Previous Page Next Page 
మగబుద్ధి పేజి 32


    "మరి యిది స్వర్గం కాకపోతే, మీరు యింత దగ్గరగా నా పక్కన కూర్చుంటారా?" అనుమానంగా అడిగాడు.

 

    ఆమె ఆ మాటలకు సిగ్గుపడి నవ్వింది.

 

    అంతలో నర్స్ తలుపు తోసుకువచ్చింది.

 

    ఆమెను పరిశీలనగా చూశాడు నరేష్. "చామనచాయలో వున్నా బాగానే వుంది. మరి గుండెలు ఇంకాస్త ఎత్తుంటే బావుండు. తన గుండెలు ఇంకాస్త ఎత్తుగా కనిపించే బ్రా వేసుకున్నా లోపల కనపడేది కాదు. అవునూ స్వర్గంలో నర్సులు కూడా యూనిఫామ్ నే వేసుకుంటారా? ఏ యూనిఫామ్ లేకుండా వుంటే చూడముచ్చటేసేది" అనుకున్నాడతను.   

 

    రజనీని పక్కనే ఉంచుకొని మరో ఆడపిల్ల గురించి ఆలోచించడం ఎబ్బెట్టుగా అనిపించినా, అది మగబుద్ధి. మగాడ్ని కనుక ఈ బుద్ధి సహజం అని సమర్ధించుకున్నాడతను.

 

    ఆ నర్స్ వచ్చి అతని తొడమీద సిరంజితో గుచ్చింది.

 

    దాంతో అది స్వర్గం కాదనీ, భూలోకమని ఒకానొక ఆస్పత్రని తెలిసింది. నెమ్మదిగా రాత్రి జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటి గుర్తుకు వచ్చాయి.

 

    అతను ఆరాధనతో రజనివైపు చూశాడు.

 

    "నన్ను క్షమించండి. మీ దగ్గర యాక్ట్ చేయబోయి దెబ్బ తిన్నాను. మీకు అనవసరంగా శ్రమ కలిగించాను" గిల్టీగా అన్నాడు.

 

    ఆమెకు నరేష్ ఎప్పట్నుంచో తెలుసునన్న భావన ఏర్పడుతోంది. తమ అనుబంధం ఈ జన్మది కాదన్న నమ్మకం కలుగుతోంది. తనకు చాలా ఆత్మీయుడయిన వ్యక్తిని తన అజ్ఞానం వల్ల యింతకాలం గుర్తించలేనట్టు అనిపిస్తోంది.  

 

    ఆమెకు అతనితో ఏదేదో చెప్పాలనిపిస్తోంది. తన చిన్నప్పుడు కాన్వెంటుకి వెళుతూ అమ్మకు తెలియకుండా జామెంట్రీ బాక్స్ లో చాక్ లెట్లు వేసుకుపోయిన దగ్గిర్నుంచి, నాన్నంటే తనకు ఎంత ఇష్టమో నన్నంతవరకూ ఏదేదో మాట్లాడాలనుంది ఆమెకు.   

 

    అతన్ని దగ్గిరకు తీసుకొని, గుండెలకి హత్తుకొని ఓదార్చాలనుంది.   

 

    నర్స్ యింకా అక్కడ కొలనులోని తెల్ల తామరపువ్వులా ఉండడంతో ఆమెకు వీలు కాలేదు.

 

    నర్స్ సిరంజి తీసుకుని వెళ్ళిపోయింది.

 

    ఆమె ఏదో చెప్పడానికి వుద్రిక్తురాలవుతోంది. అంతలో తలుపు తెరచుకోవడం, బయటనుంచి ఓ గుంపు లోపలికి రావడం జరిగింది. రాళ్ళపల్లి కుటుంబం, ప్రసాద్, అతని భార్య శ్రీలక్ష్మి వచ్చారు.

 

    రజని లేచి నిలబడింది.

 

    రాళ్ళపల్లి, ప్రసాద్ మంచం చెరువేపులా చేరారు. "నరేష్ హౌ ఆర్యూ?" రాళ్ళపల్లి మెల్లగా అతని ఛాతీమీద చేయివేసి పరామర్శించాడు.

 

    "బావుంది సార్! నేను హాస్పిటల్ లో వున్నానని మీకెలా తెలుసు సార్?"

 

    "నేను రూరల్ ఎస్.ఐ.నయ్యా! నాకు తెలియకుండా నా పరిధిలో చీమ కూడా అడుగువేయదు. రాత్రి ఆసుపత్రివాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ లో ఈ అమ్మాయి కూడా మాట్లాడింది" అంటూ రజనివేపు చూశాడు ఆయన.

 

    మళ్ళీ ఆయనే చెప్పాడు. "నువ్వు చేసిన ఘనకార్యం అంతా రజనీ చెప్పింది. అయినా నువ్వు కిరాయి గూండాలను కుదుర్చుకొని వాళ్ళను చావబాదేస్తే ఎలా? నీలాంటివాడే ఒకడు రాముడు వేషం వేసి సీతను ద్రౌపదీ అని సంబోధించాడట. అలా వుంది నీ వ్యవహారం. ఇంతకీ అ జగ్గారావు నీకెలా తెలుసు?"    

