"మరో విషయమా! అయితే అడుగు." అంది సుందర సుకుమారి.
"నిన్న తిరిగి తిరిగి అలిసిపోయిందానికి మేము బ్రహ్మాండంగా నిద్రపోయాం. నీవు మామూలుగానే కుంభకర్ణుడి చెల్లిలివి కదా! ఒక పట్టాన లేవవు కదా! అర్థరాత్రి నిద్ర ఎలా లేచావ్?" రాణి అడిగింది.
"మీరెవ్వరు నవ్వరు కదా! నేను చెప్పింది విని..." సుందర సుకుమారి అడిగింది.
"అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను. నవ్వము. ఇక చెప్పు" రాణి అంది.
"నిన్నంతా బాగా నడిచాం కదా! రాత్రి తిన్నది గంటకే అరిగిపోయింది. మా ఇంట్లో కూడా నాకో అలవాటు ఉంది. అర్థరాత్రి నడిమంచంమీద కూర్చుని ఒళ్ళో డబ్బా పెట్టుకొని...
"ఒళ్ళో డబ్బా పెట్టుకోడందేనికి?" రాణి ఆత్రుతగా అడిగింది.
"అది చెబుతున్నది కదా! మధ్యలోనే అడ్డుదేనికే మైసూర్ మహారాణీ!" వందన అడిగింది.
"కుతూహలం ఆపుకోలేక...సరేనా!" రాణి అంది.
"నీ కుతూహలం తగలబడ. సుందరిని చెప్పనివ్వండే! పానకంలో పుడకల్లాగా మీ అడ్డు ఒకటి. అదేదో కొత్త విషయం చెబుతుంటే వినకుండ మధ్యలో ఆనకట్టలు కడుతుంటారు... ఊ ... కానివ్వు సుందరి! తొందర తొందరగా చెప్పేసెయ్." అంది ప్రమద.
"మా బామ్మకి నా అలవాట్లు తెలుసు. అర్థరాత్రి లేచి ఏదోటి చిరుతిండి తింటానని నా మంచం ప్రక్కనే ఒక చిన్న డబ్బాలో స్వీటు, హాటు ఉంచుతుంది. ఆ పక్కనే మరచెంబు నిండా మంచినీళ్ళు పెడుతుంది. కడుపు ఖాళీ అయింది అనుకో...టక్ మని మెలకువ వస్తుంది. వెంటనే లేచి నిద్రకళ్ళతోనే డబ్బా ఒడిలో పెట్టుకుని కడుపులోకి పంపించి మరచెంబుడు మంచినీళ్ళు పట్టించి... చెంబుని... డబ్బాని మంచం కిందకి నెట్టి అలాగే పడి మళ్ళీ నిద్రపోతాను. ఇదో పాడలవాటు నాకు...
"ఇది పాడు అలవాటు కాదని నొక్కి వక్కాణిస్తున్నాను. ఆపై కథ కానీయ్" అంది ప్రమద.
"ఆకలి వేసింది. దాంతో నాకు మెలకువ వచ్చింది. కళ్ళువిప్పి చూద్దును కదా...దొంగ పంకజం చడీచప్పుడు లేకుండ మన సామానులు సర్దుతున్నది. దాంతో గ్రహించాను... ఆమె పక్కా మోసగత్తెని. ఆ సీను చూసిందాక నేనూ ఆమెని అనుమానించలేదు. ఎప్పుడైతే దొంగ అని నిర్థారణ చేసుకున్నానో...ఆలోచించాను. మిమ్మల్ని లేపితే అది పారిపోవచ్చు. మిమ్మల్ని లేపకుండానే దాన్ని పట్టుకోవాలి. ఎలా?"
"ఊ... చెప్పు చెప్పు." ఆత్రుత పడింది రాణి.
"చెబుతున్నాను...చెబుతున్నాను. పిల్లిలా పైకి లేచాను. అమాంతం దానిమీదకి దూకాను. నా విసురుకి అది దభేల్ మంటు బోర్లాపడింది. అదసలే దొంగ...ఏదన్నా ఆయుధాలుంటే గాయపరుస్తుంది... అన్న ఆలోచనరాగానే అమాంతం దాని నడుము మీద కూర్చుండిపోయాను. తలకాయని నేలకేసి అదిమిపట్టాను. ఇంక కేకలు మొదలుపెట్టాను." సుందర సుకుమారి చెప్పింది.
