"ఏమిటి ఆలోచిస్తున్నావు. నీకిష్టం అయితే నాకేం అభ్యంతరంవుండదు."
"నిజమేలెండి మీరన్నది... యింట్లో యిద్దరు ఆడవాళ్ళు ఉండడం కష్టమే. అందులో కొత్తపిల్ల. మీరన్నట్టు నాకు చాదస్తం, శుభ్రం ఎక్కువ. సుగుణ వచ్చిఏదన్నా పిండివంటలు చేసి వెళితే యిల్లు వాకిలి, కుకింగ్ రేంజులు అన్ని జిడ్డు, యిల్లు, మారిపోతుందని అది విసుకనిపిస్తుంది నాకు. వద్దులెండి ఎందుకొచ్చిన గొడవ."
"అన్నట్టు ఇందాక విక్రమ్ ఫోను వచ్చింది. ఎడ్జస్ట్ అయ్యారా లేదా. డాడీ ఫోను చెయ్యలేదు పదిహేనురోజులయింది అంటూ చేశాడు" కొడుకు ఫోన్ సంగతి చెప్పింది.
"అవును క్రిందటివారం ఏదో హడావిడిలో మర్చిపోయాను. ఏం చెప్పావు. ఇక్కడ సంగతులు అన్నీ చెప్పావా..." అన్నీ బాగానే వున్నాయి. మిమ్మల్నే మిస్ అవుతున్నాము అని చెప్పాను" రాజేశ్వరి అంది.
"ఇంకోటి కూడా బాగా మిస్ అవుతున్నాను ఇక్కడ..." అని అర్దోక్తిలో ఆగి ఏమిటో చెప్పు చూద్దాం..." కేశవరావు భార్యవంక చిలిపిగా చూశాడు. రాజేశ్వరి ఆశ్చర్యంగా చూసి "ఏమిటి మిస్ అవుతున్నారు. ఏమిటా నవ్వు - కొంపదీసి గరల్ ఫ్రెండ్ ఎవర్తన్నా వుందేమిటి అక్కడ హాస్పిటల్లో. దాన్ని మిస్ అవుతున్నారా."
"ఆడబుద్ధి అంతేమరి. అంతకంటే ఆలోచించలేరు. అసూయ ముందు..."
"ఆ, చాల్లెండి గాని- ఏమిటి మిస్ అవుతున్నారు చెప్పండి" కుతూహలంగా అడిగింది.
"నా టెన్నిస్-" సావకాశంగా అన్నారు. "గత ముప్పైఐదేళ్ళుగా రోజూ ఆడే టెన్నిస్ ఆట మిస్ అయ్యాను యిక్కడికి వచ్చాక. అదొక్కటే యిక్కడ కుదరడం లేదు..." కాస్త నిరాశగా అన్నారు.
"వేయించండి టెన్నిస్ కోర్టు. మీకేం డబ్బుకి లోటా-" రాజేశ్వరి తేలిగ్గా అంది.
"టెన్నిస్ కోర్టు చేయడం ఎంతసేపు... యిక్కడ నాతో ఎవరాడతారు? ఎవరున్నారు?"
అది నిజమే. ఈ వూర్లో టెన్నిస్ వచ్చినవారెవరుంటారు. రాజేశ్వరి ఒక్కక్షణం ఆలోచించి పోనీ టెన్నిస్ రాకపోతే బ్యాంట్ మింటన్ కోర్టు చేయించండి. నేను ఆడతా. మన రంగా, వాసు, రేణు, యిప్పుడీ శ్యామల లాంటి కుర్రాళ్ళు వున్నారు గదా. రాకపోయినా ఓ వారంరోజులు ఆడితే అదే వస్తుంది. టెన్నీస్ లా కష్టం కాదు కదా. పొద్దుటే రెండు గేములు ఆడుకుందాం రోజూ. నాకూ ఎక్సర్ సైజుగా వుంటుంది. వాసు వాళ్ళని రమ్మని డబల్స్ కూడా ఆడచ్చు..." రాజేశ్వరి చెప్పింది. వినగానే ఆయన ఉత్సాహంగా "అవును సుమా, ఆమాటే నాకు తట్టలేదు. మన ఇంటిముందు ఇంత స్థలం వుంది. హాయిగా కోర్టు వేయించేస్తా కొలతలిచ్చి" ఉత్సాహంగా లేచి లోపలికి వెళ్ళారు.
