ధ్యాన ముద్రలో మునిగి ఉన్న ఆమె అపూర్వ సౌందర్యాన్ని కనులారా ఆస్వాదిస్తూ పిలిచాడు లంకేశ్వరుడు. అతడు ఎన్నెన్నో లోకాలు తిరిగాడు! ఎందరెందరో సుందరీమణులను చూశాడు. మండోదరి వంటి మహా పతివ్రతను తొలిసారి చూసినప్పుడు అతని మనసు ఇలాగే తొందరించింది. ఆమెను తన అర్దాంగిగా చేసుకుని ఆనందించాడు.
అప్సశిరోమణి అయిన రంభను చూసినప్పుడు తన సోదరుడు నలకూబరుడు మన్నించే మగువ అనే మాట మరిచాడు. అందం చేసిన తొందరపాటు రంభ శాపాన్ని తెచ్చింది. అప్పుడిలాగే మనస్సు తొందరించింది. మళ్ళీ ఇదిగో- ఇప్పుడు- ఈ చంద్రవందన కనిపించీ కనిపించగానే మనసు కలవరపడుతున్నది.
'సుందరీ!'
మరింత దగ్గరగా వెళ్ళి తమకంతో పిలిచాడు. లంకేశ్వరుడి శ్వాస తమకం వల్ల వేడి సెగలు కక్కుతున్నది. ఆ గాలికి ఆమె చప్పున కనులు విప్పింది.
ఆ రెండు కళ్ళూ సాక్షాత్తూ రుద్రుడి మూడో నేత్రం ద్విగుణీకృత క్రోధంతో ద్వంద్వమైనట్లుగా నిప్పులు కక్కుతున్నాయి.
కనులెదుట కనిపిస్తోన్న కన్యకామణి కమనీయ సౌందర్యాన్ని కనులతో తాగుతూ మత్తెక్కిన రావణుడి కళ్ళకి- ఆమె నేత్రారుణిమలు రోషకషాయిత లక్షణంగా కాక- వలపు వేడిమి ఫలితంగా అనిపించాయి.
'ఎవరు నువ్వు? ఒంటరి దానవా? జంటగున్నావా? నీ తోడెవరు? నీ నీడెవరు? నీవు పితృ పరాధీనవా? మాతృ పాలితవా? ఓహ్! ఏమి నీ సౌందర్యం. దివిజ భామినుల సోయగాలూ, దివ్య సుందరీ మణుల విన్యాసాలూ, రాక్షసాంగనల రమణీయతలూ, మానవ స్త్రీల మనోహరత్వం. సర్వం పరిశీలించిన నాకు ఎక్కడా యీ సోయగాలు కనువిందు చేయనే లేదు. సుందరీ! ఎందుకింత ఆలస్యం! రా! లేచిరా! నా పాణిని అందుకుని పాణిగ్రహణం పూర్తిచేసి నన్ను నీ అనన్య సామాన్య ఆనంద సౌందర్య వాహినిలో ఓలలాడించు.'
'దుష్టుడా!'
ఆ పలుకులకు తృళ్ళిపడ్డాడు రావణుడు.
'ఎవడవురా నీవు? పరమ శివుని చరణ సన్నిధి వంటి ఈ హిమాలయంలో నిశ్చల నిర్వికార నిర్వి కల్పసమాధిలో తపస్సు చేసుకుంటున్న నన్ను, నా తపస్సు భంగపరిచి కారుకూతలు కూస్తున్నావు. ఎంత సాహసం! రాక్షసుడివా? యక్షుడివా? గంధర్వుడివా? మీకయితేనే యీ చలచిత్తం. యీ ప్రలాపం'
పక పక నవ్వాడు రావణుడు.
'సుందరీ! అందగత్తెలు ఆగ్రహించినా అందం మేనే అది. నేనెవరినో పోల్చుకోలేకపోయినా నా జాతి లక్షణాన్ని నిర్వచించి నా జాతిని చక్కగా పోల్చుకున్నావ్! అయినా నేనెవరైతేనేం! మగవాడిని. నువ్వు స్త్రీవి! సుందరివి! రా! నన్ను వరించి, నా వలపు తీగలు సవరించి ప్రణయగీతం ఆలపించు.'
'వాచాలుడా! తపోనిష్టలో ఉన్న అబలతో మాట్లాడవలసిన రీతి ఇదా?'
