భోజనం బల్ల ముందు కూర్చుని ఇంత గంధం బొట్టు, దాని మీద ఇంత కుంకం బొట్టు దిద్దుకుని , కంచం ముందుకు లాక్కుని కూర్చున్నారు కృష్ణశర్మ గారు. ఐదు నిమిషాలైనా భార్య వచ్చి వద్దించక పోవడంతో ఆవిడ మీద ఆయనకి తిక్కకోపం వచ్చింది.
"వర్ధనం , కంచం ముందు కూర్చుని ఐదు నిమిశాలైంది. ఇంత పిండాకూడు తగలేస్తావా '- అరిచారాయన.
వర్ధనమ్మ పెరట్లోంచి పచ్చడి గిన్నె తెస్తూ "అయ్యో ఏమిటా కేకలు , మీరేగా నోరు చచ్చిపోయింది , యింత కరివేపాకు పచ్చడి నూరమన్నారు. కాస్త లేట కరివేపాకు కోసి, రెండు ఎండుమిరపకాయలు , చింతపండు , జేలకర్ర, ఇంగువ వేసి నూరుకోస్తున్నాను గ్రైండరు లో చేస్తే తినరని.... ఈలోగా పిండాకూడు అంటూ అరుస్తారా, అవ్వ, శుక్రవారం పూట ఏమిటామాటలు "- వంటింట్లోంచి వంటగిన్నెలు టేబుల్ మీద పెడ్తూ అంది.
"వడ్డించి , తగలడు - "నీరసంగా అరిచారాయన.
పోపులో వేసిన బీరకాయ కూర, పెసరకట్టు పచ్చడి వేసి వేడన్నం వడ్డించి నెయ్యి వేసింది. ఔపోసన పట్టి ఆబగా కూరతో నాలుగు ముద్దలు టిని పచ్చడి కలుపుకున్నారు. వేడన్నంలో నేయి వేసి పచ్చడి కలిపి నోట్లో పెట్టుకోగానే జిహ్వ లేచి వచ్చింది. కడుపులో నాలుగు ముద్దలు పడగానే ఆత్మారాముడు శాంతించాడు.
"పచ్చడి పుల్లపుల్లగా బాగుందే. ఎలాగైనా నీ చేతిలో వుందే రుచి" గబగబ ముద్దలు తింటూ అన్నారాయన.
వర్ధనమ్మ మూతి తిప్పింది.
"అదిగో పసుపు ఇదుగో ముసుగు మీ వ్యవహారం అంతా. కోపం వచ్చినా సంతోషం వచ్చినా పట్టలేం - పిండాకూడు అని తిట్టారుగా "- అలక గొంతుతో అని తన కంచంలో వడ్డించుకుని కూర్చుంది.
"నీరసమే - నాలుగు రోజుల జ్వరం - ఆ దిక్కుమాలిన మాత్రలు కలిసి శక్తి లాగేసింది. ఆకలికి పిచ్చ కోపం వచ్చింది" సంజాయిషీ యిస్తూ చారన్నం కలుపుకున్నారు.
"బాగుందే ఇంగువ చారు. పుల్లగా తియ్యగా కమ్మగా వుంది. 'అమెరికా ప్రయాణం వుంది. జ్వరపడ్డారు . తగ్గుతుందా అని భయపడ్డాను ."
"ఇంకా పదిరోజుల టైముందిగా. పోయిన శక్తి వచ్చేస్తుంది - ఇంకనీ పచ్చళ్ళు పొడులు సర్దుడు మొదలుపెట్టు. ఆఖరివరకు పెట్టావంటే వాదావుడి అయిపోతుంది" - మజ్జిగ కలుపుకుంటూ అన్నారాయన.
"ఆ తెలుసులెండి. కందిపోడుం కి పప్పులు వేయించి పెట్టి - కరువేపాకు పొడి నువ్వుల పొడి, అన్నీ ఎంతసేపు గ్రైండరు లో వేస్తే నిమిషం పని. చింతకాయ, పండుమిరపకాయల పచ్చడీ, గోంగూర , కాకరకాయ, నిమ్మకాయ, టామోటా పచ్చడి చేస్తాను. వాడికి అమెరికా వెళ్ళినా మన తెలుగు వంటంటే ప్రాణం , కాస్త గుమ్మడి వడియాలు, పేలాల వడియాలు కావాలన్నారు."
"ఏం చేస్తావో, ఏమేమి పట్టు కేళతావో లిస్టు తయారుచెయ్యి మనవి నాల్గు పెట్టెలు. రెండు షోల్టర్ బ్యాగులు... ఒక్క కేజీ బరువేక్కువైనా బోలెడు డబ్బులు కట్టాలి. అది గుర్తుపెట్టుకుని పెట్టెలు సర్దు. పిల్లలకి బట్టలన్నావు. సునీత సి.డి లడిగింది. పుస్తకాలు తీపి, కారం టిఫిన్లు అన్నీ కలిపి తడిసి మోపెడు అవుతాయేమో!"
