రామదాసు ఖైదీ విషయం జ్ఞాపకానికొచ్చి ఆ మాటంటూ మెట్లెక్కాడు ఆయన.
సరిగ్గా అదే సమయంలో....
ఆంజనేయులు, ఆ ప్రక్కన తరణి తోటలోంచి నడుచుకుంటూ వస్తున్నారు.
"ఆ జంట ఎంత కన్నులపండుగ్గా ఉందో చూశారా?" అబ్బురంతో తబ్బిబ్బవుతూ అంది భువనేశ్వరీ దేవి.
తలతిప్పి చూశాడు భుజంగరావు.
ఒక్కక్షణం నిశ్చేష్టుడైపోయాడాయన.
"నమస్కారం బాబాయిగారూ..." కాళ్ళకు వంగి దండం పెడుతున్న తరణి భుజాలమీద అప్రయత్నంగా చెయ్యివేసి పైకెత్తాడాయన.
ఆయన కనుపాపల్లోకి రెండు కన్నీటి బిందువులు అకస్మాత్ గా వచ్చి నిలిచాయి.
"హాయిగా పిల్లా పాపలతో..." అనబోయి ఆగిపోయాడాయన.
తన కాళ్ళకు నమస్కారం పెట్టిన తరణిని, ఆప్యాయంగా పైకెత్తి నుదుటిమీద ముద్దు పెట్టుకుని..
"మనమ్మాయే ఇంటికొచ్చినట్టుంది గదండీ-" అంది భువనేశ్వరి.
భుజంగరావు ఏం మాట్లాడలేదు.
"ఈ ముసిలాళ్ళిద్దరకూ కూతురు సెంటిమెంటు ట్రాక్ ఒకటి ఉన్నట్టుంది" మనసులో అనుకున్నాడు ఆంజనేయులు.
టిఫిన్లయిపోయాక-
"అమ్మాయి ఈవాళ యిక్కడే వుంటుంది... నువ్వు ఆఫీస్ కెళ్ళి సాయంత్రం త్వరగా యింటికి రా బాబూ..." అంది ఆంజనేయులుతో భువనేశ్వరీదేవి.
చేసేది లేక బయటికొచ్చేస్తున్నప్పుడు మెట్లమీద బాసింపట్టు వేసుక్కూర్చున్న భుజంగరావు...
"చూడు అంజిబాబూ... మొన్న ఆ ఇంటి ముందు ముగ్గులెట్టింది... ఈ ఆడంగి వెధవని నాకు తెలుసు... మరి... నిన్న నీ రూమ్ కొచ్చిన అమ్మాయెవరు? ఈవాళ ఈ అమ్మాయెవరు? వీటికి సాయంత్రం నువ్వొచ్చినప్పుడు సమాధానాలు చెప్పాలి..." అన్నాడు చుట్ట కాలుస్తూ, ఎటో చూస్తూ.
"ఆ సమాధానాలు ఇప్పుడు చెప్పకూడదా?" బుర్ర గోక్కుంటూ అన్నాడు ఆంజనేయులు.
"కట్టుకథలల్లటానికి టైమ్ కావాలి గదయ్యా... అందుకు..." అదే సమయంలో భువనేశ్సరీదేవి పిలవడంతో లేచి లోనికెళ్ళాడాయన.
"ఏమిట్రా యిది?" ఆనందం వేపు చూస్తూ అన్నాడు.
"ఏమీ తెలియనట్టు నన్నడుగుతావేం... ఇక నుంచీ నీ పర్సనల్ విషయాల్లో నాకేం సంబంధం లేదంతే..." చిరాకుపడ్డాడు ఆనందం.
ఇద్దరూ గేటు దాటి రోడ్డుమీద కొచ్చారు.
* * * *
లోనకెళ్ళిన భుజంగరావు దగ్గరకొచ్చి, భువనేశ్వరి నెమ్మదిగా "ఆ అమ్మాయికి కార్యవింకా కాలేదట... మాటల్లో పెట్టి అడిగేను. ఈవేళ శుభకార్యాన్ని మనింట్లోనే చేయించాలనుకుంటున్నాను... ఏవంటారు?" అనడిగిందావిడ.
"ఈ కార్యాల పిచ్చేవిటే బాబూ నీకు... అస్సలు వాళ్ళ సంగతేంటో అర్ధంకాకుండా వుంటే, కార్యాలూ, కర్తలూ అంటూ ఈ పోరేవిటి మధ్యన."
