"ఏమిటి తన మనస్సు?"
"మునీశ్వరా?"
ఉలికిపడ్డాడు శ్రీకర్.
నీలవేణి మళ్ళీ నవ్వుతోంది.
"సారీ! ఈ మధ్య యెందుకో యిలా ఆలోచనల్లో పడిపోతున్నాను!"
"ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు."
శ్రీకర్ వళ్ళు ఝల్లుమంది. గుండెలయ హెచ్చింది. "నీలవేణి నాతో ఆడుకుంటున్నావ్" అనుకున్నాడు.
"శ్రీకర్! ఇది నా స్వంత జడే! చూడు, ఈరోజు ఎలాగూ తలంటు పోసుకున్నాను... విప్పేస్తాను చూడు. మళ్ళీ అల్లుకోవడం ఎంతసేపు" చకచకా జడ విప్పేస్తాను. అంతే! ఒక్కసారిగా పురివిప్పిన నెమలి పించంలాగా, అపార జలరాశిలాగా ఆమె కేశరాశి వీపంతా కప్పేసింది.
"వేణి! నన్ను నీ కురులలో దాచుకోవా?" అని అడగాలనిపించిందతనికి. అంతలో నీ కొంటె ఆలోచన వచ్చి చప్పున ఫేన్ ఫుల్ స్పీడ్ లో ఆన్ చేశాడు. అంతే తుఫాను గాలికి చెల్లా చెదరయ్యే నీలిమేఘ మాలికల్లాగా ఆమె తలకట్టు అంతా విప్పుకుని భుజం. వీపు, ముఖం ఆక్రమించింది.
"యు సిల్లి!" నవ్వుతూ జడ కట్టుని సరిచేసుకుంటూ ఫేన్ ని ఆపు చేసింది...మరో రెండు నిమిషాలకి అన్నీ కుదురుకున్నాయి. వంపులు తిరిగి వంకీలు తిరిగిన ఆ జుట్టు మరో రెండు నిమిషాలకి మళ్ళీ జడగా మారిపోయింది.
అంతసేపూ దేవి ప్రత్యక్షమైతే చూసే భక్తుడిలా చూస్తూ వుండిపోయాడు శ్రీకర్.
"ఇంతకీ మీలో గాంభీర్యం ఎంతుందో చిలిపిదనమూ అంతేవుంది! మిమ్మల్ని ఎవరు పెళ్ళాడుతారోగానీ ఆ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు.
నవ్వుతూ నేలవేణి అన్న మాటలకి శ్రీకర్ శరీరం రోమాంచితం అయింది. కళ్ళు విప్పారాయి. పెదాలు అదిరాయి. మనస్సు వేగం హెచ్చింది. ఒక్కసారిగా నరనరాన రక్తం కాక ప్రేమ ప్రవాహం ప్రవహించినట్లయింది.
"ఒరేయ్ పిచ్చి సన్నాసీ! ఇది మంచి సమయం! ఆమే పెళ్ళి విషయం ఎత్తింది. నిన్ను చేసుకునే వాళ్ళు అదృష్టవంతురాలంది! ఏ కన్నెపిల్ల అయినా అంతకంటే యింకా ఎలా స్పష్టంగా చెవుతుంది? లేకపోతే ఇండియా యువరాజువనీ, హాలివుడ్ హీరోవనీ వ్యంగ్యంగా నన్ను పెళ్ళిచేసుకో అని అడుగుతుందా? నీ పిచ్చిగానీ లేనిపోని ఆలోచనలకి పోక ఇప్పుడే నీ ప్రేమపత్రం దాఖలు చేసుకో" అంది మనస్సుహెచ్చరికగా.
"రేయ్ పిచ్చి వెధవా? ఊరికే తొందరపడి మనస్సు పారేసుకోవద్దు. ఆ అమ్మాయి తత్వమే అంతేమో! అందంతో ఇలాగే చనువుగా వుంటుందేమో! నీకేం తెలుసు ఊరికే పిచ్చి - పిచ్చి ఆలోచనలు చేసి వున్న గౌరవం పోగొట్టుకోవద్దు. బయటపడేవరకు గౌరవం! వెర్రిగా బయటపడ్డావా నీ ప్రేమా గీమా దుమ్ముపాలే! కాబట్టి బుద్దిగా మెలుగు" చివాట్లేసింది బుద్ధి.
"ఛట్! నీకు అన్నీ శంకలే! ఇది అపూర్వమైన అవకాశం అడిగెయ్" మళ్ళీ పలికింది మనస్సు.
క్షణంలో సగంలో జరిగిన అంతర్యుద్ధంలో మనస్సే గెలిచింది.
"నీలవేణి! నిజంగా అంటున్నారా ఆ మాట!"
