Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 32

    ఏమయితేనేం మాకు అమ్మాయి నచ్చింది. మీ నాన్నగారు మా వూరు వస్తే అన్ని విషయాలు మాటాడుకుందాం సరేనా?"
    అంత సులభంగా చెల్లెలి పెళ్ళి నిశ్చయమయ్యేసరికి శ్రీకర్ మనస్సు పొంగిపోయింది. చప్పున జ్యోతి గుర్తుకొచ్చింది. సంబంధం లేకున్నా యీ విషయం రాయాలి. తమ శక్తి తెలియాలి అనుకున్నాడు.
    "వదినగారూ! మా అబ్బాయి కానీకట్నం తీసుకోనని గాంధీగారి పేర శపధం చేశాడు. ఆయనా అంతే! కాబట్టి కట్నం గురించి ఆలోచించకండి. లక్ష్మీదేవిలా వుంది. అమ్మాయి ఆమే లక్షవరహాలు కట్నం అనుకుంటాం. ఇకపోతే లాంఛనాలు అవేవీ పెట్టకండి."
    అన్నపూర్ణ తన చెవుల్ని తనే నమ్మ లేకపోయింది. శైలజ అదృష్టవంతురాలే అనుకుంది తను. కానీ మరి ఇంతటి అపూర్వ యోగమా? భగవాన్. నువ్వెంత దయామయుడివి!"
    "వస్తామమ్మా!" అంది ఆమె కదులుతూ.
    ముగ్గుర్నీ జట్కా ఎక్కిస్తూ అంది అన్నపూర్ణ "వదినగారూ! మా శైలజ పూర్వజన్మలో బంగారుపూలతో పూజ చేసుకుంది. లేకపోతే యింతటి మంచి సంబంధం దొరుకుతుందా? మీరెంత వద్దన్నా మేం మా శక్తికొద్ది యిస్తాం. అది మాత్రం కాదనకూడదు!"
    ఆవిడ నవ్వేసింది. జట్కా కదిలింది. 
    ఆ పూట యింట్లో ఆనందం తాండవించింది. చాలారోజుల తర్వాత శ్రీకర్ మనఃపూర్వకంగా నవ్వుతూ ఆటలు పట్టించాడు చెల్లాయ్ ని శైలజ మనసు పౌర్ణమినాటి సముద్రమే అయింది.
                                                    33
    ఉదయం మామూలుగా ఆఫీసుకు వచ్చాడు శ్రీకర్.
    అతనికి ఈరోజు చాలా ఆనందంగా వుంది. ఏదో తెలియని ఉత్సాహం బాగా చోటు చేసుకుంది. కేవలం చెల్లాయికి పెళ్ళి నిశ్చయం కావటమే ముఖ్య కారణం కాదు దానికి!
    నిన్న తండ్రి రాగానే అన్న మాటలు చప్పున గుర్తుకొచ్చాయ్. "ఒరే శ్రీకర్! నువ్వింత యోగ్యుడివి అనుకోలేదురా! అందరూ నీలాగే వుంటే ఏ తండ్రికీ బాధ వుండదు. ప్రతి చెల్లాయికి నీలాంటి అన్నయ్య వుంటే వాళ్ళెంత అదృష్టవంతులురా? పెళ్ళి కావాల్సిన చెల్లాయ్ కి అదెంత గొప్ప విషయంరా? శ్రీకర్! నిన్న శైలజని చూట్టానికి వచ్చారే వాళ్ళెవరనుకున్నావ్? నువ్వు నీ క్లాస్ మేట్ దాశరధికి రాశావటకదా ఎక్కడైనా మంచి సంబంధాలుంటే చూడమని. అతను పంపించిన సంబంధమేరా ఇది! దాశరధి పిన్ని కొడుకేనట శత్రుఘ్న...అతను మన కుటుంబ పరిస్థితుల్ని చెప్పితే వాళ్ళు అంగీకరించారట!"
    తండ్రి మాటలు అతనికి కళాప్రపూర్ణ వచ్చినంత ఆనందాన్ని కలిగించాయ్.
    "ఏమిటండీ మీలో మీరే నవ్వుకుంటున్నారు?" తనూ నవ్వుతూ ప్రశ్నించింది నీలవేణి...ఆమె అప్పుడే ఆఫీసుకి వచ్చింది.
    "గుడ్ మార్నింగ్!"
    నీలవేణిని చూస్తే అతనికి మతిపోయినట్టవుతుంది...మనస్సు లయ తప్పుతుంది...కళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోతాయామెకి...
    "చెప్పకూడని విశేషమైతే వద్దులే! మీరే దాచుకోండి" అంది సీట్లో కూర్చుంటూ_
    "అదేంలేదు...మా చెల్లాయికి పెళ్ళి నిశ్చయమైంది. అబ్బాయి మా క్లాస్ మేట్ కజిన్! వాళ్ళు కానీ కట్నం వద్దన్నారు. అది తలచుకొని సంతోషంగా నవ్వాను అంతే!"
