నర్సు అంది.
"ఇందాక వచ్చి బయట కూర్చుని వున్నాడు ఒక మనిషి. వీళ్ళ నాన్నట."
రిలీఫ్ గా చూశాడు డాక్టర్.
"వీళ్ళ నాన్నా! అయితే ఫర్వాలేదు. వీడి అదృష్టం" అన్నాడు.
పదినిమిషాల తరువాత డాక్టర్ రవుండ్స్ ముగించుకుని వెళ్ళిపోయాక-
అప్పుడు వార్డులోకి వచ్చాడు దాసు.
మట్టి రంగుకి తిరిగి వున్నాయి బట్టలు. వదులుగా వున్న షర్టూ, పైజమా.
షర్టు మీద బహుశా సాంబారు మరక కాబోలు - ఒకటి ప్రముఖంగా కనబడుతోంది.
కొత్త వాసన పసికట్టినట్లు కళ్ళు తెరిచాడు రాజా.
అతనివైపే తదేకంగా చూస్తున్నాడు దాసు.
"నొప్పిగా వుందా?" అన్నాడు జాలిగా.
అవునన్నట్లు తల వూపాడు రాజా.
"ఇరవై రెండు చోట్ల బొమికెలు ఇరిగాయంట!"
మాట్లాడకుండా చూస్తున్నాడు రాజా.
దాసు అన్నాడు.
"మందులకీ మాకులకీ శానా కరుచవుద్దంట! నా దగ్గర పదిహేను వేలున్నాయి. పోలీసుబాబు మాస్టారికిచ్చిన డబ్బు తాలూకు."
రాజా ఏదో అనేటంతలోనే దాసు కఠినంగా అన్నాడు.
"కానీ దాన్లో నుంచి పైసా కూడా ఇవ్వను నీకు! దొంగనా కొడకా! కన్న తండ్రి కడుపు కొడతావురా! కాపు సారా కాద్దామంటే కాదు కూడదని కూర్చుంటావుట్రా! దేవుడు లేడూ! అందుకే నువ్వు మళ్ళీ మనిషిలా తిరగలేకుండా మక్కెలిరిగేటట్లు చేశాడు. చావరా చావు! తింగిరి నా కొడకా!"
అని చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు దాసు.
తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ వుండిపోయాడు రాజా.
అప్పుడు స్క్రీన్ చాటునుంచి బయటికి వచ్చాడు డాక్టర్. అతని మొహంలో కనబడుతున్న భావం చిత్రంగా వుంది.
"ఇప్పుడు వచ్చిన వాడు నీ తండ్రేనా?" అన్నాడు అపనమ్మకముగా.
అవునన్నట్లు తలాడించాడు.
తరువాత నర్సు వైపు తిరిగాడు డాక్టర్. ఉద్వేగంగా అన్నాడు.
"ఇలాంటి లుచ్చాగాడు ఒకడు ఈ ప్రపంచంలో వున్నాడంటే నేను బహుశా నమ్మేవాడిని కాదేమో! కానీ ఇవాళ కళ్ళారా చూసి, చెవులారా విన్నాను కాబట్టి నమ్మక తప్పడం లేదు. నిజంగా ఈ కుర్రాడి మీద జాలి పడుతున్నాను. ట్రీట్ మెంట్ కి ఖర్చవుతుంది. అయినా ఫర్వాలేదు. నేను భరిస్తాను. వీడి తండ్రి వీడికి పగవాడిలా చూడడం ఒక ఎత్తయితే, ఇన్ని దెబ్బలు తగిలినా వీడు బతికి బయట పడడం ఇంకో ఎత్తు" అని అతనివైపు తిరిగాడు డాక్టర్.
"పిల్లగా! దేవుడికి నువ్వు అప్పుడే చచ్చిపోవడం ఇష్టం లేనట్లుంది. బతుకు! బతికి ఏదన్నా సాధించు" అన్నాడు.
నవ్వడానికి ప్రయత్నం చేశాడు.
కానీ పెదిమలు కూడా స్వాధీనంలో లేనట్లు అనిపించింది.
అయితే అదే సమయంలో....
పోయిన శక్తిలో సగం తిరిగి వచ్చినట్లు కూడా అనిపించింది అతనికి.
డాక్టర్ చెప్పిందీ నిజమే!
అంత స్పీడుగా వస్తున్న లారీకింద పడ్డా తను చావలేదంటే? ఇరవై రెండు చోట్ల ఎముకలు విరిగినా తను బయట పడ్డాడంటే? కన్నతండ్రి కసాయివాడిలా మాట్లాడినా ఈ డాక్టర్ కి మాత్రం దయ కలిగిందంటే?
ఆ జై వీరహనుమాన్ తనవైపే ఉన్నాడు.
నిజంగానే!
ఆ క్షణంలో ఒక నిశ్చయానికొచ్చేశాడు అతను.
తను చావడు!
బతికి సాధిస్తాడు!
ఇప్పుడర్థమౌతోంది తనకి!
ఈ ప్రపంచంలో అందరూ తన తండ్రిలాంటి, లేకపోతే ఆనందరావులాంటి లంగాగాళ్ళే ఉండరు.
కృష్ణాజీ లాంటివాళ్ళూ, ఈ డాక్టర్ లాంటివాళ్ళూ కూడా ఉంటూనే ఉంటారు- అక్కడక్కడ!
లేకపోతే పాపం పండిపోయి ఈపాటికి భూమి మధ్యకి పగిలిపోయి ఉండదూ!
ఇన్నాళ్ళూ తన ఖర్మకొద్దీ రాంగ్ ట్రాక్ లో వెళ్ళాడు. ఆ రూట్ లో అంతా అలగా వెధవలే తగిలారు తనకి.
కృష్ణాజీ దయవల్ల ఇప్పుడు కరెక్ట్ రూట్ లోకి వచ్చాడు.
ఈ రూట్ లో కొత్త మనుషుల్ని చూస్తున్నాడు తను! నిజంగానే!
అంటే మనం వెళ్ళేదారిని బట్టి, మనకు తగిలే మనుషులు కూడా వుంటారన్న మాట!
ముళ్ళ డొంకల్లోకి వెళ్తూ అక్కడ మంచి గంధం చెట్లు కనబడలేదని ఏడిస్తే ఎట్లా కుదుర్తుందీ?
బతకాలనే కోరికే బలాన్ని త్వరలోనే తిరిగివచ్చేలా చేసింది రాజాకి. అందులో లేత ఎముకలు కావడం వల్ల త్వరగానే అతుక్కున్నాయి.
రెండు నెలల్లో హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడు రాజా.