Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 32


    రాజీవ్ గాంధీ హత్య తర్వాత ,తమిళనాడులో తమిళ పులుల కార్యక్రమాలని అంతం చెయ్యడానికి తీవ్రమైన ప్రయత్నం జరిగింది.

    కొంతమంది టైగర్లు అరెస్టు అయ్యారు.

    అనేక మంది టైగర్లు సైనైడ్ కాప్స్యూల్సు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.

    టైగర్ల వ్యూహంలో ముఖ్యాతి ముఖ్యమైనది కమ్యూనికేషన్స్. సమాచారం అందించే సాధనాలు.

    డిక్సన్ మొదలయిన టైగర్లు వైర్ లెస్ ద్వారా సమాచారం అందించడంలో ఎక్స్ పర్ట్స్. అయితే, వీళ్ళ కమ్యూనికేషన్స్ నెట్ వర్క్ ని ఎంత ధ్వంసం చేసినా కూడా, కమ్యూనికేషన్స్ మాత్రం యిప్పటికీ నిరాటంకంగా సాగిపోతూనే వున్నాయి. అప్పుడు అర్ధమయ్యింది ప్రభుత్వానికి _ టైగర్ల యంత్రాంగం ఎంత పకడ్భందీగా మనదేశంలో పాతుకుపోయిందో!

    టైగర్ల ముఖ్యస్థావరాల్లో వెల్లూరు ఒకటి! తమిళనాడులోని వెల్లూరు అంధ్రప్రదేశ్ బార్డర్ కి దాదాపు ముప్పయ్ కిలోమీటర్ల దూరంలో వుంది.

    ఇక్కడే అస్సాం ఉల్ఫా తీవ్రవాదులకి టైగర్లు సైనిక శిక్షణ ఇచ్చారు.

    ఇక్కడి జైల్లోనే అనేకమంది టైగర్ల బందీలుగా వున్నారు.

    హైదరాబాద్ టెలిఫోన్స్ లో పనిచేసే అమోఘన్ ద్వారా అతనిలాంటివాళ్ళ ద్వారా, టైగర్ల కమ్యూనికేషన్లు నిరాటంకంగా సాగిపోతున్నాయి.

    అమోఘన్ ఒకప్పుడు మామూలుగానే ఉండేవాడు. కనీసం అల కనబడేవాడు పైకి.

    అయితే అతని ఆలోచనలు మాత్రం చిత్రంగా వుండేవి. తను ఏనాటికైనా బాగా సంపాదిస్తానని నమ్మేవాడు అమోఘన్.

    ఎలా? లాటరీలో లక్షలు సంపాదిస్తానని నమ్మేవాడు.

    ఊహల్లోనే సంపాదనకి యింకో మార్గం కనిపెట్టాడు అమోఘన్.

    తను నిరంతరం సంగీత సాధన చేస్తాడు. ఎక్స్ పర్ట్ అయిపోతాడు. ఈలోగా సింగర్ బాలసుబ్రహ్మణ్యం రిటారయిపోతాడు. తను బాలసుబ్రహ్మణ్యం స్థానంలోకి వచ్చేసి పిచ్చగా సంపాదిస్తాడు.

    ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనల్లోనే అతనికి నలభై ఏళ్ళొచ్చేశాయి.

    నలభయ్యో ఏడు మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం! సాధారణంగా మనిషిలో మానసికంగా మార్పు వచ్చేస్తుంది నలభయ్యో ఏడు రాగానే!

    ఈ మనిషి మారడం అనేది మూడు ఘట్టాల్లో జరుగుతుంది.

    మొదటి ఘట్టం__

    టెన్త్ క్లాస్, లేదా ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు.

    అది చదువులో పెద్ద టర్నింగ్ పాయింట్. ఏ కోర్సు తీసుకుని, జీవితంలో ఎటువైపు సాగాలి అనేది అక్కడే నిర్ణయమవుతుంది.

    రెండో ఘట్టం పెళ్ళి.

    పెళ్ళి తర్వాత మారతాడు మనిషి. మంచికా, చెడుకా అన్నది వేరే విషయం.

    మూడోదీ, ముఖ్యమైనదీ అయిన ఘట్టం_ నలభయ్యో ఏట అడుగు పెట్టడం!

    ఒక వ్యక్తికి నలభై ఏళ్ళు వచ్చేసరికి అతనికి అర్ధం అయిపోతుంది- తను జీవితంలో వెళ్ళవలసిన దారిలో వెళ్తున్నాడో లేదా గమ్యాన్ని అసలు చేరుకోగలడో, లేడో....

    తన శేష జీవితం గురించిన ఖచ్చితమైన అవగాహన అప్పటికి ఏర్పడిపోయి వుంటుంది.

    అదిగో....అక్కడ మారిపోతాడు మనిషి.