    "ఎంత శుభవార్త చెప్పారండీ బాబూ! మీ నోరు తీపి చెయ్యాల్సిందే. దేశం అంత ఆ యువకుడిలాగే వుంటే ఎంత బావుంటుంది? స్వంతం మేనత్త కొడుకైనా లాంఛనాలు, కట్నాలూ ఇవ్వందే పెళ్ళి చేసుకోని ఈ రోజుల్లో శైలజకి యీ సంబంధం కుదరటం ఆమె అదృష్టమే కాదు. మీ అదృష్టం కూడా -"
    "ఒక్క నిమిషం వుండండి మీకు స్వీట్ ఇస్తాను. మన కాబిన్ లోకి ఎవ్వరూ రాకముందే ఇచ్చేస్తాను- ఈ స్వీట్ మా అమ్మగారు నాకోసం ప్రత్యేకంగా చేశారు. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు...శుభదినం...అదేమిటో నన్నడక్కండి. నిదానంగా చెపుతాను. పట్టండి నోరు, ఆ వెరీగుడ్...అంతా మీలాంటి మగాళ్ళే అయితే మొగుళ్ళని ముక్కుకి తాడేసి లాగొచ్చండి - కానీ ఎక్కడా వుండరే?" చిలిపిగా నవ్వుతూ అంది నీలవేణి.
    ఆమె మాటలకి ఉక్కిరి బిక్కిరయ్యాడు శ్రీకర్.
    ఆమె తిరిగి తన కుర్చీ వద్దకు వెళుతుంటే ఆమెనే తదేకంగా చూడసాగాడు, ఎంత పొడుగు జడ? బారెడు మందాన పిరుదులు దాటి మోకాళ్ళదాకా వుంది. నీలవేణి అని జడను చూసే పెట్టారో - జడ పేరు పెట్టాకే పెరిగిందో?!
    "ఏమిటండీ బాబూ అది? స్వీట్ తిన్నారు థాంక్స్ చెప్పరు. శుభవార్త ఏమిటని అడగరు...ఏమైంది?" నవ్వుతూ అడిగిందామె.
    "నీలవేణి!"
    "ఏమిటండీ?"
    "మీ జడ యెంత అందంగా వుందండీ!"
    సిగ్గు పడింది నీలవేణి. అసలే ఆ శుభ సన్నివేశం గుర్తుకొచ్చి రాగరంజిత మవుతున్న ఆమె చెక్కిళ్ళు ఇంకా ఎర్రబడ్డాయ్. అతని కాంప్లిమెంట్ ని మృదువుగా తిరస్కరిస్తూ "పొండి బాబూ! మీకెప్పుడూ నా జడమీదే ధ్యాస...మీకింకేం పనిలేదా?" అంది.
    "మీరేం అనుకోనంటే ఓ మాట అడగనా?"
    "అడగండి!"
    "ఏమీ అనుకోనని మాటివ్వాలి."
    "ఇటు చూడండి! ఈరోజు మీరేం అడిగినా నేను ఏమీ అనుకోను. మీకు ఫ్రీ ఇచ్చాను-అయినా మనం ఒకచోట పనిచేస్తున్నాం. అంటే ఓ కుటుంబంలోని వ్యక్తుల్లాంటి వాళ్ళ అన్నమాటే కదా! ఇందులో అనుకోవటానికేముంది?"
    శ్రీకర్ మనస్సు ఆనందంతో ఉరకలు వేసింది. తదేకంగా ఆమెని చూశాడు. ఆ కళ్ళనిండా ఆరాధన! చప్పున జ్యోతి అతని కళ్ళముందు మెదిలింది. జ్యోతి కళ్ళు ఆమె తలకట్టు దాదాపు ఇలాగే వుంటాయ్. అప్పుడప్పుడు ఏకాంతంలో మహా ఆనందం అనుభవించే వేళలో జ్యోతి జుట్టు తన ముఖంనిండా కప్పుకొని 'చమరీ మృగం' అనేవాడు. అందుకు జ్యోతి కోపగించుకునేది కాదు నవ్వేది. పైగా సింహం అనేది తన నడుం పట్టుకొని అదీ తనకెంతో ఆనందాన్నిచ్చేది.
    "శ్రీకర్! ఏమిటి ఈరోజు నవ్వులెక్కువయ్యాయి?"
    చప్పున బయటపడ్డాడు ఆలోచనలనుంచి.   
    "అడుగుతామన్నారే అడగండి?"
    "నీలవేణీ! మీ జడ నిజం జడా? జడపదార్ధమా?"
    ఫక్కున నవ్వింది నీలవేణి. పగలబడి నవ్వింది. తెరలు తెరలుగా వస్తోన్న నవ్వుని ఆపుకొని నవ్వుతోంది.
    "ఇదో జ్యోతికూడా ఇలాగే నవ్వుతుంది.
    నవ్వి నవ్వి అలసిపోయింది నీలవేణి.
    తదేకంగా ఆమెనే చూస్తూ వుండిపోయాడు. "ఎంత హాయిగా నవ్వుతుంది? ఎంత నిర్మలమైన మనస్సు ఆమెది. తనిలా నవ్వగలడా? అసలు తన జీవితంలోంచే నవ్వు వెళ్ళిపోయిందా అన్నట్టుగా వుంటుంది. ఒక్కోసారి అయితే నీలవేణిని చూసినప్పుడు మాత్రం తన మనస్సు మళ్ళీ యధాస్థితికి వస్తుంది. అందుకే...అందుకే...తన మనస్సు నీలవేణి చుట్టూ పరిభ్రమిస్తోంది...నిజంగా నీలవేణితో తను మళ్ళీ బ్రతుకును పంచుకోగలడా? ఒకవేళ ఆమె అంగీకరించినా మళ్ళీ మళ్ళీ తన మనస్సు జ్యోతి చుట్టూ తిరుగుతూ ఇలాగే నీలవేణిని ఆమెతో పోల్చుకుంటూ వుంటే అది మాత్రం తనకి హాయిగా వుండగలదా?  

 Previous Page Next Page