వచ్చేటప్పుడు ఒక వందరూపాయలు చేతిలో పెట్టాడు డాక్టర్. అంతకు మించి అతను రాజా బాధ్యతని నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు.
చాలు! ఎవరికీ చేతనయినంత మంచి వాళ్ళు చేస్తే చాలు! ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలుండవు. మొత్తం మంచీ ఒకళ్ళే చెయ్యాలనుకోవడం మనల్ని మనం మోసగించుకోవడమే అవుతుంది. అది అసహజం కూడా.
వంట్లో ఆరోగ్యంతో, మనసులో ధైర్యంతో, జేబులో వంద రూపాయలతో రోడ్డు మీది కొచ్చాడు రాజా.
వచ్చీరాగానే అతనికి కనబడింది ఒక దృశ్యం.
రోడ్డుమీదే దొమ్మరి ఆట ఒకటి జరుగుతోంది.
అప్రయత్నంగానే ఆటవేపు నడిచాయి రాజా కాళ్ళు. ఆ గుంపులోకి తనుకూడా జొరబడి, ఆసక్తిగా చూడడం మొదలెట్టాడు.
గోడ మీద నిలబడి వుంది ఒక చిన్న పాప.
తాడు మీద బాలన్సు చేస్తూ ఉంది ఒక అమ్మాయి.
కింద పల్టీలు కొడుతున్నాడు ఒక పిల్లాడు.
ఒక స్త్రీ డోలు వాయిస్తోంది.
ఒక మొగతను రన్నింగ్ కామెంటరీలా చెబుతూ, తను కూడా కొన్ని ఫీట్స్ చేస్తున్నాడు.
ఆ ప్రదర్శనని కాసేపు చూశాక, హఠాత్తుగా స్ఫురించింది రాజాకి తను భవిష్యత్తులో చెయ్యవలసింది ఏమిటో!
తనొక కమెండో కావాలి.
కనీసం పోలీసు ఆఫీసరు కావాలి! అదేగా కృష్ణాజీ కోరిక కూడా!
పోలీసు డిపార్ట్ మెంట్ లో కమెండోనే అవుతాడు తను.
కానీ ఎట్లా ?
పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరాలంటే బాగా చదువుకుని వుండాలి.
స్ట్రాంగ్ బాడీ వుండాలి. మంచి ఛెస్ట్ వుండాలి.
మంచి కంటిచూపూ అదీ వుండాలి.
పోలీసు డిపార్ట్ మెంట్ గురించి చాలానే తెలుసు రాజాకి.
ఇదివరకటి పోలీసాఫీసర్లు అసలు సిసలైన మొగాళ్ళలా ఉండేవాళ్ళు. మంచి పర్సనాలిటీ, మంచి ఆరోగ్యం, తెలివితేటలూ ఉన్నవాళ్ళే సెలెక్టు అయ్యేవాళ్ళు.
ఇప్పుడేముంది! లక్షో, రెండు లక్షలో పారేస్తే అర్ధనాకారపు మనుషులూ, అంగుష్ట మాత్రులూ, ఆడంగివాళ్ళూ కూడా సెలెక్టయిపోతున్నారు.
పైసాలోనే కదా పరమాత్మ ఉంది!
తన దగ్గర పైసా లేదు. అందుకని తను పర్సనాలిటీ డెవలప్ చెయ్యాలి. కరాటే, జూడో, కుంగ్ ఫూ, కర్రసాము, రైడింగ్, షూటింగ్... అన్నీ ప్రాక్టీస్ చెయ్యాలి.
దానితోబాటు....
కళ్ళు పేలిపోయేలా చదువుకోవాలి.
యూనివర్శిటీ ఫస్టు రావాలి.
గోల్డ్ మెడలు కొట్టెయ్యాలి.
యూనివర్శిటీ డిగ్రీ పట్టుకుని, గోల్డ్ మెడల్ షర్టుకి పిన్ చేసి, ఇన్ని విద్యల్లో ప్రావీణ్యం పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్తే లంచంగాళ్ళూ, కంచంగాళ్ళూ, మంచంగాళ్ళూ ఎందుకు పనికొస్తారూ?
చిన్నప్పటి నుంచి చెడు పద్ధతులని బాగా అబ్జర్వ్ చేసి ఉండడం వల్ల రాజాకి తెలుసు. ఈ రోజుల్లో పనులు కావాలంటే లంచం అన్నా తినిపించాలి, డిన్నర్లు అన్నా ఇచ్చి తినిపించి తాగించాలి, లేదా అమ్మాయిల్ని తీసుకొచ్చి అప్పచెప్పాలి.
తను పూర్తిగా ట్రైనింగ్ అయిపోయి, రెడీమేడ్ ఆఫీసర్ లాగా ఇంటర్వ్యూకి వెళ్తాడు.
అయినా కూడా సెలెక్టు చెయ్యరా ?
సెలెక్టు చెయ్యకపోతే ఐ.జీ.పీ.ని పట్టుకుని అదరగొట్టేస్తాడు.
ఇంకాసేపు దొమ్మరి ఆటని పరిశీలనగా చూశాడు రాజా.
కాదు! అతని ఆలోచన వాళ్ళతో చేరిపోవాలని కాదు.
పాపం వాళ్ళు ఎంత హీనంగా బతుకుతారో, వాళ్ళు ఎంతమంది చేత ఎలాంటి హరాస్ మెంటుకి గురి అవుతారో రాజాకి తెలుసు.
తను మళ్ళీ ఆ ట్రాక్ లో పడిపోకూడదు!
ఇంకో చక్కటి రాజ మార్గం ఉంది దానికి.
సర్కస్ లో చేరిపోవడం!
సర్కస్ అంటే కొద్దోగొప్పో పద్దతిగా ఉంటుంది. కాస్తో కూస్తో గౌరవం వుంటుంది. అక్కడ బోలెడంత డిసిప్లిన్ కూడా వుంటుంది.
అదే తన రూటు!
కానీ సర్కస్ ఇప్పుడెక్కడ వుంటుందీ? అసలు దానిలో చేర్చుకుంటారా తనని?
దొమ్మరి ఆట అయిపోయేలోగా వందరూపాయల నోటు మార్చాడు రాజా. ఒక యాభై ఆ కుటుంబానికి ఇచ్చాడు.
తనకి దారి చూపించారు. వీళ్ళకి కృతజ్ఞుడయి ఉండాలి తను.
ఒక బస్సు క్యాచ్ చేశాడు రాజా. అర్పిత వాళ్ళ ఊరు చేరుకున్నాడు.
ఆ షెడ్డు అలాగే ఉంది. అయితే కొత్తగా పులిజూదం ఆటతాలూకు గళ్ళు గీసి వున్నాయి షెడ్డులో.
అర్పిత వాళ్ళ ఇంటివేపు చూశాడు రాజా. ఆ అమ్మాయి కనబడలేదు.
సదాశివబ్రహ్మంగారు మాత్రం కూర్చుని రాట్నం వడుకుతున్నాడు.
చాలాసేపు అక్కడే కూర్చున్నాడు రాజా. అలాగే నిద్రపట్టేసింది. గోడకి ఆనుకునే కాసేపు జోగాడు. తర్వాత లేచి ఒళ్ళు విరుచుకుని, బట్టలు దులుపుకుని, బయలుదేరాడు. అర్జెంటుగా టీ తాగాలనిపించింది.