"డిష్ లో చూస్తే యింక మూడు మాత్రమే ఇడ్లీలు వున్నాయి. అంతక్రితం డిష్ నిండుగా ఉన్నాయి. అంటే తను దాదాపు డజను ఇడ్లీలు తిందా! తనది కడుపా చెరువా ఆంటీ ఏమనుకుంటారు! ఆంటీ తిందో లేదో తను గమనించక్కరలేదా?" పద్మిని సిగ్గుపడింది.
"ఆంటీ!" ముఖం పైకెత్తకుండానే నెమ్మదిగా పిలిచింది పద్మిని.
"ఊ..." అంది ఆమె.
ఒక్కసారి తలెత్తి పార్వతమ్మ ముఖంలోకి చూసినట్లయితే ఆమె కళ్ళల్లోని భావాలు అర్ధంకాకపోయినా ఏదో కొత్త విషయాన్ని తెలియజేసేవి.
"మీరు తిన్నారో లేదో చూసుకోకుండా అన్ని ఇడ్లీలు తినేశానాంటీ!" బిడియంగా అంది.
"నీవు తృప్తిగా తిన్నావు తల్లీ! చాలు నా కడుపు నిండింది" అంది ఆమె.
పద్మిని తలయెత్తి ఆమె ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళల్లో పల్చటి కన్నీటి పొర. ముఖంలో మాత్రం అంతులేని తృప్తితో పద్మినిని చూస్తున్నది.
పద్మినికి ఏమీ అర్ధంకాలేదు "ఆంటీ!" అంది తెల్లబోయి చూస్తూ.
అప్పుడే తెలివి వచ్చినట్లు కంగారుగా ముఖం తిప్పేసుకొని మూడు ఇడ్లీలు మాత్రమే మిగిలిన డిష్ ను తీసుకొని వెళ్ళి పనిమనిషి లచ్చికిచ్చింది పార్వతమ్మ.
పద్మిని అయోమయంనుంచి ఇంకా తేరుకోలేదు. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచుండిపోయింది "పద్మినీ! ఇలా రామ్మా" అంటూ శంకర్రావు పిలవటంతో అక్కడనుంచి కదిలి ముందు గదిలోకి వచ్చింది.
"ఇలా కూర్చో!" తన పక్కనే చోటు చూపిస్తూ చెప్పాడు శంకర్రావు.
పద్మిని ప్రియదర్శిని తల దించుకొని శంకర్రావు పక్కనే కూర్చుంది.
"నిన్న సాయంత్రం నీకో విషయం చెప్పాను గుర్తువుందా తల్లీ!" పద్మిని తలమీద చేయివేసి ఆప్యాయంగా నిమురుతూ నెమ్మదిగా అడిగాడు శంకర్రావు.
"ఏ విషయం అంకుల్!" ఆమె ఆలోచిస్తూ అడిగింది.
"గుర్తు తెచ్చుకో తల్లీ!" నిరాశగా తగ్గిపోతూ దగ్గుత్తికతో అన్నాడు శంకర్రావు.
ఆమె శ్రమపడకుండానే గుర్తొచ్చింది. "ఆ...గుర్తొచ్చింది అంకుల్!" అంది.
"చాలమ్మా ఈ రోజంతా ఆ విషయం మరచిపోకుండా వుంటే చాలు"
"అలాగే అంకుల్!" పద్మిని అంటుండగా పార్వతమ్మ కాఫీ తీసుకొని వచ్చింది.
"కాఫీ తాగకుండా వచ్చేశావేమిటి తల్లీ!" పార్వతమ్మ కాఫీ కప్పు అందిస్తూ అడిగింది. అప్పుడు ఆమె ముఖం ప్రసన్నంగా వుంది. ముఖంలో ఏ భావాలూ కానరావటం లేదు.
"పద్మినిని నేనే పిలిచాను పార్వతీ!" శంకర్రావు చెప్పాడు.
"అవును ఆంటీ! అంకుల్ పిలిచారు. కాఫీ తర్వాత తాగొచ్చులే అని వచ్చాను. అయినా ఆంటీ నా సంగతి మరచిపోకుండా కాఫీ నోటిదగ్గరకే తెస్తుందని తెలుసు" అంటూ రెండు గుక్కలు కాఫీ తాగి "ఈ రోజు ఏంటి ఆంటీ! కాఫీ కూడా అమృతంలాగా తయారుచేసి తెచ్చావ్! ఇలా పీకలదాకా కాఫీ టిఫెన్ లు పట్టించానంటే మళ్ళీ జ్వరం తిరగబెట్టడం ఖాయం తిన్నది అరక్కపోతే...
పద్మిని మాట పూర్తిచేయకముందే కంగారుగా పార్వతమ్మ అడ్డువచ్చింది. "అలా అనొద్దు తల్లీ" అంది ఆ స్వరంలో ఆందోళన స్పష్టంగా గోచరిస్తున్నది.
