రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలయింది.
"జాగ్రత్తమ్మా తరణీ! భయపడకూడదు... ఏమయినా భయపెడితే నన్ను పిలువు" చేతికి పాలగ్లాసిచ్చి, లోనకు గదిలోకి తరణిని తోసేసి, తను వెనక్కెళ్లిపోయింది భువనేశ్వరి.
లోనకొచ్చి, లోన గడియపెట్టి, పాలగ్లాసు ప్రక్కన పెట్టేసి, కొరకొరా చూస్తున్న ఆంజనేయులు దగ్గరకొచ్చి చురచురా చూస్తూ-
"ఏవిటి? ఆ ముసలాయనికి మాయమాటలు చెప్పి శోభనం ఏర్పాట్లు చేసేసుకుని, నా కోసం చూస్తున్నారా..."
నవ్వుతూ అడుగుతున్న తరణివేపు నోటిమాట రాకుండా చూస్తూ వుండిపోయాడు ఆంజనేయులు.
"ఆవిడ చెప్పిందంతా వింటూ గంగిరెద్దులా తయారై, నువ్వా నేనా లోనకొచ్చింది... రేపు ఈ విషయం బయటకు తెలిస్తే... నాకు పెళ్ళవుతుందా?" అని విసురుగా మంచానికి కట్టిన దండల్ని విసిరికొట్టాడు ఆంజనేయులు.
"మీరా దండలు విసిరేస్తే, నేను ఇంకేం విసరలేననుకున్నారా?" తరణి పాల గ్లాసెత్తేసింది.
ఇద్దరూ కలిసి ఆ రూమ్ ని ధ్వంసం చేసేశాక-
"చూడమ్మాయ్! నేను నా అవుట్ హౌస్ కి వెళ్ళిపోతున్నాను... ఉదయం లేచాక ఆ పెద్దావిడకి నువ్వేం సమాధానం చెప్పుకుంటావో నీ ఇష్టం"
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం వెనక తలుపుగుండా వరండాలోకి వచ్చి, పిల్లిలా నెమ్మదిగా మెట్లు దిగిపోయి అవుట్ హౌస్ లోకి వచ్చి పడ్డాడు.
గదిలో వున్న తరణి ఆలోచనలో పడింది.
నెమ్మదిగా తను కూడా 'అవుట్ హౌస్' కెళ్ళిపోదామని నిర్ణయించుకుని, గదిలోంచి బయటికొచ్చి గోడవారగా నిలబడింది.
ఆంజనేయులు తనతో చెప్పింది అబద్ధమో, నిజమో 'టెస్ట్' చెయ్యడానికి గది బయట ఓ మూల చీకట్లో నక్కి నిల్చున్నాడు భుజంగరావు.
మరో మూల గది బయట కొత్త దంపతుల సరససలాపాల్ని ఆసక్తిగా గమనించడానికి భువనేశ్వరీదేవి నక్కి నిల్చుంది.
దూరంగా పొంచున్న భుజంగరావుని గుర్తుపట్టి, తల మీద ముసుగు కప్పుకొని గబుక్కున గది దగ్గరకొచ్చి తలుపులు తీసున్న గదిలోకి నెమ్మదిగా అడుగుపెట్టాడు.
అదే సమయంలో....
ఆ గదిలోకి భుజంగరావు వెళ్ళడాన్ని స్పష్టంగా చూసిన భువనేశ్వరి ఈ సమయంలో 'ఈయనెందుకట ఆ గదిలోకి' అని అనుకున్నదై తనూ ఆ గదిలోకి అడుగుపెట్టింది.
చీకట్లో ఎవరికీ ఎవరూ కనిపించడం లేదు.
అదే సమయంలో వెనక మెట్లమీంచి ఈ తతంగమంతా చూసిన తరణి గబుక్కున వచ్చి, తలుపు బయట గెడపెట్టి పరుగు పరుగున మెట్లు దిగి వెళ్ళిపోయింది.
చీకటి గదిలో....
"ఒరే అంజిగా... అంజిగా..." అని తిరుగుతున్న భుజంగరావుకి-
"మీరిక్కడున్నారెందు కండి...?" అనే భువనేశ్వరి స్వరం వినిపించడంతో...
"ఎందుకో కందుకు-గదిలో ఇద్దరూ మాయమైపోయారు గానీ... నువ్విలా రా..." అని నెమ్మదిగా పిల్చాడు.
"బాగానే వుంది భాగోతం..." తలుపు తియ్యబోయింది. కానీ అది తెరుచుకోలేదు. లైటు స్విచ్ వెయ్యబోయింది.
