కానీ అంతలోనే ఇంకో విషయం గుర్తొచ్చింది.
ఇవాళ నుంచి...ఇవాళ నుంచే...ఒంటిని ఇనప ముక్కలా చెయ్యడం మొదలెట్టాలి తను. ఈ కాఫీలూ, టీలూ...ఇవన్నీ ఉత్త ఫ్యాన్సీ! తాగిన కొద్దీ తాగాలనిపిస్తుంది. డబ్బు వేస్టు! ఒంటికి మంచిది కాదు!
అప్పటికప్పుడే ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాడు రాజా.
ఇవాళ్టి నుంచి...తను తినేదీ...తాగేదీ...ప్రతిదీ కూడా వంటికి బలాన్ని ఇచ్చేదిగానే వుండాలి. నానా గడ్డీ తినకూడదు.
అలా ఆలోచిస్తూ, తనకి తెలియకుండానే మునిసిపల్ స్కూలు దగ్గరికి వచ్చాడు రాజా.
స్కూలుకి దగ్గరలోనే ఒక సన్నటి సందు వుంది. సాధారణంగా నిర్జనంగా వుంటుంది అది. సందులోకి రాగానే రాజాకి కనబడింది ఒక దృశ్యం.
అర్పిత ఒక్కతే వస్తోంది. ఆ అమ్మాయి పక్కన వాళ్ళ అక్క అంకిత లేదు. ఆ సందులోనే దుర్గంధ భూయిష్టంగా వున్న యూరినల్స్ వున్నాయి.
వాటి వెనక నుంచి హఠాత్తుగా బయటికి వచ్చాడు ఒక మనిషి. అతన్ని చూసీ చూడగానే అతనేం చేయబోతున్నాడో గ్రహించేశాడు రాజా.
అతను ఊహించినట్లే, ఆ మనిషి చటుక్కున వచ్చి అర్పిత ముందు నిలబడ్డాడు.
"ఏయ్ పిల్లా! చెవులకి వున్న రింగులు తీసి ఇవ్వు!" అన్నాడు.
అర్పిత మొహంలో భయం కనబడింది.
"ఊఁ" అన్నాడు ఆ మనిషి.
వణుకుతూ చెవిదగ్గర చెయ్యి పెట్టింది అర్పిత.
క్షణంలో ఆ వ్యక్తి దగ్గరికి చేరాడు రాజా.
"ఊరికే గొడవొద్దు! ఆ అమ్మాయిని వదిలెయ్ రాదూ!" అన్నాడు బోర్ గా చూస్తూ.
ఆ మనిషి మొహంలో ఎగతాళి కనబడింది.
అతను ఏదో అనబోయేంతలోనే ఛక్ మని రాజా చేతిలో ప్రత్యక్షమయ్యింది బటన్ నైఫ్.
"వెళ్ళిపో!" అన్నాడు రాజా.
అతను ముందర స్టన్ అయ్యి, తర్వాత ఎగాదిగా రాజావేపు చూశాడు.
రాజా చేతిలోని కత్తి కంటే, రాజా కళ్ళలో కనబడుతున్న కాఠిన్యం అతనికి భయం కలిగించింది. ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
దిగ్భ్రాంతురాలయిపోయి ఇదంతా చూస్తోంది అర్పిత.
"ఇంటికెవెళ్ళగలవా? నేను రావాలా?" అన్నాడు రాజా.
కష్టంమీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని అంది అర్పిత.
"నీ దగ్గర ఎప్పుడూ కత్తి వుంటుందా?"
"ఉంటుంది"
"ఎందుకూ?"
"జామకాయలూ అవీ కోసుకోవడానికి!"
కొంచెం తృప్తిపడినట్లు చూసింది అర్పిత.
"నువ్వే స్కూలు?" అంది.
"ప్రైవేట్ గా చదువుతున్నా!"
"ఎన్నో క్లాసు?"
"బి.ఏ."
అదిరిపడింది ఆ అమ్మాయి.
"నువ్వు బియ్యేనా?"
"అవును! ఒకేసారి బియ్యేకి అప్పియర్ అవుతా!"
"ఇప్పుడేం నేర్చుకుంటున్నావ్? ఆరో క్లాసు పుస్తకాలు చదివేశావా?"
"అక్షరాలూ నేర్చుకోగానే చదివేస్తా!"
"ఏమిటీ? నీకు అక్షరాలు కూడా రావా?"
"ఉహుఁ! నువ్వు రాసిస్తావా?"
"మా నాన్నగారు నేర్పిస్తారు. నేర్చుకో"
"నువ్వు రాసిస్తేనే నేర్చుకుంటా"
హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అంది అర్పిత.
"నువ్వు మా ఇంటెదురుగా వ్యాయామశాలలో ఉన్నావ్ కదూ?"
"అవును...."
"అయితే రేపు రాసిస్తా"
"సరే!"
ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.
అర్పిత వెళ్ళిన వేపే హీరోలా చూస్తూండిపోయాడు రాజా.
మర్నాడు ఏబిసీడీలూ, తెలుగు గుణింతాలూ ఉన్న ఛార్టులు రెండు తెచ్చిచ్చింది అర్పిత. అక్షరాలను ఒకసారి తను పలికి చూపించింది.
అప్పటికే ఫ్రేం కట్టించి ఉంచాడు రాజా కృష్ణాజీ ఫోటోని. ఫోటోని గోడకి ఆనించి, రెడీగా వుంచుకున్న అగరొత్తులు వెలిగించాడు.
ఫోటోకి సాష్టాంగ నమస్కారం పెట్టి తరువాత అక్షరాలను పరిశీలించటం మొదలెట్టాడు.
సాయంత్రం ఆ అమ్మాయి స్కూలు నుంచి వచ్చేటప్పుడు వాటిని తిరిగి యిచ్చేశాడు రాజా.
"ఏం! నేర్చుకోవా?" అంది అర్పిత.