"ప్రామిస్!"
"అయితే ఓ మాట అడగనా?"
"ఏం మనుషులు బాబూ మీరు! ప్రతిదీ యింతే వితర్కంతో చేస్తారా? ఒట్టి సందేహజీవులేంటి?"
చప్పున జ్యోతి కళ్ళముందు నుంచుంది..."జ్యోతీ!" అనుకున్నాడు.
"ఇదిగో త్వరపడకు! ఈ సాయంకాలం పార్కుకి ఆహ్వానించు! అక్కడ అడిగెయ్! నీ ప్రేమ పురాణం ఆఫీసులోనా? చాలు చాల్లే...ఇలాగేగా నాతో విడిపోయింది!" అన్నట్టయింది. ఆమె యెదురుగా నించున్నట్టుగా ఫీలయ్యాడతను.
అడగండి ఆగిపోయారేం!"
ఇక ఆలసించకుండా అడిగేయాలని నిశ్చయించుకున్నాడు శ్రీకర్. అంతలో ప్యూన్ వచ్చి "పి.ఏ.గారు పిలుస్తున్నారు" రమ్మని నీలవేణిని పిలుచుకెళ్ళాడు.
హతాశుడయ్యాడు శ్రీకర్. అతనికి అంతా శూన్యంగా అనిపించింది. అంతలో నీలవేణి తిరిగి వచ్చింది. తిరిగి కుర్చీలో కూర్చుంటూ అతనివేపు ప్రేమగా చూసి చెప్పండి ఆగిపోయారేం!" అంది.
"నీలవేణీ! నిన్ను నేను అభిమానిస్తున్నాను. నీవు నా భాగస్వామిని అయితే నాకంటే ధన్యులు లేరనుకుంటాను. ఇంతకు పూర్వం నీవు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం నిన్ను అభ్యర్ధించడంలో తప్పు లేదనుకుంటాను. వేణీ! నువ్వు నా విన్నపాన్ని అంగీకరించి నా దానివై నీ వేణితో బంధిస్తే జీవితాంతం నా బ్రతుకు నీ బాహువుల్లో బందీచేసి నిశ్చింతగా వుండిపోతాను!"
దేవతకి విన్నపాలు విన్నవించుకునే పరమ భక్తుడిలా అన్నాడు.
నీలవేణి కంగారుపడి పోయింది. ముందుగా భయపడింది. తర్వాత ఆశ్చర్యపడింది. ఆపై మనస్సుని సంబాళించుకుని చిరునవ్వు నవ్వింది.
"మీరు! మీ అంగీకారం ఇప్పుడే చెప్పక్కర్లా! మీ ఇష్టం ఎంతైనా టైం తీసుకోండి. మీరు సిగ్నల్ ఇస్తే నేను పర్సనల్ గా చెప్పుకునే విషయాలు కొన్ని వున్నాయ్" అన్నాడు.
నీలవేణి ఏదో చెప్పబోయింది.
"మీరు వ్యాచంగా చెప్పకపోతే ఫరవాలేదు. మీ జడని ముడివేసి ముందుకి వేసుకుంటే అంగీకరించినట్టు. సాదాగా అలాగే వదిలేసినా, సిగ చుట్టుకున్నా తిరస్కరించినట్టు అనుకుంటాను!" ఆరాధనా పూర్వకంగా చూస్తూ అన్నాడు.
తన మామూలు ధోరణిలో నవ్వింది నీలవేణి.
ఆ నవ్వులో జ్యోతి కనిపించింది మళ్ళీ. ఆమె వికటాట్టహాసం చేసినట్టుగా ఫీలయి ఉలిక్కిపడ్డాడు అతను__ కళ్ళు చెదిరినట్లయి రెప్పలు తాటించి తిరిగి నీలవేణిని చూశాడు.
ఆమె సిగ చుట్టుకుంటూంది.
పిడుగు పడ్డట్టయింది అతనికి.
"శ్రీకర్! నీవు స్నేహంగా వుంటే నేనూ క్లోజ్ గా మెలిగాను. నాకు చిన్నప్పటినుంచీ జంకు గొంకులు లేవు. బిడియం లేదు. ఎవరితోనయినా కలివిడిగా వుంటాను. అది ఒకవేళ నువ్వు మరోరకంగా అనుకోవటానికి దారితీసుంటే దానికి నేనే బాధ్యురాలిని అయినందుకు క్షమించు.
ఆరోజు నీకు పరిచయం చేశానే శంకర్...మా బావ. అతనికీ, నాకూ ఏనాడో నిశ్చయమైంది. మేం పుట్టగానే భార్యా భర్తలుగా పుట్టాము అంటారందరూ.