"ఏంటన్నయ్యా... టవలా... ఆ సూట్ కేస్ లో వుంది తీసుకో..." అని జవాబిచ్చి, మూలనున్న చీపురు పట్టుకొని హాలు ఊడ్వడం ప్రారంభించింది సీరియస్ గా.
"రాత్రికి చెప్తాలేండి..." అని తరణి అన్నమాట ఆనందం చెవిన పడింది.
"రాత్రిళ్ళు చెప్పుకుంటారట రాత్రిళ్ళు... వెధవ... అంజిగా నన్ను కూడా బోల్తా కొట్టించాలని చూస్తావా... నేన్నమ్మనుగా... నమ్మనంటే నమ్మనుగా" అంటూ బాత్ రూమ్ లోకి దూరాడు.
ఏదో పాటను 'హమ్' చేస్తూ గదులన్నీ తుడుస్తున్న తరణి వేపే అయోమయంగా చూస్తున్నాడు ఆంజనేయులు. నెమ్మదిగా లేచి వెళ్ళి ఆమె వెనక నిలబడ్డాడు.
"నా ఎడ్రసే ఇచ్చి, నిన్నెవరు పంపించారో చెప్పవా... మేరీ పంపించింది కదూ... ప్లీజ్... ప్లీజ్... చెప్పవా..."
తలెత్తి చూసి-
"ఆ మేరీమాథ్యూస్ గురించేనా మీరడుగుతున్నది ఆ మాథ్యూసూ పంపలేదు... ఎడ్వకేట్ జిగురుమూర్తీ పంపలేదు. నేనే వచ్చాను. ఏం నేను రావడం నచ్చలేదా... నేను రావడం వలన మీకు చాలా ఉపయోగాలున్నాయి. ఇకనుంచీ పొరిగిళ్ళలో తిండి తినాల్సిన అవసరం లేదు... బట్టలు వుతుక్కోవాల్సిన అవసరం లేదు... ఇల్లు తుడుచుకోవాల్సిన అవసరం లేదు... ఇంకా"
ఏదో చెప్పబోయి-
"అన్నయ్య వస్తున్నాడు లెండి... పగటిపూట సరసాలేవిటీ..." గట్టిగా ఆనందానికి సిన్పించేట్టుగా అనేసి లోనకెళ్ళిపోయింది.
"వామ్మో... అంజిగా..... నేను లేనప్పుడు సరసాలాడుతూ ఆ అమ్మాయెవరో తెలీదని బుకాయిస్తున్నావ్... కదరా..." తల తుడుచుకుంటూ అడిగాడు.
"బాబూ... నన్నొదిలెయ్... నా బుర్ర పిచ్చెక్కిపోతోంది..." విసురుగా బాత్ రూమ్ వేపు వెళ్ళిపోయాడు ఆంజనేయులు.
ఓ అరగంట తర్వాత అప్పల్రావుడొచ్చాడు.
"అమ్మగారు చిన్నమ్మగార్నీ, మిమ్మల్నీ టిఫిన్ కి పిలుస్తున్నారు" అన్నాడు వినయంగా.
"వస్తాం... లే...పో..." అని గసిరేసి...
"ఈవిడొకత్తీ... నా ప్రాణం మీదకు... ఎవరెవరు అక్కడకు తగలడాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కట్టగట్టుకుని రావచ్చు..." అనేసి బయట ద్వారబంధం దగ్గర నిల్చున్నాడు ఆంజనేయులు.
"నేను అంకుల్ తో మాట్లాడుతుంటాను... నువ్వూనూ, మా సిస్టరున్నూ కల్సిరండి" అంటూ ముందు వెళ్ళిపోయాడు ఆనందం.
తోట దాటి, మెట్లెక్కబోతున్న ఆనందంకి ఏదో పిలుపు వినబడటంతో తలతిప్పి చూశాడు.
భుజంగరావు!
"ఏవిటట? మా ఆవిడ హడావుడి పడిపోతోంది... అమ్మాయొస్తోందీ అమ్మాయొస్తోందీ అని- నువ్వేమో... ఇలా వచ్చేసేవు... ఇంక అమ్మాయి ఎక్కడ నుంచొస్తుందోయ్?"
"అమ్మాయాండి... వచ్చిందండి... రాత్రి వచ్చిందండి... అదీ హడావుడి..." కసిగా అన్నాడు ఆనందం, తన అనుమానం ఆయన మీదకు మరలగా.
"ఇద్దరూ కలిసి కొత్త డ్రామా ఆడుతున్నారా... నేనన్నీ గమనిస్తున్నా... నిజం చెప్పు... ఆ అమ్మాయెవరో చెప్పు...?" గదమాయిస్తూ అడిగాడాయన.
"ఆ... వార్ని... ఎస్వీ రంగారావ్, వేమూరి గగ్గయ్య లెవెల్లో ఎంత గొప్పగా నాటకమాడేస్తున్నారండి... ఛా... ఊరుకోండి" అన్నాడు ఆనందం రహస్యాన్ని కనిపెట్టినట్లు ఫోజుపెడుతూ.