ఆరోజు ఉగాది! ఈ సంవత్సరం ఉగాది ఆ వూరికి కొత్త శోభనిచ్చినట్లనిపించింది వూరందరికీ. విద్యాధికుడు, ధనికుడు, డాక్టరు. సౌమ్యుడు అయిన డాక్టరు రాకతో ఆ వూరికి అందరికీ ఈసారి ఉగాది కొంగొత్త ఉత్సాహానిచ్చింది. వారిద్దరూ పీటల మీద కూర్చుని లక్ష్మీనరసింహాలయంలో కళ్యాణం జరిపిస్తుంటే ఊరు వూరంతా తరలివచ్చింది వారి యింట పెళ్లి అన్నట్టు. దేవాలయం కొత్తరంగులతో, దేముళ్ళు కొత్త బట్టలతో, దీప తోరణాలతో రంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది.
తరువాత అందరికీ అన్నదానం జరిగింది. ఊరిలో ఆడవాళ్లంతా నడుంకట్టి దేవాలయప్రాంగణంలో బారులుతీరి కూర్చున్న బీదప్రజానీకానికి వడ్డించారు. అయినింటి ఆడవారంతా రెండు బంతులలో కూర్చున్నారు. దేముడి ప్రసాదం రుచి వుత్తప్పుడు రాదు అన్నమాట నిజం అన్నట్టు ఆరోజు చక్రపొంగలి, పులిహోర ఘుమఘుమలాడాయి.
పెద్ద పెద్ద గుండిగలతో వంటవారు పక్కవూరునించి వచ్చి గాడిపొయ్యిలు తవ్వి ఉదయం నుంచి వండివార్చారు. "అన్నదాతా సుఖీభవ" అన్నట్టు అంతా సంతృప్తిగా తిని లేచారు.
ఆచార్యులుగారు కేశవరావు, రాజేశ్వరిలకు ఆశీర్వచనం చదివారు. పూజారికి జరీ పంచెలు, ఐదువందలు కట్నం యిచ్చింది రాజేశ్వరి. చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అనుకుంటూ అంతా యింటికి వెళ్ళేసరికి రెండుగంటలయింది.
"రంగా, వాసూ సాయంత్రం ఓసారి ఇంటికి రండి. రైసు మిల్లుకి పర్మిట్ వచ్చింది. సహకార బ్యాంకు నుంచి ఉత్తరం వచ్చింది. కాసేపు రెస్టు తీసుకున్నాక యింటికి రండి" అన్నారు కారు ఎక్కుతూ కేశవరావు.
"ఇంత బాగా సంతృప్తిగా ఎప్పుడూ దేముడిగుళ్ళో పూజ ఎప్పుడూ జరగలేదు. తిరుపతిలో కళ్యాణం చేయించినా ఏదో గుంపులో కూర్చోడం తప్ప ఈ తృప్తి లేదు." రాజేశ్వరి అంది. చిన్నదేవాలయంలో పూజారులు శ్రద్ధగా చేస్తారు. అందులో కాస్త సంభావన బాగా దొరుకుతుంది అంటే మరికాస్త శ్రద్ధ చూపుతారు.
తిరుపతి అంతా బొత్తిగా కమర్షియల్ అయిపోయింది. వెళితే యిలాంటి చిన్న దేవాలయాలకే వెళ్ళాలి. తృప్తి దొరుకుతుంది. పూజకంటే కూడా ఈరోజు యింతమంది భోజనం చేశారు. అది ఎక్కువ తృప్తి నాకు. అబ్బ వంటలు బాగున్నాయి సుమా. ఆ గుమ్మడికాయ పులుసు, వంకాయ కూర చాలా బాగున్నాయి. యింట్లో ఆ రుచి రాదేమిటి...కళ్ళు మూతలు పడుతున్నాయి భుక్తాయాసంతో- చక్రపొంగలి ఎంత బాగుంది. కాస్త అడిగి తీసుకురావాల్సింది రాత్రికి తినేవారు."
"ఏమో అందరిఎదుట మనకు ప్రత్యేకంగా యిమ్మనడం ఏం బాగుంటుంది. వైష్ణవ దేవాలయాలు చక్రపొంగలికి ప్రసిద్ధి. నిజంగా బాగుంది. వుండండి వెంకన్నని పంపి, వుంటే కాస్త డబ్బాలో పెట్టి యిమ్మని పంపిస్తాను" అంది రాజేశ్వరి కారు దిగుతూ.
* * *
రైసు మిల్లుకి పర్మిట్, దాంతోపాటు బ్యాంకు అప్పు ఇవ్వడానికి అంగీకరించిన కాగితాలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కవరింగ్ లెటర్ తో కేశవరావు పేరిట పంపారు. బ్యాంకు లోను వెంటనే గ్రాంటు అవుతుందని, పని మీరు ఆరంభించుకోవచ్చని, స్థలం శాంక్షన్ కాగితం అన్నీ మనిషి ద్వారా పంపించారు కలెక్టర్.
