Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 32


    వెంకయ్య దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారిద్దరు. జానకి వచ్చి వారిని కలుసుకుంది. ఆమె నాగేశ్ ను ఉడికించింది. రుక్మిణి అన్నవీ అననివీ చిలవలు పలవులుచేసి చెప్పింది. నాగేశ్ అదోలా అయిపోయాడు. ఏదో కొత్త ప్రాణం వచ్చినట్లయింది.

 

    ఏదో ఒక పని కల్పించుకొని నాగేశ్ వెంకయ్య ఇంటికి తరచూ వెళ్తున్నాడు. అప్పుడప్పుడు రుక్మిణి కనిపిస్తూనే ఉంది. చూపుల మాటలతో సంతృప్తి కలగడంలేదతనికి. అవకాశం చిక్కించుకొని మాట్లాడాలని అతని ఉబలాటం. ఆ మాటల్లో ఏదో అమృతం ఒలుకుతుందని అతని అభిప్రాయం. కాని అతనికి అనేక పనులు. ఒక్క గ్రంథాలయమేనా అతనికి? రాత్రి పాఠశాలలు, పత్రికలు చదివి వినిపించడాలు, పైగా సింగన్నతో సంబంధం, ఒకటి రెండుసార్లు కోయగూడెం కూడా వెళ్ళివచ్చాడు.

 

    గ్రంథాలయానికి చందాలు బాగానే వసూలైనాయి. పెద్ద బజారులో ఇల్లుకూడా అద్దెకు తీసుకున్నారు. హైదరాబాదు నుంచీ, బెజవాడ నుంచీ పుస్తకాలు కూడా వచ్చాయి. కాని నైజాంలో గ్రంథాలయం అంటే వట్టి చదువుకునే చోటుమాత్రం కాదు. అది రాజకీయ కేంద్రం. అక్కణ్ణుంచే ఉద్యమాలన్నీ పుట్టాయి. గ్రంథాలయం అంటే బెదురు నైజాం నవాబుకు. అందుకే కఠినమైన శాసనాలు చేశాడు. కొన్ని గ్రంథాలయాలను జప్తుచేసి సీళ్లువేయడం, కార్యకర్తలను నానాయాతనలు పెట్టడం అనేకచోట్ల జరిగాయి.

 

    అయినా గ్రంథాలయం స్థాపించదలచాడు రఘు. ప్రారంభోత్సవం ఘనంగా చేయాలనీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలనీ సంకల్పించాడు. నైజాంలో వాక్సభా స్వాతంత్ర్యాలు మృగ్యం. ప్రజల నోళ్ళు కొట్టివేయడానికి గస్తీ నిషాన్ 53 వెలువడింది. ఆ గస్తీ (సర్క్యూలర్) ప్రకారం సభ జరుపుకోవాలంటే అవ్వల్ తాలూక్దారు (కలెక్టరు) నుండి అనుమతి తీసుకోవాలి. ఇందు విషయంలో కలెక్టరు పోలీసుశాఖ సలహాలను తప్పనిసరిగా పాటించాలి. అందును గురించి అనేక నియమాలు. బయటవారు సభలో పాల్గొనరాదు. రాజకీయములైన ఉపన్యాసాలు చేయరాదు. ఉపన్యాసం రాజకీయమైనది ఔనా, కాదా అనే విషయంలో తుదినిర్ణయం ప్రభుత్వపుది. రాజకీయమైన ఉపన్యాసానికి ఒక నెల జెయిలు శిక్ష. 200 రూపాయీల జరిమానా విధించబడుతుంది.

 

    నల్లగొండలో ఒక గ్రంథాలయ వార్షికోత్సవానికి అనుమతి యివ్వవలసిందని తాలూక్దారుకు దరఖాస్తు పెట్టుకున్నారు నిర్వాహకులు. తాసిల్దారుకు అధికారం ఉన్నప్పటికీ న్యాయస్థానాధికారి అనుమతి పొందవలసిందన్నాడు. అతడు పోలీసు వారి అభిప్రాయం కోరాడు. ఉపన్యాసాలు రాజకీయ పరిణామం పొందే అవకాశం వుందని రాశారు. నాజిమ్ ఏదీ తేల్చి చెప్పక బాబెహుకుమత్ (ప్రభుత్వ) శలవు పొందమన్నాడు. నిర్వాహకులు బాబెహుకూమత్ కు అర్జీ పెట్టుకోగా వారు త్రోసివేశారు.

 

    రఘుకు ఇన్ని ఇబ్బందులు కలుగలేదు. ఈ జాగీరుకు సంబంధించినంతవరకు మున్సిఫ్ అవ్వల్ తాలూక్దారుగా వ్యవహరించేవాడు. దరఖాస్తు పెట్టుకోగానే అనుమతి యిచ్చేశాడు. అందువల్ల తాసిల్దారుకు మున్సిఫ్ కూ నిప్పులో ఉప్పు వేసినట్లయింది.

