Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 31

    ఈ భూతద్దాల జైంట్ వీల్ ఎవరో బిందురేఖ ఎవరుగదు.

    ఆ అల్చిప్పల చిన్నది ఎవరో అబ్బులు ఎరగడు.

    ఇద్దరూ తెప్పరిల్లి ఈ లోకంలోకి వచ్చారు.

    అబ్బులు బిందురేఖ జబ్బులు వదిలిపెట్టకుండానే " సారీ" అన్నాడు.

    " చేతులు తియ్యండి" అంది బిందురేఖ బోలెడు కోపం ప్రదర్శస్తూ.

    " ఎక్కడినుంచి?" అని అబ్బులు అనేసి పొరపాటు గ్రహించి బిందురేఖ జబ్బ లొదిలి " సారీ!" అన్నాడు మరో సారి.

    " సారీ చెప్పటం తప్ప మరేం పనిలేదా?" అంది బిందురేఖ.

    " అమ్మయ్యో బోలెడు పనుంది" అని అబ్బులు భూతద్దాలు సరిచేసుకుని ఆగిపోయాడు.

    " కళ్ళజోడు సరిచేసుకువడమా?"

    " కాదండి."

    " మీరేమిటండీ."

    " అప్పుడప్పుడు అందమైన అమ్మాయిలను చూసీ చూడక ఢీ కొనడం కూడానండి. సారీ! అది నా తప్పు కాదండి నా కళ్ళజోడు తప్పండి."

    " ఇప్పుడు తప్పంతా మి జోడుదన్నమాట. మిద కాదన్నమాట?"

    " అంతేకదండి మరి?"

    " సిగ్గు లేకపోతే సరి!"

    " ఎవరికండీ?" అమాయకంగా భూతద్దాల్లోంచి అల్చిప్పల్లోకి చూస్తూ అడిగాడు అబ్బులు.

    " నాకు, సరేనా!" కోపంగా అందు బిందురేఖ.

    " ఆడపిల్లలకు సహజమే కదండి" అన్నాడు అబ్బులు అదేదో సామాన్య విషయం అన్నట్లు.

    " ఇంతేసేపు మి ఎదురుగుండా నుంచిని మాట్లాడటం సిగ్గు సిగ్గు" అని బిందురేఖ మరింత కోపంతో భూమ్మిద కాలితో తన్ని గిర్రున తిరిగి వెళ్ళిపోయింది.

    " ఏమండి. ఏమండి! మి పేరు చెప్పిపొండి. ప్లీజ్" అన్నాడు అబ్బులు.

    బిందురేఖ వెనుతిరిగి అబ్బులి దగ్గరకొచ్చి సీరియస్ గా ఆల్చిప్పల్లోంచి భూతద్దల్లోకి చూస్తూ " మికు తెలివుందా?" అని గద్దించి అడిగింది.

    " ఉందండి" ఠకీమని సమాధానం చెప్పాడు అబ్బులు.

    " అయితే మి చెయ్యి చాపండి" అంది బిందురేఖ

    ఏమాత్రం ఆలస్యం చేయకుండ చెయ్యి చాచాడు అబ్బులు.

    బిందురేఖ అబ్బులి అరచేతిలో ఓ రేఖ మిద వేలుమ్చి " ఈ గీత- మి శరీరం మిద చెమట పడుతుందే ఆ చెమటలో ఓ చుక్కా- కలిపితే నా పేరొస్తుంది.

    ఆడపిల్లని ఢీ కొనటం ఓ తెలివి కాదు. చుక్కా గీతా కలిసిన ఈ పజిల్ సాల్వ్ చేయండి. నా పేరు కనుక్కోండి. అదీ తెలివి" అని గిర్రున వెనుతిరిగి వెళ్ళిపోయింది బిందురేఖ.

    " చుక్కా గీత, గీతా చుక్క" అని మననం చేసుకుంటూ బాత్ రూమ్ వైపు బయలు దేరాడు అబ్బులు.

    అబ్బులు ఎంత ఆలోచించినా చుక్క గీతకి సరి అయిన అర్ధం తియలేకపోయాడు.

    స్నానం కానిచ్చి గడికొచ్చి గదిలో అడుగు పెడుతూనే అడిగాడు " ఓరోరి కుంతీపుత్రా? నీకు తెలివుందా?" అని.

    వ్యాకర్ణ తెల్లబోయి తెప్పరిల్లి " ఇప్పుడు తెలివితో పనేమొచ్చిందిరా అబ్బాయ్" అన్నాడు.

    " చెప్పెదను. ఓ అందమైన అమ్మాయికి మహా అందమైన పేరుంది. ఆ పేరు మనకి తెలియదు.

    మా అల్లా! చుక్క అంటే చెమట చుక్క. గీత అంటే అరచేతిలో గీత. కలిపితే ఆ అమ్మాయి పేరొస్తుంది.

    ఇదో ఫజిలనుకో. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటంటావు?" 

 Previous Page Next Page