    తను సరైన దారిలో వెళ్తున్నానని అర్ధమై, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని నమ్మకం కలిగితే, ఉత్సాహంగా ముందుకు సాగిపోతాడు.

    అలా కాక, తను సాధించదలుచుకున్నవి యింక మిగిలిన జీవిత కాలంలో సాధించలేనని అర్ధమైపోతే, (నలభై దాటాక ఇంక కొత్తగా వచ్చే అవకాశాలు సాధారణంగా చాలా తక్కువ) ఫ్రస్టేట్ అయిపోతాడు మనిషి.

    అలాంటి స్థితికి చేరుకున్నాడు అమోఘన్. తను కోరుకున్న స్థితికి ఈ జన్మలో వెళ్ళలేనని అతనికి క్రమంగా అర్ధమయ్యింది.

    ఫ్రస్టేట్ అయ్యాడు అతను. సినిక్ గా మారాడు. అప్పుడు అతన్ని కాంటాక్ట్ చేశాడు ఒక తమిళ పులి. సాధారణంగా తీవ్రవాద సంస్థలకి కొత్త రిక్రూట్స్ యూనివర్శిటీలలో, కాలేజీలలో దొరుకుతారు. ఏదో చేసెయ్యాలనే నిజమైన కోర్కెతో వున్న కుర్రాళ్ళు.

    లేదా_

    నలభైదాటి ఫ్రస్టేట్ అయిన వాళ్ళు కూడా తీవ్రవాదులకి ఈజీ టార్గెట్సే!

    మెల్లిగా ఎల్.టి.టి.ఇ.తో కాంటాక్ట్ పెరిగింది అమోఘన్ కి. అతను చూడడానికి సాదాగా ఉంటాడు. హార్మ్ లెస్ గా కనబడతాడు.

    సరిగ్గా అదే అతని ప్లస్ పాయింట్ అయ్యింది.

    అతనికి ఇలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయని ఎవరూ ఊహించలేదు. అందరితో స్నేహంగా ఉంటాడతను. అన్ని సర్కిల్సులో కలిసిపోతాడు. అందరికీ చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటాడు.

    ఆ విధంగా అతను చాలా సక్సెస్ ఫుల్ కాంటాక్ట్ మాన్, ఇన్ ఫార్మర్.

    ఆ రోజున అమోఘన్ ఎల్.టి.టి.ఇ.కి అందించిన సమాచారం ఇలా వుంది.

    "ఫలాని వాళ్ళకి అందవలసిన ప్యాకేజీ అందింది" అంతే.

    అమోఘన్ పక్షాన కాస్త మంచిగా చెప్పాలంటే, ఆ ప్యాకేజిలో ఏముందో అతనికి నిజంగా తెలీదు.

    ఆ ప్యాకేజీలో హైగ్రేడ్ ప్లాస్టిక్ ఎక్స్ ప్లోజివ్ ఉందని అస్సలు తెలీదు అతనికి.

    ప్రజల కష్టాలు తీర్చడానికే ఉద్భవించిన ఉద్యమకారులు కొందరు, ప్రజల కష్టాలు తీర్చడానికి గానూ ఆ ప్లాస్టిక్ ఎక్స్ ప్లోజివ్ ని ఢిల్లీ నుంచి వచ్చే అంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ ట్రాక్ మీద పెట్టారు.

    ప్రజల కష్టాలు తీర్చడానికే!

    అంతకుమించి వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు!

    ప్రతివాడూ ప్రజల కష్టాలు తలుచుకుని కన్నీళ్ళు కార్చేవాడే! ప్రజల కష్టాలు తీర్చడానికిగానూ మరింతగా వాళ్ళని కష్టాలపాలు చేసేవాడే!

    ఒకడు బస్సులు తగలబెడతాడు. ఒకడు బందు చేయిస్తాడు. ఒకడు బాంబులు వేస్తాడు. ఒకడు పట్టాలు పీకేస్తాడు. ఒకడు రాస్తారోకో చేస్తాడు.

    అన్నీ ప్రజలకోసమే!

    అని మనం నమ్మాలి!

    హైపవర్ ఎక్స్ ప్లోజివ్ ఏ.పి.ఎక్స్ ప్రెస్ వచ్చే ట్రాక్ మీద పెట్టారు.

    ఏ.పి. ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ వైపు దూసుకు వచ్చేస్తోంది.


                      *    *    *    *


    రైల్లో....

    కంపార్టుమెంటులోకి రాష్ గా ఎక్కిన ముగ్గురు మనుషులనీ చూశాడు అఖిల్. వాళ్ళలో పంచెలు లుంగీల్లాగా మడిచి కట్టుకున్న వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా కనబడుతున్నారు. షర్టులు వేసుకుని ఉన్నారు. వాళ్ళు చొక్కా చేతులు పైకి మడిచి ఉన్నాయి. షర్టులకి పెద్ద పెద్ద జేబులు. ఆ జేబుల్లో నుంచి వంద రూపాయల నోట్లు బొత్తులుగా కనబడుతున్నాయి.