 

    సభ ఏ రోజు జరిగేదీ నిర్ణయం అయింది. కరపత్రాలు జాగీరు మొత్తంలోనూ పంచి పెట్టారు. ప్రజలకు సభ అనే పదం వింతగా కనిపించింది. అదేమిటో చూడాలనే ఉబలాటం కలిగింది. ఏ పల్లలో చూచినా, యే బస్తీలో చూచినా, యే వ్యక్తిని చూచినా సభను గురించే చర్చ సాగింది.

 

    సభ ఊరిబయట యేర్పాటు చేయబడింది. సభాస్థలంలో పెద్ద పెద్ద పందిళ్ళు వేయబడినాయి. పచ్చని తోరణాలతో వేదిక అలంకరించబడింది. స్త్రీలకు, పురుషులకు ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేయబడింది. స్వచ్చంద సేవకులు సకల యేర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాదు నుండి నాయకులు వచ్చేశారు. వారు విడిచిన చోట జనం తండోవ తండాలుగా కూడింది. వారిని ప్రశ్నలడగడం, వారి సమాధానాలు వినడం, వాళ్ళల్లో వారు చర్చించుకుంటుంటే ఆలకించడం వింతగానూ వేడుకగానూ ఉంది జనానికి.

 

    ఊళ్ళకు ఊళ్ళు తరలివస్తున్నాయి. గుర్రాలమీద, బండ్లమీద, కాలినడకన సద్దులమూటలు నెత్తిన పెట్టుకొని సాగారు పల్లీయులు. కోయ గూడేలు కూడా కొన్ని కదిలాయి. సింగన్న గూడెం మాత్రం మొత్తంగా కదలి వచ్చింది.

 

    ఆ జనం, ఆ ఉత్సాహం తాసిల్దారు కంట్లో నిప్పులు పోశాయి. అమీను, తాసిల్దారు, గిర్దావరు మంతనాలు సాగించారు. గుండాలకు తాగుడు పోయించి దార్లు కాయించారు. అక్కడికి చేరుకునే ప్రతిబాటమీదా ప్రజలకూ గుండాలకూ ఘర్షణ జరిగింది. రఘు, నాగేశ్, రావఁడు, భీముడు పరుగులు పెట్టారు. దెబ్బలు తగిలినవారికి కట్లు కట్టారు. కొందరు గుండాల తలలు పగిలాయి. ప్రజలు మాత్రం బయలుదేరినవాడు ఒక్కడూ వెనక్కు పోలేదు.

 

    సభకు రావలసిందని జానకి రుక్మిణిని కోరింది. తల్లి ముందు వారించింది. కాని జానకి వెళ్ళుతూంది. కాబట్టి అంగీకరించింది. వారిద్దరూ సభాస్థలికి చేరుకునే వరకు అది జనంతో నిండిపోయింది. జనం జనం జనం! ఎక్కడ చూచినా జనం, అది జన సాగరం. జానకీ, రుక్మిణీ వేదికమీదికి చేరారు. రుక్మిణికి అది పెద్ద గౌరవంగా కనిపించింది. కొంత గర్వం కూడా తలెత్తింది. ఆమె కనులు నాగేశ్ కోసం వెదికాయి. అతడు ఎక్కడో హడావుడిలో ఉన్నాడు. తుదకు కనిపించాడు. వాలంటీర్లకు ఏవేవో ఆదేశాలిస్తున్నాడు. ఆమె గుండె నిండింది. ఆమెకు పెన్నిధి దొరికింది.

 

    సభ ప్రారంభం అయ్యే సమయానికి రఘు, నాగేశ్ వేదిక మీదికి వచ్చేశారు. నాగేశ్ రుక్మిణిని చూచాడు. అతనికి గిలిగింతలు పెట్టినట్లయింది. చిరునవ్వు నవ్వాడు. ఆమె పెదవులు చిరునవ్వులు చిందాయి. చిరునవ్వుల వెన్నెలలు కురిశాయి, మల్లెలు రాలేయి. క్షణంలో మనసు మళ్ళించుకున్నాడు నాగేశ్. కార్యక్రమంలో నిమగ్నుడైనాడు. రుక్మిణి చిన్నబోయింది.

 

    సభకు వీరయ్యగారు అధ్యక్షత వహించారు. పుస్తకాలు తనమీద ఎలాంటి ప్రభావం వేశాయో వివరించి అవి తమ కండ్లు తెరిపించాయని చెప్పారు. ఈ మహాసభ జరపడానికి కారణభూతులలో రఘు తనకు అల్లుడైనందుకు గర్విస్తున్నానని చెపుతూ, నాగేశ్ తనకు కొడుకువంటి వాడన్నారు.

 

    సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. సకల జనులూ వీరయ్యగారిని మెచ్చుకున్నారు.

 

    తరవాత ఒక్కరొక్కరే నాయకులంతా ఉపన్యాసాలు ఇచ్చారు. కొందరు ఉద్రేకంగా ఉపన్యసించారు. కొందరు తాపీగా మాట్లాడినా ప్రజల సమస్యలను గురించే మాట్లాడారు. ఉపన్యాసకులు తమ సమస్యలను గురించే చెపుతుండడాన ప్రజలు చాలా శ్రద్ధగా విన్నారు.

