Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 31

    కళకళలాడే మోములతో స్థిరంగా స్టడీగా నిలబడిన ఆ అమ్మాయిలంతా చీరలు సింగారించుకుని లేరు. వదులాటి అదోరకం లాగులు చొక్కాలు, నడుంకి రంగు బెల్టులు, కొందరి చేతిలో కర్రలు.

    వాళ్ళంతా ధరించిన దుస్తులు కరాటేవి.

    కరాటే దుస్తులలో వున్న అమ్మాయిలను అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళ మధ్యనుంచి దీక్ష ముందుకు వచ్చి మైకు ముందు నిలిచింది.

    దీక్షని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు.

    సింపుల్ అలంకరణతో, సాదా వాయిల్ చీరలతో, ప్రతి రోజు అందరి కళ్ళ బడ్డ దీక్ష కాదీ దీక్ష.

    క్రితంరోజు సిల్కు చీరతో కాలేజీ అమ్మాయిలాగా అందరి కళ్ళబడ్డ దీక్ష కాదీ దీక్ష.

    ఈ రోజు పట్టుచీర గరగరలతో గొప్పింటి అమ్మాయిలా అందరి కళ్ళ బడ్డ దీక్ష కాదీ దీక్ష.

    శరీరం మీద ఏ చిన్న ఆభరణము లేక కేవలం కరాటే దుస్తులతో వుంది దీక్ష. నడుంకి బ్లాక్ బెల్ట్ వుంది.

    దీక్ష మైకు దగ్గరకు రాగానే ఎప్పటిలా సభకి నమస్కారం పెట్టలేదు. కుడి చేతివేళ్ళ మీద ఎడంచేత్తో పట్టుకుని కాస్త కిందకి గౌరవంగా తలవంచి వంగి పైకి లేస్తూ "ఇస్" అంది.

    పెద్దలకి గౌరవం ఇస్తూ నమస్కారం వినమ్రంగా పెట్టటం అందరికీ తెలిసిందే. కరాటే వీరులు గౌరవంగా, నమ్రతగా అభివందనం చేయటం, రెండు చేతులు కట్టుకుని తలకాస్త వంగి "ఇస్" అంటూ పైకిలేవటం పద్ధతి. అది వాళ్ళ ఆచారం.

    ఇప్పుడు దీక్ష చేసింది అదే.

    "సోదరీమణులారా! ఆత్మరక్షణకు ధైర్యానికి, సాహసానికి ఒక గొప్ప సాధనం మన చేతుల్లోనే వున్నది. కరాటే విద్య. ఇది నేర్చుకోవాలంటే శ్రమశక్తి, దీక్ష, పట్టుదల, అవిరామసాధన, తనపై తనకి ఆత్మ విశ్వాసం. అంతే! ఇప్పుడు ఈ సోదరీ మణులు మీ ముందు రకరకాల కరాటేలు, కుంపూలు ప్రదర్శిస్తారు చూడండి." అని తియ్యనైన గొంతుకతో చెప్పిన దీక్ష వెంటనే వాళ్ళవేపు తిరిగి చిరునవ్వుతో ఎడం చేయి పిడికిలి బిగించి హృదయం మీద ఆ పిడికిలిని అలాగే పెట్టుకుని "వుష్ హా" అంది.

    వెంటనే పలుచని తెల్లని పైజమా లాల్చీ లాంటివి ధరించిన ఇద్దరు అమ్మాయిలు ముందుకు వచ్చారు. వాళ్ళ నడుములకి ఆకుపచ్చరంగు గుడ్డ బెల్టులు వున్నాయి.

    కరాటే లో నిపుణులకి ఆకుపచ్చ బెల్టు యిస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ బెల్టు ధరించి వున్నారు.

    అమ్మాయిలు యిద్దరు ఇందాక దీక్ష చేసినట్లే చేతులు కట్టుకుని తలవంచి సభలో వున్న ఆడవాళ్ళకి అభివందనం కరాటే పద్ధతిలో చేసి వెనక్కి వెనక్కి నడుచుకుంటూ దూరంగా జరిగారు. ఒకమ్మాయి పిడికిళ్ళు రాయిలా బిగించింది. మరో అమ్మాయి చేతులు వెనక్కి ముందుకి దృడంగా లేచి చాచి వేళ్ళు ముడవకుండా కత్తుల్లా చాచింది.

    ఇరువురు పోరుకి సిద్ధమై చెరో భంగిమలో నుంచున్నాడు.

    "ఇది ఆత్మరక్షణకి చేతులతోనే పోరాడే విధానం. లేక మీదకి దూసుకు వచ్చే దుండగులను తరిమి తరిమి కొట్టే ప్రక్రియ. ఇలా చేతులు ప్రయోగించి పోరాడటాన్ని, "హెంపీ" అని "హిజయిటే" అని అంటారు. "తేవాజా" అని కూడా అంటారు కొందరు. ఇప్పుడు వీళ్ళలో ఒకమ్మాయి "యుమియుకే" పద్ధతిలో పోరాడటానికి మీదకి దూసుకు వస్తున్నది. రెండో అమ్మాయి "యుకటే" (ఆత్మరక్షణ) ప్రయోగించి ఆ పద్ధతిలో ఎదుర్కొంటూ తనని తాను రక్షించుకుంటున్నది. గమనించండి." అంది దీక్ష కరాటే లోని పోరాడే విధానం పద్ధతులని సులభ శైలిలో తెలియజేస్తూ.

    ఇద్దరమ్మాయిలు పోరు ప్రారంభించారు.

    మెరుపువేగంతో వాళ్ళు ఒకరినొకరు కాచుకుంటూ ఎదురు దెబ్బ తీస్తున్నారు. విపరీతమైన ఫోర్స్ తో తలపడుతున్నారు. కాలి బొటనవేలి మీద నుంచుని గిర్రున బొంగరంలా తిరుగుతున్నారు. వంగి లేవటం పక్కకి తప్పుకోవటం క్విక్ గా జరిగిపోతున్నది. ఇది హెంపీ పోరాటం కాబట్టి ఎక్కువ చేతులనే వుపయోగిస్తున్నారు. అంతేకాదు వాళ్ళిద్దరి 'హ్హా..హ్హా..' అరుపులతో ఆ ప్రదేశం మారుమోగి పోతున్నది.

    కనురెప్ప అర్పితే ఏది మిస్సవుతామో అన్నట్లు అందరూ విచ్చుకున్న పత్తికాయల్లాగా కళ్ళు రెండూ తెరుచుకు ఆ ప్రదర్శనని చూస్తున్నారు. ఊపిరి బిగబట్టి మరీ చూస్తున్నామన్న గ్రహింపు ఆ నిమిషాన వాళ్ళలో చాలామందికి లేకపోయింది.

    రెండు నిమిషాల తర్వాత....

 Previous Page Next Page