"కేకలు పెట్టావ్ సరేనే! మా పేర్లు పెట్టి లేపవచ్చుకదా! పోనీ "దొంగ...దొంగ" అని అరవవచ్చుకదా! "హత్య...హత్య" అని అరవటం...మధ్యలో కెవ్ కెవ్ మని అర్థరాత్రి ఆర్తనాదాలు దేనికి చేశావ్? ఆ దెబ్బతో మేము లేవడమే కాదు... హోటల్ లో ఉన్న మొత్తం మంది పరుగెత్తుకొచ్చారు కదా!" వందన అడిగింది.
"మనకి లైటుంటే నిద్రపట్టదు. బెడ్ లైటేమో మిళుక్ మిళుక్ మంటోంది. నేనప్పటికి ఒకసారి మిమ్మల్ని పిలిచాను. మాంచి నిద్రలో ఉన్నమీరు లేవలేదు. నేను కలవరిస్తున్నాను అనుకొని మీరటు తిరిగి పడుకోవచ్చు. పైగా అది నానుంచి తప్పించుకోటానికి ఊర్కే గింజుకుంటోంది. దాని తాలూకా వాళ్ళు బయట ఎవరన్నా ఉన్నారేమో తెలీదు. వాళ్లు కూడ లోపలికి వస్తే కొంప మునుగుతుంది. ఇన్ని ఆలోచనలు చేసిన నేను...అందరు ఒక్కసారిగా లేవాలంటే ఇలా అరవడమే శరణ్యం అనుకొన్నాను. కెవ్వుమని కేకవేసి హత్య...హత్య...రక్షించండి... అంటూ అరుపులు సాగించాను. దాంతో అందరు పరుగెత్తుకొచ్చారు."
"దిగ్రేట్ సుందర సుకుమారి! నీవలా గొంతు చించుకొని అరవక్కరలేదే తల్లీ! నీవు దాన్ని కిందకి తోసినప్పుడు అది దభేల్ న పడటం...దాని తలకాయ నేలకి తగిలి దాని తలదిమ్ము ఎక్కటమే కాక నీవు గోడకట్టిన సిమెంట్ బస్తాలాగా దానిమీదకి ఎక్కి కూర్చుంటివి. ఇంకేమి లేస్తుంది? ఆయుష్షు ఉండి బతికింది."
వందనాదేవి అన్నదానికి రాణి, ప్రమద ఫక్కున నవ్వారు.
"ప్రయాణాల్లో ప్రమాదాలు అంటుంటారు రకరకాల దొంగలు... పలురకాల మోసగాళ్ళు ఎదురవుతారని ఈ ప్రయాణం ముందు నేను మిమ్మల్ని హెచ్చరించాను. ఇంత చెప్పిన నేను కూడ ఆ మాయలాడి మాటలు నమ్మి రూమ్ కి తీసుకువచ్చాను. అర్థరాత్రి లేచి చిరుతిండి తినే అలవాటు సుందరికే గనక లేకపోతే ఈపాటికి మనం కట్టుబట్టలతో మిగిలేవాళ్ళం." వందనాదేవి అంది.
"నిజమే! ఇలాంటి అనుభవాలు ఒకటి... రెండు అయితేగాని మనం మరింత జాగ్రత్తగా ఉండం." రాణి అంది.
"ఎడ్వంచర్ సుందరి...సుందర సుకుమారి ధర్మమా అని మనం కూడ అటు ఇన్ స్పెక్టర్ నించి ఇటు ఈ హోటల్లో ఉన్నవారి దగ్గర్నించి అభినందనలు లభించాయ్. కాని ఈ అభినందనలన్నీ సుందరికే దక్కాలి. హేట్సాఫ్ సుందరి!" ప్రమద అంది.
"హేట్సాఫ్ సుందర సుకుమారి!" ఈతఫా వందన, రాణి కలిసికట్టుగా అన్నారు.