"హు-మనశ్శాంతి నీవు దూరమైతే ఈ పాటి మనశ్శాంతి కరువవుతుందన్నది నీకెలా అర్ధం అవుతుంది సరోజా" నిట్టూర్చి అన్నాడు.
"ఇంక యిలాంటి మాటలు వినదలుచుకోలేదు. నేను వారంరోజుల్లో వెళ్ళిపోతాను కృష్ణమోహన్ గారూ - యిక్కడ వుండి యీ యింట్లో కలతలకి నేను కారణం అవడం నాకెంత సిగ్గుగా వుందో మీకు తెలియదు-ప్రతి రోజు ఏం జరుగుతుందోనని ప్రాణాలు బిగపట్టుకుని ఎన్నాళ్ళు గడపమంటారు - నన్ను వెళ్ళనీయండి .... ఇంక అడ్డు చెప్పకండి-"స్థిరంగా అంది.
ఆమెవంక చూస్తూ వేదనగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు మోహన్.
"వెళ్ళు సరోజా - నిన్ను వుండమని అడగడానికి ఏ అధికారమూ లేని నాకు వెళ్ళవద్దనే అధికారం కూడా లేదు."
సరోజ ఆందోళనగా చూసింది ఒక్కక్షణం - తరువాత ఆమె మొహం గంభీరంగా మారింది. ఇదిగో మీరిలా మాట్లాడి ప్రతిసారి నా కాళ్ళకి బంధం వేస్తున్నారు - ఏ అధికారంతో యిక్కడుండాలో తెలియచెప్పలేని మీరు నన్ను ఈ మాటలతో కట్టిపడేయాలని చూడకండి - వుండమనడానికి నాకీ యింట్లో వున్న స్థానం ఏమిటి తెలియచెప్పిననాడు తప్పకుండా వుంటాను-" సరోజ గొంతు వణికింది - ఆమెవంక ఆశ్చర్యంగా చూడసాగాడు - సరోజ చప్పున కళ్ళు తుడుచుకుని -అంతలోనే గొంతు మృదువుగా మార్చి-పాలు త్రాగండి చల్లారిపోతున్నాయి" అంది ఏం జరగనట్లు.
కృష్ణమోహన్ మారు మాట్లాడకుండా పాలు తాగేసాడు-గ్లాసు అందిస్తూ "సరోజా - నీ ప్రశ్నకి జవాబు చెప్పగలిగేరోజు బహుశా ఈ జీవితానికి యింక రాదేమో -" అంటూ అటుతిరిగి పడుకున్నాడు.
సరోజ అతనివంక కొద్దిక్షణాలు చూసి నిట్టూర్చి బయటికి వెళ్ళిపోయింది.
రాత్రంతా కృష్ణమోహన్ ఆలోచిస్తూనే వున్నాడు. ఏదో సుడిగుండంలో చిక్కుకున్న వాడిలా ఉక్కిరి బిక్కిరి అవుతూ అందులో పూర్తిగా మునిగిపోకముందే బయటికి ఎలా రావాలో తెలియక తల్లడిల్లిపోయాడు. ఎవరిని ఏమని సహాయం కోరాలో కూడా అంతుబట్టక, వేదనతో, నిరాశా నిస్పృహలతో రాత్రంతా గడిపాడు. ఒక్కక్షణంలో ఆవేశంగా ఏదో నిర్ణయం చేసుకునేవాడు-ఆ నిర్ణయం అమలు జరపడం అంత సుళువు కాదన్నది తట్టగానే నీట మునిగిపోతున్నట్టు గిలగిలలాడేవాడు.
రాత్రంతా నిద్రలేక - ఏం చెయ్యాలో తేల్చుకో లేక సతమతమయిన మోహన్ తల్లి చెప్పిన మాటకి హతాశుడైపోయాడు. ఉదయం మరొక డాక్టరుకి ఆపరేషన్ అసిస్ట్ చేయడానికి వెళ్ళాడు. సాయంత్రం గీత తండ్రి వస్తాడు - ఆలోగా తనేం చెయ్యగలడు? దిక్కుతోచక గాభరాపడ్డాడు-తల్లితో చెపితే-ఆవిడ ఏమంటుందో! కనీసం మనసులో మాట తల్లితోనైనా చెప్పుకోకపోతే ఆ బాధ భరించడం కష్టంఅన్పించింది అతనికి.
"ఏమిటిరా బాబూ అలా వున్నావు" సరస్వతమ్మ గదిలోకి వస్తూ ఆరాటంగా అడిగింది. మోహన్ ఏం మాట్లాడలేకపోయాడు ఒక్క క్షణం ఎలా చెప్పాలో అంతుబట్టలేదు. ఆవిడ కొడుకు ప్రక్కన వచ్చికూర్చుంది.