 

    ఉపన్యాసాలు జరుగుతుండగానే వేదికమీద రాళ్ళు పడ్డాయి. ఒక పెట్రోమాక్సు బ్రద్దలైంది. చుట్టూ ఈలలు మోగాయి. జనం మీద కూడా రాళ్ళు పడ్డాయి. కొంత కలవరం బయలుదేరింది. కాని, అది ఎంతోసేపు ఉండలేదు. నిర్వాహకులు అందును గురించి ముందే జాగ్రత్తపడ్డారు. దుండగులు బెదిరి పారిపోయారు. అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.

 

    సభా కార్యక్రమం మళ్ళీ మామూలుగా సాగింది. ఉపన్యాసాల తరువాత బుర్రకథ  ప్రారంభం అయింది. అదీ ప్రజల సమస్యకు సంబంధించిందే. నిశితంగా దుయ్యబట్టారు అధికారులను. అది ఎంతో ఆనందాన్ని కలిగించింది ప్రజలకు. మొదటిసారిగా అధికారులనూ, ప్రభుత్వాన్ని విమర్శించడం విన్నారు వారు. అదీ బహిరంగంగా. అంతమంది జనంలో ఇన్ని ఉపన్యాసాలు చేయలేనిపని ఒక్క బుర్రకథ చేసింది. అది వారి మనసుల్లో నిలిచింది.

 

    సభ ముగిసింది. జనంలో ఒక ఉత్సాహం, ఒక ఉద్రేకం, ఒక ఉత్తేజం కలిగించాయి. వారు నినాదాలు చేశారు. తాసిల్దారును తిట్టారు. గిర్దావరును దుయ్యబట్టారు. అమీన్ను అణగదొక్కాలన్నారు. వారంతా మనుషులేననీ, సామాన్యులేననీ, తమ అజ్ఞానం వల్లనే తమ భయం వల్లనే వాళ్ళ అధికారం సాగుతూందనీ గ్రహించారు జనం. గుంపు గుంపులుగా ఇందును గురించే మాట్లాడుకుంటూ ఊళ్ళకు తరలారు.

 

    సభాస్థలం ఖాళీ అయింది. వాలంటీర్లు గడలు పీకుతున్నారు. చాపలు చుడ్తున్నారు. వేదికకూడా ఖాళీ అయింది. మిగిలింది రుక్మిణీ, నాగేశ్ లు. సభ జరుగుతున్నంతసేపూ ఏకాంతం కావాలని, ఏదో మాట్లాడుకోవాలని పరితపించాయి పరువపు గుండెలు. అతడే మనుకున్నాడో ఆవిడకు తెలియదు. ఆవిడ ఏమనుకుంటుందో అతనికి తెలియదు. అయినా ఇద్దరి ఆవేదనా ఒకటే. ఇద్దరి ఆరాటం ఒకటే. ఇద్దరి ఉబలాటం ఒకటే. ఒకటి ఒకటే. రెండు ఒకటి కావాలి. ద్వైతం అద్వైతం కావాలి. అందులో ఏదో ఆనందం ఉంది. ఏదో ఆహ్లాదం ఉంది. ఏదో అనుభూతి ఉంది.

 

    అంతసేపటినుంచీ నిరీక్షించిన సమయం వచ్చింది. ఇద్దరు, ఇద్దరే ఏకాంతం ఒకరి ముందు ఒకరు. ప్రశాంతత. పక్క నెవరూలేరు. ఇద్దరి హృదయాలు గుబగుబలాడాయి. గంతలువేశాయి. మల్లెలు మొలిచాయి. గులాబీలు విరిశాయి. అన్నీ గుండెల్లోనే. రెండు ముగ్ధ హృదయాలు, రెండు మూగ గుండెలు.

 

    ఒకరి సరసన ఒకరు. వారికి చూపుల భాష తెలుసు. వాటి బాసలు తెలుసు. పెదవి అంతకుముందు కదలలేదు. దాన్ని కదిలించాలనే తుపాను గుండెల్లో రేగుతూంది. నాగేశ్ కు విప్లవం తెలుసు, రక్తం తెలుసు, చంపడం తెలుసు, చావడం తెలుసు. కాని? ఈ అనుభూతి కొత్తది - రుక్మిణికి వ్రతాలు తెలుసు, పూజలు తెలుసు, నోములు తెలుసు. ఈ అనుభూతి కొత్తది.

 

    కాలం జారిపోతూంది. క్షణాలు నిముషాలుగా మారిపోతున్నాయి. జారిపోతున్నాయి. ఇద్దరి గుండెలకు రెక్కలొచ్చాయి. రెపరెపలాడేయి. ఎగరాలి. పోవాలి. అంబరాల్లోకి, జంటగా, జతగా, వారి ఊహల్లో వెన్నెలల పందిళ్ళు వెలిశాయి. చుక్కల సోపానాలు కనిపించాయి. ఆ పందిళ్ళకు పోవాలి! ఆ మెట్లు ఎక్కాలి!

 Previous Page Next Page