 

    "నేను సజెస్ట్ చేశాను సార్! నాకు విషయమంతా చెబితే మన కాలనీలోని జగ్గారావుని కలవమని నేనే సలహా ఇచ్చాను సార్" చెప్పాడు ప్రసాద్ నొచ్చుకుంటూ.   

 

    శ్రీలక్ష్మి ఆ మాటలకు రెచ్చిపోయి అతని దగ్గర కొచ్చింది. "చిరంజీవిలా హీరోగా బతకలేరు. కనీసం సలహాలు ఇవ్వడంలోనయినా చిరంజీవి ప్రజ్ఞను చూపించండి. అదే నా చిరంజీవి అయితే నరేష్ చెప్పింది విని 'నువ్వెళ్లు. ఇక మిగిలిన కథ నే చూసుకుంటా' అని ఈ నాటకాన్ని అద్భుతంగా రక్తి కట్టించేవాడు."  

 

    భార్యవేపు చూస్తూ ప్రసాద్ కసిగా అన్నాడు. "మీ చిరంజీవి కంటే వెనకాల నిర్మాత దమ్ముంది. అతను హీరోయిన్ దగ్గరకు వెళ్ళడం సంగీతం దర్శకుడు రెడీగా కాచుక్కూర్చుని వుంటాడు. ఎప్పుడు బాల సుబ్రహ్మణ్యం గొంతు విప్పుతాడా మ్యూజిక్ వాయిద్దామా అని. రౌడీలు కనిపించగానే మీ చిరంజీవి కంటే ముందు ఫైట్ మాస్టర్ రాజూనో, విజయనో రడీగా వుంటారు మరి మాకెవరుంటారు? మేమే ఫైట్ చేయాలి."

 

    ఆ మాటలు శ్రీలక్ష్మికి అర్థం కాలేదు. తెరమీద చూసేదంతా చిరంజీవి ప్రతిభేనన్న ప్రగాఢ నమ్మకం ఆమెకు. ఆ పిచ్చి వదిలితేగానీ మిగిలిన విషయాలు అర్థంకావు.

 

    "మీరు ఎన్నయినా చెప్పండి. నా చిరంజీవి కధే వేరు. నరేష్ స్థానంలో నా చిరంజీవే వుంటే ఆ రౌడీలను చితకబాది హీరోయిన్ ను ఎత్తుకొని పాట కోసం ఏ ఊటికో, కాశ్మీర్ కో వెళ్ళుండేవాడు" శ్రీలక్ష్మి కళ్ళు చిరంజీవి పట్ల ఉన్న ఎడ్మైరింగ్ తో మెరుస్తున్నాయి.

 

    "నరేష్ ప్రస్తుతమున్న స్థితికీ, మీరు మాట్లాడే విషయానికీ మ్యాచింగ్ కుదరడం లేదు. కాసేపు ఊరుకోండి" అంది స్వప్న. ఆమె విషాదానికి సూచనగా మొత్తం నల్లటి డ్రస్ వేసుకొచ్చింది.

 

    నరేష్ ఏదో గుర్తొచ్చినట్టు కొద్దిగా కదిలి ప్రసాద్ ను అడిగాను "సార్! రాత్రి మీ ఫస్ట్ నైట్ బాగా జరిగిందా సార్?"

 

    దాంతో తన భార్యను ఓ క్షణం కోపంగా చూసి తలను టపాటపా రెండుమూడుసార్లు కొట్టుకుని చెప్పాడు అతను. "రాత్రి ఫస్టునైట్ లేదూ, పాడూ లేదూ. అలంకరించిన ఆ గదినీ, ఆ గదిలో శ్రీలక్ష్మిని చూశాక తట్టుకోలేకపోయాను. చిరంజీవి అనుకరణంతా ఎగిరిపోయింది ఆ ఆవేశంలో నా ఒరిజినల్ స్టయిల్ వచ్చేసింది. దాంతో శ్రీలక్ష్మికి మూడ్ ఎగిరిపోయింది అలనాడు శ్రీకృష్ణుడ్ని సత్యభామ ఎలా తన్నిందో అ లెవల్లో తన్నలేదుగానీ తన పొదుగును పట్టుకున్న పరాయివాడ్ని గేదె ఎలా తంతుందో అలా తన్నింది."  

 

    అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. రాజు మాత్రం నోరు విప్పలేదు. అతన్ని గమనించిన రజని అడిగింది. "ఏం బాబూ నువ్వు నవ్వలేదు. విషయం అర్థం కాలేదా?"

 

    దానికి వాడు "మీకంటే ఎక్కువగానే విషయం అర్థమైంది. అయితే ఎవరయినా లంచం ఇస్తే తప్ప నేను నవ్వను" అన్నాడు.

 Previous Page Next Page