్న తాగడు అమ్మట మాడిదుండి? బాలయ్య దొంగతనం చేస్తే దున్యనిలువదుండి"
    "ఓహో! నీకూ ఏమైనా భాగం ఉందా అందులో"
    "కాద్దోరా! సత్తెం చెపుతాన్నా బాలయ్యన్న విప్పండి"  
    "అయితే యేమిరా ! ఈ శ్రీనివాసరావు నిప్పును కూడా పట్టేస్తాడ్రా! సరేగాని , గుడిసెలోదిలి వెళ్తామంటారా బొక్కలో తోయ్యల్నా?"
    పిచ్చయ్య వళ్ళు మండింది అయినా నిగ్రహించుకున్నాడు "ఏం తప్పు చేసినని నూకతరున్రి పుట్టిందాడనే , పెరిగిందాడనే చస్తే ఆడనే చస్తంగని , పొమ్మంటే యాడికి పోతమున్రి?" ఎంత నిగ్రహించుకున్నా ఆవేశం ఆగింది కాదు.
    "అబే పిచ్చిగా! నీ వ్యవహారాలన్నీ నాకు తెలుసురా! బొక్కలోకి తోస్తినా బతికుండగా మళ్ళి రావు పెళ్ళాం పిల్లలు అడుక్కు తినాల్సివస్తుంది ఆలోచించుకో అయినా ఉస్మాన్ జాగా మీకెట్లా అవుతుందిరా?"
    "ఉస్మాన్ తాతదానుండి ఆ జాగ? సంగమని పెట్టిండు , చందాలు మొదలు పెట్టిండు , గిప్పుడేమో జాగ మింగేటంద్కే తయారైతాండు"
    "అబే, నోరు కొవ్వేక్కిందీరా! కోరి చావు నెందుకు తెచ్చుకుంటార్రా? ఉస్మాన్ దగ్గర కాగితాలున్నాయి కోర్టులో సైతం నిరూపించగలడు మీరు కోర్టుల కేం తిరుగుతార్రా. అయినా, మీ తల్లులు ఉస్మాన్ దగ్గర పడుకుంటే పుట్టార్రా మీరు."
    భరించలేకపోయాడు పిచ్చయ్య కాళ్ళూ చేతులూ వడికాయి. కళ్ళు నిప్పులు కురిశాయి ఏ తిట్టయినా భరించగలడు కాని, మాతృమూర్తికి సంబంధించిన తిట్టు భరించలేకపోయాడు.  
    "ఏమన్నావుబే? సాలె? మీ అమ్మ అటువంటిదేమో? మా అమ్మనే అంటవుబే" అంటూ దూకాడు చొక్కా పట్టుకొని శ్రీనివాసరావు (సర్కిల్ ఇనెస్పెక్టర్) ను లాగాడు అమాంతంగా లేచాడు శ్రీనివాసరావు ఊపాడు పిచ్చయ్య . [ఇచ్చయ్యను లాగి కొట్టాడు శ్రీనివాసరావు కళ్ళు తిరిగినంత పనైంది పిచ్చయ్యకు కాని తేరుకున్నాడు అతనూ అంటించాడొకటి
    శ్రీనివాసరావు కేకవేశాడు.
    టకటకా బూట్ల చప్పుడైంది.
    అనేకమంది పోలీసులు వచ్చారు.
    పిచ్చయ్యను పట్టుకున్నారు.
    శ్రీనివాసరావు ఆ చెంప ఈ చెంపా వాచేట్టు కొట్టాడు పిచ్చయ్యను కానిస్టేబుల్ దగ్గరి కర్ర లాక్కొని బాదాడు పిచ్చయ్య వాంతి చేసుకున్నాడు పడిపోయాడు.
    "గాడిదకొడుకును లాకప్ లో వేయండి" అని చెప్పి, గబగబా వెళ్ళిపోయి స్కూటర్ స్టార్ట్ చేశాడు శ్రీనివాసరావు.
    హెడ్ కానిస్టేబుల్ పరిగెత్తాడు శ్రీనివాసరావు దగ్గరికి "లాకప్ లో చస్తాడేమో సార్!" అన్నాడు.
    "చావనీ లంజాకొడుకును" అని వెళ్ళిపోయాడు సర్కిలినస్పెక్టర్ లా అండ్ ఆర్డర్ శ్రీనివాసరావు.  

                                        * * * *

 Previous Page Next Page