"అబ్బ, మీరూరుకోండి, అన్నీ సరిగా సర్దితే సరిపోతాయి. ఎప్పుడో ఓసారి వెళ్ళేవాళ్ళం . పిల్లల కోసం అన్నీ పట్టుకెళ్ళ కపోతే ఎలా - అప్పుడంటే వేణుకి పెళ్ళి, పిల్లలు లేరు గనగ కొద్దిగా పట్టుకెళ్లాం. వాడి పెళ్ళి పిల్లలు పుట్టాక మొదటిసారి వేడ్తున్నాం-" వర్ధనమ్మ అంది.
'ఈ ఏడాది బోస్టన్ లో చలి ఇంకా బాగా ఎక్కువగానే ఉందంటూ జూన్ వచ్చినా కొద్దిగా ఉలేన్స్ తెచ్చుకొమన్నాడు వేణు - కేట్స్ కూడా కొనాలి - నీకు ."
వెళ్ళబోయే అమెరికా ప్రయాణం ముచ్చట్లు ఆడుకుంటూ భోజనాలు ముగించారు ఆ దంపతులు.
* * * *
న్యూయార్క్ లో విమానం దిగి యిమిగ్రేషన్ చెకప్ ముగించుకుని బయట పడేసరికి గంటన్నర పట్టింది - సామాను ట్రాలీ తోసుకుంటూ బయటికి వచ్చేసరికి వేణు ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు.
"అబ్బ , ప్లేను లాండ్ అయి గంటన్నర అయింది. ఇంత ఆలస్యం అయిందెం నాన్నగారు.
"క్యూలురా బాబూ , యిమిగ్రేషన్ దగ్గిర, సామాను రావడం గంటలు గంటలు , మూడు విమానాలు ఒకేసారి లాండ్ అయ్యేసరికి ఒకటే జనం ఒకటే క్యూలు -"
సామాను కారులో సర్ది బయలుదేరేసరికి మరో గంట.
"అమ్మయ్య ఏం ప్రయాణంరా నాయనా. కాళ్ళు పచ్చడయ్యాయి. పద్దెనిమిది గంటలు విమానంలో . ఎయిర్ పోర్థులో గంటలు గంటలు క్యూలో ....."
"అదేనమ్మా అమెరికా ప్రయాణం అంటే - మమ్మల్ని రాలేదు రాలేదు అంటావు ప్రతీ ఏడాది ఎంత కష్టం, ఎంత డబ్బు ఖర్చు పెట్టి రావాలీ చూశావుగా "- కొడుకన్నాడు.- "ఇక్కడ నుంచి మూడు గంటల పైన ప్రయాణం ఉంది. బోస్టన్ కి " - కారు నడుపుతూ అన్నాడు. తోవ పొడగునా విశేషాలు , ఊరు పేర్లు బిల్డింగులు, రోడ్లు గురించి డ్రైవ్ చేస్తూ చెప్తున్నాడు వేణు.
బ్యాచిలర్ గా ఉండగా న్యూజెర్సీ లో ఉన్నప్పుడు వచ్చాక పదేళ్ళకి మళ్ళీ రావడం ఇదే. పెళ్ళయ్యాక ఉద్యోగం మారి బోస్టన్ లో ఉంటున్నాడు వేణు. మొదటిసారి మనవడు పుట్టాక వచ్చారు. మనవరాలు పుట్టాక వాళ్ళే వచ్చారు. పురుళ్ళకి వియ్యపురాలు వెళ్ళేది. కృష్ణశర్మ గారు ప్రతిసారి ఏదో వంక పెట్టి వెళ్ళకుండా నెట్టుకొచ్చారు. మీరే రండి మావల్ల కాడు అనేవారు. ఇప్పుడు పిల్లల చదువులు వచ్చాక ఇంక మేం తరచూ రాలేం. నాల్గు టిక్కెట్లు మీరే రావాలి అంటూ టిక్కెట్లు పంపి బలవంతం చేస్తే బోస్టన్ ప్రయాణం పెట్టుకున్నారు ఈసారి తప్పక.
"ఏం రోడ్లురా వేణు.... ఈ రోడ్లు చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఎంత శుభ్రంగా ఉన్నాయో" సంబరంగా చూస్తూ అంది - మొదటిసారి వచ్చినపుడయితే తల్లి చిన్నపిల్లలా అ ఎయిర్ పోర్టులు, రోడ్లు, ఆహైవే బ్రిడ్జిలు , ప్లై ఓవర్లు , ఆ కార్లు చూస్తూ సంబరపడిపోవడం, ఆశ్చర్యపడి పోవడం వేణు కింకా గుర్తుంది.