భుజంగరావుకేం అర్ధం కాలేదు.
ఎస్వీ రంగారావు ఎవరు? వేమూరి గగ్గయ్య ఎవరు?
అర్ధంకానట్లు ముఖం పెట్టాడు భుజంగరావు.
"అలా అర్ధంకానట్లు, మీకేం తెలీనట్లు ముఖం పెడితే నమ్మటానికి నేను ఆంజనేయుల్ని కాదు. మీ ఆవిడ్ని అంతకంటే కాదు... నా దగ్గర కుదరదు" అన్నాడు అదే ధీమాతో.
"నీకుగాని, పిచ్చిగాని పట్టేసిందా...? నువ్వేం మాట్లాడుతున్నావో నీకర్ధమౌతుందా?" చిరాకు పడ్డాడాయన.
"ఆస్కార్ లెవెల్లో నటించేస్తున్నారు గదండి. మా అంజిగాడ్ని, వాడి శీలాన్ని పరీక్షించాలని ఒక అమ్మాయిని రాత్రికి రాత్రి మా ఔట్ ఏరిస్ లో దింపుతారా? దింపింది గాక ఆ అమ్మాయెవరో చెప్పు అని నన్నే దబాయిస్తారా? నేనేమన్నా చెవిలో పూవు, నోట్లో వేలు వేసుకు కనిపిస్తున్నానా? ఆ... ఈ విషయం పిన్నిగారికి చెప్పానంటే..." ఇంకా మాటలు పూర్తి కాలేదు.
భుజంగరావు కొట్టిన దెబ్బకి ఆనందం గూబ గుయ్ మంది... బ్యాలెన్స్ తప్పి పడబోయి కొద్దిగలో తమాయించుకున్నాడు.
"పిచ్చి వెధవ... పిచ్చి కూతలు కూస్తావా...? నేను అమ్మాయిని దింపానా? ఎక్కడి నుంచి తెచ్చి? అసలు నేనీ బంగ్లా దాటక పాతికేళ్ళయింది. మీ ఇద్దరూ కలిసి ఏదో నాటకమాడుతూ నా మీద పెడతారా... చమడాలు వలిచేస్తా... కుర్రకుంక..." అన్నాడు భుజంగరావు ఉగ్రుడయిపోతూ.
ఆనందానికి ఈసారి నిజంగానే పిచ్చిపట్టి పోయినట్లయింది. అసలేం అర్ధంకాకుండా పోయింది.
"చెప్పు... నిజం చెప్పు..." అంటూ భుజంగరావు ఆనందం చెవి మెలేసి పట్టుకొని గద్దించాడు.
"లేదండి బాబాయిగారూ... నాకేం తెలీదండి... అంతా అయోమయంగానూ, కించితు అంధకారంగానూ వుందండీ. వాడా! నాకు తెలీదంటాడు... తీరా చూస్తే... స్టూడియోలోంచి తెచ్చిన ఫోటోలోలాగే ఉందాపిల్ల... పేరు కూడా సరిపోయింది. పెరూ అబద్ధమే, ఫోటో కూడా అబద్ధమే... అయితే ఆ పిల్ల డ్రామా ఆడుతోందో, లేక నిజంగా వాళ్ళిద్దరూ ఈ జన్మలోనే భార్యాభర్తలా, లేక పూర్వజన్మ జ్ఞాపకంగా ఇలాగ ప్రవర్తిస్తున్నారో... బాబాయిగారూ... నన్నిక కన్ ఫ్యూజ్ చెయ్యకండి. ఇప్పటికీ ఈ షాకులన్నిటికీ తట్టుకోలేక, గుమ్మడికాయలా వుండే నా మెదడు చింత పిక్కలా అయిపోయింది... ప్లీజ్... బాబాయిగారూ" ఆనందం దీర్ఘోపన్యాసానికి అంత బాబాయి ముఖంలో ఎన్నో ప్రశ్నార్ధకాలు కనిపిస్తుండగా-
"ఏవిటీ అక్కడే నిలబడిపోయారు? అమ్మాయీ, అంజిబాబూ వస్తున్నారు. మెట్లమీదకు రండి" అంటూ భువనేశ్వరీదేవి కేకెయ్యడంతో...
"చుట్టకాలుస్తూ, మెత్తగా కనిపిస్తున్నానని అనుకునేవ్... జాగ్రత్త. జాగ్రత్తగా వుండమని అంజిగాడి చెవిలో చెప్పు... ఏ మాత్రం తప్పు జరిగినట్టు ధ్రువపడినా ముందు ఇల్లు ఖాళీ. ఆ తర్వాత పోలీస్ కేసు. పోలీసులు అసలే మంచోళ్ళు కారు. గోల్కొండ జెయిల్లో పడేస్తారు"