ఈ తఫా తనేం తప్పుమాట్లాడోనని పద్మినికి కంగారు వేసింది. మాట్లాడకుండా వుండాలంటే కాఫీకి పని కల్పించటం వక్కటే మార్గం అనుకున్న పద్మిని కప్పు నోటికి కరచుకుని గబగబా కాఫీ తాగింది. దాంతో పొలమారింది.
పార్వతమ్మ వెంటనే పద్మిని మాడుమీద చిన్నగకొట్టి "నెమ్మదిగా తాగమ్మా! అయినవాళ్ళు ఆప్తులు తలుచుకుంటే పొలమారుతుందంటారు. ఎవరో నిన్ను అమితంగా ప్రేమించేవాళ్లే తలుచుకుంటున్నారు" అంది.
"నీవు చెప్పింది నిజమా ఆంటీ?" పద్మిని అడిగింది.
"ఇది నిజమని పెద్దలు అంటారు. అదే నీతో చెప్పాను"
"అయితే నన్ను తలుచుకున్నదెవరో నాకు తెలుసు?"
"ఎవరంటావ్?"
"ఇంకెవరు మా అమ్మ!"
"అమ్మ, మీ అమ్మ?" ఆశ్చర్యంగా నోరు తెరిచింది పార్వతమ్మ.
"అవును ఆంటీ! మా అమ్మే! నాకు యెంతో యిష్టమయిన ఇడ్లీ చేసి దగ్గరవుండి తినిపించి ఆప్యాయత, అనురాగం రంగరించి కాఫీలో కలిపి తెచ్చి దగ్గిరవుండి తాగిస్తున్న అమ్మవి నీవేకదా! నా తల్లికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని...నీవే నన్ను తలుచుకుని ఉంటావు" తెలివికి అల్లరి కలుపుతూ తమాషాగా అంది పద్మిని ప్రియదర్శిని.
పార్వతమ్మ ఒకసారి గట్టిగా కళ్ళుమూసుకుని తెరిచింది. ఆమె కళ్ళల్లో అదోరకం మెరుపు అదోరకం తృప్తి. ఆ విషయం శంకర్రావు గమనించాడు.
"అమ్మయ్య, మాట మార్చి చెప్పగలిగాను" అనుకుందిగాని పద్మిని హృదయం తన మమ్మీ జ్ఞాపకాలతో బాధగామటుకు మూలిగింది.
"పద్మినీ! తలంటిపోసుకునిరా. గుడికి వెళ్ళొద్దాము" అని చెప్పి పార్వతమ్మ ఖాళీ కప్పు తీసుకుని లోపలికి వెళ్ళింది.
"ఆంటీనేమి యెదురు ప్రశ్నించవద్దు" చాలా నెమ్మదిగా శంకర్రావు చెప్పాడు.
"మీరే చూస్తారుగా అంకుల్!" అంది పద్మిని.
19
చెప్పింది చేయటం!
కళ్ళతో చూసి ఊరుకోటం!
ఈ రెండు విషయాలు ఈ రోజంతా గుర్తుంచుకుని మెలగాలి. అంకుల్ ముందే హెచ్చరించారు. ఆంటీ అదోరకంగా వుంది... అని ఆలోచిస్తూ పద్మిని ప్రియదర్శిని తలంటిపోసుకోటం పూర్తి చేసింది.
డ్రస్సు మార్చుకుందామనుకుంటుండగా పార్వతమ్మ కొత్తచీర జాకెట్ తెచ్చి కట్టుకోమని యిచ్చింది. మారు మాట్లాడకుండా ఆ కొత్త చీర జాకెట్ ధరించింది పద్మిని.
ఇదంతా యేమిటో పద్మినికి అర్ధంకాలేదు. అడగకుండా ఆలోచిస్తూ చేసుకెళుతున్నది.
ఆ తరువాత
పద్మినీని తీసుకొని పార్వతమ్మ, శంకర్రావు గుడికి వెళ్ళారు. గుళ్ళో పూజ చేయించారు. ఏవో అభిషేకాలు, అవీ యివీ మొత్తానికి అక్కడే గంటన్నరకాలం పట్టింది. చివరకు ప్రసాదం తీసుకొని ముగ్గురూ యింటికొచ్చారు.
"ఈరోజు ఏ పండగా కాదు. మరి స్పెషల్ గా యీ పూజ ఏమిటి?" అడక్కూడదనుకొంది కాబట్టి పద్మిని అడగలేదు. ఆలోచించి వూరుకుంది.
ఇంటికొచ్చింతర్వాత
పార్వతమ్మ వంట చేస్తుంటే పద్మిని శంకర్రావుతో మాట్లాడుతూ కూర్చుంది. మరికాసేపు తోచక అటూ యిటూ తిరిగింది. అలా అలా పదకొండున్నర అయింది.