ఆ మర్నాడు కోపరేటివ్ బ్యాంకు వారు వచ్చి అక్కడ బ్యాంకు తెరవడానికి పర్మిషన్ యిచ్చింది ప్రభుత్వం. కేశవరావు, వాసు, రంగా, చౌదరి, మునసబు, కరణం, ప్రెసిడెంటు వూర్లో పొలాలు వున్నవారంతా ఖాతాలు ప్రారంభించారు. రైతుల పేరిట ఖాతా పాసు పుస్తకాలు అందచేయడం రెండు మూడు రోజులలో పూర్తి అయింది.
వ్యవసాయ రంగానికి తక్కువ వడ్డీతో రుణాలు అందించడం సహకార బ్యాంకుల ముఖ్య ఉద్దేశం. తీసుకున్న రుణాలు ప్రతిఏటా అసలు, వడ్డీలు ఎంత చెల్లించాలన్నది ముందే నిర్ణయిస్తారు. ఏ యేడన్నా పంటలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆ ఏడాది రుణం మాఫీ చేసి మరుసటి సంవత్సరం నష్టాన్ని బట్టి రెండు మూడేళ్ళు కూడా ఆగాలి. ప్రభుత్వం యిన్ని రకాలుగా సదుపాయాలు కలుగచేసినా వడ్డీవ్యాపారుల దగ్గిర హెచ్చు వడ్డీకి అప్పు తీసుకుని అవి తీర్చలేక చక్రవడ్డీ పెనుభారంగా మారడం జరుగుతుంది.
"మరి ఈ రైతులెందుకు వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకుంటారు. ఇలాంటి సదుపాయాలుండగా ఆశ్చర్యంగా అన్నారు కేశవరావు.
"బ్యాంక్ తమ నికరంలోంచి నలభైశాతం రైతులకి అప్పులుగా ఇవ్వాలి. ఒక్కొక్కసారి అరవైశాతం కూడా ఇమ్మంటుంది ప్రభుత్వం. అంటే ఉదాహరణకి వరంగల్ జిల్లాలోనే 120కోట్ల రూపాయల రుణం అవసరం అయితే బ్యాంకులు కేటాయించేది ఏ 20 కోట్లో వుంటుంది. ఆ రుణాలు కూడా మధ్యతరగతి రైతులు, చదువుకున్నవారు రాబట్టుకుంటారు. చదువు సంధ్యలేని చిన్నకారు రైతులకి రుణాలు అందవు. మధ్యలో అలాంటి రైతులని దళారులు మోసం చేయడం, వారికి రుణాలు ఇస్తామని, బ్యాంకులో రుణాలు మాఫీ చేయిస్తామని నమ్మబలికి కాగితాలమీద వేలిముద్రలు వేయించుకుని బ్యాంకు ఇచ్చిన రుణం వారు సగం స్వాహాం చేస్తారు. ఏడాది గడిచి పంట చేతికి రాక నష్టపోయిన రైతును దళారీలు బ్యాంకు అప్పు తీర్చకపోతే భూమి జప్తు అవుతుందని బెదిరించి వడ్డీవ్యాపారుల దగ్గిర రుణాలు తీయించి బ్యాంకు లోను తీరుస్తామని తమ జేబులో వేసుకుంటారు. వచ్చిన అంట అమ్ముకున్నప్పుడు కూడా రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీదారులు మాత్రమే పత్తి కొనుగోలు చేసి తమ అప్పులు రాబట్టుకోడంతో దక్కిన పంటకి కూడా రైతుకి డబ్బు రాదు. అంతేకాక ఎనభైల్లో పత్తి పంట హెచ్చులాభాలు తీసుకురావడంతో రైతులంతా పత్తిపంట వైపు మొగ్గుచూపారు. మొదట్లో ఎకరానికి వెయ్యి రూపాయలుండే ఖర్చు ఇప్పుడు పదివేలకి పెరగడం, క్రమంగా పత్తిపంటకి చీడ సోకడం, మార్కెట్ లో రేటు తగ్గడం, పురుగు మందులు విపరీతంగా వాడడంతో ఖర్చు పెరగడం అన్నీ కలిసి పత్తి రైతులకి నష్టాలు కలగచేసింది. నకిలీ పురుగుమందులు, సకాలంలో వర్షం లేక, పంట చేతికొచ్చే వేళకి వర్షాలు పడడం అన్నీ కలిసి రైతులని నిలువునా ముంచాయి" ఆఫీసరు వివరించాడు.