'అబలవా! అతివా! నీవు అబలవా! హ! హ! ఎంత అందం! ఎంత సోయగం! ఏమి శరీర పుష్టి! ఇంత బలిమి కలదానవు. నీవు అబలవా! చాలు! చాలు! మాటలు కట్టిపెట్టి మా మనస్సుని కనిపెట్టి మమ్ము వరించు!'
'కాముకుడికి సర్వం భ్రాంతిగానే ఉంటుంది. వెళ్ళు! ఇక నీతో మాట్లాడినా పాపమే!'
మరింకేం ప్రస్తావనకు చోటివ్వకుండా నారాయణ స్మరణలో మునిగిపోయిందామె.
రావణుడిక ఆగలేకపోయాడు. ప్రతిఘతిస్తే బలత్కారంగానైనా సరే ఆ పసిడిబొమ్మ అందాలను ఆస్వాదించాలనుకున్నాడు. మాటలతో తిరస్కరించి మౌనం వహించి ముని కన్యలా తపస్సులో మునిగేసరికి వంటింటి కుందేలు ఎక్కడికి పోతుందిలే అనుకుని మరో అడుగు ముందుకు వేసి ఆమె భుజంపై చేయి వేశాడు.
అగ్నిలో ఆజ్యం పోయగానే భగ్గుమన్నట్లు చప్పున కళ్ళు తెరిచిందామె. చప్పున లేచి నుంచుని 'మూర్ఖుడా! నన్ను చెరపట్టదలిచిన నిన్ను క్షమించను. నీ వినాశననికి హేతువవుతాను. ఏ అందమైతే నిన్ను శలభంలా చేసిందో, ఆ అందం అగ్నిలోనే నువ్వు భస్మమవుతావు. నీ ఇంటపుట్టి, మళ్ళీ నీ ఇంటికే వచ్చి, నిన్ను మూలబలంతో సహా నిర్మూలనమయ్యేలా చేస్తాను. ఇవి వేదవతి శాప వాక్కులు!' అంటూ తపోగ్నిలో క్షణంలో భస్మమయింది.
తనని శపించి తనని దూషించి తనని తనే దహించుకుని, బూడిదైన వేదవతి భస్మ రాశిని చూస్తూ నిట్టూర్చాడు. రావణుడు మరో శాపం అనుకున్నాడు. ఆ భస్మరాశినే పవిత్రంగా స్వీకరించి కదిలాడు.
* * * *
శచీదేవిని మంద గమనంతో మందహాసంతో చేర వచ్చింది. ఆమె మహేంద్రుని సమీపించగానే దూతిక మెల్లి మెల్లిగా వెనక్కి నడుస్తూ తప్పుకుంది. శచీదేవిని చూసి మందహాసం చేశాడు ఇంద్రుడు.
'స్వామీ! వైకుంఠం నుండి వచ్చీ రాగానే విశ్రాంతి మందిరానికి విచ్చేయకుండా ఉద్యానవనానికి విచ్చేశారేమిటీ? అన్ని ఆపదలూ త్వరలో అణగారిపోతాయని అందుకు తాను మళ్ళీ అవతరిస్తున్నానని చెప్పారట కదా శ్రీమహా విష్ణువులు. ఇంకెందుకు స్వామీ ఆ దిగులు?' నిట్టూర్చాడు దేవేంద్రుడు.
'దేవీ! ఆ రావణుడి అత్యాచారాలకు మేర లేదు. అతని దుర్మార్గాలకూ అంతు లేదు. అతడి పాప ఫలం పండితేనే గానీ అతన్నేం చేయలేం. ఆయన అయోధ్యలో జన్మించి మానవుడిగా అవతరించి, పెరిగి పెద్దవాడైన తర్వాత కదా రావణ సంహారం! ఈ లోగా రావణుడు స్వర్గంపై దండెత్తడని నిశ్చయమేమిటీ? స్వర్గాన్ని ఆక్రమించుకుని తానే ఇంద్రుడిగా దేవనాధుడిగా అటు ఏడు, ఇటు ఏడు, మొత్తం భూభువర్లోకాది పధ్నాలుగు లోకాలకూ తానే ప్రభువుగా ప్రకటించుకోడనే నమ్మకం ఏమిటీ?' అన్నాడు దిగులుగా.