"ఏమిట్రా ఈమధ్య ఇలా వుంటున్నావు. ఏమిటో నీబాధ చెప్పరా నాయనా" ఆవిడ ఆరాటంగా కొడుకుని చూస్తూ అడిగింది.
"అమ్మా, గీత...గీతని చూస్తూంటే నాకేదో భయంగా ఉంది. ఆమెతో నా జీవితం సాఫీగా వెడ్తుందన్న నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లి పోతుంది నాలో- నా ఎన్నిక సరి అయింది కాదనిపిస్తూందమ్మా. ఏం చెయ్యాలో అర్ధంగాని విషయం అయింది నాకు నన్నేం చెయ్యమన్నావ్ చెప్పమ్మా-" ఆవేదనగా అన్నాడు కృష్ణమోహన్.
కొడుకు మనసులో రగిలే ఆలోచన యిదేనన్న సంగతి ఆమెకీ అర్ధమైంది కొడుకు చెప్పకముందే-కాని ఏ విషయంలోనూ తనంతట తను పైకి తేలని ఆమె, కాబోయే కోడలి గురించి ఏమనగలదు.
నిజానికి సంబంధం స్థిరపరిచినపుడు ఆమె చాలా ఆనందించింది. వంశం, కులం, గోత్రం, ఆస్తి, అంతస్థు సరిపోయి, బంగారు బొమ్మలాంటి కోడలు రాబోతున్నందుకు చాలా ఆనందించింది- కాని సంబంధం స్థిరపడడం వెంటనే భర్తపోవడం ఆమెకి ఏదో అపశకునంలా తోచింది. శుభమా అని శుభకార్యం తలపెడితే ఇదేమిటా అని మదనపడింది. అంత దుఃఖంలోనూ-అయితే తన మనసులో మాట పెదవి దాటనీయలేదు. ఆఖరికి ఇంకా యిలాంటి మూఢ నమ్మకాలేమిటి అని తనకు తానే నచ్చచెప్పుకుంది.
భర్తపోవడం, పెళ్ళి వాయిదాపడడం, గీత ఆ వూళ్ళోనే వుండడం, యింటికి రాకపోకలు ఆరంభించిన దగ్గిరనించి క్రమక్రమంగా గీత మనస్తత్వం అర్ధమయి ఆమె మనసులో ఏదో భయం తొంగి చూడసాగింది. గీత మొదట్లో యింట్లో తిరుగుతూంటే కూతురు లేని లోటు తీరుతున్నట్టు సంబరపడింది ఆవిడ.... కాని-రోజులు గడుస్తున్న కొద్ది గీతపట్ల సదభిప్రాయం మంచులా కరగిపోసాగింది. ఆమె వేషభాషల తీరుచూసి ఈ కాలం పిల్లలింతే అని సరిపెట్టుకున్నా. ఆమె వైఖరిచూస్తే కుదురుగా కాపురంచేసే లక్షణాలు కనుపించలేదు. మరో అమ్మకన్న పిల్లని తనెందుకు అనుకోడం, గారాబంగా పెరిగిన పిల్ల, పెళ్ళయితే అన్నీ సర్దుకుంటాయిలే అని తనకి తను నచ్చచెప్పుకుంది ఆవిడ. తనని బొత్తిగా లక్ష్యపెట్టక పోవడం అత్తగారంటే యింత సిసరు గౌరవమన్నా చూపించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం దురుసుగా మాట్లాడడం అన్నీ చూస్తూ తనలో తాను బాధపడేది గాని ఏనాడు కొడుకుతో ఒక్కమాట మాట్లాడలేక పోనీ తనని లక్ష్యపెట్టకపోయినా కొడుకూ కోడలు సంతోషంగా వుంటే అంతకంటే తనకేం కావాలి అని సరిపెట్టుకుంది యిన్నాళ్ళు. కాని ఆఖరికి అదికూడా అనుమానాస్పదంగా తయారయింది ఆవిడకి. సరోజ వచ్చిం దగ్గరనుంచి గీత ప్రవర్తన మరీ మితిమీరడం కొడుకు ఎటూ ఏమనలేక మదనపడటం గుర్తించింది. కొడుకు భవిష్యత్తు తలచుకుని ఆరాటపడింది ఆవిడ. ఎంతో సౌమ్యుడయిన అతను గీత లాంటి అహంభావి, అహంకారితో సుఖపడగలడన్నది అబద్దం అని ఆవిడకి దృఢపడింది. కాని ఇప్పుడేం చెయ్యగలదు పదిమంది ఎదుట నిశ్చితార్ధం కూడా జరిగిపోయాక యిప్పుడు వెనక్కు ఎలాతిరగడం? మాట ఎలా తప్పడం?- ఆవిడ మనసులో బాధపడ్తూనే వుంది. కొడుకు చాలా అశాంతికి గురి అవుతున్నాడన్న విషయం ఆమె గుర్తించినా ఏ విధంగానూ ఓదార్చలేక పోయింది.