Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 32

    "ముగ్గుర్ని కన్నాను. ఇవేం నొప్పులో నాకా మాత్రం తెలీదా! ఇవి ఆ నొప్పులే. కడుపులో ఉన్నవాళ్ళు వీక్ గా ఉంటే ముందే నెప్పులొస్తాయని 'భ్రాంతి' వారపత్రికలో సెక్స్ డాక్టర్ అమరంగారు ఒకాయన ఇలాంటి ప్రశ్నే వేస్తే ఇలాంటి జవాబే ఇచ్చారు. న అకేందుకో అనుమానంగా ఉంది. ఆస్పత్రికి వెళదాం" బిక్కమొహం వేసుకోని చెప్పాడు పర్వతేశ్వరరావు.
   
    "ఎంత చచ్చినా నా మొగుడు ఏడవక తప్పుతుందా" అందిట అనకటికొకామె. ఏం చేస్తాం మీరు చెపితే వినరు. అవస్థా నాకు తప్పదు. నేస్పత్రికి వెళదాం పదండి." అని భర్తతో చెప్పి పెద్ద వాణ్ని రిక్షా తీసుకు రమ్మని పంపించి తను గుడ్డలు సర్దడం మొదలెట్టింది.
   
    మరో పది నిమిషాల తర్వాత ఆ భార్య భర్త ఎక్కినా రిక్షా ఆస్పటల్ వేపు బయలుదేరింది.
   
                                            *    *    *    *
   

    ఆ ఇంట్లో-
   
    గుర్నాధం, వనజాక్షి చిలకా గోరింకల్లాంటి దంపతులు. వాళ్ళకి ఒకబబాయి ఒకమ్మాయి అబ్బాయి పండుకి పదిహేనేళ్ళు అమ్మాయి పద్మినీకి పదేళ్ళు ఇద్దరి కిద్దరన్నట్టు ఆనందంగా గడుపుతున్న ఆ సంసారంలో చిన్న అపశ్రుతి ఏర్పడింది.
   
    ఆ ఇంట్లో వనజాక్షి ఆఫీసులో టైపిస్ట్ ఉద్యోగం చేస్తోంది. భర్త గుర్నాధం ఒ కంపెనీలో గుమాస్తా, అతను పనిచేసే కంపెనీ మేనేజర్ చనిపోవడం వల్ల మూడ్రోజుల పాటు అతను పనిచేసే కంపెనీకి శెలవిచ్చారు.
   
    ఆ పూట వనజాక్షి ఇంట్లోంచి తొందరగా బయల్దేరి తన ఆఫీసుకి వెళ్ళిపోయింది. కంపెనీకి శెలవు కావడం వల్ల గుర్నాధం ఇంటిపట్టునే ఉన్నాడు. పద్మిని స్కూల్ కెళ్ళి పోయింది. ఒంట్లో బాగుండని పాండు ఆ పూట ఇంటి పట్టునే ఉన్నాడు.
   
    భార్య, కూతురు అటు వెళ్ళంగానే ఇటు పాండు దగ్గిర కొచ్చాడు గుర్నాథం.
   
    "ఒంట్లో ఎందుకు బావుండలేదు? ఏమైనా కాని పని చేశావా?" కొడుకుని నిలదీసి అడిగాడు గుర్నాథం.
   
    "కాని పని చేస్తే ఒంట్లో బాగుండదా?" ఎదురు ప్రశ్నించాడు పాండు.
   
    "కాని పనంటే నీ కర్ధం కాదు. ఎలా చెప్పాలి? ఆ....నీ వెన్నాల్ల బట్టి మెన్సెస్ కావడంలేదు?" సూటిగా రంగంలోకి దిగుతూ అడిగాడు గుర్నాథం.
   
    "ఏమో! ఎన్నాళ్ళయిందో! నేనెప్పుడూ రోజులు లెక్కబెట్టను. అయితే అయ్యాననుకుంటాను. కాకపోతే కాలేదను కుంటాను. అయినా ఈ ప్రశ్నలేమిటి నాన్నా?" చిరాకు పడుతూ అన్నాడు పాండు.
   
    "ముందు నా ప్రశ్నలకి జవాబులు చెప్పు. ఆ తర్వాత అసలు విషయం చెబుతాను."
   
    అయిష్టంగానే "ఊ" అన్నాడు పాండు.
   
    "నీకు అన్నం సయించడం లేదు. అవునా?"
   
    "అవును."
   
    "పుల్లగా ఏమైనా తినాలని ఉందా?"
   
    "నాకు పుల్లటి పదార్ధాలు ఎప్పుడూ ఇష్టమే. నీకూ తెలుసుగా. చింతపండు కనబడితే చాలు తినేస్తానని అమ్మకోప్పడుతూ ఉంటుందిగా"
   
    "అయ్యో! నీకెలా చెప్పాలో నా కర్ధం కావడంలేదురా!" వాపోయాడు గుర్నాథం.
   
    తండ్రి ఎందుకు కంగారు పడుతున్నాడో అడ్డదిడ్డమైన ఈ ప్రశ్న లేమిటో పాండుకి అర్ధం కాలేదు. తండ్రి వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.
   