"చిలకా గోరింకల్లా ఇద్దరూ కాళ్ళమీద పడితే హాయిగా పిల్లాపాపలతో అని ఆశీర్వదించింది మీరే కదా... మళ్ళీ అనుమానం ఏవిటండీ... ఓ కన్యకి గర్భాదానం చేయిస్తే, మన పిల్లలకి పుణ్యమండీ చచ్చు ఆలోచనలు మానేసి, ఆ పురోహితుడికి కబురు చెయ్యండి"
మరే మాటా వినకుండా విసవిసా వెళ్ళిపోయిందావిడ.
కళ్ళు తేలవేశాడాయన.
* * * *
జరుగుతున్నది ఏవిటో ఒక్కపిసరు అర్ధం కావడంలేదు భుజంగరావుకి.
మేడమీద ఓ గదిని శోభనం గదిగా అలంకరణ చేయించింది భువనేశ్వరి.
"సరిగ్గా తొమ్మిదీ నలభై నిమిషాలకు మంచి ముహూర్తమండీ... అబ్బాయి అలంకరణ విషయం మీరు చూడండి" పురోహితుడు వచ్చి వెళ్ళిపోయాక అంది భువనేశ్వరి భర్తతో.
నిజమేనేమో... వాళ్ళిద్దరూ భార్యాభర్తలేనేమో... ఇల్లు కోసం తనకు పెళ్ళికాలేదని అంజిబాబు అబద్ధాలాడేడేమో... సాయంత్రం వరకూ రకరకాలుగా ఆలోచిస్తూ కూర్చున్నాడు భుజంగరావు.
సరిగ్గా ఆరుగంటలకు ఆంజనేయులు ఊడిపడ్డాడు.
"టాపిక్ సీరియస్ కాకముందే, సత్యం చెప్పవోయ్ మగడా... నిజంగా ఆ పిల్ల నీ పెళ్ళమేనా?"
"అంకుల్... గాడ్ దుర్యోధనుడి మీద ఆన అంకుల్... మీతో, నా గాడ్ లాంటి మీతో, ఎప్పుడయినా అబద్ధం ఆడేనా అంకుల్... నిజంగా ఆ అమ్మాయెవరో నాకు తెలీదంకుల్..." చేతులు కట్టుకుని చెప్పాడు ఆంజనేయులు.
"మరి ఈ ఇంటికే ఎలా వచ్చింది?"
ఆ ప్రశ్నకు వెలవెలబోయాడు కుర్రాడు.
"నాకెలా తెలుస్తుందంకుల్... నా ఖర్మ... అంతే."
"నీ మొహం చూస్తే నిన్ను నమ్మబుద్ధేస్తోందోయ్... కానీ... ఆ పిల్ల మొహం చూస్తే నీ మీద అనుమానం వస్తోందోయ్. అదీ గాక... మొన్నొచ్చిన అమ్మాయి..."
"ఆ ప్రశ్నలన్నింటికీ తీరుబడిగా ఎప్పుడయినా సమాధానం చెప్తానంకుల్... ప్రస్తుతానికి ఈ శోభనం గొడవ నుండి నన్ను రక్షించండి అంకుల్."
"నిజమేనంటావా?"
"నిజమంకుల్"
"అయితే ఓ పనిచెయ్యి... మా ఆవిడ పట్టు ఉడుంపట్టు... ఆ కార్యక్రమం అయితేనేగానీ దానికి నిద్రపట్టదు... పద్ధతి ప్రకారం నువ్వు స్నానాలవీ చేసి, కొత్తబట్టలవీ కట్టుకుని గదిలోకి తగలడు... వెనక తలుపు లోంచి బయటపడి, నీ అవుట్ హౌస్ లోకి వెళ్ళిపో... అంతే" సలహా యిచ్చాడు పెద్దాయన.
"ఏం ఐడియా ఇచ్చారంకుల్" అని పెద్దాయన్ని మెచ్చుకుంటుండగా..
"వచ్చావా నాయనా... బాత్రూంలో వేడినీళ్ళు పెట్టించాను... స్నానాలవీ కానిచ్చెయ్..." అనుకుంటూ భువనేశ్వరీదేవి వచ్చేసింది.
"పదవోయ్... నిన్ను దగ్గరుండి స్నానం చేయిస్తాను..." అంటూ హుషారుగా ఆంజనేయులు వెనుక వెళుతున్న భర్తవేపు విడ్డూరంగా చూస్తూ నిల్చుంది భువనేశ్వరి.