    వాళ్ళకి టిక్కెట్ రిజర్వేషనూ అదీ ఏమీ ఉన్నట్లు లేదు.

    తమ సీట్లకోసం వెదుక్కునే ప్రయత్నం చెయ్యలేదు వాళ్ళు. అన్నదమ్ముల్లో తమ్ముడిలా కనబడుతున్నవాడు రేచుకుక్కలా వేగంగా వెళ్ళి, ఖాళీ సీట్లకోసం కంపార్ట్ మెంట్ అంతా కలియతిరిగి వచ్చాడు.

    "ఎక్కడా ఖాళీలేదు!" అన్నాడు.

    "అయితే ఇక్కడే కూలబడదాం!" అన్నాడు రెండోవాడు.

    "పక్కకి జరుగు!" అన్నాడు బాడీగార్డు, అఖిల్ ని స్టెన్ గన్ తో అదిలిస్తూ.

    అఖిల్ జవాబు చెప్పేలోగానే అన్నదమ్ములిద్దరూ నవాబుగారి పక్కన కూర్చున్నారు. అఖిల్ పక్కన మొరటుగా కూలబడ్డాడు బాడీగార్డు. కూర్చుంటూనే బ్రీఫ్ కేసు తీశాడు. అందులో విస్కీ బాటిల్ వుంది. బిస్లేరీ వాటర్ బాటిల్ కూడా ఉంది. గ్లాసులు వున్నాయి.

    విస్కీ బాటిల్ ఓపెన్ చేసి మద్యాన్ని గ్లాసులో పోసి, దానిలో బిస్లేరీ వాటర్ కలిపి అన్నదమ్ములిద్దరికీ అందించాడు బాడీగార్డు. తనొక గ్లాసు పక్కన పెట్టుకున్నాడు. పెద్ద పాలిథిన్ బ్యాగ్ ఒకటి తీశాడు. దాని నిండా  వేయించిన వేరుశెనక్కాయలున్నాయి. టపటప వేరుశెనక్కాయలని వలిచి తింటూ, విస్కీ త్రాగడం మొదలుపెట్టాడు.

    ఒక్క నిమిషంలో కంపార్టుమెంటు అంతా గలీజుగా అయిపోయింది. వేరుశెనక్కాయల తొక్కలు చిన్న గుట్టలాగా పోగు అయిపోయాయి.

    తింటూ, తాగుతూ, పెద్ద గొంతుతో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ముగ్గురూ. మధ్య మధ్యలో బూతులు జోరుగా దొర్లి పోతున్నాయి.

    ఒక నిమిషం తర్వాత అర్ధమయింది అఖిల్ కి-వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఏమిటో!

    వాళ్ళ నాన్న మొన్నటిదాకా ఆ జిల్లాకి నాయకుడు. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ జిల్లాకి పెద్దలు. వంశపారంపర్యంగా వాళ్ళ వృత్తి రాజకీయాలే!

    ఆ జిల్లాలో అప్పుడే ఏవో ఎలెక్షన్లు జరిగాయి.

    ఎలాగయినాసరే ఆ పదవి తమ కుటుంబంలోనే ఉండి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటివాళ్ళకి దక్కకూడదు.

    అందుకని తమ్ముడు హఠాత్తుగా ఓ రోజున ఒక స్టేట్ మెంట్ ఇచ్చి పార్టీ నుంచి బయటికెళ్ళిపోయి, అపోజిషన్ పార్టీలో చేరిపోయాడు.

    ఇంతకాలం నుంచి ఆ తమ్ముడికి హత్యా రాజకీయాలతో సంబంధం వుందనీ, అతను కోట్లు వెనకేసుకున్నాడనీ రాత్రింబవళ్ళు ఆరోపణలు గుప్పించిన అపోజిషన్ పార్టీ, అతను తమ పార్టీలో చేరగానే అన్నీ మర్చిపోయి, అతనికి ఎలెక్షన్ కి టిక్కెట్ ఇచ్చింది. అప్పటికి అహర్నిశలూ అపోజిషన్ పార్టీ తరపున పనిచేసిన కార్యకర్తలకి ఇది ఆశనిపాతం అయ్యింది.

    ప్రధాన పార్టీలు రెండింటి తరుపునా ఈ అన్నదమ్ములే ప్రత్యర్ధులయ్యారు.

    ఆ పార్టీ తరపున అన్న!

    ఈ పార్టీ తరఫున తమ్ముడు! ఎవరు గెలిచినా కుటుంబ పాలనే! ఇద్దరూ కలిసి ఇండిపెండెంట్ కేండిడేట్లను పంపించేశారు. వీళ్ళకి అడ్డం లేకుండా. 

 Previous Page Next Page