    పాండు అందంగా ఉంటాడు. ముద్దుగా అప్పుడప్పుడు వాడ్ని స్నేహితులు "పాండ్స్" అనికూడా పిలుస్తూంటారు. ఆడ, మగ బోలెడు మంది స్నేహితులు వాడికి స్నేహితులతో కబుర్లేసుకుని కూర్చున్నాడంటే అన్నం నీళ్ళు అక్కరలేదు వాడికి.
   
    ఈ రోజు తండ్రి తనని బయటికి పోనీయక తల్లి, చెల్లీ అటెళ్ళంగానే తన్నిపట్టుకొని గుచ్చి గుచ్చి చూస్తూ యక్షప్రశ్నలు సవాలక్ష వేస్తూంటే ఏమి అర్ధం కాలేదు పాండుకి.
   
    "నువ్వేమో అడుగుతున్నావ్. నాకేమీ అర్ధం కావడంలేదు. ఆ అడిగేదేదో అర్ధమయ్యేలా అడుగు నాన్నా" అన్నాడు పాండు.
   
    "అర్ధమయ్యేలాగానే అడుగుతానురా! నీకెవరయినా అమ్మాయి లతో స్నేహం ఉందా! వాళ్ళతో ఆడడం, పడటం చేస్తున్నావా?" గుర్నాతం సూటిగా అడిగాడు.
   
    "అదేమిటి నాన్నా! నా స్నేహితుల్లో సగం మంది అమ్మాయిలు సగంమంది అబ్బాయిలు. అందరూ నాతో చాలా క్లోజ్ గా ఉంటారు! నేనంటే ప్రాణం ఇస్తారు నేనంటే పడి చస్తారు" గర్వంగా చెప్పాడు పాండు.
   
    "ఏ అమ్మాయయినా, ఎప్పుడయినా నిన్ను ముద్దుపెట్టుకుందా?"
   
    పాండు కాస్త సిగ్గుపడ్డాడు. "నేను అందంగా ఉంటానట. ఆ మాట నాతో అంటమే కాదు నా ఫ్రెండ్స్ లో కొందరమ్మాయిలు ముద్దుకూడా పెట్టుకున్నారు" నాన్చుతూ చెప్పాడు.
   
    "నీ దుంపతెగ. నువ్వండంగా ఉన్నంతమాత్రాన వాళ్ళు ముద్దుపెట్టుకుంటే ముద్దు పెట్టించుకోవడమేనా! ఆడపిల్లలు మరీ బరితెగించి పోయారు ఆడపిల్లలకన్నా మగపిల్లలు నయం-ఇంతకి ఆ ఆడపిల్లలు నిన్ను ముద్దుమాత్రమే పెట్టుకున్నారా ఇంకేమైనా చేశారా?"
   
    "ఇంకేమైనా అంటే?"
   
    "నా శ్రార్ధం" విసుక్కున్నాడు గుర్నాథం.
   
    "నువ్విలా అర్ధంలేని ప్రశ్నలు వేసి ఊరికినే నామీద విసుక్కుంన్నావంటే సాయంత్రం అమ్మ ఆఫీసునుంచి వచ్చింతర్వాత చెప్తాను. ఆ తర్వాత నీ ఇష్టం" బెదిరింపుగా అన్నాడు పాండు.
   
    ఆ ఇంట్లో పెత్తనం వనజాక్షిది. ప్రతిదీ డిసిప్లేన్ గా ఉండాలంటుంది ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలి వస్తువు స్థానం మారితే భరించలేని మనిషి. కొడుకు కాలు జారాడంటే భరిస్తుందా? "నువ్వేం తండ్రివి! నీ పెంపకం తగలబడినట్టే ఉంది- ఈ ఇంటి పరువు, మర్యాద మీ తండ్రీ కొడుకులవల్ల బజారున పడేటట్లు ఉంది మా పుట్టింటివాళ్ళను చూడండి-నా పెంపకాన్ని చూడండి. ఎంత పరువు, ఎంత మర్యాద...." అంటూ తూర్పార పడుతుంది. ఆ బాధ భరించటం చాలా కష్టం. కొడుకు కానిపని చేసి కాలు జారాడేమోనని గుర్నాథం భయం. గత వారంరోజుల బట్టి కొడుకుమీద అనుమానం వచ్చింది. నిజం నిలదీసి అడుగుదామంటే టైంచిక్కడంలేదు ఇదిగో ఇప్పుడు సమయం వచ్చింది నిలదీసి అడుగుతుంటే అడ్డంగా సమాధానాలు చెబుతున్నాడు.
   
    "నిన్ను ఆ ఆడపిల్లలు ఇంకేమయినా చేశారా అంటే అదన్నమాట" అన్నాడు గుర్నాథం.
   
    "ఇంకేమన్నా అంటావ్. అదంటావ్-ఇదంటావ్ అసలేంటి నీ గోల? ఇవాళ నీకేదో అయింది. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్" అంటూ పాండు తండ్రిని అనుమానంగా చూస్తూ అన్నాడు.

 Previous Page Next Page