" బాత్ రూమ్ లో దెయ్యాలేమయినా వున్నాయిరా అబ్బూ!"
" లేవే, దేనికి?"
" బాత్ రూమ్ కెళ్ళేటప్పటి ముఖము మాటలు మారి కొత్త మాటలు, కొత్త ముఖము వస్తేను!"
" అదా..." అది... అది... అదే ఆ పిల్ల... చుక్క... అహహో గీత... వుహూ... పిల్లే..."
" ఒరేయ్! సరీగా చెప్పి తగలడతావా! నాలుక తెగ్గోయనా? నన్నన్నా నిన్నిన్నీ ఏంటా నత్తివాగుడు.
ఆడ దెయ్యం పట్టిన వాడిలా కులుకుతున్నావ్! ఏ మొచ్చింది? ఏం జరిగింది? ఏమయింది?" అని వ్యాకర్ణ గట్టిగా కోప్పడాడు.
" అసలేం జరిగిందంటే?" అంటూ అబ్బులు మొదలు పెట్టి జరిగిన కధంతా చెప్పేశాడు.
చెప్పి " ... గీతచుక్క ఫజిల్ సాల్వ చేసి ఆ పిల్ల పేరు వెలికిలాగి ఇదిగో అమ్మడూ! ఇదీ నీ పేరు" అని చెప్పకపోతే తనకి తెలివి లేనట్లేనని...
ఆ పిల్లముందు తను ఫూల్ కావాలని... అదనీ ... ఇదనీ... ఈ బ్రతుకే వ్యర్ధమని..." వాపోయాడు.
అంతటిలో ఆగక- " ఈ అవమానం నా కొక్కడికే కాదు. ఆపదలో వున్న ప్రాణ మిత్రుడిని ఆదుకొని, నీకు కూడా వర్తిస్తుంది" అని బెదిరించాడు.
" నిజమే" నని ఒప్పుకున్నాడు వ్యాకర్ణ.
ఆ తర్వాత యిద్దరూ తీరుబడిగా కూర్చుని " గీతచుక్క" ల గురించి తర్జన భర్జనలో పడ్డారు.
" ఆ... ఆ పిల్ల పేరు చుక్కమ్మ అన్నాడు వ్యాకర్ణ.
" నీ ముఖంలా వుంది. మరి గీత సంగతేమిటి?" అన్నాడు అబ్బులు.
" గీత యింటిపేరు. అంటే, గీతల చుక్కమ్మ ఆ పిల్ల పూర్తిపేరు.
" గీతల చుక్కమ్మ కాదు. చుక్కల గీతమ్మ."
" అలాగూ అయి వుండవచ్చు."
" ఏడ్చినట్లే వుంది. అంత అందమైన పిల్ల పేరు చుక్కమ్మా కాదు గీతమ్మ కాదు.
' అమ్మడూ, నీ పేరు యిది' అని చెప్పానంటే ముఖాన నవ్వేస్తుంది."
" దిక్కుమాలిన పేరు, దిక్కుమాలిన ఫజిల్ అసలా పిల్ల నెందుకు ఢీ కొన్నావ్! బుద్ధి లేకపోతేసరి.
ఢీ కొన్నావ్ సరే, పేరెందు కడిగావ్! బుద్ధి లేకపోతేసరి. పేరడిగావ్ సరే. ఆ పిల్ల ఫజిలెందు కివ్వాలి?"
" బుద్ధిలేక అన్నాడు అబ్బులు, భూతద్దాలు తీసి కళ్ళుతుడుచుకుని ముక్కుచీది.
" ఏడ్వ కేడ్వకురా అబ్బూ! మా నాయన కదూ? మా తండ్రి కదూ, ఇద్దరం కలసి ఎలాగో చుక్కల్లోంచి గీతల్లోంచి ఆ పిల్లని... కాదు కాదు... ఆ పిల్ల దని పేరుని లాగేద్దాం" అంటూ వ్యాకర్ణ ఓదార్చాడు.
బొంగురు స్వరంతో నీరసంగా " అలాగే" అన్నాడు అబ్బులు.
వ్యాకర్ణ, అబ్బులు కల్సి వార, మాస పత్రికలు, డిష్ణరీ, డైరీ పేపర్సు, పెఅసిఫ్ద్ధ రచయిత్రుల నవల్స్, సినిమా పత్రికలు, రైల్వే గైడ్, జనరల్ నా లేడ్జీ గైడు వగైరా అన్నీ ముందు పేర్చుకు కూర్చున్నారు.
తర్వాత గుర్తుకొచ్చి సినిమా పారాల పుస్తకాలు కూడా దుమ్ము దులిపి ముందేసుకున్నారు. తిరగెయ్యనివి, తిరగేసేవి, తిరగేసినవి అన్నీ పడేసిసార్లు చూశారు.
రెండున్నార గంటల్ తర్వాత ఓ వారపత్రికలో ఓ డాక్టరు గారి సలహాల శీర్షికకింద " ఎండాకాలం చెమట పట్టడం ఎండ లక్షణమే గాక, చెమట శరీరానికి మంచి కలుగజేస్తుంది. చెమట బిందువులు ( చుక్కలు)..." అంటూ రాశాడు.
అది చదివిన అబ్బులు ఆనందంతో అమాంతం వ్యాకర్ణని కౌగలించుకొని అంతక్రితమే హీరో బ్లేడుతో చదును చేసిన వ్యాకర్ణ బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు.
" నీ కేం వచ్చిందిరా!" అని వ్యాకర్ణ బుగ్గ తుదిచేసుకుని అబ్బులి నెత్తిన వొకటిచ్చుకున్నాడు.
" వచ్చిందిరా వచ్చింది. ఈ డాక్టరుగారు చెమట బిందువులని రాసి బిందువులంటే అర్ధంకాని అక్కుపక్షులుంటారేమో అని బ్రాకెట్ లో చుక్కలు అని రాశారు. చుక్క అంటే బిందు" అన్నాడు అబ్బులు.