భుజంగరావు వెయ్యనివ్వలేదు.
* * * *
"కొత్త ప్రదేశం కదా పిన్నిగారూ... ఆయన మొహమాట పడితేనూ.." ప్రొద్దుటే సిగ్గును నటిస్తూ వచ్చి నిల్చున్న తరణి వేపు చూడలేకపోయింది భువనేశ్వరి సిగ్గుతో.
"అలా చెప్పా చెయ్యకుండా వెళ్ళిపోతే... మేం కంగారు పడమా?" ముసి ముసిగా నవ్వుతూ అంది భువనేశ్వరి.
అదే సమయంలో....
అక్కడికి రాబోయి, వెనక్కి వెళ్ళిపోతున్న భుజంగరావు, ఆంజనేయుల దృష్టిలో పడ్డాడు.
"అంకుల్... ఇప్పటికైనా తెల్సిందా... మేం భార్యాభర్తలం కాదని" గుసగుసలాడాడు ఆంజనేయులు.
"తెల్సిందిలేవోయ్... పెద్ద బడాయి..." అని దూరంగా మాట్లాడుతున్న తరణిని చూపించి-
"అయితే... ఆ అమ్మాయెవరు?... ఏ వూరు?... అది చెప్పు... అది నాకు కావాలి... వారం రోజుల్లోగా నువ్వా విషయం చెప్పకపోతే... ఇల్లు ఖాళీ చేయించేస్తాను. గుర్తుంచుకో..."
"మళ్లీ ఇదెక్కడి గోలండీ బాబూ... అదేదో మీరే కనుక్కోవచ్చుగా?" విసుగ్గా అన్నాడు ఆంజనేయులు.
"నువ్వే కనుక్కొని నాకు చెప్పు. లేకపోతే, ఖాయం... గుర్తుంచుకో" కూర్చుని కాళ్ళూపుకోడానికి టైమయిపోవడంతో, కుర్చీ వేపు వెళ్ళాడాయన.
* * * *
"రాత్రంతా ఏం చేశారో చెప్పు..." అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు ఆనందం.
"నిన్న సాయంత్రం బయటకు వెళ్ళినవాడివి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావ్...?" ఆంజనేయులడిగాడు.
"మాట మారిస్తే పీకపిసికి చంపేస్తా... నిన్న సాయంత్రం భువనేశ్వరీదేవి నన్ను పిలిచి ఈ మూడు రాత్రులు బయటెక్కడన్నా పడుకో, లేదంటే మా ఆయన దగ్గర పడుకోమంది. వాళ్ళాయన దగ్గర పడుకుంటే ఆ పిల్ల ఎవరో చెప్పు, లేదంటే చంపేస్తానంటాడని బయటే చచ్చి... చచ్చి చెడి ఇప్పుడొచ్చా? నే వేసిన ప్రశ్న నాకింకా గుర్తే వుంది. చెప్పు... నిజం చెప్పు..."గుడ్లురుముతూ అన్నాడు ఆనందం.
"ఏం కాలేదు... నువ్వేం కుళ్ళిపోనఖ్ఖర్లేదు..." అని క్రితం రాత్రి జరిగింది చెప్పాడు ఆంజనేయులు.
అంతలో....
"ఏవండీ..." అంటూ లోన గదిలోంచి వినిపించింది. ఆ పిలుపుకి ఆంజనేయులు దడుచుకుచస్తే, ఆనందం తిరిగి అనుమానంగా చూశాడు.
"రాత్రి బుగ్గల్ని, పెదాల్ని వద్దంటున్నా ముద్దు... ముద్దు అంటూ మొరటుగా కొరికేశాడు. ఇప్పుడెలా బయటికెళ్ళాలి" అనుకుంటూ వచ్చి అక్కడ ఆనందం ఉండటం చూసి సిగ్గు పడింది తరణి.
"వామ్మో... వామ్మో... కొరికాడా? ముద్దు ముద్దన్నాడా? ఏరా...?!" పళ్ళు నూరుతూ అడిగాడు ఆనందం.
"ఈపిల్లెంత గద్దరిదో... ఎన్ని అబద్ధాలాడేస్తోందో... రామరామ... నాకే పాపం తెలీదురా. నన్ను నమ్మరా..." అని ఆనందానికి నచ్చచెప్పి, తరణిని తిట్టేందుకు నోరు తెరవబోతుండగా, గోడ చాటు నుంచి భువనేశ్వరీ దేవి పట్టుచీర కనిపించింది. టక్కున ప్లేటు ఫిరాయించాడు ఆంజనేయులు.


